1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్


img_0516

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in)

ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:  

 • సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి చెందిన 58 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. 
 • ఇండియాలో అత్యంత పైన ఉన్న 58 మంది బిలియనీర్ల కింద ఉన్న సంపద, అత్యంత కింద ఉన్న 70 శాతం మందికి చెందిన సంపదకు సమానంగా ఉన్నది.
 • ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ (ఉదా: టి.సి.ఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొ.)  సీఈఓ వార్షిక వేతనం ఆ కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం కంటే 416 రెట్లు అధికంగా ఉన్నది. 
 • అత్యంత పై స్ధానంలో ఉన్న 10 శాతం సంపన్నుల చేతుల్లో దేశంలోని 80 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. 

ప్రపంచ వ్యాపితంగా చూస్తే:   

 • ప్రపంచ జనాభాలో కింది స్ధానంలో ఉన్న 50 శాతం జనాభా చేతిలో ఉన్న సంపదలు, అత్యంత పై స్ధానంలో ఉన్న 8 మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న సంపదల మొత్తంతో దాదాపు సమానంగా ఉన్నది. 
 • పై స్ధాయిలో ఉన్న 500 మంది సంపన్నులు వచ్చే 20 ఏళ్లలో తమ వారసులకు 2.1 బిలియన్ డాలర్ల సంపదను వారసత్వం కింద అప్పగించనున్నారు. ఇది ప్రస్తుత భారత దేశ జీడీపీ కంటే కాస్త ఎక్కువ. 

ప్రపంచ వ్యాపితంగా ప్రచురించబడిన వార్తా సంస్ధల నివేదికలు, తాను సొంతగా చేసిన అధ్యయనాల ఆధారంగా ఆక్స్ ఫామ్ సంస్ధ ఈ గణాంకాలను వెలువరించింది. 

భారత దేశంలో ఆదాయాల పెరుగుదల కూడా తీవ్ర అసమానతలతో కూడి ఉన్నదని ఆక్స్ ఫామ్ నివేదిక తెలిపింది. 

ఉదాహరణకి భారత దేశంలో 

 • 1998 , 2011 సంవత్సరాల మధ్య అత్యంత దిగువన ఉన్న 10% పేద ప్రజల ఆదాయాలు కేవలం 29 డాలర్లు (రు 2000) మాత్రమే పెరిగింది. ఇది సంవత్సరానికి 1 % పెరుగుదలతో సమానం. ఇదే కాలంలో ద్రవ్యోల్బణం 15.3% నుండి 6.5% మధ్య నమోదు అయింది. అనగా దిగువ ప్రజల ఆదాయం వాస్తవానికి -5.5% నుండి -14.3% వరకు పెరిగాయి. అనగా వారి నిజ ఆదాయాలు తగ్గిపోయాయి తప్ప పెరగలేదు.
 • అదే అత్యంత ఎగువన ఉన్న 10% సంపన్నుల ఆదాయాలు అదే కాలంలో సగటున రు 40,000 చొప్పున పెరిగింది. ఇది 25% వార్షిక పెరుగుదల రేటుకు సమానం. 

ఈ అసమానతలకు, అసమానతల పెరుగుదలకు కారణం ఏమిటి? 

ఆక్స్ ఫామ్ ప్రకారం అసమానతలు, వాటి వృద్ధికి కారణాలు:            

 • క్రోనీ కేపిటలిజం. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం: తమను ఆశ్రయించిన పెట్టుబడిదారులకు, బంధువులు, స్నేహితులు, ఇతరత్రా ప్రలోభాల ద్వారా దగ్గర అయిన/చేసుకున్న పెట్టుబడిదారులకు దేశ వనరులు అప్పనంగా కట్టబెట్టి వారి సంపదల పెంపుకు తోడ్పడే విధానానికి పాల్పడటం ద్వారా పాలకులే సంపదల కేంద్రీకరణకు కారకులు కావడం. 
 • కార్పొరేషన్లు / కంపెనీలు దిగువ స్ధాయి ఉద్యోగుల వేతనాలను కుచింపజేసి ఉన్నత స్ధాయి ఎక్జిక్యూటివ్ ఉద్యోగుల వేతనాలు, షేర్ హోల్డర్ల డివిడెండ్లు గరిష్టంగా చెల్లించడం. అనగా దిగువ స్ధాయి ఉద్యోగుల వేతనాలలో వీలైనంత ఎక్కువ భాగాన్ని ఉన్నత స్ధాయి ఉద్యోగులకు అధిక వేతనాలుగా తరలించడం. (తద్వారా ఉద్యోగులలో తమకు అనుకూలంగా ఆలోచించే సేవక వర్గాన్ని యజమానులు తయారు చేసుకుంటారు.)
 • సంపదలు పెంచుకోవటానికి అత్యంత ఖాయమైన పధ్ధతి ఆ సంపదను స్వాయత్తం చేసుకోవడం. ఈ సూత్రాన్ని ధనికులు అక్షరాలా పాటిస్తున్నారు. ధనికులకు మాత్రమే నాణ్యమైన మదుపు (investment) సలహాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి కొత్త ఆదాయాలు కూడా ఆ ధనికులకు అత్యధిక భాగం వచ్చి చేరతాయి. 
 • ఆదాయాలు తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ సంపన్నులు తమ ఆదాయాలకు తగిన పన్నులు చెల్లించరు. అత్యధిక భాగాన్ని విదేశీ ఖాతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వాలు పన్నులు ఎగవేసి, సంపదలు విదేశాలకు తరలిస్తున్నవారిని వదిలిపెట్టి తమ ఆదాయ పెంపు కోసం తిరిగి పన్నులు కట్టేవారి పైనే పన్నులు పెంచుతున్నాయి. సంపన్నులు రాజకీయ వ్యవస్ధలను తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతున్నారు. ఈ ప్రక్రియ ఆదాయాల అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నది. 

నల్ల ఆర్ధిక వ్యవస్ధ (బ్లాక్ ఎకానమీ), నల్ల ఆదాయం (బ్లాక్ ఇంకమ్), నల్ల డబ్బు (బ్లాక్ మనీ)… ఈ మూడు పై కారణాలలో అంతర్లీనంగా ఇమిడి ఉండటం గమనించవచ్చు. మూడింటిలో బ్లాక్ ఎకానమీ ప్రధానమైనది. బ్లాక్ ఎకానమీ నుండి బ్లాక్ ఇంకమ్ నిరంతరాయంగా జనిస్తూ ఉంటుంది. సదరు బ్లాక్ ఇంకమ్ లో చాలా కొద్ది భాగం మాత్రమే (2 శాతం) బ్లాక్ మనీగా ఉంటుంది. ఇది కూడా ఆర్ధిక వ్యవస్ధలో వేరుగా ప్రత్యేక ఉనికిని కలిగి ఉండదు. రోజువారీ కార్యకలాపాలలో, తెల్ల ధనంతో పెనవేసుకుని ఉంటుంది. కనుక బ్లాక్ మనీ ని అరికట్టాలంటే మొదట బ్లాక్ ఎకానమీని దెబ్బ కొట్టాలి. తద్వారా బ్లాక్ ఇంకమ్ ఉత్పత్తిని ఆపాలి. అప్పుడిక బ్లాక్ మనీ నిర్మూలన చిటికెలో పని. 

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలు బ్లాక్ ఎకానమీ పైన ఈగ కూడా వాలనివ్వరు. వారు ఇష్టంగా, ఆర్భాటంగా అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాలు, ఆహ్వానిస్తున్న విదేశీ ప్రయివేటు పెట్టుబడులు బ్లాక్ ఎకానమీకి ప్రధాన పట్టుగొమ్మలు. కనుక బ్లాక్ ఎకానమీకి విచ్చలవిడిగా అనుమతిస్తూ, సంపూర్ణ రాజకీయ, ఆర్ధిక విధానాల మద్దతు అందజేస్తూ  ‘డీమానిటైజేషన్’ లాంటి తుగ్లక్ చర్యల ద్వారా బ్లాక్ మనీని అరికడతాననీ, విదేశీ ఖాతాల డబ్బు వెనక్కి తెస్తాననీ మోడీ చెబుతున్నవి ఒట్టి దొంగ మాటలు. ప్రజలను మోసగించేందుకు చెబుతున్న బూటకపు కబుర్లు. ప్రజల వేలితో ప్రజల కళ్ళు పొడిచే కుటిల నీతి. 

One thought on “1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

 1. ధనవంతుల ఆధాయమార్గాలు,ఆలోచనతీరులు,సామాజిక సంభందాలు ఇలా అన్నిటినీ హైలైట్ చేస్తూ కిందినున్న అసంఖ్యాక ప్రజానీకం పై రుద్దడంద్వారా(బ్రైన్ వాష్) ధనవంతులు తమకు ప్రజలద్వారా వ్యతిరేకత రాకుండా చేసుకోగలుగుతున్నారు. గనుక ఇటువంటి ఎన్నినివేదికలు వచ్చినా,ఎవరెంతగా చర్చించుకున్నా వారికి అటువంటి నష్టం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s