తండ్రి పైన తిరుగుబాటు చేసిన కొడుకు వైపే ఎలక్షన్ కమిషన్ మొగ్గు చూపింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వం లోని సమాజ్ వాదీ పార్టీ గ్రూపుకే సైకిల్ గుర్తు అప్పజెపుతున్నట్లు కొద్ది సేపటి క్రితం కమిషన్ ప్రకటించింది. “ఇక కమిషన్ మాకు ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తు పైన పోటీ చేస్తాం” అని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించాడు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గత ఐదారు నెలల నుండి సమాజ్ వాదీ పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తూ వచ్చింది. లేదా ‘ప్రచ్చన్న యుద్ధం’ అనే నాటకాన్ని తండ్రీ తనయులు ప్రదర్శిస్తూ వచ్చారు. అనేకసార్లు రాజీలు ప్రకటించి అంతలోనే కొట్లాడుతూ, ఒకరినొకరు బహిష్కరించుకుని అంతలోనే ‘కలిసిపోయాం’ అని ప్రకటించిన ఎస్‌పి గ్రూపులు చివరికి తాము వేరు వేరుగానే పోటీ చేయనున్నామని చెబుతున్నారు.
ములాయం సింగ్ యాదవ్ కు ఇద్దరు సోదరులు. వారిలో ఒకరు -శివపాల్ యాదవ్- అన్న ములాయం పక్షం వహించగా, మరొక సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ అన్న కొడుకు, యూపి ముఖ్యమంత్రి కూడా అయిన అఖిలేష్ యాదవ్ పక్షం వహించారు. ఎస్‌పి లో మళ్ళీ చేరిన అమర్ సింగ్ కేంద్రంగా ఆరంభం అయిన విభేదాలు చివరికి కుటుంబం లోనే విభేదాలుగా ప్రత్యక్షం అయ్యాయి.
కానీ ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు నిజమా లేక నాటకమా అన్నది ఎంతకీ తేలడం లేదు. ఒక్కోసారి చూస్తే ‘నాటకం ఆడుతున్నారు’ అనిపించేలా పరిణామాలు జరుగుతున్నాయి. అంతలోనే “విభేదాలు నిజమేనేమో” అనిపించేలా పరిణామాలు జరుగుతున్నాయి. మొత్తం మీద పార్టీ చీలిక పైన అయోమయం సృష్టించడంలో కుటుంబం సఫలం అయినట్లు కనిపిస్తోంది. ఈ అయోమయం, తండ్రీ కొడుకుల సమరం, పరస్పర బహిష్కరణలు, రాజీలు… ఇలా వరుస పరిణామాలతో ప్రభుత్వ వ్యతిరేకత నుండి యూపి ప్రజల దృష్టిని మళ్లించడంలో ఎస్‌పి నేత కుటుంబం విజయవంతం అయినట్లు కనిపిస్తున్నది.
అఖిలేష్ యాదవ్ అమర్ సింగ్, శివపాల్ యాదవ్ ల మీద విరుచుకుపడతాడు గానీ వారిని వెనకేసుకు వస్తున్న తండ్రి ములాయం సింగ్ యాదవ్ ని పల్లెత్తు మాట అనడు. ‘నేతాజీ’ పైన ఒక్క విమర్శ కూడా చేయొద్దని తానే స్వయంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, మంత్రులకు ఆదేశాలు ఇస్తాడు.
అలాగే ములాయం సింగ్ యాదవ్ కూడా తమ్ముడు రామ్ గోపాల్ యాదవ్ ని అదే పనిగా తిట్టిపోస్తాడు. కానీ రామ్ గోపాల్ యాదవ్ కు మద్దతుగా నిలబడిన కుమారుడు అఖిలేష్ ని ఒక్క మాటా అనడు. పైగా రామ్ గోపాల్ యాదవ్ మాటలు విని తన కొడుకు చెడిపోయాడు అంటాడు గానీ “బాబాయి చెబితే మాత్రం చెడిపోతావా, వెధవా?” కొడుకుని విమర్శించడానికి పూనుకోడు.
ములాయం సింగ్, ‘పార్టీ చీలే ప్రశ్నే లేదు’ అని ఓసారి హుంకరిస్తాడు. కానీ ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్ళి “పార్టీని నేనే స్ధాపించాను. కనుక పార్టీ నాదే. సైకిల్ గుర్తు మాకే ఇవ్వాలి” అని వాదించి వస్తాడు. మంత్రి వర్గం నుండి శివపాల్ యాదవ్ (బాబాయ్) ని తొలగించి, ఆయనకు టికెట్ కూడా ఇవ్వడు అఖిలేష్. తండ్రి ఆహ్వానంతో పార్టీలో మళ్ళీ చేరిన అమర్ సింగ్ ని మాత్రం ప్రతి వేదిక పైనా తిట్టిపోస్తాడు. పెద్ద యెత్తున వేరు సమావేశం జరిపి, పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక అవుతాడు. ఆ వెంటనే వెళ్ళి తండ్రిని కలిసి ములాయం యాదవే మా నాయకుడు అంటాడు.
- Sivpal Sing Yadav
- Ramgopal Yadav
- Amar Singh
- Amar Singh re-entry
ఇన్ని రకాల దాగుడు మూతలు అసలు చీలిక/ఘర్షణ/విభేదాలు నిజమా, నాటకమా అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. బిజేపి నేతలైతే “ఇదంతా ఒట్టి నాటకం” అని స్పష్టంగా నిర్ధారించారు.
నాటకమే అయితే, ఆ నాటకం ద్వారా ఏమి ప్రయోజనాలు సాధించవచ్చు?
-
యాంటీ-ఇంకుబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) నుండి ప్రజల దృష్టి మరల్చవచ్చు.
-
ఎస్‌పి పై వ్యతిరేకతను ములాయం సింగ్ ఖాతాకు తరలించి అఖిలేష్ ను శుభ్రమైన నేతగా చూపవచ్చు. ఇన్నాళ్లూ చేసిన పాపాలు, జరిగిన నష్టాలు అన్నీ ములాయం వల్లా, శివపాల్ & అమర్ సింగ్ ల వల్లా జరిగినవే అనీ, వారి బారి నుండి పార్టీని అఖిలేష్ కాపాడి శుద్ధమైన పార్టీగా తయారు చేశాడనీ, ఇక ప్రజలు నిశ్చింతగా అఖిలేష్ కు ఓటు వేయవచ్చనీ జనం లోకి సందేశం పంపవచ్చు.
-
చీలికల సంరభం పైన దృష్టి పెట్టిన ప్రజలు ఇతర పార్టీలను వదిలేసి అఖిలేష్ ను గెలిపించాలా లేక ములాయంను గెలిపించాలా అన్న ఆలోచన లోకి నెట్టవచ్చు. అనగా అనేక పార్టీలు పోటీ పడుతున్న ఎన్నికల యుద్ధం ద్వైపాక్షిక యుద్ధంగా మారిన భ్రమలు కలిగించవచ్చు. ఆ భ్రమలు సక్సెస్ అయ్యేదీ లేనిదీ తర్వాత సంగతి!
-
అమర్ సింగ్ లాంటి పరాన్నభుక్తుల నుండి పార్టీని కాపాడిన ప్రతిష్టను అఖిలేష్ కు ఆపాదించవచ్చు.
నాటకమే కాకపోతే అనేళ్ళబట్టి పార్టీకి రారాజుగా వెలుగొందిన ములాయం సింగ్ యాదవ్ 90 శాతం పార్టీ కార్యకర్తలను ఎలా దూరం చేసుకుంటాడు? లేదా 90 శాతం కార్యకర్తలు ‘నేతాజీ’ కి వ్యతిరేకంగా ఎలా తిరుగుబాటు చేస్తారు? భారత రాజకీయాల్లో ఇది బొత్తిగా మింగుడుపడని వ్యవహారం.
కానీ పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్ ముందు ఇరు పక్షాలూ గట్టిగానే కొట్లాడాయి. అఖిలేష్ తరపున కాంగ్రెస్ నేత, సుప్రీం కోర్టు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తే, ములాయం తరపున పేరు మోసిన మరో సుప్రీం లాయర్ మోహన్ పరాశరణ్ వాదించారు. అఖిలేష్ జాతీయ అధ్యక్షుడు గనక, 90 శాతం నేతలు, ఎంఎల్‌ఏ లు, కార్యకర్తలు ఆయన కిందే ఉన్నారు కనుక పార్టీ పేరు, గుర్తు ఆయనదే అని సిబాల్ వాదించారు. కానీ మోహన్ పరాశరన్ ఏకైక డిఫెన్స్: పార్టీని స్ధాపించింది ములాయం గనుక పార్టీ ఆయనదే. ఆ విధంగా ములాయం వాదన బలహీనంగా ఉండగా అఖిలేష్ వాదనకు వాస్తవాల పునాది ఏర్పరచబడింది. దానితో కమిషన్ అనివార్యంగా అఖిలేష్ కు అన్నీ అప్పజెప్పింది.
మామూలుగా అయితే ఇటువంటి పరిస్ధితుల్లో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నానా అడ్డమైన ఆరోపణలూ చేసుకోవాలి. అవతలి వైపు నేత ఎంత వెధవో, విద్రోహో, వెన్నుపోటుదారుడో వివరిస్తూ నానా తిట్లూ తిట్టుకోవాలి. కానీ అవేవీ కనిపించడం లేదు. “ఇంకేం చేస్తాం. కమిషన్ ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తు పైన పోటీ చేస్తాం” నీరసంగా, ఉదాసీనంగా ప్రకటించి ఊరుకున్నాడు ములాయం. ఇది వింత కాదా!
బహుశా ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తేవచ్చు. ప్రస్తుతానికి ఎస్‌పి (అఖిలేష్), కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల పొత్తు అనబడే సీట్ల సర్దుబాటు ఖాయం అయినట్లే.