
RBI
పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.
నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను చంపటానికి చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఓ సభలో చెప్పుకున్నారు. “ఎవరు వాళ్ళు, దేశ ప్రధానిని చంపితే మేము ఊరుకుంటామా? వాళ్లెవరో చెప్పండి, తాట తీస్తాం” అని ప్రతిపక్ష నేతలు పార్లమెంటులోనే దులిపేసేసరికి మోడీ ఇక ఆ మాట ఎత్తడం మానుకున్నారు.
ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అదే మాట చెబుతున్నారు. ప్రధాన మంత్రి లాగా భావోద్వేగంతో కాకుండా అధికారికంగా, RTI దరఖాస్తుకు సమాధానం ఇస్తూ ఆయన ‘ప్రాణ ప్రమాదం’ గురించి చెప్పారు. కారణాలు చెబితే ఆ చెప్పిన వాళ్ళ ప్రాణాలకు ముప్పు రావోచ్చని గవర్నర్ ఒక కారణంగా చెప్పారు. కానీ ఎవరి నుండి ఆ ముప్పు వస్తుందో మాత్రం చెప్పలేదు.
గతంలో చెప్పిన కారణాలని పునరుల్లేఖించిన గవర్నర్ ఈసారి అదనంగా “ప్రాణాలకు ముప్పు ఉన్నది” అంటూ కొత్త కారణాన్ని జత చేశారు. “నోట్ల రద్దు నిర్ణయం వెనుక గల నిర్దిష్ట కారణాలు చెప్పటం వల్ల దేశ సౌర్వభౌమత్వం, సమగ్రత, భద్రతలకు హాని జరుగుతుంది. అంతే కాకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది’ అని ఆర్.బి.ఐ సమాధానం ఇచ్చిందని అమెరికన్ వాణిజ్య పత్రిక ‘బ్లూమ్ బర్గ్ న్యూస్’ చెప్పింది.
డిసెంబర్ 8 తేదీ నుండి జనవరి 2 తేదీ వరకు తాము ఆర్.బి.ఐ ని 14 ప్రశ్నలకు సమాధానం కోరామని బ్లూమ్ బర్గ్ తెలియజేసింది. “అయితే ఆర్.బి.ఐ వీటిల్లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంది. మినహాయింపు క్లాజును అందుకు కారణంగా చూపింది. మరి కొన్నింటికి ‘మా వద్ద సమాచారం లేదు’ అని చెప్పి తప్పించుకుంది” అని బ్లూమ్ బర్గ్ తెలిపింది.
నోట్ల రద్దు ఆలోచన ముందు ఎవరికీ వచ్చింది అన్న అంశానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐ పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇవ్వడం ఇప్పటికే జనం దృష్టికి వచ్చింది. “ఆర్.బి.ఐ నిర్ణయం తీసుకుంది. మేము దానిని ఆమోదించాం” అని కేంద్ర మంత్రులు గతంలో చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మొదట్లో ఆర్.బి.ఐ నిరాకరించింది. లేదా మౌనం వహించింది.
కానీ ప్రతిపక్ష నేత నాయకత్వంలో ఉండే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరైనప్పుడు ఎదో ఒక కారణం చెప్పి తప్పుకోవడానికి గవర్నర్ కు వీలు కాలేదు. తప్పుడు సమాధానం ఇస్తే చట్టబద్ధంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బహుశా సభా హక్కుల ఉల్లంఘన కూడా కావచ్చు. దానితో PAC ముందు అసలు విషయం వెళ్ళగక్కారు. “నవంబరు 7 తేదీన కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి మాకు సమాచారం ఇచ్చింది. పెద్ద నోట్లు రద్దు చేయాలనీ సలహా ఇచ్చింది. ఆ సలహాను మేము నవంబరు 8 తేదీన ఆమోదించాం” అని ఉర్జిత్ పటేల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చెప్పారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధం అని ఉర్జిత్ పటేల్ వెల్లడి చేశారు.
ఆ విధంగా ఆర్.బి.ఐ సంస్ధను బీజేపీ/మోడీ ప్రభుత్వం నామ మాత్రం చేసేసింది. తానె స్వయంగా ఆర్.బి.ఐ పరువు గంగలో కలిపింది. రాజ్యాంగ సంస్ధలు ఇన్నాళ్లూ సాపేక్షింగా అనుభవించిన స్వతంత్రతను మోడీ ప్రభుత్వం హరించివేసింది. సంస్ధల విచక్షణను నీరు గార్చింది. భారత ప్రజల్లోnoo, అంతర్జాతీయంగానూ పలుచన చేసింది.