అమెరికా, జపాన్ లతో మిలట్రీ డ్రిల్ కు ద.కొరియా నో!


South Korean Army

South Korean Army

ఆసియాలో, ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్ర తీరంలో ఒక విశేషం చోటు చేసుకుంది.

ఆసియాలో జపాన్ తర్వాత దక్షిణ కొరియాయే అమెరికాకు నమ్మిన బంటు. అమెరికాకు చెందిన అది పెద్ద సైనిక స్ధావరాలు జపాన్, దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. అయితే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని బెదిరించడానికి జపాన్, అమెరికాలు తలపెట్టిన సంయుక్త విన్యాసాలలో పాల్గొనడానికి దక్షిణ కొరియా నిరాకరించడమే ఆ విశేషం.

ఉత్తర కొరియాకు చెందిన జలాంతర్గాములను లక్ష్యం చేసుకుని దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త జల సైనిక విన్యాసాలు నిర్వహించాలని అమెరికా, జపాన్ లు నిర్ణయించాయి. అయితే ఈ విన్యాసాలలో పాల్గొనేందుకు దక్షిణ కొరియా తిరస్కరించింది. “సైనిక విన్యాసాలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదు” అని చెప్పి దక్షిణ కొరియా విన్యాసాలలో పాల్గొనడానికి నిరాకరించింది.

దక్షిణ కొరియా నిరాకరణ ఒక అనూహ్య పరిణామం. ఎందుకంటే దక్షిణ కొరియా ఎన్నడో తన రక్షణ బాధ్యత అంతా అమెరికా చేతిలో పెట్టింది. నిజానికి ఆ బాధ్యతను అమెరికాయే లాక్కుంది అనడమే సబబుగా ఉంటుంది.

కాస్త వ్యాపార దక్షత, ఆర్ధిక పుష్టి కలిగిన ఏ దేశం కూడా రెండో దేశానికి సాగిలపడేందుకు ఒప్పుకోదు. కానీ 1950లలో కొరియా యుద్ధాన్ని బలవంతంగా రుద్దిన అమెరికా ఆ దేశాన్ని రెండుగా విడదీసిన పుణ్యం కట్టుకుంది.

కమ్యూనిస్టు ‘భూతం’ దెబ్బకు గజగజలాడిన అమెరికా ఆ రోజుల్లో కమ్యూనిజం విస్తరిస్తుంది అనుకున్న చోటల్లా చొరబడి తగవులు పెట్టి, యుద్ధాలు రెచ్చగొట్టి తాను ఒక పక్షం చేరిపోయి కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవడానికి కుట్రలు చేసింది.

ఆ విధంగా కొరియా ప్రజల తిరుగుబాటును అణచివేయడంలో కొరియా దోపిడీ వర్గాలకు సహకరించి ఒక భాగం తన అదుపులో ఉండేలా చేసుకుంది. అదే దక్షిణ కొరియా. ఉత్తర భాగంలో అప్పటి కమ్యూనిస్టు చైనా సహాయంతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అమెరికా జోక్యం లేనట్లయితే కొరియా రెండుగా విడిపోయి ఉండేది కాదు. (జర్మనీ విభజనలో కూడా ఇదే తరహా కుట్రలకు అమెరికా, పశ్చిమ దేశాలు పాల్పడ్డాయి.)

చైనా, ఉత్తర కొరియాలు ఇప్పుడు కమ్యూనిస్టు దేశాలు కావు. సోషలిస్టు సమాజాన్ని నిర్మించే పనిలో అక్కడి ప్రభుత్వాలు లేవు. అయినప్పటికీ ఆర్ధికంగా గట్టి పోటీగా తయారయిన చైనాను బెదిరించి నిలువరించడం అమెరికా ప్రయోజనంగా కొనసాగుతోంది.

China, South Korea & Japan

China, South Korea & Japan

జపాన్, చైనాల మధ్య ఎలాగూ వైరం ఉన్నది కనుక దానిని అమెరికా వినియోగించుకుంటున్నది. జపాన్ రక్షణ పేరుతో అక్కడ భారీ సైనిక స్ధావరాన్ని, జపాన్ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, కొనసాగిస్తున్నది. అలాగే దక్షిణ కొరియాలో కూడా అతి పెద్ద సైనిక స్ధావరాన్ని అమెరికా నెలకొల్పి కొనసాగిస్తున్నది. ఈ రెండు దేశాల్లోనూ అమెరికా అణు బాంబులు మోహరించింది.

దక్షిణ కొరియాలో అణు బాంబులు మోహరించినందున ఉత్తర కొరియా సైతం తన స్వంత రక్షణ కోసం అణు బాంబులు తయారు చేసుకుంది. సందర్భం, అవసరం వచ్చినప్పుడల్లా దక్షిణ కొరియా, అమెరికాలు ఉత్తర కొరియాను గిల్లుతాయి. గిల్లడం అంటే ఉత్తర కొరియాకు దగ్గరగా సైనిక విన్యాసాలు జరపడం, దక్షిణ కొరియా నుండి వెళ్ళి భారీ యెత్తున పాంప్లెట్లను విమానాల నుండి ఉత్తర కొరియాలో జారవిడవడం. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం… ఇలా.

దానితో ఉత్తర కొరియా గట్టిగా సమాధానం ఇస్తుంది. “అవసరం అయితే అణు బాంబు ప్రయోగానికి కూడా వెనకాడేది లేదు” అని ప్రకటిస్తుంది. పశ్చిమ పత్రికలు ఉత్తర కొరియా చేసిన ఆత్మ రక్షణ ప్రకటనను మాత్రమే కొండంతలు చేసి ప్రచురిస్తాయి. అమెరికా, దక్షిణ కొరియాలు చేసే ‘గిల్లుడు’ చర్యల గురించి ఒక్క ముక్కా చెప్పవు.

దానితో ప్రపంచానికి ఉత్తర కొరియాయే పెద్ద విలన్ లా కనిపిస్తుంది. (రష్యా, సిరియా, ఇరాన్, లిబియా దేశాల విషయంలో కూడా అమెరికా ఇలాంటి కుట్రలకే పాల్పడుతూ ఆ దేశాలను విలన్ లుగా చూపిస్తుంది. ఆ పశ్చిమ పత్రికల వార్తలను విశ్లేషణలనే ఇతర దేశాల్లోని స్ధానిక పత్రికలు మోసి తరిస్తాయి. అమెరికా, పశ్చిమ దేశాలకు తమ వంతు ప్రచారం చేసి పెడతాయి. ఫలితంగా ఉత్తర కొరియా గురించిన వాస్తవాలు ఎప్పటికీ ఇతర దేశాలకు తెలియవు. ఉత్తర కొరియా ప్రకటనలను, ఆ దేశ వార్తా సంస్ధల వార్తలను అవి ఎన్నడూ పట్టించుకోవు.

దక్షిణ కొరియా అమెరికా చేతిలో పావు మాత్రమే. తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు అది అమెరికా ఆధిపత్య ప్రయోజనాలకు సహకరిస్తుంది. అలాంటి దక్షిణ కొరియా అమెరికాతో సంయుక్త మిలట్రీ విన్యాసాలకు నిరాకరించడం ఒక విశేషం.

ఈ విశేషానికి కారణం చైనాకు కోపం తెప్పించకుండా ఉండటానికి దక్షిణ కొరియా కూడా ప్ర్యత్నించడమేనా అన్నది పరిశీలించాల్సిన విషయం. నిన్న మొన్నటి వరకు ఫిలిప్పైన్స్ కూడా అమెరికాకు నమ్మిన బంటుగా వ్యవహరించింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా వ్యూహాలలో భాగస్వామ్యం వహించింది. కానీ గత సం. నుండి ఆ దేశం తన పంధా మార్చుకుంది. ఆర్ధికంగా పటిష్టంగా మారిన చైనాకు దగ్గర అవుతున్నది. అందుకోసం అమెరికా, ఒబామా లను దూషించడానికి కూడా ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు వెనకాడటం లేదు.

దక్షిణ కొరియా కూడా ఫిలిప్పైన్స్ బాటలో నడవాలని భావిస్తున్నదా? ఈ అంశాన్ని అప్పుడే నిర్ధారించడం తొందరపాటుతనమే అవుతుంది గానీ గమనంలో ఉంచుకోవలసిన అంశం అనడంలో మాత్రం సందేహం లేదు. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s