[పై కత్తిరింపును పిడిఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి]
ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి.
అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి గానీ అలాంటి పరిశోధన అవసరం లేని సందర్భాలలో కూడా కేవలం పశ్చిమ దేశాలకు అనుకూలంగా మాత్రమే ఎందుకు రాస్తాయన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉండదు.
ఉదాహరణకి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచాడు. ఆయన గెలుపుకి కారణం రష్యా దేశమే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్ధలు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలను రష్యా హ్యాకింగ్ చేసిందని, తద్వారా హిల్లరీ క్లింటన్ పైన ట్రంప్ విజయం సాధించేలా చేసిందనీ CIA , FBI లు నివేదికలు తయారు చేస్తే వాటి ఆధారంగా బారక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ లతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా రష్యా పైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఈ ఆరోపణలను భారత పత్రికలు, చానెళ్లు ఏ మాత్రం ప్రశ్నించకుండా, తప్పొప్పులను విచారించుకోకుండా వార్తలుగా ప్రసారం చేస్తున్నాయి. ప్రచురిస్తున్నాయి. పోనీ అమెరికా ఆరోపణలకు రష్యా సమాధానాన్ని కూడా పట్టించుకుని ప్రచురిస్తున్నాయా అంటే అదీ లేదు. అమెరికా ఆరోపణలు నిజం కాదనీ, తమకు అసలు ఏ మాత్రం శమందం లేదనీ, ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేక ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని రష్యా సమాధానం చెప్పింది. అసలు ‘ఎన్నికలను హ్యాకింగ్ చేయడం’ అంటే ఏమిటో అమెరికా గూఢాఛార సంస్ధలు ఇంతవరకు చెప్పలేదని, హ్యాకింగ్ చేశారన్న ఆరోపణలకు సాక్షాలు కూడా చూపలేదని, ఎలాంటి సాక్షాలు లేకుండా వేగ్ గా ఎలా చెబుతారని రష్యా ప్రశ్నిస్తోంది.
రష్యా సమాధానాన్ని, వాదననీ మాత్రం భారత పత్రికలు, చానెళ్లు ప్రసారం చేయడం లేదు. ప్రచురించడం లేదు. దానితో అమెరికా ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందన్న వార్త మాత్రమే భారత ప్రజల్లోకి వెళుతున్నది తప్ప రష్యా సమాధానం, ఖండనలు వెళ్లడం లేదు. తద్వారా ప్రజలకు వాస్తవాలు అందించడంలో కనీసం ఏది వాస్తవమో నిర్ణయించుకునే అవకాశం జనానికి ఇవ్వడంలో కూడా పత్రికలు, చానెళ్లు విఫలం అవుతున్నాయి.
ఇదే తరహా ప్రచారం సిరియా విషయంలో కూడా జరిగింది; జరుగుతోంది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు చెప్పిన సకల అబద్ధాలను వార్తలుగా ప్రసారం చేశాయి భారత పత్రికలు. ఆ అబద్ధాలు వాస్తవం కాదని నిరూపించేందుకు అనేక సాక్షాలు రష్యా పత్రికలు, చానెళ్లు అందించాయి. వాటిని ప్రచురించడంలో భారత పత్రికలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ఫలితంగా రష్యాను దురాక్రమణ దేశంగా, సిరియాను టెర్రరిస్టు దేశంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు సఫలం అవుతున్నాయి. వారు ప్రచారం చేసిన అబద్ధాలే వాస్తవాలుగా భారత్ లో ప్రచారం అయ్యాయి.
ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడి వల్లనే భారత ప్రభుత్వం డీమానిటైజేషన్ ను బలవంతంగా భారత ప్రజలపై రుద్దిన వాస్తవాన్ని ఒక తెలుగు పత్రిక ప్రచురించడం నిజంగా సాహసమే. ఈ సాహసానికి పూనుకున్నందుకు ఆంధ్ర జ్యోతి పత్రికను తప్పకుండ అభినందించాలి. అమెరికా సామ్రాజ్యవాదం భారత ప్రజల జీవనం లోని ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో ఈ సందర్బంగా గుర్తించాలి. ఇందుకు భారత పాలకులే వాహకులుగా పని చేస్తున్నారనీ, అమెరికా పెత్తనం చొరబాటుకు తామే మద్దతు ఇస్తున్నారని ప్రజలు గ్రహించాలి. ఆధార్ కార్డు, జన్ ధన్ తదితర చర్యలన్నీ ఒక పధకం ప్రకారం దశల వారీగా ప్రవేశపెట్టి డీమానిటైజేషన్ కు అనువుగా వాతావరణం సిద్ధం చేస్తూ వచ్చారని ఈ కధనం ఆధారంగా మనం గ్రహించవచ్చు.
పోటీలు పడి మరీ రాజకీయ పార్టీలు పెంచుకున్న సభ్యత్వాలు కూడ.
ఇటువంటి కధనాన్నే సాక్షి దినపత్రిక కూడా ఈ రోజు ప్రచురించింది.