డీమానిటైజేషన్ / రీమానిటైజేషన్ లీలలు ఒకటీ, రెండూ కాదు.
ఆ మధ్య సంస్కృత అంకెలను తప్పు ముద్రించారు. ఆ తర్వాత ఆంగ్లం అంకెలని కూడా తప్పు ముద్రించారు. ద్రెడ్ లేకుండా కొన్ని నోట్లు పంచారు. ఓ చోట బ్యాంకు రెండు వేళా నోటు తెచ్చుకున్నాక కొన్ని గంటల లోపే ముక్కలు ముక్కలుగా దానంతట అదే విరిగిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. కొన్ని చోట్ల సగం మాత్రమే ప్రింట్ అయినా 500 నోట్లు ఎటిఎం లలో ప్రత్యక్షమై గాభరా పెట్టాయి. సీరియల్ నెంబర్లు కేవలం సున్నాలు మాత్రమే ముద్రించబడ్డ 2000 నోట్లు కూడా చెలామణిలోకి వచ్చి అనేక జోకులకు ఆహారంగా నిలిచాయి.
ఇప్పుడేమో ఏకంగా గాంధీ బొమ్మే లేకుండా ముద్రించిన 2000 నోటు ఇచ్చి బ్యాంకు (RBI) వారు ఓ రైతు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు.
మధ్య ప్రదేశ్ లోని షియో పూర్ జిల్లాలో ఓ రైతు తన చేతికి వచ్చిన 2000 నోట్లు చూసి షాక్ తిన్నాడు. బ్యాంకు క్యాషియర్ ఇచ్చిన 2000 నోట్లలో మూడింటి పైన మహాత్మా గాంధీ బొమ్మ ముద్రించి లేదు. ఆ రైతు పేరు లక్ష్మణ్ మీనా. బిచ్చుగవాడి గ్రామానికి చెందినవాడు. ఆ బ్యాంకు పబ్లిక్ సెక్టార్ కు చెందినదని చెప్పిన ద హిందూ పత్రిక బ్యాంకు పేరు మాత్రం వెల్లడి చేయలేదు.
లక్ష్మణ్ మీనా వెంటనే తన నోట్లను చూసుకోలేదు. బ్యాంకు నుండి మార్కెట్ కు వెళ్లి అక్కడ మార్చుతుండగా మహాత్మా గాంధీ బొమ్మ లేకపోవడం గమనించి హతాశుడయ్యాడు. ఆ నోట్లు దొంగ నోట్లేమో అని కంగారు పడ్డాడు. అవి దొంగ నోట్లే అని అతని కొడుకు నిర్ధారించి చెప్పేసాడు. దానితో అవి తాము ఇచ్చినవి కాదని చెబుతూ బ్యాంకు వాళ్ళు వెనక్కి తీసుకోవటానికి నిరాకరిస్తారేమో అని భయపడుతూ తిరిగి బ్యాంకుకు వెళ్ళాడు.
“జనవరి 3 తేదీన నేను బ్యాంకు నుండి డబ్బులు విత్ డ్రా చేశాను. మూడు నోట్ల పైన గాంధీ బొమ్మ లేని సంగతిని నేను ఆ తర్వాత గమనించాను. గాంధీ బొమ్మ లేని విషయం గమనించినప్పుడు నేను మార్కెట్ లో ఉన్నాను. వెంటనే బ్యాంకుకు పరుగెత్తుకు వెళ్లి మేనేజర్ కి నోట్లు చూపించాను.” అని రైతు PTI తో మాట్లాడుతూ చెప్పాడు.
బ్యాంకు మేనేజర్ నోట్లు తీసుకోవటానికి వెంటనే అంగీకరించలేదు. “బ్యాంకులో ఉన్నపుడే ఎందుకు చూసుకోలేదు” అని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో మూడు నోట్లను మల్లి డిపాజిట్ చేయండని రైతుకు చెప్పాడు.
“నోట్లు తీసుకుంటున్నప్పుడే ఏంతుకు పరీక్షించుకోలేదని మేనేజర్ మొదట నన్ను ప్రశ్నించారు. బ్యాంకు వాళ్ళు కూడా ఇలాంటి నోట్లు ఇస్తారని నాకేం తెలుసు! కానీ, ఆ తర్వాత ఆయనే నోట్లు డిపాజిట్ చేసి కొత్త నోట్లు తీసుకోమన్నారు” అని రైతు చెప్పాడు.
“అయితే అవి దొంగ నోట్లు కాదని, ముద్రణలో లోపం వల్ల అలా జరిగి ఉండ వచ్చని మేనేజర్ గారు చెప్పారు” అని రైతు చెప్పాడని PTI తెలిపింది.
బ్యాంకు వాళ్ళు రైతుకు కొత్త నోట్లు వెంటనే ఇవ్వలేదు. ఆ తర్వాత రోజు రమ్మని చెప్పారు. జనవరి 4 తేదీన మాత్రమే వేరే నోట్లు ఇచ్చారు. పై అధికారులను సంప్రదించి వారు ఓకే అన్న తర్వాత మాత్రమే వేరే నోట్లు ఇవ్వడానికి సిద్ధ పడ్డారని భావించవచ్చు.
గాంధీ బొమ్మ లేని నోట్ల విషయమై PTI సంబంధిత బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా ఆయన వివరాలు చెప్పడానికి నిరాకరించారు. జరిగిన సంగతి లీడ్ బ్యాంక్ మేనేజర్ కి రిపోర్ట్ చేశామని ఏమన్నా సమాచారం కావాలంటే ఆయన్నే కనుక్కొమ్మని ఆయన బదులిచ్చారు.
“నేను చెప్పడానికి ఏమి లేదు. ఇప్పటికే పైకి రిపోర్ట్ చేసాను. వివరాలు కావాలంటే లీడ్ మేనేజర్ ని సంప్రదించండి” అని అయన ఫోన్ లో చెప్పారని PTI తెలిపింది.
ద క్వింట్ (వెబ్) పత్రిక ప్రకారం ఈ సంఘటన జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో. బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తుండగా రికార్డ్ చేసిన వీడియోను సదరు పత్రిక తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. గాంధీ బొమ్మ లేని నోట్లను RBI కి పంపామని, ఇది ఎలా జరిగిందో నిర్ధారించడానికి విచారణ చేపట్టామని ఆయన ఆ వీడియోలో చెప్పారు.
ద అమెరికన్ బజార్ పత్రిక ప్రకారం గాంధీ బొమ్మ లేని రెండు వేల నోట్లు అందుకున్నది లక్ష్మణ్ మినా ఒక్కరే కాదు. లక్ష్మణ్ తనకు వచ్చిన నోట్లను బ్యాంకు వాళ్లకు చెప్పినపుడు మొదట వారు అనుమానంగా చూసారని పైన చూసాం. ఆ నోట్లు బ్యాంకులో తీసుకున్నవే అని లక్ష్మణ్ బ్యాంకు మేనేజర్ ను నమ్మించేందుకు తంటాలు పడుతుండగానే మరో రైతు ఆవే తరహా నోట్లతో బ్యాంకుకు వచ్చాడు.
ఆ రెండో రైతు పేరు గుర్మీత్ సింగ్. కదుఖేదా గ్రామానికి చెందిన వాడు. ఆయనకీ గాంధీ బొమ్మ లేని రెండు వేళా నోట్లు నాలుగు వచ్చాయి. రెండో రైతు కూడా రావడంతో బ్యాంకు వాళ్ళకి అవి తమ నోట్లే అని అర్ధం అయినట్లుంది. వాటిని డిపాజిట్ చేయమని చెప్పి వేరే నోట్లు తీసుకోవటానికి తర్వాత రోజు రమ్మని చెప్పి రైతులను పంపేశారు.
శివపురి రోడ్ SBI బ్రాంచి లో ఈ సంఘటన జరిగిందని, ఈ నోట్లు ఎలా వచ్చింది తెలుసుకోవటానికి దర్యాప్తు చేపట్టామని, RBI కి కూడా సమాచారం ఇచ్చామని SBI జిల్లా మేనేజర్ ఆకాష్ శ్రీ వస్తావా చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
మోదీ ప్రకటన వెలువడిన నవంబర్ 8 నుండి దేశంలో ఉన్న,విదేశాలలో ఉన్న 500రూ.,1000రూ. నోట్లన్నీ గాంధీ బొమ్మ ఉన్నా చెల్లని చిత్తుకాగితాలుగా మార్చేసిన ఆ సంఘటన ప్రజానీకానికి ఆందోళనకు గురిచేసింది. దాదాపు 125 కోట్ల ప్రజానీకానికి భయబ్రాంతులకు గురిచేసిన మోదీ దేశభక్తి అనే పనికిమాలిన భావోద్వేగాన్ని ఉపయోగించి ఉపశమనం పొందడానికి ప్రయత్నించాడు. రానున్న ఎన్నికలలో దాని ప్రతిఫలాన్ని రుచిచూస్తాడు!