“డీమానిటైజేషన్ వల్ల జనానికి కాస్త అసౌకర్యం కలిగించిన మాట నిజమే. కానీ ప్రజలందరూ డీమానిటైజేషన్ కు మద్దతు ఇస్తున్నారు. మోడీ మంచి చర్య తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారని మెచ్చుఁకుంటున్నారు. దేశంలో ఏ ఒక్కరూ నిరసన తెలియజేయక పోవటమే అందుకు నిదర్శనం. జనం ఎక్కడా వీధుల్లోకి రాకపోవడమే అందుకు సాక్షం.”
ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. డీమానిటైజేషన్ ఫలితంగా వందకు మందికి పైగా చనిపోవడం, రోజుల తరబడి చాంతాడంత క్యూలలో వందలాది ప్రజలు పనులు మానుకుని నిలబడవలసి రావడం, కోట్లాది శ్రామిక కుటుంబాలు పని లేక పస్తులు ఉండడం, ఉత్తర భారత గ్రామాల నుండి పనుల కోసం నగరాలకు వలస వెళ్లిన కోట్లాది కార్మికులు ఆ పనులు లేక గ్రామాలకు ‘రివర్స్ మైగ్రేషన్’ లోకి మళ్లడం, వ్యాపారాలు లేక అనేక చిన్న-మధ్య తరహా పరిశ్రమలు కార్మికులను లే-ఆఫ్ చేయడం, అనేక చోట్ల రబీ పంటలు విత్తుబడికి నోచుకోక పోవడం, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోవడం, ఖరీఫ్ పంటలు అమ్మకానికి నోచుకోక ధరలు భారీగా పతనం కావటం… ఇవన్నీ ఈ దళసరి చర్మాల దృష్టిలో ‘కాస్త అసౌకర్యం’ మాత్రమే.
నిజానికి అనేక చోట్ల వివిధ రూపాల్లో ప్రజలు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీ, మంత్రులు, మోడీ భక్తాగ్రేసర గణాలు ఆ నిరసనలను చూడక పోవడం, చూసి కూడా నిరాకరించడమే అసలు సమస్య. బెంగాల్, అస్సామ్ టీ తోటల కార్మికులు, సూరత్, కాన్పూర్, లూథియానా మొదలైన చోట్ల టెక్స్ టైల్ పరిశ్రమల కార్మికులు, ఆహార ప్రాసెసింగ్ కార్మికులు, అనేక బ్యాంకుల ఉద్యోగులు మరియు అధికారులు… ఇలా అనేక మంది వివిధ వేదికల పైన, వివిధ రూపాలలో డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా గొంతు విప్పారు; ప్రదర్శనలు నిర్వహించారు; రాస్తా రోకోలు చేశారు. ఇంకా చేస్తున్నారు. జనవరి 2 తేదీన (సోమవారం) ఛత్తీస్ ఘర్ రాజధాని రాయపూర్ లో రైతులు ధరల పతనానికి నిరసనగా లక్ష కిలోల కూరగాయలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం డీమానిటైజేషన్ వ్యతిరేక నిరసనల వరుసలో ఒకటి మాత్రమే.
సోమవారం వేలాది మంది రైతులు రాయపూర్ లోని ధర్నా స్ధల్ లో చేరి డీమానిటైజేషన్ ప్రభావంతో తమ కూరగాయల పంటల ధరలు భారీగా పతనం కావడం పట్ల ఆగ్రహం ప్రకటించారు. ధరల పతనానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. డీమానిటైజేషన్ వల్లనే తమకు ఈ పరిస్ధితి దాపురించిందని ఆక్రోశించారు. వారి ఆందోళనను బీజేపీ పార్టీ నేతలు హైజాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ రైతులు తమ ఆందోళనను కొనసాగించారు.
జనవరి 1 నుండి ఎటిఎం లలో రు 4500 విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించినప్పటికీ వాస్తవంగా అది అమలులోకి రాలేదు. RBI నుండి కరెన్సీ సరఫరా మెరుగుపడక పోవడంతో ఎటిఎం కాంట్రాక్టర్లు ఎప్పటి లాగానే పరిమితంగా అందుబాటులో ఉంచుతున్నారు. అనేక చోట్ల ఈ కాంట్రాక్టర్లు ప్రయివేటు ధనికులతో సంబంధాలు పెట్టుకుని కమిషన్ తీసుకుని వారికీ నోట్ల కట్టలు ముట్టజెబుతున్నారు. దానితో ఎటిఎం లకు డబ్బు చేరడం లేదు.
రు 500 నోట్లు సరఫరా చేస్తున్నాము అని ఆర్ధిక మంత్రి ఘనంగా ప్రకటించారు గాని నగరాల బ్యాంకులు కూడా ఇంతవరకు రు 500 నోట్లను కళ్ళ జూడలేదు. ప్రయివేటు బ్యాంకులకు మాత్రం కొత్త నోట్లు దండిగా అందుతున్నప్పటికీ అవి ధనికుల ఇళ్లకు మాత్రమే చేరుతున్నాయి. హైద్రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో 200 బ్రాంచీలు ఉండగా వాటికి (అన్నింటికీ కలిపి) ఇప్పటికీ రెండు రోజుల కొకసారి 10 కోట్లు మాత్రమే RBI పంపిణి చేయడం బట్టి పరిస్ధితిని అంచనా వేయవచ్చు. (మాములుగా అయితే ఈ బ్రాంచిలకు రోజుకి 25 నుండి 50 కోట్ల వరకు అవసరం అవుతుంది.) ఈ పరిస్ధితుల్లో అటు ఎటిఎం లు గాని, ఇటు బ్యాంకు శాఖలు గానీ కొత్త నోట్లను తగినంతగా ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉంచలేకపోతున్నాయి.
ఫలితంగా మధ్యవర్తులు, కొనుగోలుదారులు రైతులకు డబ్బు ఇవ్వలేక కొనుగోలు చేయడం లేదు. లేదా పరిమితంగా కొనుగోలు చేస్తున్నారు. కానీ కూరగాయలు నిల్వ ఉండేవి కాదు. ఎప్పటికప్పుడు అమ్ముకోవలసిందే; లేదా అయిన కాడికి అమ్ముకోవలసిందే. దానితో ధరలు తీవ్రంగా పతనం అవుతున్నాయి. పంట చేతికొచ్చే సీజన్ లో అటు అమ్ముకోలేక, ఇటు నిల్వ చేసుకోలేక సరుకు పారబోయవలసి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాయపూర్ కూరగాయల రైతులు తమ కూరగాయలను మార్కెట్ నుండి ధర్నా స్ధల్ కు తరలించారు. లక్ష కిలో గ్రాముల కూరగాయలను ఉచితంగా జనానికి పంపిణి చేశారు.
బీజేపీ నేతలు, దాని అనుబంధ సంఘాల నేతలు రైతుల ఆందోళనలోకి చొరబడటం గమనార్హం. ఓ వైపు రైతులు డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగానే తాము ఆందోళన చేస్తున్నామని ప్రకటిస్తుండగా మరో వైపు బీజేపీ నేతలు తమను తాము రైతు నాయకులుగా చెప్పుకుంటూ “మా ఆందోళన డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా కాదు. కేవలం ధరల పతనానికి వ్యతిరేకంగా మాత్రమే” అని ప్రకటించారు. వారి ప్రకటనలను రైతులు తీవ్రంగా తప్పు బట్టారు. తమ ఆందోళనను పాలక పార్టీ నేతలు హైజాక్ చేస్తున్నారని ఆగ్రహం ప్రకటించారు. ధరల పతనానికి కేవలం డీమానిటైజేషన్ మాత్రమే ముఖ్య కారణం. ఆ సంగతి మాకు స్పష్టంగా కనిపిస్తోంది” అని రైతులు స్పష్టం చేశారు.
“ఒక్క చోటైనా ప్రజలు నిరసన తెలియజేశారా?” అని మోడీ, జైట్లీలు నమ్మకంగా ప్రకటించడం వెనుక అసలు కారణం ఏమిటో రాయపూర్ రైతుల నిరసన ద్వారా అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడా ఆందోళన, నిరసన జరిగినా వాటిని హైజాక్ చేసి ఆందోళన లక్ష్యాలను పక్కదారి పట్టించాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు, అనుబంధ సంఘాలకు ఆదేశాలు అందినట్లు రాయపూర్ ఉదాహరణ ద్వారా తెలుస్తున్నది.
రైతులు కూరగాయలు పంపిణి చేసిన బుద్ధతలాబ్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు గుమి కూడి క్యూలలో నిలబడి మరీ కూరగాయలు ఉచితంగా పొందారు. “ధరల పతనానికి, డీమానిటైజేషన్ కు నిరసనగా మేము దాదాపు 30 వేల మంది ప్రజలకు లక్ష కి.గ్రా ల కూరగాయలు పంపిణి చేశాం” అని రైతులు చెప్పారని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.
‘ప్రజలు ఆందోళన చేసారా? నిరసన తెలియజేసారా?” అని ప్రశ్నిస్తున్న మోడీ, కేంద్ర సచివులు గతంలో ఎప్పుడు ప్రజల నిరసనను పట్టించుకున్నారు? జనం ఆందోళన పట్టించుకుని వారి సమస్యలు పరిష్కారం చేసే వారైతే ఆ ప్రశ్నలు వేయడంలో అర్ధం ఉంది. రోహిత్ ఆత్మహత్యకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా విద్యార్థులు ఉవ్వెత్తున నిరసన తెలియజేసినప్పటికీ మోడీ వీసమెత్తయినా స్పందించారా? అఖ్లక్ హత్యకు వ్యతిరేకంగా పన్సారే-ఖల్బుర్గి-దభోల్కర్ హత్యలకు వ్యతిరేకంగా వందలాది రచయితలు, ప్రొఫెసర్లు తమ అవార్డులను వెనక్కి ఇచ్చినా ఈ హిందుత్వ ప్రభుత్వం స్పందించిందా? NDA – 1 హయాంలో గాని, NDA -2 హయాంలో గాని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యనగ తెలంగాణ, విదర్భ (మహారాష్ట్ర), కర్ణాటక రాష్ట్రాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే పట్టించుకున్నారా? ప్రజల నిరసనలను ఏ మాత్రం పట్టించుకోని వారు, స్పందించని వారు ‘నిరసనలు లేవు చూసారా’ అని తమను తాము సమర్ధించుకోవడం అత్యంత హాస్యాస్పదం.
“మేము ఇక్కడికి డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చాం. ఆందోళనకు నాయకులం అని చెబుతున్నవారు కొందరు ఇక్కడికి వచ్చాక డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం మానేశారు. బీజేపీ నాయకులు వారిని ప్రభావితం చేశారు. డీమానిటైజేషన్ వల్లనే కూరగాయల ధరలు పతనం అయ్యాయన్న సంగతి మాకు స్పష్టంగానే తెలుసు” అని రైతులు చెప్పారు. “బీజేపీ నేతలు మా ఆందోళనను హైజాక్ చేసారు” అంటూ వారు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజులుగా కూరగాయల ధరలు భారీగా పతనమై పెట్టుబడి సంగతి అలా ఉంచి కనీస ఖర్చులు కూడా రాలేదని ఆక్రోశం వెలిబుచ్చారు.
ఛత్తీస్ ఘర్ వ్యవాయ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ మాత్రం ధరల పతనానికి వేరు కారణం చెబుతున్నారు. “బైటి నుండి వచ్చే వ్యాపారాలు కొందరు ఛత్తీస్ ఘర్ మార్కెట్ కు దూరంగా ఉన్నారు. అందుకే ధరలు పతనం అయ్యాయి” అని చెప్పారు. “డీమానిటైజేషన్ వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ అదే ఏకైక కారణం కాదు” అని బ్రిజ్ మోహన్ సన్నాయి నొక్కులు నొక్కారు.
2014లో సుమారు 8 లక్షల కోట్ల నగదు ఉందిట చలామణిలో. అప్పటి నుండి ఇప్పటికి దేశం పెద్ద అభివృధ్ధి చెందేసిందేం కాదు కాబట్టి, రిజర్వ్ బాంకు ఇక బాంకులకు అంత కంటె డబ్బు ఇవ్వక్కరలేక పోయినా పర్లేదు.
ఇప్పుడు బాంకుల్లో జమ అయిన ఈ అదనపు సూమారు 7 – 8 లక్షల కోట్ల నగదూ గత మూడేళ్ళుగా ఎలాగో ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ బాంకుల్లోకి వచ్చాయి. ప్రజల్లోకి వెళ్ళి చలామణిలో ఉంటే ఉల్బణ ధర్మం. నల్లగా నిలువ ఉన్నందువల్ల ఉల్బణం కనపడలేదు ఈ మూడేళ్ళూ.
ఇప్పుడివి బాంకుల్లోకి వచ్చాయి కనుక మళ్ళీ అంత నగదు వదలక పోవడమే మంచిది.
అయిందేదో అయిపోయింది.
ఇకనుంచైనా చలామణిలో ఉండవలసిన నగదు మొత్తం, నోటుల నిష్పత్తి, ఉండ వలసిన చిల్లర, డిజిటల్ డబ్బుల మార్గ దర్శకత్వాలపై ఒక రాదారి పటం, శ్వేత పత్రం ఉంటే మేలు.