సుప్రీం ప్రక్షాళన: బి‌సి‌సి‌ఐ అధ్యక్షుని డిస్మిస్!


anurag-thakur

సుప్రీం కోర్టు పుణ్యాన భారత క్రికెట్ 2017 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అవినీతి రాజకీయ నాయకులకు, ఆశ్రిత పక్షపాతానికి, వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన బి‌సి‌సి‌ఐ అధ్యక్షుడు కార్యదర్శి పదవుల నుండి అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లను తొలగించింది. వారి స్ధానాలను భర్తీ చేసేందుకు క్రికెట్ ఆటతో సంబంధం ఉన్న నిష్కళంక దక్షులను వెతకాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులతో ద్వి సభ్య కమిటీ నియమించింది. అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ముందున్నారని కొన్ని పత్రికలు అప్పుడే ఊహాగానాలు చేస్తున్నాయి.

బి‌సి‌సి‌ఐ ప్రక్షాళన నిమిత్తం సుప్రీం కోర్టు నియమించిన ఆర్ ఎం లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి బి‌సి‌సి‌ఐ కమిటీ అడ్డంగా నిరాకరించడంతో కొద్ది నెలలుగా ఇరు పక్షాల (లోధా కమిటీ మరియు బి‌సి‌సి‌ఐ) మధ్యా యుద్ధం లాంటిది నడుస్తోంది. తమ పదవులకు, సంపదలు పోగేసుకోవటానికి ఆటంకం కలగని కొద్ది సిఫారసులను ఆమోదించి, ఆటంకంగా ఉన్న ప్రధాన సిఫారసులను అమలు చేయడానికి మాత్రం మీన మేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఆ సాకు ఈ సాకు చెబుతూ అమలును పదే పదే వాయిదా వేస్తూ వచ్చింది. రాష్ట్రాల అసోసియేషన్లు ఆమోదించడం లేదని కుంటి సాకులు చెప్పింది.

చివరికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను సైతం తమకు అనుకూలంగా (సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా) ప్రకటన ఇవ్వాలని అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కోరాడన్న సంగతి వెలికి వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రాల అసోసియేషన్లకు వందల కోట్లు పంపిణీ చేసింది. అనేక పదవులకు నియామకాలు చేపట్టింది. దానితో సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది.

Justice R M Lodha

Justice R M Lodha

లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు డబ్బులు ఇవ్వరాదని రెండు నెలల క్రితం ఆదేశాలు ఇచ్చింది. బి‌సి‌సి‌ఐ ఖాతాలను స్తంభింపజేసింది. ఆర్ధిక అధికారాలను లోధా కమిటీ తాత్కాలికంగా లోధా కమిటీకి వశం చేసింది. బి‌సి‌సి‌ఐ పంపిణీ చేసిన నిధులు వెనక్కి తీసుకుంది. కమిటీ సిఫారసులను అమలు చేసిన తర్వాత ఆర్ధిక, పాలనా అధికారాలు బి‌సి‌సి‌ఐ కి బదలాయిస్తామని స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫారసులను సంపూర్ణంగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

అయినప్పటికీ బి‌సి‌సి‌ఐ లొంగి రాలేదు. కేసును ఒక కొలిక్కి తేవడానికి, భారత క్రికెట్ పాలనను అవినీతి రహితం చేయడానికి సుప్రీం కోర్టు చేస్తున్న ప్రయత్నాలకు బి‌సి‌సి‌ఐ కమిటీ తీవ్ర ఆటంకంగా పరిణమించింది. అనురాగ్ ఠాకూర్ తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వమని ఐ‌సి‌సి ని తాను కోరలేదని మరోసారి అబద్ధం చెప్పాడు. దానితో సుప్రీం కోర్టు అధ్యక్షుడు, కార్యదర్శులను పదవుల నుండి తొలగించింది. కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు, కోర్టులో ఒట్టు వేసి అబద్ధం చెప్పినందుకు (పెర్జురీ) అభియోగాలు మోపి ఎందుకు విచారణ చేయకూడదో చెప్పాలని కోరుతూ అనురాగ్ ఠాకూర్ కు నోటీసులు జారీ చేసింది.

2013లో ఐ‌పి‌ఎల్ టోర్నమెంటులో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బైటపడడంతో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లోకి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఐ‌పి‌ఎల్ అవినీతిని విచారించడానికి జస్టిస్ ముదుగల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను సుప్రీం కోర్టు నియమించింది. ఐ‌పి‌ఎల్ నిర్వహణలో తీవ్రమైన అవినీతి చోటు చేసుకుంటున్నదని ముదుగల్ కమిటీ సమర్పించిన నివేదిక తేల్చి చెప్పింది. క్రికెట్ ఆటను ప్రక్షాళన చేయవలసి ఉన్నదని స్పష్టం చేసింది. దరిమిలా జనవరి 2015లో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. క్రికెట్ పాలన ప్రక్షాళనకు ఏయే సంస్కరణ చర్యలు చేపట్టాలో చెప్పాలని కమిటీని కోరింది.

Justice Mudgal

Justice Mudgal

జులై 2015లో నివేదిక సమర్పించిన లోధా కమిటీ, ఐ‌పి‌ఎల్ చెన్నై (చెన్నై సూపర్ కింగ్స్) మరియు రాజస్ధాన్ (రాజస్ధాన్ రాయల్స్) ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ రెండు టీముల సహ యజమానులు గురునాధ్ మీయప్పన్, రాజ్ కుంద్రాలు తమ జీవిత కాలంలో క్రికెట్ తో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకుండా నిషేధం విధించింది.

అనంతరం బి‌సి‌సి‌ఐ ను సంపూర్ణంగా, సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు అనేక సిఫారసులు చేసింది. 70 యేళ్ళ పైబడిన వ్యక్తులు పదవులు చేపట్టకుండా పరిమితి విధించడం, మంత్రులు,  క్రికెట్ పదవులు చేపట్టరాదని కోరింది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని కోరింది. తద్వారా నగరాల క్రికెట్ అసోసియేషన్లు, ప్రాంతాల అసోసియేషన్లు కేంద్ర స్ధాయిలో పెత్తనం చేయకుండా అడ్డుకుంది. పలుకుబడి కలిగిన, ఆదాయం మెండుగా కలిగిన నగరాల (ఉదా: ముంబై, ఢిల్లీ, చెన్నై) క్రికెట్ అసోసియేషన్ లు పెత్తనం చేస్తూ తమ జట్ల సభ్యులకే జాతీయ జట్టులో అవకాశం వచ్చే విధంగా, పేద ప్రాంతాల అసోసియేషన్లు, ప్రాంతాల నుండి ఆటగాళ్లకు అవకాశాలు లేకుండా చేసే విధంగా ప్రభావితం చేసే విధానానికి స్వస్తి పలికేందుకు ఏర్పాట్లు చేసింది. బి‌సి‌సి‌ఐ పాలనలో, నిధుల ఖర్చులో పారదర్శక ఉండేందుకు గాను బి‌సి‌సి‌ఐలో కాగ్ (సి‌ఏ‌జి – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సిఫారసు చేసిన వ్యక్తి ఒక సభ్యుడుగా ఉండాలని చెప్పింది.

లోధా కమిటీ సిఫారసులు బి‌సి‌సి‌ఐ పెద్దలకు సహజంగానే కంటగింపు అయ్యాయి. సొసైటీ చట్టం కింద ఏర్పడిన బి‌సి‌సి‌ఐ లోకి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకూడని మొదట వాదించింది. వారి వాదనను సుప్రీం కోర్టు మొగ్గలోనే తుంచివేసింది. దేశ ప్రజల ఆదాయం నుండే క్రికెట్ బోర్డుకు వివిధ రూపాల్లో నిధులు వచ్చి చేరుతున్నందున బి‌సి‌సి‌ఐ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టుకు అన్ని విధాలా అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. ఆ తర్వాత రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు లోధా కమిటీ సిఫారసులను అంగీకరించడం లేదని సాకు చెప్పింది. అయితే వారికి నిధులు ఇవ్వడం ఆపాలని కోరింది. లోధా కమిటీ సిఫారసులు ఆమోదించిన అసోసియేషన్లకే బి‌సి‌సి‌ఐ నిధులు ఇవ్వాలని చెప్పింది. అయినప్పటికీ బి‌సి‌సి‌ఐ పదే పదే అప్పీలు చేస్తూ వచ్చింది. వాయిదా ఎత్తుగడలను అనుసరిస్తూ ఈ లోపు నిధులను కాజేసే ఎత్తుగడలు రచించింది.

SC appointed Amicus Curiae: Gopal Subrahmanyam

SC appointed Amicus Curiae: Gopal Subrahmanyam

బి‌సి‌సి‌ఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఐ‌సి‌సి రూల్స్ ని అడ్డం పెట్టుకోవడం ద్వారా బి‌సి‌సి‌ఐ పెత్తనాన్ని కాపాడుకోవాలని పధకం పన్నాడు. ఐ‌సి‌సి నిబంధనల ప్రకారం వివిధ దేశాల కేంద్ర ప్రభుత్వాలు ఆ దేశాల క్రికెట్ అసోసియేషన్ లలో జోక్యం చేసుకోరాదట. ఇంతకంటే మించిన పెత్తందారీ ధోరణి బహుశా ఎక్కడా కనిపించకపోవచ్చు. ఒక దేశ ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని ఒక అంతర్జాతీయ ప్రైవేటు క్రికెట్ సంస్ధ నిబంధన విధించడం ఏమిటో దానికి బి‌సి‌సి‌ఐ అంగీకరించడం ఏమిటో బొత్తిగా అర్ధం కాని సంగతి. ఈ అడ్డగోలు నిబంధన క్రికెట్ బోర్డులను శాసిస్తున్న ప్రైవేటు ధనిక వర్గాల ఉడుం పట్టును, వారి ఆర్ధిక దోపిడీ విధానాలను కాపాడుకునేందుకు ఉద్దేశించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అనురాగ్ ఠాకూర్ సరిగ్గా ఈ నిబంధననే సుప్రీం కోర్టు తలపెట్టిన ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఉపయోగించాలని పధకం వేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ సంస్ధ అయిన కాగ్, బి‌సి‌సి‌ఐలో ఒక కమిటీని నియమించడం అంటే అది కేంద్ర ప్రభుత్వం జోక్యం కిందికి వస్తుందని, అది తమకు ఆమోదయోగ్యం కాదని ఐ‌సి‌సి నుండి సుప్రీం కోర్టుకు లేఖ రావాలని అనురాగ్ ఠాకూర్ కోరాడు. ఈ సంగతి సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణ్యం సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చాడు. దానితో సుప్రీం కోర్టు అగ్గి మీద గుగ్గిలం అయింది. అనురాగ్ ఠాకూర్ ని వివరణ కోరింది. ఆయన తాను అడిగింది అది కాదని సుప్రీం సిఫారసులపై అభిప్రాయం చెప్పాలని మాత్రమే కోరానని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధాన్ని తన అఫిడవిట్ లో చేర్చాడు.

సుప్రీం కోర్టు ఠాకూర్ అఫిడవిట్ ను విశ్వసించలేదు. ఈ విషయమై ఐ‌సి‌సి ఛైర్మన్ తోనే నేరుగా సంప్రదించి నిజా నిజాలు నిర్ధారించాలని అమికస్ క్యూరీని కోరింది. దరిమిలా ఠాకూర్ అఫిడవిట్ అబద్ధమని గోపాల్ సుబ్రమణ్యం ఐ‌సి‌సి ఛైర్మన్ శశాంక్ మనోహర్ నుంచి స్పష్టమైన సమాచారం సేకరించడం ద్వారా నిర్ధారించింది. ఫలితంగా సుప్రీం కోర్టు అంతిమ ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఠాకూర్ లాయర్ కపిల్ సిబాల్ (ఠాకూర్ బి‌జే‌పి ఎం‌పి కాగా కపిల్ సిబాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేయడం గమనార్హం.) తమ క్లయింటుకు వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. ఆయన చెప్పింది అబద్ధం అయితే ఆపాలజీ చెబుతాడని హామీ ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా అనురాగ్ ఠాకూర్ ఉపయోగించుకోలేదు. తన అబద్ధానికే కట్టుబడ్డాడు.

దానితో సుప్రీం కోర్టు ఈ రోజు అంతిమ ఆదేశాలు జారీ చేసింది. లోధా కమిటీ సిఫారసులు అమలు చేసేందుకు ఆటంకంగా ఉన్న అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కే లను పదవుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిష్కళంకులయిన వ్యక్తులను వెతికి ఖాళీ అయిన పదవుల నియామకాల నిమిత్తం లోధా కమిటీకి సూచించాలని కోరింది. లోధా కమిటీ సిఫారసుల మేరకు ఇప్పటికే పలువురు బి‌సి‌సి‌ఐ సభ్యులు రాజీనామా చేశారు. 70 యేళ్ళు పై బడిన శరద్ పవర్ లాంటి వారు రాజీనామా చేశారు. పదేళ్ళకు పైగా క్రికెట్ పాలనా పదవుల్లో ఉన్న పలువురు రాష్ట్రాల అసోసియేషన్ సభ్యులు రాజీనామాకు సుముఖత వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు ఆదేశాలకు బి‌సి‌సి‌ఐ సెక్రటరీ షిర్కే ఆహ్వానించాడు. కోర్టు ఆదేశాలతో తనకు పేచీ లేదని ప్రకటించాడు. అధ్యక్షుడు ఠాకూర్ మాత్రం మరోసారి విషం కక్కుతూ ప్రకటన జారీ చేశాడు. “స్వయం ప్రతిపత్తి కోసమే నా పోరాటం” అంటూ గొప్పగా ప్రకటించుకున్నాడు. ఆయన గారి పోరాటం బడా ధనిక వర్గాలకు బంగారు గుడ్లను అందిస్తున్న బి‌సి‌సి‌ఐ బాతును తమ పెత్తనంలో ఉంచుకోవడానికే అన్నది నిర్వివాదాంశం. ఆయన కోరే స్వయం ప్రతిపత్తి విచ్చలవిడిగా క్రికెట్ ఆదాయాన్ని స్వాయత్తం చేసుకోవడానికి మాత్రమే తప్ప క్రికెట్ అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడే అవకాశం లేదు. తమ అత్యాశకు, పదవీ లాలసకు పోరాటం ముసుగు తొడగడానికి ఆయనకు ఎలాంటి సిగ్గూ లేదు.

“రిటైర్ అయిన జడ్జిలు క్రికెట్ పాలనను సమర్ధవంతంగా చేపట్టగలరని కోర్టు భావిస్తోంది. అయితే అలాగే కానివ్వండి” అంటూ ఠాకూర్, సుప్రీం కోర్టును పరిహసించడానికి సైతం తెగించాడు. అయితే పార్లమెంటులో కూర్చొని ప్రభుత్వ పాలన చేయాలని ప్రజలు ఆదేశించిన ఎం‌పిలు మంత్రులు, 70 యేళ్ళు పైబడి అడుగు తీసి అడుగు వేయలేని వయో వృద్ధులు క్రికెట్ పాలనను ఏ విధంగా సమర్ధవంతంగా నిర్వహిస్తారో ఠాకూర్ చెప్పవలసింది. బాధ్యతా రహితంగా ప్రకటనలు జారీ చేసే ముందు ఆ వయో వృద్ధ అత్యాశపరుల హయాం లోనే క్రికెట్ లో అవినీతి తారాస్ధాయికి చేరిన సంగతి ఠాకూర్ గమనంలో ఉంచుకోవలసి ఉంది.

రిటైర్డ్ జడ్జిలు తాము క్రికెట్ పాలన చేస్తామని చెప్పారా? క్రికెట్ ఆటతో సంబంధం ఉన్నవారి చేతుల్లో మాత్రమే క్రికెట్ ఒక ఆటగా అభివృద్ధి చెందగలదని, దేశ ప్రజలందరికీ క్రికెట్ అభివృద్ధి నుండి ఫలితం వచ్చే అవకాశం ఉన్నదని తమ సిఫారసుల ద్వారా రిటైర్డ్ జడ్జిలు చెప్పారు. అందుకు తగిన సిఫారసులు చేశారు. క్రికెట్ ను సంపన్న వర్గాల దోపిడీ కౌగిలి నుండి తప్పించి ప్రజలందరూ పాల్గొని ఆనందించే ఆటగా మార్చేందుకు తమ పరిజ్ఞానం పరిధిలో సూచనలు చేశారు.

ఆ సిఫారసులు, సూచనలను సుప్రీం కోర్టు ఎకాఎకిన ఆమోదించలేదు కూడా. సదరు సిఫారసులపై బి‌సి‌సి‌ఐ నుండి, ఇతర క్రికెట్ అసోసియేషన్ల నుండి అభిప్రాయాలూ కోరింది. నిపుణుల నుండి అభిప్రాయాలూ సేకరించింది. లోధా కమిటీ సిఫారసులకు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరింది. బి‌సి‌సి‌ఐ చెప్పిన అభ్యంతరాలు క్రికెట్ అభివృద్ధికి దోహదపడకపోగా యధాతధ స్ధితిని కాపాడుకునేందుకు ఉద్దేశించినవే అని సుప్రీం కోర్టు సరిగ్గానే తృణీకరించింది. సుప్రీం కోర్టు జోక్యం, రిటైర్డ్ జడ్జిల సిఫారసులు అనేక క్రికెట్ కుంభకోణాలు వెల్లడి కావడం వల్లనే జరిగింది తప్ప హఠాత్తుగా జరిగింది కాదు. కనుక క్రికెట్ పాలన ప్రక్షాళన ఈ రోజు కాకపోతే రెపైనా జరగవలసి ఉన్నదే. నిజానికి ఎప్పుడో ఇది జారగి ఉండాల్సింది.

లోధా కమిటీ సిఫారసులు  క్రికెట్ అవినీతి పూర్తి స్ధాయిలో అరికట్టబడేందుకు ఎంత వరకు దోహదం చేస్తాయి? ఇది భవిష్యత్తులో తేలుతుంది. అయితే రాజకీయ నాయకులు, సంపన్న వర్గాల ఆటవిడుపుకు కేంద్రంగా మారిన క్రికెట్ వారి ఉడుం పట్టు నుండి బైటపడడం వరకు సంభవమే. 

2 thoughts on “సుప్రీం ప్రక్షాళన: బి‌సి‌సి‌ఐ అధ్యక్షుని డిస్మిస్!

  1. There has been a lot of arrogance in the way Anurag Thakur responded to various supreme court directives in the last few months. I am unable to find better explanation to why is he acting this way. Usually the government itself will be careful in dealing with supreme court. On a high level he is from the ruling party. But that doesn’t explain it all. Is there an issue higher than this in the cooking? I wanted to understand this issue in the context of the NDA govt trying to make the judiciary less powerful than before.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s