నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ


rbi

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు.

కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని నేరస్ధులను కూడా చేసిన నిర్ణయానికి జవాబుదారీ వహించడానికి మాత్రం మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆ నిర్ణయం రహస్యం అంటోంది. నోట్ల రద్దు సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకు నష్టం అంటోంది. ప్రజలను కష్టాలపాలు చేసిన నిర్ణయానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

రు 1000, రు 500 నోట్లు రద్దు చేయడానికి కారణాలు ఏమిటి? కొత్త నోట్ల ముద్రణ ఎప్పుడు పూర్తవుతుంది? అని ప్రశ్నిస్తూ ఒక ఆర్‌టి‌ఐ కార్యకర్త సమాచార హక్కు కింద ఆర్‌బి‌ఐ ని సమాచారం కోరాడు. కానీ ఆర్‌బి‌ఐ సమాచారం ఇవ్వడానికి అడ్డంగా నిరాకరించింది. ఆర్‌టి‌ఐ చట్టం సెక్షన్ 8(1)(a) కింద సమాచారం ఇచ్చేందుకు వీలు కాదని చెప్పి తప్పించుకుంది.

సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 8(1)(a) ఏమి చెబుతుంది?

There shall be no obligation to give any citizen information, the disclosure of which which would prejudicially affect the sovereignty and integrity of India, the security, strategic, scientific or economic interests of the State, relation with foreign State[s] or lead to incitement of an offence.

అని చెబుతుంది. అనగా

“భారత దేశ సార్వభౌమత, సమగ్రత దెబ్బ తీసేది అయినా, దేశ భద్రతకు భంగం కలిగించేది అయినా, భారత రాజ్యం యొక్క వ్యూహాత్మక, శాస్త్రబద్ధ మరియు ఆర్ధిక ప్రయోజనాలకు భంగకరం అయినా, విదేశాలతో సంబంధాలకు నష్టం కలిగించేట్లు ఉన్నా, ఒక నేరానికి పాల్పడేలా ప్రోద్బలించేది అయినా… అటువంటి సమాచారాన్ని పౌరులకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి (ప్రభుత్వ సంస్ధలకు) లేదు”

అని ఈ సెక్షన్ చెబుతోంది.

కార్యకర్త అడిగిన సమాచారానికి ఈ సెక్షన్ వర్తించదని కాస్త బుద్ధి, సామాన్య పరిజ్ఞానం (కామన్ సెన్స్) ఉన్నవారు ఎవరైనా అంగీకరిస్తారు. డీమానిటైజేషన్ నిర్ణయం పూర్తిగా ప్రజలకు సంబంధించిన నిర్ణయం. ప్రజల జీవనాన్ని నేరుగా ప్రభావితం చేసిన నిర్ణయం. ప్రజల కష్టార్జితాన్ని వారికి అందకుండా చేసిన నిర్ణయం. 41 కోట్ల మంది శ్రామిక ప్రజలకు పని లేకుండా చేసిన నిర్ణయం. భారత ఆర్ధిక వ్యవస్ధకు (ఆ మాటకొస్తే, ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధకైనా) అత్యంత ముఖ్యమైన సరఫరా గొలుసు (సప్లై చెయిన్) వ్యవస్ధను రెండు నెలలపాటు ఛిద్రం చేసేసి, మరో ఆరేడు నెలలపాటు నాశనం కొనసాగించనున్న నిర్ణయం. 150 మంది వరకు పౌరుల ప్రాణాలను నిలువునా హరించివేసిన నిర్ణయం. అటువంటి నిర్ణయానికి కారణాలు అడిగితే అది దేశ సార్వభౌమత్యం, సమగ్రతలకు దెబ్బ తీస్తుందని చెప్పడం ఎలా సాధ్యం?

భారత ప్రజలకు సంబంధం లేని భారత దేశ సార్వభౌమత్వం ఎవరిని ఉద్ధరించడానికి? భారత ప్రజలకు వర్తించని భారత సమగ్రత ఏ దగుల్బాజీలను రక్షించడానికి? భారత ప్రజల స్వార్జితాన్ని వారికి ఉపయోగపడటానికి అడ్డం వచ్చే జాతీయ భద్రత ఏ దోపిడి దొంగలకు కాపలా కాస్తున్నట్లు? అసలు ప్రజలకు భాగస్వామ్యం లేని దేశం దేశమేనా? భారత ప్రభుత్వ సేవల నుండి భారత ప్రజలను మినహాయించే భారత ప్రభుత్వం ఏ విదేశీ గాడిదలకు సేవలు చేస్తున్నట్లు?

కొత్త నోట్ల ముద్రణ ఎప్పుడు పూర్తవుతుందన్న వివరణ “భవిష్యత్తు రోజులో జరగనున్న సంఘటనకు సంబంధించిన సమాచారం. అటువంటి సమాచారాన్ని ఆర్‌టి‌ఐ చట్టం నిర్వచించలేదు. కనుక సెక్షన్ 2(f) కింద సమాచారం ఇవ్వలేము” అని ఆర్‌బి‌ఐ సమాధానం ఇచ్చింది. అయితే ప్రధాన మంత్రి చెప్పిన 50 రోజుల గడువులోపు పరిస్ధితి కుదుట పడదని ఆర్‌బి‌ఐ స్పష్టంగా చెబుతోంది. అదొక సంగతైతే నోట్ల ముద్రణ దాదాపు పూర్తయినట్లే అని చెబుతున్న ఆర్ధిక మంత్రి జైట్లీ మాటలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేయడం మరో సంగతి.

ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, డీమానిటైజేషన్ కి కొమ్ము కాస్తున్న చిన్నా, పెద్దా వూడూ, జాదూ ఆర్ధిక పండితులు ఆర్‌బి‌ఐ లిఖిత సమాచారాన్ని పట్టించుకుంటున్నారో లేదో తెలియడం లేదు. ఓ పక్క నోట్ల ముద్రణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అసలు భాధ్యత కలిగిన ఆర్‌బి‌ఐ చెబుతుంటే మోడీ, ఆయన అనుచర మంత్రులు, అరివీర భక్తాగ్రేసరులు మాత్రం “ఇదిగో, పూర్తయిపోయింది” అంటూ జనాన్ని పిచ్చోళ్ళను చేస్తున్నారు.

ఆర్‌బి‌ఐ ఇచ్చిన సమాధానాన్ని మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శైలేష్ గాంధీ తీవ్రంగా తప్పు పట్టారు. ఆర్‌టి‌ఐ కార్యకర్త కోరిన సమాచారం ఆర్‌బి‌ఐ పేర్కొన్న సెక్షన్ కిందకు రానే రాదని స్పష్టం చేశారు. “దరఖాస్తుదారు కోరిన సమాచారానికి మాత్రమే ఆర్‌బి‌ఐ చెప్పిన మినహాయింపు క్లాజు వర్తిస్తుంది. ఈ నిర్దిష్ట ఉదాహరణలో మినహాయింపు క్లాజుకు వర్తించే సమాచారం ఏమీ లేదు” అని శైలేష్ చెప్పారని స్క్రోల్ పత్రిక తెలిపింది.

అదీ కాక ఆర్‌టి‌ఐ చట్టం ప్రకారం “సమాచారం నిరాకరిస్తే అందుకు స్పష్టమైన కారణాలు చెప్పాలి. మినహాయింపు సెక్షన్ ఎలా వర్తిస్తుందో స్పష్టమైన వివరణ ఇవ్వాలి” అని ఆయన చెప్పారు. ఆర్‌బి‌ఐ పేర్కొన్న సెక్షన్ 8(1)(a) కింద 8 మినహాయింపు అంశాలు ఉన్నాయి. ఈ 8 అంశాలలో దేని కింద సమాచారం నిరాకరిస్తున్నారో చెప్పాలి. ఆ అంశం నిరాకరణకు ఎలా వర్తిస్తుందో కూడా వివరణ ఇవ్వాలి. ఆర్‌బి‌ఐ అలాంటి వివరణ ఏదీ ఇవ్వలేదు. ఫలానా సెక్షన్ కింద సమాచారం ఇవ్వలేము అని జనరల్ గా చెప్పి ఊరుకుందంతే. ఇది ఆర్‌టి‌ఐ చట్టానికి విరుద్ధం అని శైలేష్ గాంధీ చెప్పారు.

పారదర్శకత పాటిస్తున్నామని చెప్పేందుకు ఆర్‌బి‌ఐ సమావేశాల మినిట్స్ ని ఆర్‌బి‌ఐ వెబ్ సైట్ లో పెడతామని గతంలో ఆర్‌బి‌ఐ ప్రకటించింది. ఆ మేరకు మొన్న డిసెంబర్ 21 తేదీన జరిగిన సమావేశం మినిట్స్ ని వెబ్ సైట్ లో పెట్టింది కూడా. కానీ నవంబరు 8 తేదీ సమావేశం మినిట్స్ ఇవ్వడానికి మాత్రం ఆర్‌బి‌ఐ నిరాకరిస్తోంది. ఆ నాటి మినిట్స్ సమాచారం ఇవ్వాలని దరఖాస్తు చేసిన మరో ఆర్‌టి‌ఐ కార్యకర్తకు కూడా ఇదే సెక్షన్ 8(1)(a) కింద సమాచారం ఇచ్చేందుకు ఆర్‌బి‌ఐ నిరాకరించింది. ప్రధాన మంత్రి మోడి గారి పారదర్శకత ఇలా తగలడింది.

పైకి చెప్పేది ఒక సమాచారం ఇస్తే చెప్పకుండా దాచినది మరో సమాచారం ఇస్తుంది. పైకి చెప్పే సమాచారం బట్టి చెప్పని సమాచారం ఎలాంటిదో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధాని పైకి చెప్పిన కారణాలు, ఆర్‌బి‌ఐ చెప్పడానికి నిరాకరిస్తున్న కారణాలు బేరీజు వేస్తే ఏమి అర్ధం అవుతుంది?

నల్ల డబ్బు పై యుద్ధం, దొంగ నోట్ల పని పట్టడం, టెర్రరిస్టుల ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం… ఈ కారణాల వల్లనే 86% లిక్విడిటీని ఆర్ధిక వ్యవస్ధ నుండి రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8 తేదీ రాత్రి ప్రధాన మంత్రి మోడి ప్రకటించారు. ఇవే కారణాలను ఆర్‌బి‌ఐ తన చర్యకు కారణాలుగా ఎందుకు చెప్పదు? ఆ కారణాలు చెప్పడానికి ఆర్‌బి‌ఐ నిరాకరించింది అంటే అవి అసలు కారణాలు కాదని అంగీకరించినట్లే కదా!

కాబట్టి ప్రధాని మోడి నవంబర్ 8 తేదీన చెప్పిన కారణాలు వాస్తవం కాదని ఆర్‌బి‌ఐ చెబుతున్నట్లే. పైకి చెప్పలేని కారణాలు, దేశ ప్రజలకు తెలియకూడని కారణాలు డీమానిటైజేషన్ నిర్ణయం వెనుక ఉన్నాయని ఆర్‌బి‌ఐ సమాచార నిరాకరణ ద్వారా స్పష్టం అవుతున్నది. ఇది చాలదా మోడి ప్రభుత్వం దేశ ప్రజలకు జవాబుదారీతనం వహించకపోగా, ఏ మాత్రం పారదర్శకత పాటించకపోగా, దేశ ప్రజలను మోసం చేస్తున్నదని తెలియడానికి!

2 thoughts on “నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s