
Syria flag over Eastern Syria
(True transalation of The Hindu editorial “A Chance For Peace in Syria”, published on December 21, 2016.)
*********
సిరియా సంక్షోభానికి దౌత్య పరిష్కారం కనుగొనటానికి రష్యా, టర్కీ, ఇరాన్ లు ఒక చోటికి చేరడం ఆహ్వానించదగిన పరిణామం. టర్కీలో రష్యా రాయబారి అందరి కార్లొవ్ హత్యకు గురయినప్పటికీ మాస్కోలో మంగళవారం జరగనున్న శిఖరాగ్ర సభను కొనసాగించడానికే నిర్ణయించడం బట్టి తాము అనుకున్న పంధాలో ముందుకు వెళ్ళడానికే తాము నిబద్ధులమై ఉన్నామని చాటుకున్నారు. గతంలో జరిగిన (శాంతి) ప్రయత్నాలలో సరిగ్గా ఇదే కొరవడింది. ఈ శిఖరాగ్ర సభ రష్యా వైఖరిలో వచ్చిన మార్పును కూడా సూచిస్తున్నది. సిరియా విషయమై దౌత్య పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలలో భాగంగా ఇంతవరకు జరిగిన చర్చలలో అది అమెరికాను పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు, అలెప్పో (నుండి టెర్రరిస్టులను, పౌరులను) ఖాళీ చేయించడం లోనూ, మాస్కో కాన్ఫరెన్స్ లోనూ వాషింగ్టన్ ను దూరంగా పెట్టింది. పోయిన సారి సెప్టెంబర్ 2016 లో రష్యా, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు స్ధిరమైన కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యపడుతుందని ఆశ, నమ్మకం కలిగాయి. కానీ అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన రోజులలోనే అమెరికా నేతృత్వం లోని కూటమి సేనలు వైమానిక దాడులు చేసి డజన్ల మంది సిరియా సైనికులను చంపివేసాయి. అనంతరం, ఈ దాడి పట్ల అమెరికా విచారం ప్రకటించినప్పటికీ, శాంతి ప్రక్రియ దెబ్బ తిన్నది. మాస్కో, వాషింగ్టన్ ల మధ్య ద్వైపాక్షికంగా నెలకొన్న విస్తృత స్ధాయి ఉద్రిక్తలు కూడా సిరియా సమస్యను అధిగమించడానికి ఆటంకం అయ్యాయి.
ప్రస్తుత చొరవ మరింత ఆశాభావంగా కనిపిస్తున్నది. సిరియా ప్రభుత్వంపై రష్యా, ఇరాన్ లు నేరుగా ప్రభావం కలిగి ఉన్నాయి. టర్కీ ఇప్పటికి కొన్ని మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నది. డబ్బు, ఆయుధాలతో పాటుగా అవతలి పక్షంతో ఎలాంటి సమాచారం మార్చుకోవాలన్నా మిలిటెంట్లకు టర్కీ సహాయం అవసరం. కాగా చర్చలకు ముందుకు రావడానికి టర్కీకి కారణం ఉన్నది. తన ప్రభుత్వ-వ్యతిరేక సిరియా విధానం తనకే ఎదురు తన్నిందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ గ్రహించినట్లు కనిపిస్తున్నది. ఇస్లానిక్ స్టేట్ జిహాదిస్టుల నుండీ, కుర్దిష్ మిలిటెంట్ల నుండీ టర్కీ తీవ్ర భద్రతా సవాళ్ళను ఎదుర్కొంటున్నది. సిరియాలో యుద్ధం కొనసాగినట్లయితే, అస్ధిరత మరింత ర్యాడికల్ మిలీషియా గ్రూపులకు అవకాశం కల్పించినట్లయితే టర్కీ భద్రతా పరిస్ధితులు మరింతగా దిగజారతాయి; మరోవైపు (టర్కీ సరిహద్దుకు అనుకుని ఉన్న) సిరియా భూభాగంలో కుర్దులు మరింత శక్తివంతం అవుతారు. కాగా రష్యా, సిరియాలో జోక్యం చేసుకున్నప్పటి నుండీ “యుద్ధం మరియు చర్చలు” వైఖరిని అమలు చేస్తూ వచ్చింది. సిరియా ప్రభుత్వానికి సైనికంగా రక్షణ కల్పిస్తూనే ఇతర పాత్రధారులతో వ్యవహరించడానికి దారులు వెతికింది. గత సంవత్సరం రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేసినప్పటి నుండీ అంకారా, మాస్కోల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో మెరుగుపడటంతో శాంతి ప్రక్రియ ముందుకు సాగటానికి మార్గం సుగమం అయింది. అయితే సిరియాలో స్ధిరత్వాన్ని సాధించడంలో ఇరు పక్షాల (టర్కీ, రష్యా) ప్రయోజనాలు ఒకటి అయినంత మాత్రాన శాంతి చేరువలోనే ఉన్నదని అర్ధం కాదు. తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్న దేశాలలో టర్కీ ఒకటి మాత్రమే. సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్ -ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలే- కూడా ఆ జాబితాలో ఉన్నాయి. 1989 లో లెబనాన్ లో సివిల్ వార్ కు ముగింపు పలకడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించింది. లెబనాన్ వలెనే ప్రాంతీయ సమస్య; కనుక ప్రాంతీయ పరిష్కారమే కావాలి. ఇందుకు గాను, అరబ్ పాత్రధారులు టర్కీ వలెనే, ‘అస్సాద్ గద్దె దిగి తీరాలి’ అన్న ముందస్తు షరతును ఉపసంహరించుకుని శాంతి ప్రక్రియలో చేరాలి.
*********
ఈ మధ్య కాలంలో ద హిందూ నుండి వెలువడిన వాస్తవిక విశ్లేషణ. సిరియాలో అమెరికా, ఐరోపా, గల్ఫ్ రాజ్యాల మద్దతుతో టెర్రరిస్టుల అరాచకాలు కొనసాగినన్నాళ్లు పశ్చిమ పత్రికల లాగానే ద హిందూ కూడా అస్సాద్ కు వ్యతిరేకంగా విశ్లేషణలు ప్రచురించింది. అస్సాద్ ను కౄరుడుగా, నియంతగా ప్రచారం చేయడంలో పశ్చిమ పత్రికలకు వంత పాడింది. టెర్రరిస్టుల అరాచకాలను చెప్పడంలో విఫలం అయింది. పశ్చిమ పత్రికల దుష్ప్రచారానికి ఇతోధికంగా సహకరించింది. కానీ ఇప్పుడు, అంతర్జాతియంగా పరిస్ధితులు మారుతున్న వాసన పసిగట్టాక, సిరియా యుద్ధంలో సిరియా-రష్యా-ఇరాన్-హిజ్బొల్లా కూటమి పై చేయి సాధించాక, ప్రధాన నగరం అలెప్పో సిరియా ప్రభుత్వం కైవసం చేసుకున్న తర్వాత, అమెరికా కుట్రలు కుయుక్తులు ఘోరంగా విఫలం అయ్యాక మాత్రమే వాస్తవాలను చెప్పడానికి ద హిందూ సుముఖంగా మారింది. ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు.