అవున్నిజం, మోడి గంగ అంత నిర్మలుడు!


rahul-in-mehsana

భూకంపం పుట్టిస్తానన్న రాహుల్ గాంధీ అన్నంత పని చేయలేకపోయారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో బహిరంగ సభ జరిపి ఆయన పాల్పడిన వ్యక్తిగత అవినీతి గురించి చెప్పడం ద్వారా ఎన్నడో చేయాల్సిన పనిని కనీసం ఇప్పుడన్నా చేశారు.

గుజరాత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రధాన మంత్రి సొంత జిల్లా మెహసానాలో ఆయన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి, ముఖ్య మంత్రిగా ఉండగా సహారా, బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీల నుండి అనేక మార్లు కోట్లాది రూపాయలు లంచంగా స్వీకరించిన సంగతిని రాహుల్ ప్రజలకు చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2014 లోనే ఈ అవినీతి గురించి వెల్లడి చేసింది. డీమానిటైజేషన్ ప్రకటించిన ఆరంభ రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఇదే అంశాన్ని చెప్పారు గానీ పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ బి‌జే‌పి నాయకులు గానీ, మంత్రులు గానీ, ప్రధాని మోడి గానీ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పలేదు.

స్వరాజ్య అభియాన్ వ్యవస్ధాపక నేత, ‘కామన్ కాజ్’ ఎన్‌జి‌ఓ నిర్వాహకులు, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ సహారా, బిర్లా కంపెనీల డెయిరీ సాక్షాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే డెయిరీలో ఎంట్రీల ఆధారంగా తాము విచారణకు ఆదేశించలేమని జస్టిస్ ఖేహార్ నేతృత్వం లోని ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది.

డెయిరీల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ‘మదింపు నివేదిక’ ను తయారు చేశారనీ, చట్టబద్ధ ప్రభుత్వ విచారణ సంస్ధ తయారు చేసిన సదరు నివేదిక ఆధారంగా, అందులో పొందుపరచబడిన అధికారిక సాక్షాల ఆధారంగా విచారణ చేయించాలని పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ కోరారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

హవాలా కేసులో జైన్ డెయిరీల ఆధారంగా అద్వానీ తదితరులపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కేసును విచారించిన సుప్రీం కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. దాని ప్రకారం కేవలం డెయిరీలో ఎంట్రీలు ఉన్నంత మాత్రాన వాటిని సాక్షాలుగా పరిగణించలేమని పేర్కొంది. అయితే డెయిరీ ఎంట్రీలపై విచారణ సంస్ధలు పరిశోధన చేయాలనీ, ఆ పరిశోధనలో చర్య తీసుకోదగిన సాక్షాలు లభించినట్లయితే కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

మోడి అవినీతి కేసులో దొరికిన డెయిరీలు ఆదాయ పన్ను శాఖ సహారా, బిర్లా కంపెనీలపై జరిపిన దాడులలో దొరికినవే. వాటిని ఎవరో అనామకుడు బైటపెట్టినవి కావు. కంపెనీల నుండి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను అధికారికంగా స్వాధీనం చేసుకున్నవేనని తెలియజేసే విధంగా ఆదాయ పన్ను శాఖ ఉన్నత అధికారులు సదరు పత్రాలపైన సంతకాలు చేశారు. కనుక అవి అధికారిక సోదాలలో పట్టుబడినవే.

ఈ కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం డెయిరీల వ్యవహారంపై తదుపరి విచారణకు ఆదేశాలు ఇవ్వవలసి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. ఆ వ్యవహారమే తమకు తెలియనట్లుగా కార్పెట్ కిందకు తోసేశారు.

కనీసం తృణమూల్ కాంగ్రెస్ 2014 లో ఆరోపించినప్పుడు గానీ, అరవింద్ కేజ్రీవాల్ తిరిగి 2016లో ప్రస్తావించినప్పుడు గానీ అయినా మోడి స్పందించలేదు. గత మూడేళ్లుగా ప్రధాన మంత్రి దేశ ప్రజలకు ఒక వాగ్దానం పదే పదే ఇస్తూ వచ్చారు. “నేను తినను. ఎవరినీ తిననివ్వను” అని. అదే గొంతుతో “నా ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి పైనైనా ఒక్క అవినీతి ఆరోపణ అయినా వచ్చిందా?” అని ప్రశ్నించి తమది అవినీతి రహిత ప్రభుత్వం అని చాటారు.

ఇప్పుడు మంత్రులు, ఎం‌పి లపైన కాదు. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైనే వ్యక్తిగత అవినీతికి పాల్పడిన ఆరోపణలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఈ ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ విచారణ సంస్ధ జరిపిన సోదాలలో అందుకు ఆధారాలు లభ్యం అయ్యాయి. బాధ్యత కలిగిన ప్రభుత్వ నేత అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ప్రజలకు చెప్పవలసి ఉన్నదన్న బాధ్యతను గ్రహించినట్లయితే, ముఖ్యంగా ఆయన నిత్యం చెప్పే అవినీతి వ్యతిరేక కబుర్లు నిజమే అని ప్రజలు నమ్మాలి అంటే ఆయన స్వయంగా ఆరోపణలపై విచారణకు ఆదేశించాలి.

తద్వారా తాను నీతిమంతుడనే అన్న సంగతి ధైర్యంగా రుజువు చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగినన్ని రోజులూ, ఆ పార్టీ నేతలపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడల్లా మోడి గానీ, ఇతర బి‌జే‌పి నేతలు గానీ కూడా ఇదే బాధ్యతను వారికి గుర్తు చేశారు. ఇప్పుడు తమ వంతు వచ్చింది. కాంగ్రెస్ అవినీతికి ఒక నీతి, బి‌జే‌పి అవినీతికి మరొక నీతి ఉండబోదు.

రాహుల్ గాంధీ ఆరోపణలపైన బి‌జే‌పి నేతలు విచిత్రంగా స్పందించారు. “అత్యంత నిర్మలుడైన మోడీ పైనా మీరు అవినీతి ఆరోపణలు చేసేది?” అని ఐ‌టి మంత్రి రవి శంకర్ ప్రసాద్ గర్జించారు. ఆరోపణలు వచ్చాక గర్జించి ఉపయోగం లేదు. “గంగ ఎంత నిర్మలమైనదో మోడి అంత నిర్మలుడు” అని రవి శంకరుల వారు విశ్వాసం వెలిబుచ్చారు.

కానీ రవి శంకర్ ప్రసాద్ గారు మర్చిపోయారో ఏమో! గంగా నది కాలుష్యంతో నిండి ఎందుకూ పనికిరాకుండా పోయిందని చెబుతూ, ఆ నదిని మొదలంటా శుభ్రం చేస్తామని మోడీ ఎన్నికల్లో వారణాసి ప్రజలతో పాటు ఉత్తర భారత ప్రజలకు వాగ్దానం చేసి అధికారం లోకి వచ్చారు. పదవి చేపట్టాక గంగ ప్రక్షాళనకు రు 5000 కోట్లు బడ్జెట్ లో ప్రకటించారు కూడా. సదరు ప్రక్షాళన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతున్నదని పత్రికలు చెబుతున్నాయి.

అనగా గంగ నిర్మలంగా లేదు. గంగ ఎంత నిర్లమైనదో మోడి అంత నిర్మలుడు అని చెబుతున్నారు గనుక ప్రధాని మోడి సచ్చీలుడు కాదని బి‌జే‌పి నేత, మంత్రి గారు తమకు తెలియకుండానే అంగీకరిస్తున్నారు.

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలలోనే మోడి పేరు వెలుగులోకి వచ్చింది. అదేమీ రాహుల్ గాంధీయో, కేజ్రీవాలో కనిపెట్టిన పేరు కాదు. అచ్చంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టబద్ధ సంస్ధ జరిపిన దాడుల్లో దొరికిన పత్రాలలోనే మోడి పేరు స్పష్టంగా దొరికింది.

పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన సోదా కూడా కాదు, మోడి పేరు ఇరికించారు అని చెప్పి తప్పుకోవడానికి. మోడీ ప్రధాన మంత్రి అయ్యాక జరిపిన సోదాల లోనే బిర్లా, సహారా కంపెనీల పత్రాలు/డెయిరీలు స్వాధీనం చేసుకున్నారు. కనుక విచారణకు ఆదేశించవలసిన నైతిక బాధ్యత బి‌జే‌పి ప్రభుత్వం పైనా, ముఖ్యంగా ప్రధాని మోడీ పైన ఉన్నది. కాదూ ఎవరో సాకులు చెప్పి విచారణ బాధ్యత నుండి తప్పుకుంటారా? అయితే, ఓ.కె. అప్పుడిక కాంగ్రెస్ పార్టీకీ, తమకూ తేడా లేదని ప్రజలు గ్రహిస్తారు.

కానయితే నల్ల డబ్బు, అవినీతి అరికట్టడానికే డీమానిటైజేషన్ అని చెబుతున్న కల్లబొల్లి కబుర్లు ఇకనైనా కట్టిపెట్టండి. క్యాష్ లెస్ ఎకానమీ అంటూ ఊహా లోకాలని జనం పైన రుద్దడం మాని వారి మానాన వారిని వదిలి పెడితే ప్రస్తుతానికి అదే పది వేలు! ఆ తర్వాత మోడి ప్రభుత్వాన్ని బొంద పెట్టాలో, తగలబెట్టాలో జనమే తేల్చుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s