టర్కీలో రష్యా రాయబారి హత్య -ఫోటోలు


సిరియాను దురాక్రమించిన టెర్రరిస్టులపై పోరాటంలో సిరియా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు రష్యా దుష్ఫలితాల్ని అనుభవిస్తోంది. సిరియా కిరాయి తిరుగుబాటులో సొంత సైనిక అధికారులను, కొద్ది మంది సైనిక సలహాదారులను కోల్పోయిన రష్యా మొదటిసారి ఒక సివిల్ అధికారిని కోల్పోయింది. 

టర్కీలో రష్యా రాయబారిగా పని చేస్తున్న ఆండ్రీ కార్లోవ్ సోమవారం టర్కీ రాజధాని అంకారా లో హత్యకు గురయ్యారు. అంకారాలో ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాక ప్రసంగిస్తున్న కార్లోవ్ పైన దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరిపాడు. నిందితుడిని 22 ఏళ్ళ టర్కీ పోలీసుగా గుర్తించారు. అలెప్పో నగరాన్ని టెర్రరిస్టుల ఆక్రమణ నుండి విముక్తి చేసిన నేపథ్యంలో ఈ హత్య జరగడం గమనార్హం. 

“మేము అలెప్పోలో చేస్తున్నాము. నువ్వు ఇక్కడ చావు” అని కాల్పులు జరిపిన వ్యక్తి అరిచాడని పత్రికలూ తెలిపాయి. “అల్లాహు అక్బర్” అని అరిచాడని కూడా పత్రికలు తెలిపాయి. కాల్పులు జరిపాక కొద్ది సేపు ప్రసంగం చేసిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపేశారు.

హత్యకు పాల్పడిన వ్యక్తి బెతుల్లా గులెన్ గ్రూపుకు చెందిన టెర్రరిస్టు అయి ఉండవచ్చని టర్కీ అధికారి ఒకరు తెలిపారు. ‘అలెప్పో నుండి టెర్రరిస్టులను తరిమివేయడం నచ్చని టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చు’ అని టర్కీ మాజీ విదేశాంగ మంత్రి చెప్పారు. 

హత్యకు అసలు కారణం ఏమిటో రష్యా ప్రభుత్వం తెలిపింది. “సిరియా సంక్షోభం పరిష్కారానికై అస్తానాలో జరగనున్న ‘పీస్ కాన్ఫరెన్స్’ ను విఫలం చేసే లక్ష్యంతోనే మా రాయబారిని హత్య చేశారు. దీనిని టెర్రరిస్టు చర్యగా గుర్తిస్తున్నాం. అయితే వారి ప్రయత్నాలను ముందుకు సాగనివ్వం” అని రష్యా ప్రకటించింది. అస్తానా (కజకిస్తాన్) లో జరగనున్న సిరియా శాంతి చర్చలకు ముందు మంగళవారం (డిసెంబర్ 20) మాస్కోలో నాలుగు దేశాల రక్షణ మరియు విదేశీ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్, టర్కీ, సిరియా దేశాల విదేశాంగ మంత్రులు ప్రయాణంలో ఉండగా రాయబారి హత్య జరిగింది.

హత్య జరిగినప్పటికీ మాస్కో సమావేశాన్ని కొనసాగించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి. తద్వారా ఏ లక్ష్యం కోసం అయితే హత్య జరిగిందో అది నెరవేరకుండా చూసేందుకు అవి నిర్ణయించాయి. 

అస్తానా శాంతి చర్చలు కొనసాగడం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదు. అందుకు కారణం ఆ చర్చలలో పశ్చిమ దేశాలను భాగస్వాములుగా స్వీకరించకపోవడమే. ముఖంగా తనతో సంబంధం లేకుండా సిరియాలో శాంతి స్ధాపన జరగడం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లతో పాటు సౌదీ అరేబియా, కతార్, ఇజ్రాయెల్ దేశాలకు కూడా అస్తానా చర్చలు కంటగింపు అయ్యాయి. 

రష్యా, టర్కీ, ఇరాన్, సిరియా దేశాలు మాత్రమే అస్తానా చర్చలలో పాల్గొంటున్నాయి. ఈ దేశాలు ఐరాసను కూడా దూరం పెట్టాయి. ఇన్నాళ్లు ఐరాస నేతృత్వంలో, ‘ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా’ పేరుతో చెలామణి అయినా అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాలు అనేక దఫాలుగా చర్చలు జరిపాయి. కానీ ఈ సమావేశాలు అన్నింటా ‘అస్సాద్ గద్దె దిగితేనే శాంతి చర్చలు’ అన్న షరతును సో-కాల్డ్ అపోజిషన్ పేరుతో ఉన్న టెర్రరిస్టు సంస్ధలు షరతు విధిస్తూ వచ్చాయి. అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాల ఆదేశాలతోనే వారు ఆ షరతు విధించారన్నది బహిరంగ రహస్యం. 

‘అస్సాద్ బేషరతుగా గద్దె దిగడంతో’ సిరియా శాంతి చర్చలను ముడి పెట్టడం ద్వారా ఆ చర్చలు ముందుకు సాగకుండా అమెరికా పశ్చిమ దేశాలు నిరోధించాయి. అస్సాద్ అధికారంలో ఉన్నంత వరకు పశ్చిమ రాజ్యాల భౌగోళిక-రాజకీయ ఆధిపత్య ఎత్తుగడలు ముందుకు సాగవు. అస్సాద్ ని అధికారం నుండి తప్పించి సిరియాను ముక్కలుగా చేసి తమ అవసరాలకు అనువుగా గల్ఫ్ దేశాల నుండి చమురు పైపులను నిర్మాణం చేయడమే పశ్చిమ దేశాల లక్ష్యం. 

ఇది జరిగితే మధ్య ప్రాచ్యంలో పూర్తిగా అరాచకం తాండవిస్తుంది. ఇరాన్ ప్రయోజనాలు ఉల్లంఘనకు గురవుతాయి. రష్యా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. ముఖ్యంగా సిరియా ప్రజలు తీవ్ర అణచివేతకు గురవుతారు. 

ఈ కారణాలతో అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాలను సిరియా చర్చల నుండి దూరం పెట్టారు. దానితో అమెరికా, ఐరోపాలు రగిలిపోతున్నాయి. టర్కీ సహకారం ఉంటె సిరియా శాంతి విషయంలో పురోగతి సాధించడం సాధ్యమే అని రష్యా నమ్ముతోంది. సిరియా కిరాయి తిరుగుబాటులో ఇంతవరకు నిర్ణాయక పాత్ర పోషించిన టర్కీ, అమెరికా ప్రోత్సాహంతో తమ దేశంలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత, అమెరికాకు దూరం జరిగి రష్యాకు దగ్గరయింది. ఆ విధంగా అస్తానా చర్చలు సఫలం కావడానికి మార్గం సుగమం అయింది. 

ఆండ్రీ కార్లోవ్ హత్య దృశ్యాలను కింది ఫోటోల్లో చూడవచ్చు. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s