రీమానిటైజేషన్ (ఆర్ధిక వ్యవస్ధ లోకి కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ) కు అట్టే సమయం పట్టబోదని నిన్న (లేకపోతే మొన్న) ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చేశారు. ఎప్పటిలాగానే ఆయన హామీలో వివరాలు ఏవీ లేవు.
సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ “70 రోజుల వరకూ ఆగాలి” అని స్వయంగా చెప్పాడు. అంతకు ముందు రోజు (డిసెంబర్ 13 న) ఇంకా 15 రోజులు ఆగాలి అని చెప్పి ఆ మరుసటి రోజే “70 రోజుల్లో సర్దుకుంటుంది” అని చెప్పాడు.
ఆ తర్వాత డీమానిటైజేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తరపున పత్రికలతో మాట్లాడుతున్న కేంద్ర రెవిన్యూ కార్యదర్శి రోహత్గి హామీని ధృవీకరించారు కూడా. “డబ్బు కొరత (cash crunch) తిరడానికి జనవరి 20 తేదీ వరకు పట్టవచ్చు. బహుశా జనవరి 30 వరకు పట్టినా పట్టవచ్చు” అని రెవిన్యూ కార్యదర్శి శక్తి కాంత దాస్ ప్రకటించాడు.
అనగా రోహత్గి చెప్పిన 70 రోజుల గడువును శక్తికాంత దాస్ వాస్తవానికి 80 రోజులకు పొడిగించాడు.
ప్రధాని మోడీ మొదట 50 రోజుల హామీ ఇస్తారు. అటార్నీ జనరల్ దానిని 70 రోజులకు పడిగిస్తారు. రెవిన్యూ కార్యదర్శి జొరబడి ‘కాదు, కాదు 80 రోజులు’ అంటారు.
ఆనక ఆర్ధిక మంత్రి గారు రంగం లోకి దిగి “అబ్బే, అట్టే రోజులు పట్టదు. నిజం” అని నమ్మబలుకుతున్నాడు.
ఓ పక్క బ్యాంకుల దగ్గర జనాలు క్యూల వెంబడి పడిగాపులు పడుతూనే ఉన్నారు. క్యూలో నిలబడలేక వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. కొన్ని చోట్ల అప్పులు తీరక కొందరు, తీర్చలేక కొందరు, రొటేషన్ ఆగిపోయి కొందరు… కష్టాలకు అవమానాలకు తట్టుకోలేక, భయకంపితులై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
అనేక చోట్ల జనం రాస్తా రోకోలకు గూడా దిగుతున్నారు. జనం ఒత్తిడిని భరించలేక, అటు ఆర్‌బిఐ నుండి కొత్త నోట్ల ముద్రణ మెరుగుపడక బ్యాంకు ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రజల నుండి ఆగ్రహావేశాలు, దూషణ భూషణలు ఎదుర్కొంటున్నారు.
“మాకు పోలీసు రక్షణ కల్పించండి” అని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు వేడుకుంటున్నాయంటే వారి ఆందోళనలను గ్రహించవచ్చు. “కనీసం బ్యాంకులకు తగిన మొత్తంలో కొత్త నోట్లు సరఫరా చేసేవరకూ నోట్ల పంపిణీని సస్పెండ్ అయినా చేయండి” అని వారు మొత్తుకుంటున్నారు.
నోట్ల పంపిణిని సస్పెండ్ చేస్తే అసలు మజా ఏమిటో మోడీకి తెలిసి వస్తుంది. డీమానిటైజేషన్ అనంతర ఒత్తిడి బ్యాంకు ఉద్యోగుల నుండి మోడి పైకీ, ఆయన ప్రభుత్వం పైకీ, ఆయన పార్టీ పైకీ నేరుగా మళ్లుతుంది. నిజానికి అదే సరైన చర్య కాగలదు. అంతవరకూ డీమానిటైజేషన్ వల్ల అంత లాభం ఉంది, ఇంత లాభం ఉంది అంటూ మోడీ, ఆయన మంత్రుల వెర్రిమొర్రి ప్రకటనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.
కానీ కోరి కోరి కొరివితో తల గోక్కునే పనికి మోడి ఎందుకు పూనుకుంటారు. నోట్ల ముద్రణ పూర్తయ్యే వరకు బ్యాంకుల సిబ్బందిపై ఒత్తిడి తగ్గించే చర్యకు ఆర్‌బిఐ యే పూనుకోవాలి. అప్పుడు గానీ డీమానిటైజేషన్ ఎంత లాభకరమో ప్రధాని మోడీకి తెలిసి రాదు.
ఇంతకీ ఆర్ధిక మంత్రి గారు ‘రీ మానిటైజేషన్’ హామీ ఎక్కడ ఇచ్చారో తెలుసా? ఫిక్కీ (FICCI – Federation of Indian Chambers of Commerce and Industry) 89 వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ హామీ ఇచ్చారు.
అనగా ఈ దేశంలో అత్యంత ధనిక వర్గాలు ఏర్పాటు చేసుకున్న సంఘం నిర్వహించిన సభలో ‘రీమానిటైజేషన్ కు అట్టే కాలం పట్టదు’ అని హామీ ఇచ్చారు. ఓ పక్క ఒక్క 2000 రూపాయల నోటు కోసం జనం బారులు తీరి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతుంటే అవే కొత్త నోట్లు కట్టలు కట్టలుగా ధనికుల ఇళ్ళల్లో, బ్లాక్ మార్కెటీర్ల కొట్టాల్లో ప్రత్యక్షం అవుతుండడం మన కళ్ల ముందు కనపడుతున్న సత్యం. ధనికులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వర్గాలు బ్యాంకుల ముందు నిలబడకపోయినా వారి ఇళ్లకు కట్టలు కట్టలు నోట్లు చేరిపోతున్నాయి.
అలాంటి ధనికులకే ‘అట్టే సమయం పట్టదు’ అని ఆర్ధిక మంత్రి హామీ ఇవ్వడం అంటే సామాన్య భారత ప్రజానీకాన్ని వారి ఖర్మానికి వారిని వదిలేశారని, ‘మన్ కీ బాత్’ ద్వారా, బిజేపి ఎన్నికల మీటింగుల ద్వారా మోడి కురిపిస్తున్న ఖాళీ వాగ్దానాలు, పోచుకోలు కబుర్లు మాత్రమే జనానికి దక్కుతున్నాయని తెలియడానికి ఇంకా చర్చలు చేసుకోవాలా?
ఈ భూమిమీద మానవజన్మ ఒకటుందని,మిగతా జంతువులకు లేనిది(ఉంటే అతితక్కువ),మానవులకే ప్రత్యేకమైనది తెలివితేటలు అని చిన్నప్పటినుండి గురువులు చెబుతుంటే ఏమిటో అనుకున్నాను! నా సగం జీవిత కాలంలో దొరకని సమాధానం మోదీ పుణ్యమా అని ఇప్పుడు బాగా అర్ధమైనది. తన తెలివితక్కువనిర్ణయంతో 125 కోట్ల ప్రజానీకానికి బొమ్మ చూపించిన ఘనత నిశ్శందేహంగా మన ప్రధానికే చెందుతుంది.మోదీకి జై అనకుండా ఉండలేకపోతున్నాను.!