అలెప్పోలో ఆల్-ఖైదాకు సాయం చేస్తున్న అమెరికా మిలట్రీ పట్టివేత


Syrians celebrate Aleppo liberation

గత ఆరేళ్లుగా సిరియా ప్రభుత్వం చెబుతున్నదే నిజం అయింది. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నది సిరియన్లు కాదనీ, సౌదీ అరేబియా, కతార్, టర్కీలు ఇతర ముస్లిం దేశాల నుండి సమీకరించిన టెర్రరిస్టులను తమ దేశంలోకి ప్రవేశపెట్టి కృత్రిమ తిరుగుబాటు సృష్టించాయని వారికి అమెరికాతో సహా వివిధ పశ్చిమ దేశాల మిలట్రీ సలహాదారులు శిక్షణ ఇస్తున్నాయని, సిరియాలో తిష్ట వేసి టెర్రరిస్టులను నడిపిస్తున్నారని సిరియా ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. అలెప్పో నగరంలో బంకర్లలో దాగిన అమెరికా, సౌదీ అరేబియా, కతార్, ఇజ్రాయెల్ దేశాల మిలట్రీ బలగాల అరెస్టుతో సిరియా ప్రభుత్వం చెబుతున్నది నిజమే అని స్పష్టం అయింది. 

2011 నుండి సిరియాలో అంతర్యుద్ధం సాగుతోంది. సిరియా నియంత బషర్ ఆల్-అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం సిరియా ప్రజలు తిరుగుబాటు చేశారని, వారిని సిరియా ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తున్నదని, ఊచకోతకు పాల్పడుతూ తన ప్రజలను తానే చంపుతున్నదని పశ్చిమ పత్రికలూ ఎత్తున ప్రచారం చేశాయి. అనేక కధలు, కధనాలు ప్రచారంలో పెట్టాయి. మార్ఫ్ డ్ వీడియోలు, ఫోటోలు ప్రచురించాయి. సిరియా అధ్యక్షుడిని కూల్చివేయాలని ఐరాస చేత తీర్మానాలు చేయించాయి. సిరియా పైన ‘నో-ఫ్లయ్ జోన్’ అమలు చేసి లిబియా అధ్యక్షుడు గడాఫీని పదవీచ్యుతుని చేసి చంపేసినట్లే బషర్ ఆల్-అస్సాద్ ను కూడా చంపేయాలని పధకం వేశాయి. కానీ రష్యా, చైనాలు వీటో హక్కుతో ఐరాస భద్రతా సమితిలో అడుగడుగునా అడ్డు పడటంతో వారి ఎత్తులు పారలేదు. 

ఈ లోపుగా అమెరికా, పశ్చిమ దేశాలు ఐసిస్ కు ప్రాణ ప్రతిష్ట చేశాయి. ఇస్లామిక్ కాలిఫెట్ పేరుతో ప్రత్యేక ముస్లిం రాజ్యం ఏర్పడిందని సిరియాలో ఆల్-రక్కా కేంద్రంగా, ఇరాక్ లో మోసుల్ కేంద్రంగా ఏర్పడిన ఈ రాజ్యాన్ని ఐసిస్ సంస్ధ ఏర్పాటు చేసిందని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రకటించాయి. ఇది ఆల్-ఖైదా కంటే క్రూరమైనదని నిర్ధారించాయి. అందుకు రుజువుగానా అన్నట్లుగా అనేక మంది పశ్చిమ దేశాల జర్నలిస్టుల తలలను జిహాద్ జాన్ (సో-కాల్డ్ ఐసిస్ టెర్రరిస్టు) కత్తితో నరికిన వీడియోలు యూ-ట్యూబ్ లో ప్రత్యక్షం అయ్యాయి. 

ట్విట్టర్, పేస్ బుక్ లలో వేలాది ఐసిస్ ఖాతాలు, ఆల్-ఖైదా ఖాతాలు వెలిసాయి. ప్రపంచం నలుమూలల నుండి వహాబీ టెర్రరిస్టులకు ఐసిస్ లో చేరాల్సిందిగా, పవిత్ర ఇస్లామిక్ రాజ్యం నిర్మాణంలో భాగం పంచుకోవాల్సిందిగా సందేశాలు ఆ ఖాతాల నుండి వెలువడ్డాయి. ఐసిస్ పై పోరాటం ప్రకటించిన అమెరికా, ఐరోపాలు ట్విట్టర్, ఫేస్ బుక్ ల నుండి టెర్రరిస్టుల ఖాతాలను ఎలా అనుమతించాయో, ఆ ఖాతాలను తొలగించవలసిందిగా సోషల్ నెట్ వర్క్ సంస్ధలపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయాయో అడిగినవారు లేరు, చెప్పిన వారూ లేరు. పశ్చిమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పని చేసే వెబ్ సైట్లను, ఫేస్ బుక్ – ట్విట్టర్ ఖాతాలను ఠంఛనుగా నిషేధించే, నిషేధించేలా ఒత్తిడి తెచ్చే అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు ఆల్-ఖైదా, ఐసిస్ టెర్రరిస్టుల ఖాతాలను, ప్రచార వెబ్ సైట్లను, బ్లాగ్ లు మాత్రం నిర్నిరోధంగా కొనసాగేలా ఎందుకు అనుమతించాయో చెప్పినవారు లేరు. 

సిరియా విజ్ఞప్తి మేరకు 2015 సెప్టెంబర్ లో ఆల్-ఖైదా (ఆల్-నూస్రా) మరియు ఐసిస్ లపై రష్యా ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడంతో అమెరికా, ఐరోపాలే ఆల్-నూస్రా, ఐసిస్ లకు మద్దతుదారులని, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, జోర్డాన్ ల సహాయంతో వారికి ఆయుధ-ధన-మానవ వనరులు అందజేస్తున్నాయని క్రమంగా రుజువు అవుతూ వచ్చింది. రష్యా సహాయంతో సిరియా ప్రభుత్వ బలగాలు ఆల్-నూస్రా, ఐసిస్ లు స్వాధీనం చేసుకున్న పట్టణాలు, ప్రాంతాలను ఒక్కొక్కటిగా పునఃస్వాధీనం చేసుకుంటున్న కొద్దీ అమెరికా-ఐరోపాలు బహిరంగంగానే రష్యా చర్యలను తప్పు పట్టడం ప్రారంభించాయి. రష్యా, సిరియా ప్రభుత్వాల పురోగమనాన్ని అడ్డుకునే లక్ష్యంతో పదే పదే ‘కాల్పుల విరమణ ఒప్పందాలను’ ప్రతిపాదించాయి. ఆ ఒప్పందాలను టెర్రరిస్టుల చేత అమలు చేయించడంలో విఫలం అయ్యాయి. 

నిజానికి రష్యా, సిరియా ప్రభుత్వ బలగాల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న ఆల్-నూస్రా, ఐసిస్ బలగాలకు తెరిపిడి ఇచ్చే లక్ష్యంతోనే కాల్పుల విరమణ ఒప్పందాలను అమెరికా పశ్చిమ దేశాలు ప్రతిపాదించామని త్వరలో తెలిసి వచ్చింది. రష్యా, సిరియా ప్రభుత్వ బలగాల తాకిడికి చెల్లా చెదురు అయినా టెర్రరిస్టులు తిరిగి రీ-గ్రూప్ కావడానికి, ఆయుధాలు-ఆహారం సరఫరా చేయడానికి మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందాలను పశ్చిమ దేశాలు వినియోగిస్తున్నాయని తేటతెల్లం అయింది. 

ఐదు నెలల నుండి ‘అలెప్పో’ నగరం విముక్తి కోసం జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమ దేశాల అసలు రంగు స్పష్టంగా వెల్లడి కావడం ప్రారంభం అయింది. ప్రాచీన నగరం పామిరాను ఐసిస్ ఆక్రమణ నుండి విముక్తి చేసిన అనంతరం రష్యా, ఇరాన్, హిజ్బొల్లా (లెబనాన్), సిరియా లు అలెప్పో విముక్తికి నడుం బిగించాయి. సిరియాలో అలెప్పో నగరమే అతి పెద్ద నగరం. పరిశ్రమలు, వాణిజ్య పరంగా అలెప్పో సిరియాలో అతి ముఖ్యమైన నగరం. సిరియా జీడీపీ లో 40 శాతం అలెప్పో నగరం నుండే సమకూరుతుంది. కాబట్టి అలెప్పొను తిరిగి స్వాధీనం చేసుకుంటే సిరియా ప్రభుత్వం ఆరేళ్లుగా సాగిస్తున్న టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధానికి అమెరికా, పశ్చిమ దేశాల దురాక్రమణ వ్యతిరేక పోరాటానికి భారీ సాఫల్యత చేకూరుతుంది. సరిగ్గా ఇదే కారణంతో అమెరికా, పశ్చిమ దేశాలు అలెప్పో నగరాన్ని టెర్రరిస్టుల చేతుల్లో కొనసాగించడానికి సర్వ శక్తులు ఒడ్డడానికి నిర్ణయించాయి. ఫలితంగా అలెప్పో విముక్తి యుద్ధం ఇరు పక్షాలకు సవాలుగా పరిణమించింది. సిరియా యుద్ధంలో ముఖ్యమైన మలుపుగా, ప్రతిష్టాత్మకంగా మారింది.  

అలెప్పో యుద్ధంలో సిరియా ప్రభుత్వ-ఇరాన్-హిజ్బొల్లా బలగాలు, రష్యా వైమానిక దాడులు సఫలం కాకుండా ఉండేందుకు అమెరికా సకల యుక్తులు ప్రయోగించింది. అడపా దడపా ఐరాస అధిపతి చేత సిరియా వ్యతిరేక ప్రకటనలు ఇప్పించింది. మానవతా సహాయం పేరుతో ఆల్-నూస్రా, ఐసిస్ బలగాలకు ఆయుధాలు-ఆహార సరఫరాలు అందేట్లు చూసింది. సిరియా పక్షం బలగాలు పై చేయి సాధించినప్పుడల్లా బూటకపు ‘కాల్పుల విరమణ ఒప్పందాలను’ రుద్దింది. ఐరాస ఆహార ట్రక్కుల ద్వారా టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చేసింది. అలెప్పో ప్రజలను ‘హ్యూమన్ షీల్డ్’ గా ప్రయోగించింది. ఐరాస ట్రక్కులపై దాడులు చేసి ఆ నెపాన్ని సిరియా పైకి నెట్టింది. టెర్రరిస్టుల చేత రసాయన ఆయుధాలు ప్రయోగింపజేసి అది చేసింది సిరియా బలగాలు అని కార్పొరేట్ మీడియా చేత విస్తృతంగా ప్రచారం చేయించింది. సిరియా ప్రభుత్వ బలగాలపై తానే వైమానిక దాడులు చేసి ‘ఐసిస్ అనుకుని దాడి చేశామని’ వంకలు చెప్పింది. 

ఎన్ని చేసినప్పటికీ సిరియా ప్రభుత్వ పక్ష బలగాల పురోగమనం ఆగలేదు. అమెరికా, ఇతర పశ్చిమ రాజ్యాల ఎత్తులను రష్యా ఎప్పటికప్పుడు చిత్తు చేసింది. ఐరాస భద్రతా సమితిలో పశ్చిమ రాజ్యాలు ప్రవేశపెట్టిన సిరియా వ్యతిరేక తీర్మానాలను రష్యా, చైనాలు వీటో చేసాయి. వైమానిక దాడులతో రష్యా, టెర్రరిస్టు స్ధావరాలను ధ్వంసం చేసింది. సిరియా-హీజ్బొల్లా-ఇరాన్ బలగాల పురోగమనానికి వాయు దాడులతో మద్దతు సమకూర్చింది. కాలు విరమణ ఒప్పందాల వెనుక దాగిన అమెరికా దొంగ ఎత్తులను ఎంతో ఓపికగా ప్రపంచానికి వెల్లడి చేసింది. ఈ లోపు టర్కీలో అమెరికా మద్దతుతో జరిగిన సైనిక కుట్రను విఫలం చేయడంలో రష్యా ఇఛ్చిన సమాచారం ఇతోధికంగా సహాయపడింది. దరిమిలా సిరియా వ్యతిరేక కిరాయి తిరుగుబాటులో టర్కీ మెల్లగా వెనక్కి తగ్గింది. రష్యాతో ఒప్పందం చేసుకుంది. టర్కీలో సైనిక కుట్ర చివరికి సిరియాలో కిరాయి తిరుగుబాటుకు వ్యతిరేకంగా పరిణమించింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 15 నాటికి అలెప్పో దాదాపు పూర్తిగా సిరియా ప్రభుత్వ బలగాల వశం అయింది. షియాలు నివసించే మూడు ప్యాకెట్లు మాత్రమే ప్రస్తుతం టెర్రరిస్టుల అధీనంలో మిగిలాయి. అలెప్పో ప్రజలను బందీలుగా ఉంచుకోవడం వల్ల ఈ ప్రాంతాలను అదుపు చేస్తున్న ఆల్-నూస్రా టెర్రరిస్టులపై సిరియా బలగాలు దాడి చేయలేకపోతున్నాయి. ఒప్పందం ద్వారా టెర్రరిస్టుల బందీలుగా ఉన్న ప్రజలను సురక్షితంగా విడుదల చేయించడానికి రష్యా, సిరియా, ఇరాన్ లు ఓపిక వహిస్తున్నాయి. అయితే అలెప్పో యుద్ధం చివరి దశకు చేరుకునే కొద్దీ అమెరికా, ఐరోపాలు దాడిని నిలువరించడానికి సకల ప్రత్యత్నాలు చేస్తున్నాయి. చివరి దశలో, టెర్రరిస్టులకు అండగా నిలుస్తున్నారన్న నిజం స్పష్టంగా బైటపడే పరిస్ధితి వచ్చినప్పటికీ అలెప్పో విముక్తికి వ్యతిరేకంగా అమెరికా ఎందుకు నిలబడిందీ అన్నది మిస్టరీగా మారింది. 

అమెరికా పట్టుదల వెనుక మర్మం ఏమిటన్నది రష్యా, సిరియా ప్రభుత్వాలు లీక్ చేశాయి. అమెరికాతో పాటు వివిధ ఐరోపా రాజ్యాలు, గల్ఫ్ రాచరిక ప్రభుత్వాలకు చెందిన ప్రత్యేక బలగాలు (స్పెషల్ ఫోర్సెస్) అలెప్పో లోని చివరి టెర్రరిస్టు స్ధావరంలో చిక్కుకుని పోయారని అలెప్పో పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం లోకి వస్తే ఈ విదేశీ బలగాలను సిరియా బలగాలు పట్టుకుంటాయని భయపడటమే అమెరికా, ఐరోపా, గల్ఫ్ రాజ్యాల నిస్పృహకు కారణమని అవి వివరించాయి. వారి ప్రత్యేక బలగాలు పట్టుబడితే తామే ఆల్-నూస్రా, ఐసిస్ బలగాలకు శిక్షణ, సరఫరా అందిస్తున్నామన్న నిజం అనుమానం లేకుండా రుజువవుతుందని, దాని వల్ల పశ్చిమ దేశాలు టెర్రరిస్టులపై పోరాటం చేయకపోగా, వారిని వెనక ఉండి నడిపిస్తున్నాయన్న సంగతి లోకానికి తెలిసిపోతుందని అందుకే అవి చివరి ప్రయత్నాలు చేస్తున్నాయని సిరియా, రష్యాలు వెల్లడి చేశాయి. 

అలెప్పోను టెర్రరిస్టుల నుండి విముక్తి చేస్తున్న దశలో రష్యా, సిరియా, ఇరాన్ ల దాడులు నిలిపివేయాల్సిందిగా ఐరాస భద్రతా సమితిలో అమెరికా, ఐరోపాలు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాయో ఈ వెల్లడితో లోకానికి అర్ధం అయింది. 

అలెప్పో బంకర్లలో దాగిన విదేశీ ప్రత్యేక బలగాల అరెస్టుతో రష్యా, సిరియాలు చెప్పింది నిజమే అని తేటతెల్లం అయింది. అరెస్టు చేసిన విదేశీ ప్రత్యేక బలగాలు, గూఢచారులు, మిలట్రీ శిక్షకులలో అమెరికా, ఇజ్రాయెల్, టర్కీ, సౌదీ అరేబియా, కతార్ దేశీయులు ఉన్నారని సిరియా అధికారులు చెప్పడం విశేషం. సిరియా ప్రత్యేక బలగాలే విదేశీ స్పెషల్ ఫోర్సెస్ ను అరెస్ట్ చేసినప్పటికీ సిరియా ప్రభుత్వం ఈ వార్తను అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉన్నది. అరెస్టు ఘటన డిసెంబరు 16 తేదీన జరిగిందని Voltaire.net వెబ్ సైట్ తెలిపింది. 21stcenturywire.com వెబ్ సైట్ అయితే ఒక సిరియా ఎంపీ ని ఉటంకిస్తూ అరెస్ట్ అయిన వారి పేర్లను, వారి జాతీయతలు కూడా ప్రకటించింది. 

“శుక్రవారం డిసెంబర్ 16 , 2016 తేదీన గం. 17:00 GMT సమయానికి  ఐరాస భద్రతా సమితి ప్రయివేటు సమావేశంలో ఉండగానే  ఈ ఉదయం తూర్పు అలెప్పోలో నాటో అధికారులను సిరియా ప్రత్యేక బలగాలు అరెస్టు చేశాయి” అని Voltaire.net వెబ్ సైట్ తెలిపింది.     

“సిరియా అధికారులు పక్కా సమాచారంతో అలెప్పో లోని పశ్చిమ దేశాల సీనియర్ అధికారులు హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. అండర్ గ్రౌండ్ బంకర్లలో దాగిన విదేశీ మిలట్రీ సలహాదారులను సజీవంగా పట్టుకున్నారు. ఫ్రెంచి, అమెరికన్, బ్రిటిష్, జర్మన్, టర్క్, సౌదీకి, మొరాకన్, కతార్ మొదలైన దేశాల అధికారులు వారిలో ఉన్నారు” అని southfront.org  వెబ్ సైట్ తెలిపింది. 

“వీరి అరెస్టు సిరియాకు బ్రహ్మాండమైన సానుకూల అవకాశాన్ని సమకూర్చింది. సిరియాను నాశనం చేసిన దేశాలతో జరగనున్న దేశాలతో చర్చలు జరిగే సందర్బంగా పై చేయి సాధించే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది” అని సిరియా విశ్లేషకులు ఆనందం ప్రకటించారు. 

అలెప్పో విముక్తి యుద్ధంలో సిరియా, రష్యా, ఇరాన్, హీజ్బొల్లా లు నిమగ్నం అయి ఉన్న నేపథ్యంలో ఐసిస్ బలగాలు ప్రాచీన చారిత్రక నగరం పామిరాను మరోసారి స్వాధీనం చేసుకున్నాయి. పామిరాను స్వాధీనం చేసుకునేందుకు అమెరికాయే తోడ్పడిందని, ఇరాక్ లోని మోసుల్ నుండి ఐసిస్ బలగాలను హుటాహుటిన పామిరాకు తరలించారని రష్యా, సిరియాలు ప్రకటించాయి. సిరియా ప్రభుత్వ బలగాలు ప్రస్తుతం తిరిగి పామిరా పై దృష్టి కేంద్రీకరించాయి. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s