“యాభై రోజులు ఓపిక పట్టండి. కష్టాలు అన్ని తీరుతాయి” అని ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రవేశపెడుతూ హామీ ఇచ్చారు. “మరో 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది” అని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి డిసెంబర్ 2 తేదీన సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. “ప్రజలు ఎన్నాళ్ళు ఇలా క్యూల్లో నిలబడాలి? ఈ ‘అసౌకర్యం’ ఎన్నాళ్ళు భరించాలి?” అని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనానికి సమాధానం ఇస్తూ రోహత్గి ఈ భరోసా ఇచ్చారు.
బీజేపీ నేతలు, RSS పెద్దలు, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, హిందుత్వ సంస్ధలకు చెందిన చోటా మోటా నాయకులూ, కార్యకర్తలు కూడా ఇదే తరహాలో హామీలు ఇస్తున్నారు. ఎవరికీ వారు మోడీ కేరక్టర్ ని తమకు తాము ఆవహింపజేసుకుని “ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే” అని తమకు తామే పూనకం తెచ్చుకుని భ్రమల్లో మునిగిపోయి, తమ భ్రమల్ని జనానికి హామీలుగా ఉదారంగా పంచిపెడుతున్నారు.
కానీ అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ స్టాండర్డ్ & పూర్ (ఎస్&పి) విశ్లేషణ ప్రధాని, మంత్రులు, బీజేపీ నేతల హామీలకు విరుద్ధంగా ఉన్నది. “డీమానిటైజేషన్ వల్ల కలుగుతున్న ఆర్ధిక విధ్వంసం ప్రభావం 2018 ఆర్ధిక సంవత్సరంలోకి కూడా విస్తరిస్తుంది. డీమానిటైజేషన్, GST సంస్కరణలను ఒకేసారి అమలు చేయడం వలన ఆ రెండింటి ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై తీవ్రంగా పడుతుంది” అని ఎస్&పి ప్రకటించింది.
“డీమానిటైజేషన్, GST ల వల్ల దీర్ఘకాలికంగా ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరగవచ్చు. కానీ ఈ చర్యల తాలూకు షాక్ కేవలం రానున్న కొద్దీ నెలల వరకు మాత్రమే ఉంటుందని చెప్పలేము. ఈ సంస్కరణల వల్ల కలిగే ఆర్ధిక విధ్వంసం (ఎకనమిక్ డిస్రప్షన్) 2018 ఆర్ధిక సంవత్సరం (ఫిస్కల్ ఇయర్) లోకి కూడా విస్తరిస్తుంది” అని ఎస్&పి సంస్ధ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ (వస్తు సేవల పన్ను) ను సెప్టెంబర్ 2017 నుండి అమలు లోకి తేవాలని కేంద్రం లక్శ్యంగా పెట్టుకుంది. దీనిని అమలులోకి తేవడం అంటే, ఒక కోణంలో, కంపెనీలు, వ్యాపారాలు అన్ని తమ తమ కంప్యూటర్ లలోని గణన వ్యవస్ధలను సంపూర్ణంగా మార్చుకోవడం. ప్రభుత్వ పన్నుల కార్యాలయాలు కూడా కొత్త పన్నుల వ్యవస్ధకు అనుగుణంగా తమ తమ మౌలిక నిర్మాణాలను మార్చుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ అనివార్యంగా పన్నుల వసూళ్లను ఆలస్యం చేస్తుంది. ఆటంక పరుస్తుంది. చెదిరిపోతుంది. దరిమిలా వసూళ్లు తగ్గిపోవచ్చు. ప్రభుత్వ ఆదాయం పడిపోవచ్చు. GST అమలు వల్ల కలిగే ఆటంకం ఏ స్ధాయిలో, ఎంత మేరకు, ఎంత కాలం పాటు ఉంటుందో ప్రభుత్వాలకు, అధికార వ్యవస్ధకు ఇదమిద్దంగా ఒక అవగాహన లేదు. కనుక GST వల్ల కలిగే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో వారికీ ఒక స్పష్టత లేదు. ఈ అవగాహన లేమి వల్ల ఆర్ధిక వ్యవస్ధ మరింతగా నష్టపోతోంది.
ఓ పక్క డీమానిటైజేషన్, మరో పక్క GST రోల్ అవుట్! ఈ రెండింటి ప్రభావం ప్రభుత్వాలు, మంత్రులు, నేతలు చెబుతున్నట్లు కొద్దీ నెలల్లో ముగిసిపోదని 2018 ఆర్ధిక సంవత్సరం అంతటా విస్తరిస్తుందని ఎస్&పి చెబుతోంది.
డీమానిటైజేషన్ కు ముందు భారత ఆర్ధిక వ్యవస్ధ ఈ ఏడు 7.9 శాతం వృద్ధి చెందుతుందని ఎస్&పి అంచనా వేసింది. డీమానిటైజేషన్ తర్వాత ఆ అంచనాను 6.9 శాతానికి తగ్గించుకుంది. డీమానిటైజేషన్ వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం సిద్ధిస్తుందని ఎస్&పి కూడా చెప్పింది. కానీ ఆ ప్రయోజనం ఏమిటో, అది ఎవరికీ కలుగుతుందో మాత్రం చెప్పలేదు.
ఎస్&పి కంపెనీ మార్కెట్ ఎకానమీకి కాపలాదారు. అంతర్జాతీయ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా అది పని చేస్తుంది. అలంటి ఎస్&పి చెప్పే దీర్ఘకాలిక ప్రయోజనం జనాలకు వ్యతిరేకంగాను, బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగాను ఉంటుంది అని చెప్పడానికి అట్టే సంశయించవలసిన అవసరం లేదు.
జనం అంటే లెక్క లేదు
“డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా జనం ఇంతవరకు ఒక్క నిరసనకు కూడా పూనుకోలేదు. ఒక్క ప్రదర్శన చేయలేదు. ఇది చాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఆహ్వానించారని చెప్పడానికి” అని అటార్నీ జనరల్ రోహత్గి అతి విశ్వాసంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. జనం పడుతున్న కష్టాల పట్ల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో, ఎంత నిర్దయగా ఉన్నారో, జనానికి ఎంత దూరంగా ఉన్నారో రోహత్గి వాగుడు స్పష్టం చేస్తున్నది.
క్యూల్లో నిలబడ లేక గుండెలు ఆగిపోయి, కూతుళ్ళ పెళ్లిళ్లు ఆగిపోయి అవమానంతో ఆత్మహత్యలు చేసుకుని, సుదీర్ఘ కాలం పని చేసి గుండె ఆగిపోయిన బ్యాంకు అధికారులు, పెన్షన్ల కోసం చాంతాడంత క్యూలో నిలబడి అలసిపోయి జనం చనిపోవటం… ఇవన్నీ తెలిసిన ఏ మనిషయినా ఇంట అడ్డగోలు వాదన చేయడు.
ప్రాణాలు కోల్పోవడం కంటే మించిన నిరసన ఇంకేమన్నా ఉంటుందా? బెంగాల్ లో టీ తోటల కార్మికులు, మధ్య ప్రదేశ్ లో గ్రామీణ ప్రజలు, ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షనర్లు… ఇలా అనేకమంది అనేక చోట్ల వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నా వాటిని చూసేందుకు గుడ్డిగా నిరాకరించడానికే సిద్ధపడినప్పుడు జనం నిరసన ఎలా కనిపిస్తుంది?