డీమానిటైజేషన్ పరిణామాలు, ఫలితాలపై నివేదిక వెలువరించిన అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ ఎస్&పి పలు అంశాలను తన నివేదికలో పొందుపరిచింది. వాటిలో ఒకటి: అనేక యేళ్లుగా నిక్కచ్చి పని విధానంతో, ఉన్నత స్ధాయి ప్రమాణాలతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమానిటైజేషన్ వల్ల ఒక్కసారిగా పరువు పోగొట్టుకుందని చెప్పడం.
“కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య సెంట్రల్ బ్యాంకు సమర్ధత, స్వతంత్రతలను మంటగలిపింది” అని ఎస్&పి తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ఆర్‌బిఐ విశ్వసనీయమైన వ్యవస్ధగా కొనసాగుతున్నప్పటికీ డీమానిటైనేషన్ వల్ల సంస్ధ సంపాదించిన గొప్ప లక్షణాలకు మచ్చ వచ్చి చేరిందని ఎస్&పి స్పష్టం చేసింది.
ఆర్‌బిఐ ఇన్నాళ్లూ కనబరిచిన సమర్ధత ఏమిటి? రాజ్యాంగం తనకు అప్పగించిన పనిని ఎటువంటి రాగద్వేషాలకు తావు ఇవ్వకుండా, అధికారంలో ఉన్న పార్టీలు, నేతల ఒత్తిళ్లకు తల ఒగ్గకుండా దేశంలోని మానిటరీ పరిస్ధితులు ఏ నిర్ణయాలనైతే డిమాండ్ చేస్తున్నాయని తాను భావిస్తున్నదో సరిగ్గా అదే నిర్ణయాలను తీసుకోవడమే ఆర్‌బిఐ కనపరిచిన సమర్ధత.
రాజ్యాంగం ఆర్‌బిఐ కి స్వతంత్రంగా పని చేయమని నిర్దేశించింది. గవర్నర్ గా ఎవరిని నియమించాలి అన్న అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నప్పటికీ, దాదాపు ఇప్పటి వరకు పని చేసిన అధికారులు (గవర్నర్లు) అందరూ కేంద్ర ప్రభుత్వ అవసరాలకు, ప్రభావాలకు లొంగకుండా పని చేశారని ఎస్&పి పరోక్షంగా చెప్పింది.
మోడి నేతృత్వంలోని బిజేపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి స్వతంత్ర వ్యవస్ధలను తన ఆధీనంలోకి తెచ్చుకోవటానికీ, తన మాట వినేలా చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.
యూనివర్సిటీలు స్వతంత్రంగా పని చేస్తూ సకల భావాలు, ధోరణులకు నిలయంగా పని చేయవలసి ఉండగా వాటిల్లో అడ్డగోలుగా వేళ్లూ, కాళ్ళూ అన్నీ పెట్టి అస్ధిరతకు నిలయాలుగా మార్చివేసింది. తన తొత్తులను విసిలుగా నియమించి యూనివర్సిటీలు ఇన్నాళ్ల ఆచరణలో సంపాదించిన సత్సంప్రదాయాలను, ప్రజాస్వామిక వాతావరణాన్ని హిందూత్వ విషంతో నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
వచ్చీ రావడంతోనే న్యాయ వ్యవస్ధను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, జడ్జిల నియామకాలను ప్రభావితం చేసేందుకు జ్యుడీషియల్ కమిటీ బిల్లుని చట్టం చేసేసింది. తద్వారా కొలీజియం వ్యవస్ధను రద్దు చేసి తన మాట వినే వ్యక్తులతో ఉన్నత న్యాయస్ధానాలను నింపేందుకు ఎత్తుగడ పన్నింది. సుప్రీం కోర్టు కాస్త మెలకువగా ఉండడంతో సదరు చట్టం రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు చెప్పి రద్దు చేసింది. అప్పటి నుండి కేంద్రం సుప్రీం కోర్టు, హై కోర్టులలో జడ్జిలను నియమించకుండా తాత్సారం చేస్తూ పగ సాధిస్తోంది. మోడి ప్రభుత్వం వైఖరి వల్ల న్యాయ వ్యవస్ధ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ప్రచ్చన్న యుద్ధం, బహిరంగ యుద్ధం రెండూ కొనసాగుతూనే ఉన్నాయి.
అదే రీతిలో తన మాట వింటారు అనుకుంటే గవర్నర్లను కొనసాగించింది. లేదంటే పదవుల నుండి తొలగించి తన వాళ్ళను నియమించుకుంది. వారి సాయంతో వివిధ సాకులతో వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం మొదలు పెట్టింది. మళ్ళీ సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో అప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించి ఆనక తన సొంత ప్రభుత్వాలను నిలిపే ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది.
కాస్తో కూస్తో ప్రజలకు ఉపయోగపడే చట్టాలను కూడా ఇదే తరహాలో నీరు గార్చింది. గ్రామీణ ఉపాధి హామీ పధకానికి సవరణలు తెచ్చి నీరుగార్చింది. చిల్లర వర్తక రంగంలో ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడం లేదు అని చెబుతూనే దొడ్డిదారిన ఆన్ లైన్ మార్కెటింగ్ లో 100 శాతం ఎఫ్‌డిఐ లకు అనుమతి ఇచ్చేసింది. ఇప్పుడు డీమానిటైజేషన్ పేరుతో ఆన్ లైన్ మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తూ కోట్లాది చిల్లర వ్యాపారుల మార్కెట్ ను బహుళజాతి ఆన్ లైన్ రిటైల్ మార్కెటింగ్ కంపెనీలకు తరలించేందుకు కృషి చేస్తున్నది. భూ సేకరణ చట్టానికి వినాశకర సవరణలు తేవడానికి సిద్ధపడింది. కాంగ్రెస్ నుండి సహకారం అందక వెనక్కి తగ్గింది. పర్యావరణ చట్టాలను నీరుగార్చింది.
ఇదే వరుసలో ఆర్‌బిఐ స్వతంత్రను కూడా మోడి ప్రభుత్వం లాగేసుకుంది. నిజానికి నోట్ల వ్యవహారం ఆర్‌బిఐ అధికార పరిధిలోనిది మాత్రమే. దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉండాలి, ఎప్పుడు ఏయే నోట్లు కొత్తవి ప్రవేశపెట్టాలి, ఏయే నోట్లు ఉపసంహరించాలి… ఇవన్నీ ఆర్‌బిఐ తన స్వతంత్ర ఆలోచన, ఆర్ధిక సిద్ధాంతాల మేరకు నిర్ణయించవలసినవి. కానీ మోడి ప్రభుత్వం ఆర్‌బిఐ గవర్నర్ అధికారాలను లాగేసుకుని మానిటరీ కమిటీ పేరుతో ఆర్‌బిఐ నిర్ణయాధికారాలలోకి చొరబడింది.
డీమానిటైజేషన్ వల్ల దేశంలో ఎంత అల్లకల్లోలం చెలరేగుతుందో ఆర్‌బిఐ గవర్నర్ చక్కగానే ఊహించగలదు. కేంద్ర ప్రభుత్వం చొరబాటు లేనట్లయితే ఇంత అప్రజాస్వామిక చర్యకు ఆర్‌బిఐ పూనుకుని ఉండేది కాదు. బహుళజాతి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పని చేసే రాజకీయ ప్రభుత్వం తన మాస్టర్ ప్రయోజనంతో పాటు తన సొంత రాజకీయ ప్రయోజనం కూడా తరుముకుని రావడంతో హడావుడిగా భారీ ఎత్తున డీమానిటైజేషన్ ప్రకటించారు. ‘నల్ల ధనంపై పోరాటం” అంటూ తమ అప్రజాస్వామిక చర్యకు ‘ప్రజాస్వామిక ముసుగు’ తొడిగారు.
వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చినందుకు ఎస్&పి ‘డీమానిటైజేషన్’ కు మద్దతు ఇవ్వాలి. “దీర్ఘకాలికంగా ప్రయోజనకరమే” అని చెప్పడం ద్వారా ఆ ప్రయోజననాన్ని ఎస్&పి గుర్తించింది కూడా. కానీ డీమానిటైజేషన్ ను అమలు చేసిన విధానం మాత్రం కంపెనీకి నచ్చలేదు. ఎలాంటి ఏర్పాట్లు, ముందస్తు అంచనాలు లేకుండా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకునేలా అమలు చేయడం వల్ల లాభం కంటే నష్టం వచ్చే పరిస్ధితి వచ్చిందని ఎస్&పి అంచనా వేస్తున్నదని దాని నివేదికను బట్టి తెలుస్తున్నది.
దీర్ఘకాలికంగా ఏ ప్రయోజనం వస్తుందో ఇంతవరకు చెప్పినవారు లేరు. “3 నుండి 5 లక్షల కోట్ల వరకు వెనక్కి రాదు, అది ప్రభుత్వానికి డివిడెండ్ గా వస్తుంది. ఆ డబ్బుతో పలు సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు” అని చెప్పారు గానీ అనుకున్నదాని కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులకు చేరడంతో అదేమీ జరగదని తేలిపోయింది. అనుకున్నట్లు కొంత డబ్బు వెనక్కి రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది ఏమీ ఉండదని ఆర్‌బిఐ గవర్నర్ ఇప్పుడు చెబుతున్నారు.
వడ్డీ రేట్లు తగ్గుతాయి అన్నారు. తగ్గలేదు సరికదా, ఉన్న రేటునే ఆర్‌బిఐ కొనసాగించింది. నల్ల డబ్బు వెలికి వస్తుంది అన్నారు. కానీ కొత్త నోట్లు కూడా నల్ల బజారులో కుప్పలు కుప్పలుగా ప్రత్యక్షం అవుతున్నాయి. అనగా వెలికి రాకపోగా పాత నల్ల డబ్బు తెల్ల ధనంగా బ్యాంకులకు చేరడమే కాకుండా కొత్త నోట్లలో నల్ల ధనం పేరుకుపోతున్నది. ఇక ‘నల్ల ధనంపై పోరాటం’ ఎక్కడ చేస్తున్నట్లు?
టెర్రరిస్టుల దొంగ నోట్లు ఇక చిత్తు కాగితాలే అన్నారు. కొత్త నోట్ల రూపంలో కూడా దొంగ నోట్లు కాశ్మీర్ తీవ్రవాదుల దగ్గర దొరుకుతున్నాయి. అదిగో చూసారా రాళ్ళ దాడులు ఆగిపోయాయి అన్నారు. కానీ టెర్రరిస్టు దాడులు ఇప్పటికీ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఈ విధంగా మోడి మొదట చెప్పిన మూడు లక్ష్యాలతో పాటు, మంత్రులు నేతలు చెప్పిన అనేక చిల్లర మల్లర ప్రయోజనాలు కూడా ఏమీ ఒరగడం లేదని తేటతెల్లం అయింది. నల్ల నోటు అంటే ఏమిటో తెలియని అమాయక జనం మాత్రం క్యూలల్లో నిలబడలేక చనిపోతున్నారు. చనిపోతున్నవారికి కనీసం సానుభూతి ప్రకటించడం కూడా ఈ అప్రజాస్వామిక, నియంతృత్వ, ఫాసిస్టు ప్రభుత్వానికి నోరు రావడం లేదు.
ఈ నేపధ్యంలో “డీమానిటైజేషన్ ఆర్‌బిఐ సమర్ధత, స్వతంత్రతల పైన నల్లటి నీడను పరిచింది” అని ఎస్&పి నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది. “ద్రవ్య విధానం (మానిటరీ పాలసీ) నిర్వహణకు సంబంధించి ఈ సంస్ధ అత్యంత విశ్వసనీయమైన సంస్ధ అని ఇప్పటికీ మేము నమ్ముతున్నాము. కానీ డీమానిటైజేషన్ వల్ల ఆర్‌బిఐ పైన నమ్మకాన్ని దెబ్బ తీసింది. ఇండియాలో విధానాల అమలుకు సంబధించి ప్రభావశీలత మరియు ఊహ్యత (predictability) లపై నమ్మకం తగ్గిపోవడానికి కారణం అయింది. ఇది ఆర్‌బిఐ కి కూడా వర్తిస్తుంది” అని ఎస్&పి పేర్కొంది.
డీమానిటైజేషన్ వీరులకు వినిపిస్తున్నదా?
ఊహ్యత (ప్రెదిచ్తబిలిత్య్)
ఊహాత్యత