కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన వద్ద ఒక రహస్యం ఉన్నదని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఆ రహస్యాన్ని చెప్పేస్తానేమో అన్న భయంతో తనను లోక్ సభలో అధికార పక్ష సభ్యులు మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న రహస్యం “మోడి వ్యక్తిగతంగా పాల్పడిన అవినీతికి సంబంధించినది” అని ఆయన ఈ రోజు చెప్పారు.
పార్లమెంటులో, ముఖ్యంగా లోక్ సభలో ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదో అర్ధం కాకుండా పోయింది. ప్రతిపక్షాలు సభను జరగనివ్వడం లేదని, డీమానిటైజేషన్ పై చర్చకు అవి భయపడుతున్నాయని బిజేపి నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నేతలు కూడా “డీమానిటైజేషన్ పై చర్చకు బిజేపి, మంత్రులు, ప్రధాన మంత్రి భయపడుతున్నారు” అని ప్రత్యారోపణ చేస్తున్నారు.
ఇంతకీ ఎవరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదు? డీమానిటైజేషన్ పై చర్చకు ఎవరు భయపడుతున్నట్లు? “దమ్ముంటే చర్చకు రండి” అని ఇద్దరూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం ఏమిటి?
ఒకటి రెండు పత్రికలు మర్మం విప్పి చెప్పేందుకు ప్రయత్నించాయి. ఆ పత్రికల ప్రకారం ఫలానా నిబంధన కింద ‘డీమానిటైజేషన్’ పైన చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదట. ఆ నిబంధన కింద చర్చ చేస్తే, చర్చ ముగిశాక ఓటింగ్ జరగాల్సి ఉంటుందట. కానీ బిజేపి ఆ నిబంధన కింద కాకుండా ‘డీమానిటైజేషన్’ గురించి ఉత్తినే మాట్లాడుకుందాం అని కోరుతున్నదట.
ఇదే నిజం అయితే బిజేపి తొండాట ఆడుతున్నట్లే లెక్క. ఎందుకంటే లోక్ సభలో ఓటింగ్ తో కూడిన చర్చకు భయపడాల్సిన అవసరం బిజేపికి లేదు. లోక్ సభలో బిజేపికి స్పష్టమైన మెజారిటీ ఉన్నది. ఓటింగ్ జరిగినా బిజేపియే నెగ్గుతుంది. మరి ఓటింగ్ కి బిజేపి ఎందుకు భయపడుతోంది?
లోక్ సభలో మెజారిటీ ఉన్న మాట నిజమే గానీ, రాజ్య సభలో మాత్రం ఆ పార్టీకి మెజారిటీ లేదు. బహుశా లోక్ సభలో ఏ నిబంధన కింద అయితే చర్చ జరిగిందో అదే నిబంధన కింద చర్చ జరగాల్సి ఉంటుంటుందని నియమం ఉండి ఉండాలి. అటువంటి నిబంధన ఉన్నట్లయితే ‘డీమానిటైజేషన్’ చర్చలో బిజేపి రాజ్యసభలో ఓడిపోతుంది.
చర్చలో ఓడిపోతే డీమానిటైజేషన్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలా అన్న అంశంపై స్పష్టత లేదు. చర్చ జరిగి ఓటింగ్ జరిగి, ఆ ఓటింగ్ లో అధికార పక్షం ఓడిపోతే, ఇప్పటికే అమలులో ఉన్న డీమానిటైజేషన్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వస్తుందా?
డీమానిటైజేషన్ చర్య రాజ్యాంగబద్ధం కాదని, రాజ్యాంగ మద్దతు లేకుండానే మోడి తన సొంత బుర్రతో, కొద్దిమంది కోటరీ బృందం సలహాతో, కనీసం మంత్రులను, కేబినెట్ ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించేశారని కొందరు ఆరోపిస్తున్నారు. అదే ఆరోపణతో వివిధ హై కోర్టుల్లో కేసులు కూడా వేశారు.
వాళ్ళ వాదన ప్రకారం ఏ నిబంధన ప్రకారం అయితే మోడి ‘డీమానిటైజేషన్’ ని ప్రకటించారో, ఆ నిబంధన కింద కేవలం ఒక నోటుకు సంబంధించి కొన్ని నెంబర్ సిరీస్ ల నోట్లు మాత్రమే వెనక్కి తీసుకునే అధికారం ఆర్‌బిఐ కి ఉంటుంది గాని ఒకటి లేదా రెండు నోట్లను మొత్తంగా రద్దు చేసే అధికారం లేదు. నోట్ల వ్యవహారం ఆర్‌బిఐ పరిధిలోనిదే అయినా ‘నల్ల ధనం పై పోరాటం’ కీర్తిని సంపాదించే కక్కుర్తితో ఆర్‌బిఐ నిర్ణయాన్ని ప్రధాని మోడి తమ నిర్ణయంగా ప్రకటించేశారు.
పార్లమెంటులో జరిగే చర్చలో డీమానిటైజేషన్ చర్య రాజ్యాంగబద్ధమా కాదా అన్న అంశం కూడా వచ్చి తీరుతుంది. రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం అని సభ్యులు ఓటింగ్ ద్వారా ఓడిస్తే లేదా కనీసం గెలవకపోతే అప్పుడు డీమానిటైజేషన్ ని వెనక్కి తీసుకోక తప్పదు. బహుశా అందుకే బిజేపి ఓటింగ్ కి భయపడుతున్నదేమో?!
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపధ్యంలో రాహుల్ గాంధీ హఠాత్తుగా “నన్ను మాట్లాడనివ్వడం లేదు” అని ప్రకటించాడు. “నేను మాట్లాడితే సభలో భూకంపమే వస్తుంది” అని చాటాడు. ఆయన ప్రకటనను బిజేపి మంత్రులు వెంటనే ఎద్దేవా చేశారు కూడా. కానీ ఈ రోజు (బుధవారం) చూస్తే నిజంగానే రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదని పత్రికలు చెబుతున్నాయి. “మేము చర్చకు సిద్ధం” అని కాంగ్రెస్ ప్రకటించగానే “ఇన్నాళ్ళూ సభ జరగనివ్వనందుకు కాంగ్రెస్ ఆపాలజీ చెప్పాలి” అని బిజేపి సభ్యులు డిమాండ్ చేశారని, ఆ డిమాండ్ తో సభ జరగనివ్వలేదని పత్రికల సమాచారం.
పాత నోట్లకు గాను కొత్త నోట్లను, 30% నుండి 40% వరకు కమిషన్ మినహాయించుకుని, మార్చడానికి బిఎస్‌పి, ఎస్‌పి నేతలు ఉత్తర ప్రదేశ్ లో సొంత షాపులు తెరిచారంటూ బిజేపి సభ్యులు ఆరోపణలు గుప్పించడంతో లోక్ సభలో మరింత గొడవ చెలరేగిందని తెలుస్తున్నది. (ఇండియా టుడే జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో బిఎస్‌పి, ఎస్‌పి నేతల కమిషన్ వ్యవహారం బైటికి వచ్చింది.)
ఒక్కో పార్టీ సభ్యులు ఒక్కో కారణంతో సభలో నినాదాలు, డిమాండ్లతో గోల గోల చేయడంతో సభ రేపటికి వాయిదా పడింది. దానితో రాహుల్ గాంధీ, ఇతర 15 ప్రతిపక్ష పార్టీల సభ్యులు నేతలతో సహా విలేఖరుల సమావేశం పెట్టి మరోసారి బిజేపికి సవాలు విసిరారు. డీమానిటైజేషన్ ఒక పెద్ద కుంభకోణం అని సమావేశంలో రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. డీమానిటైజేషన్ నల్ల ధనం పై పోరాటం కాదనీ పేదలపై పోరాటం అనీ ప్రకటించారు. మోడి వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడిన సమాచారం తన వద్ద ఉన్నదనీ ఆ సమాచారం బైటపెడతానన్న భయంతో తనను మాట్లాడనివ్వడం లేదనీ మరోసారి నొక్కి చెప్పారు.
ఆ సమాచారం ఏదో బైటికి చెప్పవచ్చు గదా అని ఏఏపి నేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ నేతలు అంత తేలికగా బైటపడరు. సమయం చూసి పేలుతుంది అనుకున్నప్పుడే బాంబు విసురుతారు తప్ప తెలిసింది తెలిసినట్లు బయిటకు చెప్పరు. అసలు అలాంటి సమాచారం రాహుల్ వద్ద ఉన్నదా లేదా అన్నది కూడా అనుమానమే.
నిజానికి మోడి అవినీతి ఇప్పటికే బయిటకు వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోడీకి 55 కోట్ల మేర లంచం ఇచ్చినట్లు బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సహారా కంపెనీ అధికారుల ఫైళ్లలో నమోదు అయిన సంగతి ప్రశాంత్ భూషణ్ వెల్లడి చేశారు. కానీ డైరీలలో పేర్లు ఉన్నంత మాత్రాన కేసు పెట్టలేము అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇవ్వడంతో మోడి అవినీతి విషయంపై గొడవ చేసే అవకాశం కాంగ్రెస్ కు రాలేదు.
ఈ అంశం కాకుండా ఇంకేదైనా సమాచారం రాహుల్ గాంధీ వద్ద ఉన్నట్లయితే దానిని బైటపెట్టేందుకు ఇంతకు మించిన సమయం లేదు.
రాహుల్ గాంధీ వద్దనున్నది బ్రహ్మస్త్రం కాదు,కనీసం సూదికూడా అతనివద్ద లేదు! ఏదో ఉందని భ్రమకల్పించడం తప్ప!అధికార,ప్రతిపక్షాలు అన్నీ ఇందులో భాగమే!లొక్ సభ ఎన్నడో తన విస్వాసాన్ని కోల్పోయింది!చట్ట సభలలో జరిగే చర్చాకార్యక్రమాల తీరు అందరికీ తెలిసిందే!అందువలన రాహుల్ గాందీ వద్దనున్న మోదీ రహస్యం అంతా ఉత్తగాలి!మోదీకున్న అధికార అధికారికనియంత్రుత్వం వచ్చే ఎన్నికలవరకు తగ్గదుగాక తగ్గదు!