ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ వృద్ధి పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. నోట్ల రద్దు వలన డిమాండ్ బాగా పడిపోయిందని దానితో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు సైతం ఉత్పత్తిలో తీవ్ర కోత పెట్టుకోవాల్సి వచ్చిందని హఫింగ్టన్ పోస్ట్ తెలిపింది.
భారత దేశంలో సేవల రంగం పనితీరును ట్రాక్ చేసే నిక్కీ/మార్కిట్ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ నవంబరు నెలలో 46.7 కు పడిపోయిందని పత్రిక తెలిపింది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 50 కి పైన ఉంటే ఆ రంగం వృద్ధిని నమోదు చేయనున్నదని అర్ధం. అదే 50 కి తక్కువ నమోదు చేస్తే ఆ రంగంలో ఉత్పత్తి వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోనున్నదని అర్ధం.
అక్టోబర్ నెలలో సేవల రంగ PMI, 54.5 గా నమోదు కాగా అది నవంబరులో 46.7 కి పడిపోయింది. సాధారణంగా ఒకే నెల తేడాలో PMI ఇంత భారీగా తగ్గిపోవడం జరగదు. కేవలం అరుదైన సందర్భాల్లో, సంక్షోభం అలుకున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. డీమానిటైజేషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదో PMI లో సంభవించిన ఈ భారీ తేడా తెలియజేస్తున్నదని మార్కిట్ సంస్ధ విశ్లేషించింది.
నిక్కీ సర్వేలో PMI 50 కంటే తక్కువ నమోదు కావడం జూన్ 2015 తర్వాత ఇదే మొదటిసారి. అంతే కాదు, ఒకే నెలలో ఇంత భారీ స్ధాయిలో PMI సూచిక పడిపోవడం నవంబరు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇదే మొదటిసారి.
“పెద్ద నోట్ల రద్దు వలన భారత సేవల రంగం ఎంత తీవ్రంగా దెబ్బ తిన్నదో ఈ నిరాశాజనక PMI గణాంకాలు తెలియజేస్తున్నాయి” అని మార్కిట్ సంస్ధకు చెందిన ఆర్ధిక వేత్త పోలియానా డి లిమా వ్యాఖ్యానించడం గమనార్హం.
నోట్ల రద్దు వలన వినియోగదారులు తమ విచక్షణ ఖర్చులు తగ్గించేశారని దానితో ఆర్ధిక సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు , రెంటింగ్, వ్యాపార కార్యకలాపాలు మొ.న రంగాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని మార్కిట్ విశ్లేషకులు తెలిపారు.
సెప్టెంబరు నెల వరకు భారత ఆర్ధిక వ్యవస్ధ 7.3 శాతం మేర వృద్ధిని సాధించింది. నోట్ల రద్దు ఫలితంగా మర్చి 2017 నాటికీ వృద్ధి రేటు అందులో సగానికి – 3.7 % – పడిపోతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొత్త వ్యాపారాలకు సంబంధించిన ఉప PMI సూచిక అక్టోబర్ లో 54.3 పాయింట్లు నమోదు చేయగా అది నవంబరు నెలలో 46.7 కు పడిపోనున్నదని మార్కిట్ సర్వేలో తేలింది. నూతన వ్యాపారాల సూచిక నెగిటివ్ వృద్ధికి పడిపోవటం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కాగా ఇంత భారీగా పడిపోవడం ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి.
అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు సేవల రంగాల ఉమ్మడి PMI సూచిక అక్టోబర్ లో 55.4 పాయింట్లు నమోదు చేయగా అది నవంబర్ నెలలో 49.1 పాయింట్లకు పడిపోనున్నదని మార్కెట్ సర్వేలో తేలింది. అనగా సేవల రంగంతో పాటు ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నది.
డబ్బు సరఫరా తగ్గిపోయినందున అనివార్యంగా డిమాండ్ తగ్గిపోతుంది. ఆ వెంటనే ధరలు తగ్గుతాయి. కనుక ద్రవ్యోల్బణము కూడా తగ్గాలి. ద్రవ్యోల్బణం తగ్గితే రిజర్వ్ బ్యాంకు తదనుగుణంగా వడ్డీ రేటు (రెపో రేటు) తగ్గించాలి. కొద్దీ రోజుల్లో జరగనున్న ద్రవ్య సమీక్షా విధానంలో 25 బేసిస్ పాయింట్ల మేర (0.25 శాతం) వడ్డీ రేటు తగ్గించవచ్చని మార్కెట్ వర్గాలు, విశ్లేషకులు ఊహిస్తున్నారు. వడ్డీ రేటు తగ్గితే ఆ మేరకు కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు మరిన్ని రుణాలు తీసుకుని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించాలి. ఇది అంతిమంగా జనానికి ఉపాధి పెరుగుదలగా ఫలితం ఇవ్వాలి. ఇది జరుగుతుందా లేదా అన్నది గమనించాల్సిన విషయం.
కానీ చరిత్ర నిరూపించిన సత్యం ఏమిటంటే వడ్డీ రేటు తగ్గుదల వల్ల బడా కంపెనీలకు, పెద్ద బాబులకు మరిన్ని నిధులు సమకూరడం వరకు జరుగుతుంది కానీ జనానికి ఉపాధి కల్పించే వరకు దాని ప్రయాణం సాగదు. అలా సమకూరిన అదనపు నిధులను స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు తగలేయడం తప్ప నిజంగా ఉత్పత్తి కార్యకలాపాలలోకి దిగి ఉపాధి కల్పనకు దారి వేయడం జరగలేదు.
సర్,విచక్షణ ఖర్చులగూర్చి వివరంగా తెలుపుతారా?