ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం మాత్రం ఆ లక్ష్యం కోసమే పాత పెద్ద నోట్లు రద్దు చేశారని, భవిష్యత్తులో ఎదో గొప్ప మార్పు జరగనున్నదని ఇప్పటికి నమ్ముతున్నారు.
కానీ ఇప్పటివరకు బ్యాంకుల్లో జమ అయిన పాత నోట్లను బట్టి చూస్తే మోడీ ప్రకటించిన ‘నల్ల డబ్బు నిర్మూలన లక్ష్యం నెరవేరే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య పత్రిక బ్లూమ్ బర్గ్ న్యూస్ ప్రకారం డిసెంబర్ 3 తేదీ నాటికి బ్యాంకుల్లో 12.6 లక్షల కోట్లు విలువ గల పాత పెద్ద నోట్లు (రు 1000/- రు 500/- నోట్లు) జమ అయ్యాయి. నోట్ల రద్దు ప్రకటించేనాటికి దేశంలో 15.3 లక్షల కోట్ల విలువ గల పాత నోట్లు చలామణిలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అందులో 5 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉంటుందని భావిస్తున్నామని చెప్పింది. నోట్లు పెద్ద మొత్తంలో జమ అవుతుండడంతో అంచనాను తగ్గించుకుని 3 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉండవచ్చని కొందరు మంత్రులు అంచనా వేశారు.
12.6 లక్షల కోట్లు అంటే చలామణిలో ఉన్న మొత్తంలో 82 శాతానికి సమానం. ఇంకా ప్రకటించకుండా (బ్యాంకుల్లో జమ చేయకుండా) మిగిలి ఉన్న మొత్తం రు 2.7 లక్షల కోట్ల రూపాయలు. పోస్ట్ ఆఫీసుల్లో 35 వేల కోట్లు (0.35 లక్షల కోట్లు) జమ అయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని కూడా మినహాయిస్తే ఇక జమ కావలసింది 2.25 లక్షల కోట్లు మాత్రమే. జమ చేసేందుకు డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నది. కాబట్టి మిగిలిన మొత్తం కూడా బ్యాంకుల్లో జమ అయిన ఆశ్చర్యం లేదు.
పోనీ ఇప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా, 2.25 లక్షల కోట్లు మాత్రమే జమ కావలసి ఉన్నది. ఇది మొదట ప్రకటించిన 5 లక్షల కోట్ల నల్ల ధనంలో సగం కంటే తక్కువ. సవరించుకున్న 3 లక్షల కోట్ల కన్నా కూడా తక్కువే. జమ అయిన మొత్తం తెల్ల డబ్బు కిందనే లెక్క. కనుక మోడీ ప్రకటించినట్లు గా ‘డబ్బు నిల్వలను శుభ్రం చేసే ప్రక్రియ’ ఘోరంగా విఫలం అయినట్లే.
కానీ పాత నోట్లలో అసలే నల్ల డబ్బు లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్రమ సంపాదన నోట్లలో ఉంటుంది. అందులో అనుమానం లేదు. కానీ ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం జమ అయిందంటే ఏమి జరిగినట్లు? ఒకటి: నల్ల ధనం తెల్ల ధనంగా మార్చుకునే అవకాశం డీమానిటైజేషన్ చర్య కల్పించింది. అంటే మరో రూపంలో అవినీతికీ, అక్రమానికీ పాల్పడమే జరిగింది తప్ప అవినీతి నిర్మూలన ఏ మాత్రం జరగలేదు. రెండు: డీమానిటైజేషన్ వల్ల బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, వ్యాపారంలో అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలు ఏ మాత్రం తగ్గలేదు.
అవినీతి సంపాదనను మూడు రకాలుగా ఆర్ధిక వేత్తలు వర్గీకరిస్తారు. బ్లాక్ ఎకానమీ, బ్లాక్ ఇంకమ్, బ్లాక్ మనీ. ఈ మూడింటిని నిర్మూలించేందుకు స్ధిరంగా, దీర్ఘకాలికంగా, వ్యవస్థీకృతమైన చర్యలు చేపట్టగలిగితేనే సమాజం నుండి చట్ట విరుద్ధమైన ఆర్ధిక ప్రక్రియలను తుడిచిపెట్టగలం. ఈ మూడింటిలో శక్తివంతమైనది, అసలైనది బ్లాక్ ఎకానమీ. బ్లాక్ ఎకానమీ వల్ల బ్లాక్ ఇంకమ్ నిరంతరం పుడుతూ ఉంటుంది. ఈ బ్లాక్ ఇంకమ్ లో కొద్దీ భాగం మాత్రమే బ్లాక్ మనీ గా పోగుపడుతుంది. అనేకమంది ఆర్థికవేత్తలు ఇప్పటికే చెప్పినట్లుగా నల్ల డబ్బు ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో, షేర్ మార్కెట్ లో, అక్రమ వ్యాపారాల్లో, బంగారం తదితర విలువైన లోహాల్లో, విదేశీ ఖాతాల్లో ఉన్నది. డబ్బు రూపంలో ఉన్నది చాలా తక్కువ. ఆ తక్కువ మొత్తాన్ని వెలికి తీయడంలో కూడా డీమానిటైజేషన్ విఫలం అయింది.
కొత్త నోట్ల కట్టలు కోట్ల కొద్దీ పట్టుబడుతున్న నేపథ్యంలో నల్ల ధనం పోగేసి మార్గాలను ఏ ప్రభుత్వమూ, కనీసం బీజేపీ ఏలుబడిలో రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముట్టుకోలేదని స్పష్టం అవుతున్నది. పైగా బీజేపీ పార్టీ శాఖలే డీమానిటైజేషన్ రోజున పెద్ద ఎత్తున పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెల్లడి అయింది. ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీ పాత నోట్లలో ఇఛ్చిన చందాలను వెనక్కి తీసుకుని కొత్త నోట్లలో ఇవ్వాలని చందాదారులు ఆదేశించినట్లు తెలుస్తున్నది. బ్యాంకుల అధికారులు ధనికుల ఇళ్లకు వెళ్లి కొత్త నోట్లు ఇఛ్చి పాత నోట్లు మార్చుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ని అక్రమాలు యధేచ్చచగా సాగుతున్నప్పుడు ఇక నల్ల డబ్బు, అవినీతి ఆగిందెక్కడ?
5 లక్షల నల్ల డబ్బు తేలితేనే కేంద్ర ప్రభుత్వానికి 50 వేల కోట్లు డివిడెండ్ వస్తుందని ఆర్ధిక శాఖ కార్యదర్శి కొద్దీ రోజుల క్రితం చెప్పారు. దేశ వార్షిక బడ్జెట్ చూస్తేనేమో 16 లక్షల కోట్లకు పై మాటే. ఇంత బడ్జెట్ లో 50 వేల కోట్లు ఏ మూలకు వస్తుంది? ఈ డివిడెండ్ తో నేనా మోడీ ప్రభుత్వం ప్రజలకు అదనపు సంక్షేమ చర్యలు తీసుకునేది? బడ్జెట్ లోటు పూడ్చుకునేది ఈ 50 వేల కోట్లతోనేనా? ఎంత హాస్యాస్పదం! ఎంత మోసం!!