అసాంజే: బ్రిటన్ అప్పీలు తిరస్కరణ


Ecuador embassy in London

Ecuador embassy in London

వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించడంతో అయన విడుదల దాదాపు అనివార్యం అయింది. అయితే అసాంజేను విడుదల చేస్తారా లేదా మరో సాకు వెతికి పట్టుకుని నిర్బంధం కొనసాగిస్తారా అన్నది తెలియరాలేదు. 

నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్న సంగతి తెలిసిందే. స్వీడన్ లో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను తమకు అప్పగించాలని స్వీడన్ ప్రభుత్వం కోరడంతో అసాంజే ఈక్వడార్ ఎంబసీలో తలదాచుకున్నాడు. అసాంజే ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేసి స్వీడన్ తరలించడానికి అప్పటి నుండి లండన్ పోలీసులు ఈక్వడార్ ఎంబసీని వేయి కళ్లతో కాపలా కాస్తున్నారు. 

అత్యాచారం ఆరోపణలను అసాంజే తిరస్కరించాడు. ఆరోపణలు చేసిన ఇద్దరు స్త్రీలలో ఒకరు తన ఆరోపణలను ఉపసంహరించుకోగా మరో స్త్రీ CIA ఏజెంటుగా పత్రికలు ధ్రువపరిచాయి. తనను స్వీడన్ కు అప్పగిస్తే అక్కడి నుండి అమెరికాకు అప్పగిస్తారని అసాంజే ఆరోపించాడు. అమెరికా దౌత్య రహస్యాలను వికీలీక్స్ వెల్లడి చేసినందుకు గాను అమెరికాలో అసాంజేకు వ్యతిరేకంగా రహస్య జ్యురీ ఏర్పరిచి విచారణ చేస్తున్నారని, అక్కడికి వెళితే తనకు సరైన న్యాయం దక్కుతుందన్న నమ్మకం లేదని అసాంజే వివరించాడు. 

ఈ నేపథ్యంలో జులియన్ అసాంజే నిర్బంధం చట్ట విరుద్ధం అని, మానవ హక్కులను హరించడమే అనీ కొద్ది నెలల క్రితం ఐరాస సంస్ధ తీర్పు చెప్పింది. అసాంజే ఫిర్యాదును పురస్కరించుకుని విచారణ చేసిన ఐరాస ఆయనను విడుదల చేసి నష్టపరిహారం కూడా చెల్లించాలని బ్రిటన్, స్వీడన్ లను కోరింది.

Assanje speaking to press from Ecuador embassy

Assanje speaking to press from Ecuador embassy

అయితే ఐరాస తీర్పును బ్రిటన్ తిరస్కరించింది. తాము అసాంజేను బంధించలేదని ఆయనే స్వయంగా ఈక్వడార్ ఎంబసీలో బంధితుడుగా వెళ్లాడని వాదించింది. తీర్పును మార్చాలని రెండు సార్లు అప్పీలు చేసింది. 

బ్రిటన్ అప్పీలు “అనుమతించడానికి వీలు లేనిది” (inadmissable ) గా పేర్కొంటూ ఐరాస బుధవారం మరోసారి తిరస్కరించింది. 

అప్పీలు తిరస్కరణ నేపథ్యంలో బ్రిటన్, స్వీడన్ లు తమ అంతర్జాతీయ న్యాయ బాధ్యతలను పాటించి తనను విడుదల చేయాలనీ అసాంజే ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. రెండవ సారి కూడా బ్రిటన్ అప్పీలు తిరస్కరణకు గురయినందున ఐరాస తీర్పును తిరగదోడాలన్న బ్రిటన్ ప్రయత్నాలు ఇక ముగిసినట్లే అని అయన పేర్కొన్నాడు.  

అత్యాచారం కేసుకు సంబంధించి కొద్ది నెలల క్రితం స్వీడన్ పోలీసులు లండన్ వఛ్చి అసాంజేను విచారించి వెళ్లారు. గతంలో ఈ విధంగా లండన్ వచ్చి విచారించేందుకు స్వీడన్ పోలీసులు, ప్రభుత్వం ససేమిరా నిరాకరించారు. స్వీడన్ రావలసిందేనని పట్టుబట్టారు. ఈ నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో స్వీడన్ దిగిరాక తప్ప లేదు. 

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వికీలీక్స్ ఎడిటర్ లండన్ లో ఒక ఎంబసీలో 4 సంవత్సరాలుగా బందీగా పడి ఉండడం, ఏళ్ళ తరబడి సూర్యరశ్మి సోకక అనారోగ్యానికి గురి కావడం… ఇవన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కారణాలుగా నిలిచాయి. మానవ హక్కుల విషయంలో ప్రపంచానికి హితబోధలు చేసే లండన్, స్టాక్ హోమ్ లు తామే మానవ హక్కుల అణచివేతదారులుగా ప్రపంచం ముందు దోషులుగా నిలబడవలసి పరిస్ధితి ఏర్పడింది. 

మరింత అప్రతిష్ట మూటగట్టుకోక ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకడానికి ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతున్నది. కనుక అసాంజే త్వరలో విడుదల కావచ్చని పలువురు భావిస్తున్నారు.  

2 thoughts on “అసాంజే: బ్రిటన్ అప్పీలు తిరస్కరణ

  1. అసాంజేకు క్షమా బిక్ష ప్రసాదించాలని ప్రెసిడెంట్ ట్రంప్ (ఎలెక్టెడ్) కు ఇప్పటికే వినతులు అందుతున్నాయి. హిల్లరీని ఆపడములో వికీలీక్స్ పాత్ర మరువరానిది. అయినా అసాంజే చేసినది అవకతవకలను బయటపెట్టడమేగా ! కాబట్టి, క్షమాభిక్ష ప్రసాదించొచ్చు అని నా అభిప్రాయం. దేశభక్తి అంటే దేశం చేసే దిక్కుమాలిన పనులన్నీ సమర్ధించడం కాదు కదా !

    అసాంజే పై మోపబడిన అభియోగం కూడా తీవ్రమైనది కాదు. స్వీడన్ చట్టాల ప్రకారం అది అత్యాచారమే అయినప్పటికి, అది అంత తీవ్రమైనది కాదు. (కండోం వాడకుండా శృంగారములో పాల్గొనడం). స్వీడనులో ఉన్న ఇటువంటి అతివాద చట్టాలవల్లనే, ఆ దేశం “రేప్ క్యాపిటల్ ఆఫ్ యూరోప్” గా పేరు తెచ్చుకుంది. ప్రపంచం మొత్తం చూసుకున్నా అత్యాచారాల విషయములో స్వీడన్ మొదటి మూడు స్థానాలలో ఉంటుంది.

    కేవలం, అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని రహస్యాలు బయట పెట్టాడన్న కారణంగా అసాంజేను ఇటువంటి కేసులో ఇరికించారన్నది జగమెరిగిన సత్యం. చేయని తప్పుకు ఆయన ఇదివరకే శిక్ష కూడా అనుభవించేశాడు. ఇప్పటికైనా అతన్ని విడుదల చేసి, క్షమా భిక్ష ప్రసాదించే దిష అమెరిచా అడుగులు వేస్తే బావుంటుంది. కనీసం, ట్రంప్ చార్జ్ తీసుకున్న తరువాతైనా ఈ పని జరుగుతుందని ఆశిస్తున్నా !

  2. చివరకి, కాస్త కామన్ సెన్స్ ఉన్నోడు అధ్యక్షుడయ్యాడు. ట్రుంప్ రష్యాను తమ ప్రధమ శతృవు అన్న ఫీలింగును వదిలేశాడని సూచనలు అందుతున్నాయి.. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తరువాత రష్యా ఎప్పుడు అమెరికాను తమ ప్రధమ శతృవుగా భావించలేదని. రష్యాకాదు టెర్రరిజమె తమ శతృవు అని ఫీలవుతున్నాడని లీకులు అందుతున్నాయి.. కనీసం ఇప్పటికైనా ISISకి నూకలు చెల్లిపోతాయి అనుకుంటా !

    Donald Trump removes Russia from list of US defense priorities
    http://theduran.com/donald-trump-removes-russia-list-us-defense-priorities/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s