డీమానిటైజేషన్ గాలిలో కొట్టుకుపోయిన మోడీ అవినీతి?!


Kejriwal showing documents in Delhi Assembly

Kejriwal showing documents in Delhi Assembly

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు లేఖ రాసిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించిన సంగతి ఎంతమందికి తెలుసు?

ప్రశాంత్ భూషణ్ ఎవరో తెలియనివారు / గుర్తులేనివారు ఓసారి 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కుంభకోణాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడానికి ప్రధాన కారకుడే ప్రశాంత భూషణ్. ఈయన ఏ‌ఏ‌పిలో ఉండేవాడు. కేజ్రివాల్ తో విభేదాల వల్ల ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో మరో సంస్ధను స్ధాపించాడు.

కాంగ్రెస్ నేతల కుంభకోణాలు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ద్వారా వెల్లడి అయినప్పటికీ వాటిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రశాంత్ భూషణ్ నేతృత్వం లోని PIL సంస్ధ కేసు వేసినాకనే కదలిక వచ్చింది.

కేసులో ఛార్జి షీటు వేయడానికి సిబిఐ ఎడతెగని తాత్సారం చేస్తున్నప్పుడు కూడా ప్రశాంత్ భూషణ్ వదలకుండా వెంటబడి సుప్రీం కోర్టును పదే పదే ఆశ్రయించి దర్యాప్తు వేగవంతం కావడానికి దోహదం చేశాడు.

సహారా కంపెనీ,  ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్… ఈ రెండు కంపెనీలు మోడీకి లంచం ఇచ్చి పనులు జరిపించుకున్న విషయం ఇంకమ్ టాక్స్ అధికారుల సాధారణ రైడింగ్ లో తెలిసి వచ్చింది.

ఈ అంశాలు కేంద్ర రాజ్యాంగ సంస్ధలైన సి‌బి‌ఐ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సి‌బి‌డి‌టి) సంస్ధల ముందుకు వచ్చాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సి‌వి‌సి), బ్లాక్ మనీపై మోడి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐ‌టి) ముందుకు కూడా వచ్చాయి.

నవంబర్ 8 తేదీన ప్రధాని మోడి ‘డీమానిటైజేషన్’ ప్రకటన చేయడానికి సరిగ్గా రెండు వారాల ముందు అక్టోబర్ 25, 2016 తేదీన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల నేతృత్వం లోని స్వరాజ్ అభియాన్ కేంద్ర దర్యాప్తు సంస్ధల దృష్టికి తెచ్చింది.

2014 నవంబరులో ఆదాయ పన్ను శాఖ సహారా గ్రూపు కంపెనీల కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 30, 2013 నుండి ఫిబ్రవరి 21, 2014 వరకు అనేక మంది రాజకీయ నాయకులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఈ డైరీల్లో లభించాయి.

ముడుపులు అందుకున్న వారిలో ‘మోడి జీ’ కూడా ఒకరు. అప్పటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. ‘మోడి జీ’ అనే వ్యక్తికి ఈ నాలుగు నెలల కాలంలో 8 సార్లు ముడుపులు ముట్టాయని డైరీల ఆధారంగా తయారు చేసిన నివేదికలో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో ‘జైస్వాల్ జీ’ అనే వ్యక్తి ద్వారా ‘మోడి జీ’ కి ముడుపులు ముట్టాయని సదరు నివేదిక నిర్ధారించింది. 8 విడతలుగా సహారా కంపెనీ ‘మోడీ జీ’ కి రు 40.10 కోట్లు ముట్టజెప్పిందని పేర్కొంది.

ఈ కాలంలోనే మోడి బి‌జే‌పి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా తన స్ధానాన్ని ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే సహారా ముడుపులు అందుకున్నవారిలో “సి‌ఎం ఎం‌పి” (మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి), “సి‌ఎం ఛత్తీస్ ఘర్”, “సి‌ఎం ఢిల్లీ” లు కూడా ఉన్నారు.

ఈ అంశాలన్నింటిని ప్రశాంత్ భూషణ్ కేంద్ర దర్యాప్తు, విచారణ సంస్ధలకు రాసిన లేఖలో వివరంగా పేర్కొన్నారు.

ఒక్క సహారా కంపెనీ నుండి మాత్రమే కాదు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి కూడా మోడికి ముడుపులు అందిన సంగతిని ప్రశాంత్ భూషణ్ వెలుగులోకి తెచ్చారు.

అక్టోబర్ 2013లో ఆదాయ పన్ను శాఖ బిర్లా కంపెనీ కార్యాలయాలపై దాడి చేసినపుడు స్వాధీనం చేసుకున్న రికార్డులలో కూడా మోడి పేరు కనిపించింది. “సి‌ఎం గుజరాత్” కు రు 25 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్లు రికార్డుల్లో పొందుపరిచారు.

ఈ రికార్డుల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు బిర్లా కంపెనీ అధికారులను విచారించింది. “సి‌ఎం గుజరాత్” అంటే పూర్తి రూపం “గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్” అని ఆదిత్య బిర్లా కంపెనీ అధికారులు బుకాయించారు. అతకని అబద్ధం చెప్పడం ద్వారా గుజరాత్ ముఖ్యమంత్రిని వారు వెనకేసుకు వచ్చారన్నది స్పష్టమే. లేకుంటే “సి‌ఎం గుజరాత్” కీ, వాళ్ళు చెప్పిన పూర్తి రూపానికి అసలు సాపత్యం ఎక్కడ ఉంది?

అయితే సహారా కంపెనీ అధికారులు మాత్రం అలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఇంత స్పష్టమైన ఆధారాలు దొరికినప్పటికీ ఆదాయ పన్ను అధికారులు గానీ, సి‌బి‌ఐ గానీ దర్యాప్తు జరిపేందుకు ఎలాంటి చొరవా చేయలేదు. దర్యాప్తు జరిపి న్యాయ చర్యలకు ఉపక్రమించవలసి ఉండగా అందుకు పూనుకోలేదు.

అందుకు తగిన ఫలితం ఆదాయ పన్ను శాఖ అధికారికి లభించింది. సహారా, ఆదిత్య బిర్లా కంపెనీల ముడుపులపై విచారణ చేసిన బృందానికి నాయకత్వం వహించిన అధికారి కే బి చౌదరి జూన్ 2015లో సి‌వి‌సి అధిపతిగా నియమితుడయ్యాడు.

ప్రశాంత్ భూషణ్ ఈ నియామకాన్ని సవాలు చేశాడు. సహారా, ఆదిత్య బిర్లా ముడుపుల వ్యవహారాన్ని మొదటి నుండి ఫాలో అవుతూ వచ్చిన ప్రశాంత్ భూషణ్ దఫదఫాలుగా కేంద్ర దర్యాప్తు సంస్ధలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చాడు. అందులో భాగంగానే అక్టోబర్ 25, 2016 తేదీన ఆయన ముడుపుల వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకుని విచారణ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశాడు.

కానీ దర్యాప్తు సంస్ధలు బదులు ఇవ్వలేదు. నవంబర్ 8 తేదీన ఆయన మరోసారి లేఖ రాశారు. ఆ రోజే ప్రధాన మంత్రి మోడి మొట్ట మొదటిసారిగా తలవని తలంపుగా దూరదర్శన్ లో ప్రత్యక్షమై జాతినుద్దేశించి ప్రసంగించారు. అధికారిక ప్రకటన కోసం ఒక టి‌వి చానెల్ లో ప్రధాని మోడి ప్రసంగించడం అదే మొదటిసారి. (ఆయనకు ఇష్టమైన ఫేస్ బుక్, ట్విట్టర్ మీడియాలు తన చరిత్రాత్మక చర్యకు సరైన వేదిక కాదని ఆయన భావించారన్నట్లు!)

భూషణ్ ప్రకారం: అక్టోబర్ 25 తేదీన తాను లేఖ ద్వారా మోడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్ధల దృష్టికి తేవడం, అనంతరం నవంబర్ 8 తేదీన ఫాలో అప్ లేఖ రాయడం.. ఇవన్నీ అధికారిక చానెళ్ల ద్వారా ఆర్ధిక మంత్రిత్వ శాఖ దృష్టికి, ఇతర ప్రభుత్వ సంస్ధల దృష్టికి వెళ్ళాయి. దాని ఫలితంగానే తన అవినీతిపై చెలరేగనున్న దుమారాన్ని ముందుగానే కవర్ చేసుకోవడానికి హడావుడిగా, ఆర్భాటంగా, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ప్రధాన మంత్రి మోడి ‘నోట్ల రద్దు’ ప్రకటించారు.

బి‌జే‌పి ఎం‌పి, సుప్రీం కోర్టు క్రిమినల్ లాయర్ రామ్ జేఠ్మలాని కూడా “నవంబర్ 8 నాటి ప్రకటన అతి పెద్ద కవరప్ అని చెప్పడానికి అవసరమైన అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి” అని ఫ్రంట్ లైన్ పత్రికతో మాట్లాడుతూ చెప్పారు.

రామ్ జెఠ్మలానీ నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వారం రోజులకు నవంబర్ 15 తేదీన ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. నల్ల డబ్బు వెలికి తెస్తానని ఇచ్చిన హామీని బి‌జే‌పి ప్రభుత్వం అడ్డంగా ఉల్లంఘించిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు తాను త్వరలో న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు.

“విదేశాల్లో దాచిన నల్ల డబ్బుని ట్రాక్ చేసి వెనక్కి తెచ్చేందుకు ప్రక్రియను ప్రారంభిస్తామని బి‌జే‌పి హామీ ఇచ్చింది. ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఆ వాగ్దానం చేసింది. అందుకోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉనికిలో ఉన్న చట్టాలకు తగిన సవరణలు తెస్తానని చెప్పింది. కానీ గత రెండున్నర సం.లలో బి‌జే‌పి ప్రభుత్వం యూ‌పి‌ఏ అనుసరించిన పద్ధతులనే పాటించింది.

“జర్మన్, స్విస్ బ్యాంకులు తమ వద్ద ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు అందించేందుకు సంసిద్ధత తెలిపాయి. కానీ ఆ పేర్లు ఇండియాకు రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ చర్యలు తీసుకున్నది. బి‌జే‌పి కూడా అదే పద్ధతి, ఎత్తుగడలు పాటిస్తోంది. చివరికి ‘నల్ల డబ్బు వెనక్కి తేవడంపై ఇచ్చిన హామీ కేవలం చునావి జుమ్లా -ఎలక్షన్ ట్రిక్- మాత్రమే’ అని అమిత్ షా చెప్పిందే నిజం అయింది” అని రామ్ జేఠ్మలాని చెప్పారని ఫ్రంట్ లైన్ పత్రిక తెలిపింది.

కనుక డీమానిటైజేషన్ చర్యకు మోడిని, బి‌జే‌పి ప్రభుత్వాన్ని ప్రేరేపించిన తక్షణ కారణం మోడి పైన త్వరలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రానుండడమే అని ప్రశాంత్ భూషణ్ వెల్లడి ద్వారా అర్ధం అవుతున్నది.

‘డీమానిటైజేషన్ చర్య’ ఎలాగూ 2011 నుండి వాయిదా పడుతూ వస్తున్నదే. బహుళజాతి కంపెనీలకు హామీ ఇచ్చిన ‘డిజిటైజేషన్’ సంస్కరణ కోసమే ఆధార్ కార్డ్ కు చట్టబద్ధత, జన్ ధన్, ఈ-కామర్స్ రిటైల్ అమ్మకాలకు 100% అనుమతి తదితర సంస్కరణ చర్యలను మోడి ప్రభుత్వం అమలు చేసింది. డీమానిటైజేషన్ వల్ల కలిగే ఇబ్బందుల దృష్ట్యా వెనకా ముందూ ఆలోచిస్తున్న క్రమంలో ప్రశాంత్ భూషణ్ తన లేఖల ద్వారా భవిష్యత్తు చూపించాడు.

గొప్ప అవినీతి వ్యతిరేక నేతగా మోడి చుట్టూ ఒక మాయ సృష్టించబడి ఉన్నది. ఈ నేపధ్యంలో ఆయనపై అవినీతి ఆరోపణలు, సాక్ష్యాలతో సహా, వెల్లడి అయితే ఏమన్నా ఉందా? జనానికి ఒక్క మోడీ పైనే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్ధ పైనే నమ్మకం కోల్పోయే పరిస్ధితి దాపురిస్తుంది. అటువంటి సంచలన పరిణామాలకు దారితీసే ఆరోపణలకు అంతే సంచలనంతో కూడిన ‘ప్రతి చర్య’ (counter act) కావాలి. ఆ సమయంలో ‘డీమానిటైజేషన్’ ఏలికల ముందు గొప్ప వరమై ప్రత్యక్షం అయింది.

ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే, జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, ఓట్లు పోయే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, ఆ చర్య పర్యవసానాలు ఏమిటో స్పష్టమైన అవగాహన అంటూ తమకే ఏమీ లేకపోయినప్పటికీ ‘డీమానిటైజేషన్’ ను ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ప్రశాంత్ భూషణ్ వెల్లడి చేసిన సమాచారం తెలియజేస్తున్నది.

ప్రశాంత్ భూషణ్ వెల్లడి చేసిన సమాచారాన్ని ఎకనమిక్ అండ్ పోలిటికల్ వీక్లీ (ఈ‌పి‌డబల్యూ) పత్రిక నవంబర్ 19 సంచికలో సవివరంగా ప్రచురించింది. కొన్ని పత్రాలను కూడా ప్రచురించింది. ఆ పత్రాలను కింద చూడవచ్చు. ఈ పత్రాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీమానిటైజేషన్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ డీమానిటైజేషన్ సంరంభంలో ఇది ప్రజల దృష్టిని ఆకర్షించలేదు.

ప్రశాంత్ భూషణ్ ఇంతటితో సరిపెట్టే రకం కాదు. మునుముందు మరిన్ని చర్యలకు మరింత పట్టుదలతో, కట్టుదిట్టంగా మోడి అవినీతిపై చర్యల కోసం ఆయన పని చేస్తారు. బహుశా డీమానిటైజేషన్ సంరంభం ముగిశాక, దాని వల్ల జనానికి వీసమెత్తు కూడా లాభం లేదని జనానికి అర్ధం అయ్యాక ఆయన తన పనిని వేగవంతం చేస్తారేమో! అయితే ఆయన ప్రయత్నాలు సఫలం కాకుండా చూసే శక్తి, అధికారం ప్రత్యర్ధులకు ఉన్నందున ఏ ఫలితమూ లేకుండానే భూషణ్ ప్రయత్నాలు ముగిసిపోవచ్చు. ఎందుకంటే డైరీలో ఎంట్రీలు ఉంటే సరిపోదనీ, దానికి తగినట్లుగా బలమైన సాక్షాలను దర్యాప్తు సంస్ధలు సేకరించాలని హావాలా కేసులో సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది కనుక.

2 thoughts on “డీమానిటైజేషన్ గాలిలో కొట్టుకుపోయిన మోడీ అవినీతి?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s