వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!


crisil

ఇది ‘జైట్లీ నిజం కక్కేశారు’ ఆర్టికల్ కింద వెన్నెల గారు చేసిన వ్యాఖ్య!

*********

—వెన్నెల

బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్‌ 16- నవంబర్‌ 11 మధ్య కాలానికి ఆర్‌బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్‌ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.

పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్ కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది.

*********

పత్రికల్లో, టి.వి చానెళ్లలో, సమావేశాల్లో, అధికారిక ప్రకటనల్లో ప్రధాన మంత్రి, మంత్రులు, బి‌జే‌పి నేతలు, ‘భక్త’ పండితులు తన్మయంగా చేస్తున్న వాదనల్లో ఒకటి: డీమానిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గిపోతాయి అని.

ఆర్‌బి‌ఐ తన పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేటు తగ్గించాలంటే దేశ ప్రజలు, వాళ్ళు రోజు కూలీలు, రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న-మధ్య పరిశ్రమలు, వర్తకులు… ఇలా బలహీన, చిన్న మధ్య తరహా ఆదాయ వర్గాల వాళ్ళు తమ తమ రోజువారీ అవసరాలను కూడా వాయిదా వేసుకుని, తిండి గింజలు, వెచ్చాలు కొనడం ఆపేసి బ్యాంకుల ముందు క్యూలలో నిలబడి తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో జమ చేయాలన్నమాట!

ఈ విధంగా కష్ట జీవులు తమ అవసరాలు మానుకుని బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచితే ఆ డిపాజిట్ల అండతో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే టాటా, అంబానీలు, బిర్లా ఇత్యాది వర్గాలు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఫ్యాక్టరీలు పెట్టి జనానికి ఉద్యాగాలు ఇచ్చేస్తారట. కారు లోన్లకు వడ్డీ తగ్గుతుందట. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గిపోతాయట. ఇక అందరూ స్ధలాలు కొనుక్కుని ఇళ్ళు కూడా కట్టేసుకోవచ్చట.

నోట్ల చలామణి లేకపోవడంతో పనులు లేవు; షాపుల్లో అమ్మకాలు లేవు; మార్కెట్లలో సరుకు కొనేవారు లేరు; చిల్లర లేక 2000 నోటు  తీసుకునేవారు లేరు; అమ్మకాలు లేక ఉత్పత్తి పడిపోతున్నది; ఖరీఫ్ దిగుబడి అమ్మకాలు స్తంభించిపోయాయి; రబీ సాగు విత్తుబడి ఆగిపోయింది; పెళ్లిళ్లు ఆగిపోయాయి. కూతురు పెళ్లి ఆగిపోవడం తట్టుకోలేక తండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్యూల్లో నిలబడి నిలబడీ నీరసించి ఆసుపత్రుల పాలవుతున్నారు; కొండొకచో గుండెలు ఆగిపోతున్నాయి.

జనం ఇన్ని కష్టాలు మొరపెట్టుకుంటుంటే ‘ఒక్క 50 రోజులు ఓపిక పట్టండి. వడ్డీ రేట్లు తగ్గుతాయి, కారు కొనుగోలుకు అప్పు చేయొచ్చు, ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు… అని ఊరిస్తున్నారే, కాస్తన్నా బుద్ధుందాండీ! జనం అవసరాల పైన మరీ ఇంత క్రూరంగా జోక్ లు వేయొచ్చాండి?!

చివరికి చావు కబురు చల్లగా చెబుతున్నారు, “వడ్డీ రేట్లు తగ్గడం కష్టమే” అని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s