క్యాష్ తగినంత లేదు, మరిన్ని రోజులు తిప్పలే -బ్యాంకులు


 

“నోట్లు  తగినంతగా నిల్వ ఉన్నాయి. జనం ఆందోళన చెందవద్దు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం” అని ఓ పక్క ప్రధాని, ఆర్ధిక మంత్రి, బ్యూరోక్రాట్ అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. “క్యూలు తగ్గిపోయాయి, ఇక పరిస్ధితి మెరుగుపడినట్లే” అని ఆర్ధిక మంత్రి సంతోషం కూడా ప్రకటించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని పత్రికల సర్వేలు తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకులు కూడా అదే చెబుతున్నాయి.

అనేక చోట్ల బ్యాంకులు, ఎటిఎం లలో కొత్త కరెన్సీ నోట్ల రాబడి ఎంత మాత్రం మెరుగుపడలేదు. మెరుగుదల ఏమన్నా ఉంటే అది మంత్రుల మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది తప్ప వాస్తవంగా ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా ప్రజల ఇబ్బందులు కొనసాగుతూ పోతున్నాయి తప్ప తగ్గడం లేదు. డిజిటైజేషన్ వైపు జనాన్ని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో కరెన్సీ సరఫరాను మెరుగుపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. 

కరెన్సీ కొరతకు ప్రధానంగా రెండు కారణాలను బ్యాంకులు చూపుతున్నాయి. ఒకటి: కొత్త కరెన్సీ తీసుకున్న జనం దానిని ఖర్చు చేయడం లేదు. దానితో అది చలామణిలోకి రావడం లేదు. రెండు: బ్యాంకులు కరెన్సీని నిల్వ చేసే కరెన్సీ చెస్ట్ లకు RBI నుండి కొత్త నోట్ల సరఫరా డిమాండ్ కు తగినంతగా లేదు. డిమాండ్ లో కనీసం సగం కూడా కొత్త కరెన్సీ సరఫరా కావడం లేదని, దానితో ప్రజలకు సమాధానం చెప్పలేక షట్టర్లు మూసేస్తున్నామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

“నోట్లు తగినంతగా సరఫరా చేస్తామని RBI హామీకి ఇస్తున్నప్పటికీ కరెన్సీ చెస్ట్ ల నుండి బ్యాంకులకు సరఫరా చాలా తక్కువగానే ఉన్నది. రానున్న కొద్ది రోజుల్లో అయినా సరఫరా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం” అని ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అధికారి చెప్పారని ద హిందూ తెలిపింది. “సరఫరా, చలామణిలు లేక కరెన్సీ సరఫరా కంటే డిమాండ్ చాల ఎక్కువగా ఉన్నది” సదరు బ్యాంకు అధికారి చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల్లో కరెన్సీ చెస్ట్ లు బ్యాంకులకు దూరంగా ఉంటాయి. దానితో బ్యాంకులు రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని బ్యాంకు బ్రాంచీలు పక్క బ్యాంకుల నుండి కరెన్సీ సర్దుబాటు చేసుకుంటున్నాయి. దానితో కాస్తో కూస్తో సరఫరా ఉన్న చోట్ల కూడా కరెన్సీ త్వరలోనే నిండుకుంటోంది. ICICI బ్యాంకు తగిన సరఫరా లేక ఈ విధంగా ఇతర బ్యాంకుల నుండి క్యాష్ సర్దుబాటు చేసుకుంటున్నాయి. 

“మాకు రు 100 నోట్లు, రు.10 నాణేలు కేవలం రు 2 లక్షలు మాత్రమే ఇచ్చారు. అవి పంపిణి కావడానికి ఎంతోసేపు పట్టలేదు. మా బ్రాంచిలో సగటు డిపాజిట్ మొత్తం రు 50 లక్షలు. అలాంటిది మేము కస్టమర్లకు ఏమని సమాధానం చెప్పాలి?” అని హైద్రాబాద్ లో ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ప్రశ్నించారని పత్రిక తెలిపింది. ఇది కార్పొరేట్ నగరమైన హైద్రాబాద్ లోని పరిస్ధితి. ఇక చిన్న పట్టణాలు, గ్రామాల సంగతి ఊహించుకోవలసిందే.     

జనం నుండి ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నదంటే కరెన్సీ లేని చోట షట్టర్లు దించేయాలని ఆంధ్ర బ్యాంకు అధికారులు తమ బ్రంచి కార్యాలయాలకు అనధికారిక ఆదేశాలు ఇఛ్చి చేతులు దులుపుకున్నారు. షట్టర్ మూసేస్తే పరిణామాలు ఎదుర్కోవలసిందే బ్రంచి కార్యాలయాల సిబ్బంది తప్ప ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రిలు కాదు. బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా కాదు. RBI అధికారులు అసలే కాదు. ‘గంటకు గంటకు పరిస్ధితి సమీక్షించి తగిన ఆదేశాలు ఇస్తున్నామని RBI, ప్రధాని, మంత్రుల చెబుతున్నారు. కరెన్సీ సరఫరా లేకుండా ఎన్ని సమీక్షలు చేస్తే మాత్రం, ఎన్ని ఆదేశాలు ఇస్తే మాత్రం ఏమిటి లాభం? 

ఇలా షట్టర్లు మూసే కార్యక్రమాన్ని ఇతర బ్యాంకులు కూడా చేపట్టినట్లు తమ పరిశీలనలో తెలిసిందని ద హిందూ పత్రిక తెలిపింది. ఇది వాస్తవం కూడా ఇండియా టుడే ఛానెల్ కెమెరాలతో ఉత్తర ప్రదేశ్ లో వాస్తవ పరిస్ధితిని రికార్డు చేసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ మోడల్ విలేజ్ గా ప్రకటించిన గ్రామం లోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు షట్టర్ మూసేసిన దృశ్యాన్ని ఛానెల్ చూపింది. బ్యాంకు బైట అనేకమంది గ్రామస్ధులు కరెన్సీ కోసం నిలబడి ఉండగానే, పని వేలల్లోనే బ్యాంకు సిబ్బంది షట్టర్ మూసేసారు. ‘ఏ రూల్ ప్రకారం షట్టర్ మూసేసారు?’ అని అడిగితే లోపల కూడా అనేకమంది జనం ఉన్నారని బైట ఉన్న వాళ్ళు కూడా లోపలకు వచ్ఛే చోటు లేదని అందుకే గత్యంతరం లేక షట్టర్ ముసామని సిబ్బంది బదులు ఇచ్చారు.

పోనీ ఎటిఎంల వద్ద పరిస్ధితి మెరుగ్గా ఉందా అంటే అదేమీ లేదు. అసలు అనేక ఎటిఎం లు తెరుచుకోవడమే లేదు. ప్రధాని డిమానిటైజేషన్ ప్రకటించినప్పటి నుండి అసలు ఒక్కసారి కూడా కరెన్సీ ఇవ్వని ఎటిఎంలు నగరాలూ, పట్టణాల్లోనే అనేకం ఉన్నాయి. ఇక గ్రామాల గోడు వైన్ నాధుడే లేడు. 

RBI వద్ద డిసెంబర్ 15 వరకు కరెన్సీ మార్పిడి కొనసాగుతుందని ప్రకటించడంతో RBI కార్యాలయాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు. ప్రజల దృష్టి ఇప్పుడు RBI కార్యాలయాలపై కేంద్రీకృతం అయింది. ఘోరం ఏమిటంటే పోలీసులు క్యూ లైన్లలో నిలబడ్డ పిల్లలను తరిమివేయడం. పెద్దలు క్యూ లైన్ల నిలబడి నిలబడి, కాఫీకి తాగడానికో, టిఫిన్ లేదా భోజనం చేయడానికో కొద్ది సేపు పిల్లల్ని క్యూ లైన్ లో నిలబడితే వాళ్ళని పోలీసులు బెదరగొట్టి తరిమివేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. RBI వద్ద కేవలం 2000 మాత్రమే మార్చుకోవచ్చు అని చెప్పినా జనం తొక్కిడి తగ్గడం లేదు. 

కరెన్సీ కొరత మరింత కాలం కొనసాగుతుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల సంఘం AIBEA ప్రకారం ప్రభుత్వ నోట్ల ముద్రణ యంత్రాల సామర్ధ్యం నెలకు 300 కోట్ల నోట్లు మాత్రమే. అది కూడా పెద్ద నోట్ల వరకే. డిమానిటైజేషన్ కు ముందు బ్యాంకుల్లో నోట్ల విత్ డ్రా నెలకు రు 1000 నోట్లు 622 కోట్లు కాగా, రు 500 నోట్లు నెలకు 1530 కోట్లు ఉండేవి. బ్యాంకుల నుండి విత్ డ్రా చేయడం కనుక ఇది నల్ల డబ్బు లెక్క కాదని గ్రహించాలి. ఈ నేపథ్యంలో కరెన్సీ కొరత ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు. 

అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వం లక్ష్యం కరెన్సీ నోట్ల స్ధానంలో డిజిటైజేషన్ ని ప్రవేశపెట్టడం. కనుక నోట్ల సరఫరాను మెరుగుపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదని ఆశించలేము. అందుకు బదులుగా డిజిటైజేషన్ వైపుకి మళ్లాలని ప్రచారం చేయటానికే మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించింది. ఆర్ధిక సంస్కరణలతో భాగంగా చేపట్టిన డిమానిటైజేషన్ FDI ల ప్రయోజనాలకు ఉద్దేశించింది మాత్రమే. బ్లాక్ మనీ, దొంగ నోట్లు, ఉగ్రవాదం అన్నవి పైకి తొడిగిన ముసుగు. ఈ సంగతి ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పగల చొరవ ఏ రాజకీయ పార్టీ తీసుకోకపోవడం వల్ల జనం ఇంకా మోడీ మాటల భ్రమల్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నది.

3 thoughts on “క్యాష్ తగినంత లేదు, మరిన్ని రోజులు తిప్పలే -బ్యాంకులు

  1. డిజిటిలైజేషన్ ప్రక్రియను మోదీ కన్నా త్వరగా,ఉబలాటంగా అమలుజరిపే ప్రక్రియను బాబుగారు నెత్తినవేసుకున్నారనిపిస్తుంది,ఈ రోజు మా ఊర్లో ప్రచారంద్వారా జన్ ధన్ కార్డు దారులందరికీ,ద్వాక్రా దారులకూ,పించను దారులకు మొ,, వారందరికీ రూపేకార్డులను అందించాలని,దానిని మెప్మా అధికారులకు తగిన శిక్షణ ఇచ్చమని,వారిని సంప్రదించాలని మునిసిపాలిటీ పరిదిలో దండోరా(ప్రచార రధం/వాహనం ద్వారా) వేయిస్తున్నారు.

  2. గొర్రె బొచ్చు గొరిగి, దానితో దుప్పటి చేసి, దాన్నే గొర్రెకి కప్పే జాదూగాడు ఎవడో తెలుసా? 85% సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీని రద్దు చేసి, ఆ డబ్బుతోనే ప్రతి వ్యక్తి అకౌంట్‌లో పదిహేను లక్షలు డిపాజిట్ చెయ్యాలనుకుంటున్న నరేంద్ర మోదీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s