నోట్ల రద్దు: రాజకీయ లక్షణం తప్ప సామాన్యుడి రక్షణం కాదు


 

(గత టపా కింద తెలుగు టెకీ గారు రాసిన వ్యాఖ్య ఇది. చెతుర్లతో, విరుపులతో, క్లుప్తంగానే అయినా వివరంగా రాసిన తీరు ప్రత్యేకంగా ఉన్నందున టపాగా మార్చి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)  

*********

రచన: తెలుగు టెకీ / శివ రామ 

పెద్ద నోట్ల చలామణి ప్రతిష్టంభన ప్రభుత్వం తమ పాలనను ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో పదిలపరచుకునే నేపధ్యంలో వ్యాపార దిగ్గజాలతో అంతర్గత ఒడంబడికల మేలు కలయిక, సామాన్యుల పరిధిలో కీడు ప్రక్రియ. 

ఈ చర్య అమలుకు ముందు మాజీ ఆర్.బీ.ఐ. గవర్నరు ఉద్వాసన బహుశ అభిప్రాయబేధాల పర్యవసానం. లోగడ రిలయన్స్ సంస్థలో అధికారిక హోదాలో పనిచేసిన సదరు వ్యక్తికి ప్రస్తుత ఆర్.బీ.ఐ గవర్నర్ గిరీని అప్పగించి నల్లధనం రూపుమాపు సంస్కరణ మాటున బడా వ్యాపారవేత్తలను గజారోహణంతో  ఊరేగించి సామన్యుల పీచమణిచారు. 

ప్రజల శ్రేయస్సును కోరే ప్రభుత్వం వారి వెసులుబాటు ప్రాధాన్యత రీతిలో తగిన  మిగులు దిశగా చిన్న నోట్ల ముద్రణ కావించి, బ్యాంకుల లావాదేవిలకు పటిష్టమైన చర్యలను మనుగడలోకి తీసుకుని సిద్ధపడిన పిదప ప్రకటన చేయాలి. 

కాని ముందుగా రాజకీయ శ్రేయోభిలాషులకు ఉప్పు అందించి సామాన్య ఓటర్లయిన ప్రజలను ముప్పుతిప్పలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కుట్రలు కుతంత్రాలు లేని స్వఛ్చ రాజకీయం ఈ కలియుగానికే అతీతం. 

జాతీయ బ్యాంకుల  కార్యకలాపాల సమీక్షలో ఎప్పుడూ ఎగవేతదారుల పెద్దమొత్తాలను రాని బాకీల ఖాతాకు బదలాయించి వారిని బడా బాబులుగా మార్చి నల్లధన సమీకరణకు మార్గం సుగమం చేసింది మారే పంచవర్ష రాజకీయపాలనలు లేదా కొన్ని సుస్థిర రాజకీయ ప్రభుత్వాలు. 

దాసరి తప్పు దండంతో సరి అనే నానుడిలో ఒకరి మీద ఒకరు నిందారోపణలుతో చట్టసభల గందరగోళాలో సాంప్రదాయాలను పక్కదారులు పట్టించి న్యాయ వ్యవస్థకు కూడా అంతుపట్టని రీతిలో కాలహరణం చేస్తున్నారు.

ఒక తెలుగు ముఖ్యమంత్రి తన సంస్థ షేర్లను ఈ విప్లవాత్మక చర్యకు కొద్దిముందుగా విక్రయించడంలోని ఆంతర్యం మీరే గ్రహించాలి. పెద్దనోట్ల బడబాబులు ఒకరైన బ్యాంకుల ముందు లేదా ఏ.టి.ఎమ్.ల ముందు బారులు తీర్చి నుంచున్నారా? 

మధ్యతరగతి, వెనకబడిన ప్రజల ఆక్రోశాలను చూసి స్పందించని బ్యాంకు కార్యకాలాపాలు ఎంత దిజారుడుస్థాయిలో వున్నాయో వారి వ్యర్ధ యత్నాలు చెబుతాయి. నగదు లేదనే గోడ పత్రికల అంటింపు, అందుబాటులో లేని సాంకేతిక ప్రక్రియల పట్టింపు, లంచ్ సమయంలో సిబ్బంది మూకుమ్మడిగా వెళ్ళిపోవడం లాంటి క్రియలతో  ”వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చింద”నే రీతిలో సామెతను తెగ మేసారు. అందోళన తారాస్థాయికి చేరుకునే సమయంలో షట్టర్ల మూత లేదా నగదు కోతతో ఏ.టి.ఎమ్ ల మూత. 

ఎప్పుడో భవిష్యత్తులో జరిగే అద్భుతాలకు ఊహల నిచ్చెన వేసి వర్తమానంలోని సామాన్యులను కష్టాల దిగంతాలకు తోసి ఏదో చేసామని చంకలు గుద్దుకోవడం రాజకీయ లక్షణం తప్ప సామాన్యుడి రక్షణం కాదు. 

ఊహలు వాస్తవం రూపం దాల్చే సమయానికి పాలనా ప్రభుత్వ నిర్ణీతకాలం ముగిసి నేటి సంస్కరణల నాయకులు ముసుగులోకి లేదా దాగుడుమూతలకు సిద్ధమవుతారు. మరొక ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతూ పబ్బం గడుపుతారు.

ప్రతిభ కోసం ప్రచార సాధనాల దుర్వినియోగంతో ప్రభుత్వం సామన్యుల ఇక్కట్ల వాస్తవాలను ఇరాకాటంలో పెట్టి తమకు తాముగా అందలమెక్కి చిందులు తొక్కుతున్నారు.

2 thoughts on “నోట్ల రద్దు: రాజకీయ లక్షణం తప్ప సామాన్యుడి రక్షణం కాదు

  1. ఉన్నపళంగా ఉన్న వలువలు ఊడదీసి (ఉన్న నోట్లు), ఇదో ఈ ‘పింకి’ చాప (2000) చుట్టుకోండి కొన్నాళ్ళు, ఆనక వేసుకోవాలి దేవతా వస్త్రాలు (డిజిటల్ కరెన్సీ- చేతికి తగలదు కదా) అని ఆదేశించినట్లుంది ప్రజా దేవుళ్ళని(ఓటరు దేవుళ్ళు). పైగా దేవతలారా దీవించండని అదేశం.
    నిజంగా నా భారతదేశ ప్రజలు దేవుళ్ళు…..

  2. అర్థక్రాంతిలో అర్ధభాగమే అర్ధంతరంగా అమలు చేయడంవల్ల అర్థక్రాంతి వ్యర్థక్రాంతి అయిందని బోకిల్ బాబుగారు బాధపడడంలో అర్థం ఉంది.

వ్యాఖ్యానించండి