సంఘటిత లూటీ, చట్టబద్ధ దోపిడీ -మౌనిబాబా గర్జన!


manmohan-singh

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గొంతు చాన్నాళ్ళకు వినబడింది. ‘మౌని బాబా’ గా ఇప్పటి ప్రధాన మంత్రి చేత పదే పదే ఎద్దేవా చేయబడిన మన్మోహన్ సింగ్ నోరు తెరవడమే కాదు, గాండ్రించారు కూడా. వయసు మీద పడిన మన్మోహన్ నిజానికి మోడి లాగా పెద్ద పెద్ద చప్పుళ్ళు చేయలేరు. ఆయన ఎంత చిన్నగా, మెల్లగా మాట్లాడినా ఆ మాటల్లో పదును ఉంటే దానిని గాండ్రింపుగా లెక్కించవచ్చు. తాటాకు చప్పుళ్ళ కంటే లక్ష్యానికి గురి చూసే నాలుగు మాటలు ఎంతో మెరుగు.

“నల్ల డబ్బు అరికట్టటానికి, దొంగ నోట్లను నివారించడానికి, ఉగ్రవాదం నియంత్రణకు తోడ్పడటానికి ఇదే మార్గం అని ప్రధాన మంత్రి చెబుతున్నారు. ఈ లక్ష్యాలతో నేను విభేదించడం లేదు. కానీ డీమానిటైజేషన్ ప్రక్రియలో శిలాశాసనాలలో లిఖించదగిన ఘోరమైన నిర్వహణా వైఫల్యం చోటు చేసుకుంది” అని రాజ్య సభలో, ప్రధాన మంత్రి మోడి సమక్షంలో మాట్లాడుతూ అన్నారు మన్మోహన్ సింగ్.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి గానే కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు. డీమానిటైజేషన్ ప్రక్రియ వాస్తవానికి ఆర్‌బి‌ఐ పరిధిలోనిది. కనుక దాని గురించి ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ ఏమన్నా చెప్పదలిస్తే తప్పనిసరిగా ఆలకించి తీరాలి.

“దేశంలో 90 శాతం ఆర్ధిక రంగం అనిశ్చిత రంగం (informal sector) లోనే ఉన్నది. 55 శాతం ప్రజలు వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నారు. రైతాంగం ప్రధానంగా కొ-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారానే ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ కో-ఆపరేటివ్ బ్యాంకులకు డబ్బు నోట్లు ఇవ్వకుండా నిరోధించారు. ప్రజలు ఎన్ని కష్టాలకు గురవుతున్నారంటే ఈ చర్యకు మద్దతుదారులు కూడా ‘సమీప కాలంలో ఇబ్బందులు ఉంటాయి కానీ దీర్ఘ కాలంలో లాభం జరుగుతుంది’ అని చెబుతున్నారు. ఈ వాదన నాకు ‘దీర్ఘ కాలంలో మనమంతా చచ్చిపోయి ఉంటాం’ (In the long run, we are all dead) అన్న జాన్ మేనార్డ్ కీన్స్ మాటల్ని గుర్తుకు తెస్తోంది.”

కదా! 50 రోజుల పాటు జనం ఓపిక పట్టాలి అని ప్రధాన మంత్రి ఎంత తేలిగ్గా చెప్పేశారు?! మన్మోహన్ చెప్పినట్లు 90 శాతం ఆర్ధిక కార్యకలాపాలు అనిశ్చిత రంగంలో జరుగుతుంటే అదంతా డబ్బు నోట్ల ద్వారానే జరుగుతోంది. నోట్లపై నమ్మకం ద్వారానే జరుగుతోంది. తాము కష్టపడితే ఇచ్చే ఒకటి రెండు నోట్లలో తమ కష్టార్జితం దాగి ఉన్నదనీ, తమ కష్టం విలువ అంతా ఆ నోటు కాగితాల్లో ఇమిడ్చారనీ కూలీలు, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు నమ్మడం వల్లనే కోట్లాది సామాన్యుల ఆర్ధిక జీవనం సాగిపోతున్నది. కానీ మోడి తీసుకున్న చర్య ఆ నోటు కాగితాలపై జనానికి ఉన్న నమ్మకాన్ని ఒక్క పెట్టున కూల్చివేసింది. వెయ్యి, 500 నోట్లకు బదులుగా ఇస్తున్న 2000 నోట్లు ఎవరూ తీసుకోని ఫలితంగా అది జేబులో ఉన్నా లేనట్లే అయిపోయింది.

ప్రజలకు బ్యాంకులో డబ్బు ఉన్నది. కానీ ఆ డబ్బు తీసి వాడుకోవడానికి వారికి అనుమతి లేదు. ఈ ఒక్కటి చాలు, చేసిన దాన్ని ఖండించడానికి. … ఈ చర్య వల్ల ఏయే ఫలితాలు ఒనగూరుతాయే ప్రభుత్వానికే తెలియదు. 50 రోజులు ఆగితే ఫలితాలు మంచివో కావో తెలుస్తాయని చెబుతున్నారు. 50 రోజులు తక్కువ కాలమే. కానీ ఆ 50 రోజులు చాలవా పేదలు వినాశనం అనుభవించడానికి” అని మన్మోహన్ తన 7 నిమిషాల ప్రసంగంలో ప్రధానిని నిలదీశారు.

డీమానిటైజేషన్ దుష్ఫలితాలను మన్మోహన్ తడుముకోకుండా ఏకరువు పెట్టారు. “ఈ స్కీంని అమలు చేసిన తీరును బట్టి చూస్తే అది వ్యవసాయ వృద్ధిని దెబ్బ తీస్తుంది. చిన్న పరిశ్రమలకు నష్టం చేస్తుంది. అనిశ్చితి రంగం కుదేలు అవుతుంది. దేశ స్ధూల దేశీయోత్పత్తి (జి‌డి‌పి) 2 శాతం తగ్గిపోతుంది. ఈ 2 శాతం అతి అంచనా కాదు సరికదా, తక్కువ అంచనా” అని మన్మోహన్ హెచ్చరించారు. ఆయన చెప్పిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి:

“నేను ప్రధాన మంత్రిని ఒకటి అడగదలుచుకున్నాను. బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసుకుని దాన్ని విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేని సంఘటన జరిగిన దేశాన్ని ఒక్కటయినా మీరు చెప్పగలరా?”

“ప్రతి రోజూ బ్యాంకింగ్ వ్యవస్ధ సరికొత్త నిబంధనలతో (రూల్స్) ముందుకు వస్తోంది. ఏయే నియమ నిబంధనల కింద జనం తమ సొమ్ముని విత్ డ్రా చేసుకోవచ్చో వివరిస్తూ రోజూ కొత్త కొత్త రూల్స్ చెబుతున్నారు. ఈ పరిస్ధితి ఆర్ధిక మంత్రి కార్యాలయాన్ని, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చెడుగా చూపిస్తుంది. ఆర్‌బి‌ఐ ఈ తరహా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చినందుకు నాకు చాలా విచారంగా ఉన్నది, ఆ విమర్శలు న్యాయమైనవి కూడా.”

తన ప్రసంగం ముగిస్తూ మన్మోహన్ సింహ గర్జన లాంటి మాటలు చెప్పడం విశేషం. “ఇది శిలా శాసనాలలో లిఖించదగ్గ పెను నిర్వహణా వైఫల్యం. ఇది సంఘటిత లూటీ మరియు చట్టబద్ధ దోపిడి.”

ఇదే మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉండగా అనేక భారీ కుంభకోణాలు జరిగాయి, వాటిలో కొన్ని బైటపడ్డాయి. వ్యక్తిగతంగా నిజాయితీ కలిగిన వ్యక్తిగా చెప్పే మన్మోహన్ తన కంటి ముందు జరిగిన భారీ అవినీతిని మాత్రం సహించి భరించారు. లంచం ఇచ్చినా నేరమే, పుచ్చుకున్నా నేరమే అని చెప్పే పాలకులు ఒక అత్యున్నత పాలకుడిగా అవినీతిని సహించి భరించడం కూడా నేరమే అని మాత్రం చెప్పరు.

అత్యంత భారీ కుంభకోణాల ప్రభుత్వానికి సారధిగా పని చేసిన మన్మోహన్ సింగ్ తన పదవీకాలం చివరిలో కుంభకోణాల విమర్శలకు బదులు ఇస్తూ “చరిత్ర నాపై దయతో తీర్పు ఇస్తుంది” అని సభలో గొప్ప నమ్మకంతో చెప్పారు. ఈ రోజు ప్రధాని మోడి తీసుకున్న అనాలోచిత, స్వయం సేవక, మొరటు చర్య ఫలితంగా మన్మోహన్ ఆనాడు వ్యక్తం చేసిన నమ్మకమే నిజం కాక తప్పలేదు. ఒకప్పుడు అనేకులు ఈసడించుకున్న మన్మోహన్ ఈ నాడు గొప్ప దార్శనికుడుగా, ప్రజా మిత్రుడుగా దర్శనం ఇస్తున్నారంటేనే మోడి చేసిన ఘనకార్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 

4 thoughts on “సంఘటిత లూటీ, చట్టబద్ధ దోపిడీ -మౌనిబాబా గర్జన!

 1. పలుకుటయే ఎరుగని అజాతశత్రువు పలికిననాడు
  ఆయన మదిలోని భావ సాగరములన్నియు ఏకమై
  గుసగుసగా ఘోషించినవి.
  ఇది సహస్ర సాగర ఘోషకు సమానం.

  జనం దిగమ్రింగిన బడబానలం సునామీ కంటే ప్రమాదం.

  ఆర్యులారా! అయిందేదో అయింది. మించిపోయినదేమీ లేదు
  తెచ్చుకున్న మంచి భావన కోల్పోకముందే, మలుపు తిప్పండి.

 2. ఒకప్పుడు అనేకులు ఈసడించుకున్న మన్మోహన్ ఈ నాడు గొప్ప దార్శనికుడుగా, ప్రజా మిత్రుడుగా దర్శనం ఇస్తున్నారంటేనే ఏమిటో అర్ధం చేసుకోవచ్చు
  సర్,దీనర్ధం ఏమిటో వివరంగా తెలుపుతారా?

 3. అన్నీ నేనే చెప్పాలా, మూల గారూ?

  మీకు పరీక్ష. దాని అర్ధం ఏమిటో మీరే కనిపెట్టి నాకు చెప్పండి.

  నేను ఎదురు చూస్తుంటాను.

 4. సర్,మన్మొహన్ గారు మోది కంటే మెరుగైనవాడిగా నిలపడానికి ప్రయత్నించాలా?
  మోదీ చెప్పిన మాయమాటలు చెప్పనవసరంలేకుండానే గద్దెనెక్కినవాడు మన్మోహన్ సింగ్ గారు.తనమొదటి హయాంలో పెద్దగా కుంభకోణాలేవీ జరగకపోవడంతో మరియూ తమ యు.పి.ఏ 1 చివరి అంకంలో కమ్యునిస్టుల మద్ధతు ఉపహరించడానికి సిద్ధపడినా తన తెగువ(?) తో యు.యెస్ తో అణు ఒప్పందానికి సిద్ధపడి మరలా యు.పి.ఏ గదెనెక్కడానికి కారణమయ్యాడు(అదికూడా మొదటిహయంలో కన్నా రెండో హయంలో అధిక స్థానాలను కాంగ్రేస్ గులుచుకోగలిగింది)
  స్వపార్టీలోనూ,మిత్రపక్షాల ద్వారానూ అవినీతికుంభకోణాలు వరుసగా బయటపడుతున్నపటీకీ సంకీర్ణ ధర్మమంటూ,అధినేత్రి సైగలకు బద్ధుడినంటూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
  ఉపాదిహామీ పధకమంటూ ఒక ప్రజోపయోగ పథకానికి శ్రీకారం చుట్టడంతప్ప మన్మొహన్ వల్ల సామాన్యులకు ఒరిగింది ఏమీలేదు.

  కానీ మోదీ పరిస్థిలి అలాకాదు,తన ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో మైనారిటీయులను ఊచకోతకోయించడంలో మౌనీబాబా గారి మౌనంకన్నా విశేషమైన పాత్ర పొషించారు.తన అనుంచరులచేత ఆధునిక బిస్మార్క్(బిస్మార్క్ నన్ను మన్నించుగాక) అనిపించుకున్నడు.ప్రత్యర్ధుల బలహీనతలే తన బలంగా ఎన్నికలలో స్వ-విపక్ష సభ్యులను అణగద్రొక్కి ప్రధాని పీఠాన్ని అదిరోహించాడు. అటు పిమ్మట కాలక్షేపపు మాటలతో కాలాన్ని గడిపి,ఒక తిక్క చర్యతో సామాన్యుల జీవితచక్రపు ఇరుసును పెకిలించీసాడు.

  నాయీ వాక్యాలలో మన్మొహన్,మోదీ కన్న ఏవిధంగా శ్రేష్ఠుడో అర్ధవంతంగా వివరించడంలో నేను విఫలమయ్యాననుకొంటున్నాను, ఇప్పటికైనా మీరు విషయాని వివరిస్తారని ఆశిస్తున్నాను!?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s