నోట్ల రద్దు వల్ల టాటా, బిర్లా, మహేంద్ర.. ఈ మూడు బడా పారిశ్రామిక గ్రూపులకు 9 బిలియన్ డాలర్లు క్షవరం అయిపొయింది. ఈ క్షవరం నల్ల ధనం రద్దు కావడం వల్ల జరిగిన నష్టం కాదు. నోట్ల రద్దు దరిమిలా జీడీపీ పడిపోతుందనీ, అమ్మకాలు తగ్గిపోతాయనీ… ఇత్యాది భయాలతో షేర్ హోల్డర్లు ఆ కంపెనీల లోని షేర్లను అమ్మేయటం వలన సంభవించిన నష్టం.
ప్రధాన మంత్రి మోడీ డీమానిటైజేషన్ ప్రకటించిన దగ్గరినుండి షేర్ల సూచి సెన్సెక్స్ 7 శాతం నష్టాన్ని చవి చూసింది. ప్రధాన పారిశ్రామిక గ్రూపులు అన్ని ఎంతో కొంత నష్టాన్ని చవి చూసినప్పటికీ టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులు అత్యధిక మొత్తంలో మార్కెట్ కేపిటలైజేషన్ విలువను కోల్పోయాయి. కాగా అంబానీ గ్రూపు మాత్రం కాస్త నష్టంతో బయటపడటం విశేషం.
బడా పారిశ్రామిక గ్రూపులు ఎదుర్కొన్న నష్టం కేవలం ఆ గ్రూపుల ప్రమోటర్లు ఎదుర్కొన్న నష్టం మాత్రమేనని ఈ వివరాలు సేకరించిన ET మార్కెట్స్ కంపెనీ తెలియజేసింది. 9 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 60 వేల కోట్ల రూపాయలకు సమానం.
టాటా గ్రూపులోని 27 కంపెనీల షేర్ విలువ 39,636 కోట్లు మేర అదృశ్యం అయిందని సర్వే సంస్ధ తెలిపింది. నవంబర్ 8 తేదీ నుండి నవంబర్ 21 తేదీ వరకు ఈ నష్టం సంభవించింది. TCS కంపెనిలో టాటాలకు 73.33 % వాటా ఉండగా వాళ్ళు షేర్ల పతనం వల్ల Rs 21,839 కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ నష్ట పోయారు. అలాగే టాటా మోటార్స్ కంపెనీలో Rs 8,954 కోట్ల, టైటాన్ లో Rs 3,131 కోట్ల, టాటా స్టీల్ లో Rs 1,128 కోట్ల నష్టపోయారు. టాటా కంపెనీల నష్టంలో ప్రస్తుతం ఆ కంపెనీలో సాగుతున్న రగడ కూడా ఒక కారణం.
బిర్లా గ్రూపు కంపెనీలలో ఆ కంపెనీల ప్రమోటర్లు మొత్తం 15819 కోట్లు నష్టపోయారు. కాగా మహేంద్ర గ్రూపు కంపెనీ ప్రమోటర్లు రు. 5278 కోట్లు నష్టపోయారు. నిష్పత్తి ప్రకారం చుస్తే శ్రీరామ్ గ్రూఫు అత్యధికంగా 21 శాతం మార్కెట్ కేపిటలైజేషన్ నష్టపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మాత్రం కేవలం 1748 కోట్లు మాత్రమే నష్టపోయింది.