టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!


bandipura-encounter-new-notes-found

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు.

ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా కేంద్ర మంత్రులు నమ్మబలికారు. సీమాంతర ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో చొరబడి పాఠశాలలను దహనం చేయడం ఆగిపోయిందని, భద్రతా బలగాలపైకి రాళ్ళు రువ్వడం కూడా ఆగిపోయిందని ఇదంతా పాత పెద్ద నోట్ల రద్దు పుణ్యమే అని వెంకయ్య నాయుడు లాంటి వారు చాటింపు వేశారు.

మంగళవారం నాడు జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలకూ (సైన్యం), టెర్రరిస్టులకూ మధ్య కాల్పులు జరిగాయి. అనగా ఎన్ కౌంటర్ జరిగింది. బందిపోరా జిల్లాలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టామని సైన్యం ప్రకటించింది.

ఎన్ కౌంటర్ అనంతరం శవాలను తనిఖీ చేసి చూస్తే వారి వద్ద కొత్త 2000 నోట్లు రెండు దొరికాయి. “కరెన్సీ నోట్లను పోలీసులకు అప్పగించాము. మిలిటెంట్లకు ఆ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయో పోలీసులు దర్యాప్తు చేస్తారు” అని సైన్యాధికారి ఒకరు పత్రికలకు చెప్పారు.

చనిపోయినవాళ్లు జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర వాసులు కాదు. వారు సీమాంతర ఉగ్రవాదులే అని సైన్యం గట్టిగా చెబుతోంది. వారి ముఖ కవళికలు విదేశీయుల్లానే ఉన్నాయని చెప్పారు. “చూపులకు వాళ్ళు విదేశీయుల్లానే ఉన్నారు… వాళ్ళు లోయ లోకి ఎప్పుడు చొరబడిందీ తదుపరి విచారణలో తెలుస్తుంది” అని ఆ అధికారి చెప్పారు.

కనుక చనిపోయినవారు 99% విదేశీయులే. (1% దర్యాప్తుకి వదిలేద్దాం.) సాధారణంగా సైన్యం చేతిలో చనిపోయేవారు విదేశీయులే అయి ఉంటారు. స్వదేశీయులు అయితే ఎందుకు చంపారన్న ప్రశ్న ఎదురవుతుంది. కాశ్మీర్ లోయలో యువకుల్ని పట్టుకుని చంపేసినా వాళ్ళు విదేశీయులుగా, సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులుగా, పాకిస్తాన్ లో శిక్షణ పొందిన కరుడుగట్టిన టెర్రరిస్టులుగా ముద్రవేయబడతారు.

చూపులకు విదేశీయులుగా కనిపిస్తున్న ఉగ్రవాదులకు అప్పుడే కొత్త 2000 నోట్లు ఎక్కడి నుండి వచ్చినట్లు? దేశంలో పౌరులకే కొత్త నోట్లు దొరకడం మహా కష్టంగా ఉన్నది. ఏ ఏ‌టి‌ఎం కి వెళ్ళినా స్టాక్ లేని బోర్డులే కనిపిస్తున్నాయి. అట్లాంటిది ఏకంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులకి కొత్త నోట్లు ఎలా చేరాయి?

టెర్రరిస్టులకు కొత్త నోట్లు అందాయి కనుక “పాత నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టుల ఫైనాన్సింగ్ వనరుల పైన దెబ్బ కొట్టాం” అని ప్రకటించిన మోడి, ఇతర కేంద్ర మంత్రుల మాటలు వాస్తవం కాదు అని భావించవలసి వస్తున్నది. పాత పెద్ద నోట్లు రద్దు చేసినా టెర్రరిస్టుల ఫైనాన్సింగ్ నిస్సందేహంగా కొనసాగుతున్నదని అంగీకరించాలి.

new-notes-with-terrorists

పోనీ టెర్రరిస్టుల వద్ద దొరికినవి ఇండియాలో ప్రింట్ అయిన కొత్త నోట్లు కాదు, అవి దొంగ నోట్లు అయి ఉంటాయి అనుకోవచ్చు. అలా అనుకున్నా ‘నోట్ల రద్దు’ వ్యవహారం విఫలం చెందినట్లే. దొంగ నోట్లు తయారు చేయలేని విధంగా కొత్త నోట్లు డిజైన్ చేశాం కనుక టెర్రరిస్టులకు భారత కరెన్సీ ఇక లభ్యం కాదని భారత పాలకులు చెప్పిన మాటలను టెర్రరిస్టులు తీవ్ర అపహాస్యం చేసినట్లే లెక్క. 

జమ్ము & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో ఇలా వాపోయారు: నేను ఇంతవరకు కొత్త 2000 నోటుపై చేయి వేయలేకపోయాను. వీళ్ళు మాత్రం తమ వాటా పొందటానికి ఎంతో కాలం పట్టలేదు.”

ఒమర్ అబ్దుల్లా లాగానే అనేక మంది భారతీయులకు ఇంకా కొత్త నోట్లు అందలేదు. అందిన వాళ్ళు కూడా వాటిని సరుకులతో మార్చుకోలేక నానా యాతనలు పడుతున్నారు. కానీ అప్పుడే మన నోట్లు సీమాంతర ఉగ్రవాదుల చేతికి చిక్కాయంటే ద్రవ్య నిర్వహణ ఎంత సొంపుగా ఉన్నదో అర్ధం అవుతున్నది.

సామాన్యులకు నోట్లు అందడం గగనంగా మార్చివేసిన పాలకులు టెర్రరిస్టుల ఫైనాన్సింగ్ ని మాత్రం కాస్త కూడా అరికట్టలేకపోవడం ఘోరమైన వైఫల్యం. మోడి విధించిన 50 రోజుల గడువులో ఇంకా 40 రోజులు మిగిలి ఉండగానే టెర్రరిస్టుల ఫైనాన్స్ శుభ్రంగా నడిచిపోతున్నదని వెల్లడి కావడం కంటే మించిన వైఫల్యం మోడి ‘కొత్త నోట్ల’ విధానానికి మరొకటి ఉండబోదు.

ఇండియాకు నోట్ల ముద్రణా యంత్రాలు, భద్రతా ప్రమాణాలతో కూడిన కాగితంలను గతంలో సరఫరా చేసిన కంపెనీలే ఇప్పుడూ సరఫరా చేస్తున్నాయి. ఈ కంపెనీలు పాకిస్తాన్ కి భారతీయ నోట్ల సమాచారాన్ని అందజేసి దొంగ నోట్ల ముద్రణకి సహకరించాయన్న ఆరోపణతో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.  వాటిని బ్లాక్ లిస్ట్ నుండి తొలగించినట్లు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే మళ్ళీ ఆ కంపెనీలకే కొత్త నోట్ల కాంట్రాక్టు అప్పగించారు.

కొత్త నోట్లు ఇండియాలో ముద్రిస్తున్నామని కేంద్రం చెబుతున్నది గానీ, అందుకు కావలసిన యంత్రాలు, కాగితం మాత్రం దిగుమతి చేసుకున్నవే తప్ప దేశంలో తయారైనవి కావని తెలుస్తున్నది. ఈ నేపధ్యంలో దొంగ నోట్ల ముద్రణకు అవకాశం లేకుండా ఎలా పోతుంది?

3 thoughts on “టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

  1. ఏది పాలన, ఏది టెర్రరిజం
    ఏది నిజం ఏది అబద్ధం
    ఓ మహాత్మా! ఓ మహార్షి!

    దేశ ప్రజలు గొర్రెలని ఎంత నమ్మకం ఈపాలకులకు.

  2. కంప్యూటర్ కలర్ ప్రింటర్ & లామినేటర్‌తో దొంగ ఆధార్ కార్డ్ చెయ్యడానికి 50 రూపాయలే ఖర్చవుతుంది. దొంగ ఆధార్ కార్డ్‌తో నోట్లు మార్చుకునేవాళ్ళలో వేర్పాటువాదులు ఎందుకు ఉండరు? బీహార్‌లో మావోయిస్ట్‌లు పేదవాళ్ళకి కమిషన్ ఇచ్చి వాళ్ళ సహాయంతో నోట్లు మారుస్తున్నారు, కొంత మంది పేదవాళ్ళని పోలీసులు అరెస్త్ చేసారు కూడా. మావోయిస్టులకి తుపాకులు దొరక్కూడదని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎక్సైజ్ ఉద్యోగుల దగ్గర ఉన్న తుపాకుల్ని జప్తు చేసిన తరువాత ఆ ధైర్యంతో సారా వ్యాపారులు ఎక్సైజ్ ఉద్యోగుల్ని కొట్టిన ఘటనలు జరిగినాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ మావోయిస్త్‌లకీ, కశ్మీర్ ఉగ్రవాదులకీ తిండి కూడా దొరక్కూడదనుకుని కరెన్సీ నోట్లనే రద్దు చేసాడు కానీ దాని వల్ల జనం తిండికి డబ్బులు లేక చస్తున్నారు. తుగ్లక్ కంటే తెలివితక్కువవాళ్ళు పాలకులైతే ఇలాగే ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s