నరేంద్ర మోడిని పొగడ్తలతో ముంచెత్తే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధిపతి రాజ్ ధాకరే ఈ రోజు తీవ్ర విమర్శలతో ఆయనపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల లెక్కలు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కు సమర్పించలేని సంగతిని గుర్తు చేశాడు. బ్లాక్ మనీ లేకుండానే మీరు 2014 ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నించారు.
పాత నోట్ల రద్దు చర్య, చెప్పిన ఫలితాన్ని ఇవ్వకపోతే దేశం అరాచకం లోకి జారిపోతుందని అందుకు నరేంద్ర మోడియే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
“నేను బిజేపి నాయకులతో మాట్లాడాను. ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో చర్చించాను. ఎవరూ సంతోషంగా లేరు. కానీ వాళ్ళంతా మౌనంగా ఉండిపోయారు… ఈ చర్య పైన మోహన్ భగవత్ ఇంతవరకు స్పందించలేదు. అసలు నిజంగా ఏం జరుగుతున్నదో నాకు అర్ధం కావటం లేదు” అని రాజ్ ధాకరే విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల నుండి ఇంతవరకు స్పందన లేని సంగతిని ఏ పత్రికా గుర్తించినట్లు లేదు. మోడి ఏ చర్య తీసుకున్నా సమర్ధిస్తూ ప్రకటన ఇచ్చే ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం నోట్ల రద్దుపై ఇంతవరకు స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. బిజేపి నేతలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు కూడా సంతోషంగా లేని సంగతి కూడా కొత్త సంగతే.
ఎవరూ సంతోషంగా లేరని రాజ్ ధాకరే ఇప్పుడు చెబుతున్నారు గనక బహుశా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఇప్పుడు హడావుడిగా ప్రకటన ఇస్తారేమో. కానీ ఇన్ని రోజుల మౌనానికి కూడా వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలాంటి ఏర్పాట్లు లేకుండా హడావుడిగా నోట్ల రద్దు ప్రకటించారన్నా సంగతి స్పష్టంగా కనిపిస్తున్నదని ధాకరే ఆరోపించారు.
క్యూ లైన్ల పొడవు తగ్గిపోయిందని కేంద్ర మంత్రులు సంతోషం ప్రకటిస్తున్నారు. కానీ శనివారం నోట్ల మార్పిడిపై కేంద్రం అనేక నిబంధనలు విధించిన సంగతి వారు మర్చిపోతున్నారు. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఏ బ్యాంకులో నైనా నోట్లు మార్చుకునే అవకాశాన్ని ఈ రోజు ఇచ్చారు. ఇతరులు అందరూ తమ సొంత బ్యాంకుల్లోనే ‘విత్ డ్రా’ చేసుకోవాలి. నోట్ల మార్పు లేనే లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చే కస్టమర్లు రాకుండా ఇంకుతో వేలికి మచ్చ పెడుతున్నారు.
కొద్ది రోజుల్లో ఏటిఎం రీకాలిబ్రేషన్ ముగిస్తామని కేంద్రం చెప్పగా ఇప్పటికి (శుక్రవారానికి) 27,000 ఏటిఎం ల వరకే పని పూర్తయిందని సిఎన్‌ఎన్-న్యూస్18 చానెల్ తెలిపింది. మొత్తం ఏటిఎం లలో ఇది 13% మాత్రమే. నవంబర్ 18 తేదీకల్లా 36,000 ఏటిఎం లకు రీకాలిబ్రేషన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని అందులో 75% మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈ లెక్కన ఇంకెన్ని రోజులు పడుతుందో?!
పాలు తాగడానికి తాటి చెట్టు ఎక్కడం!
ఒస్మానాబాద్ జిల్లా కలెక్టర్ ఒక వాహనం నుండి సీజ్ చేసిన 91.50 లక్షల పాత డబ్బు తనదే అని ప్రకటించి మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సుభాష్ దేశ్ ముఖ్ సంచలనం సృష్టించారు.
లోక్ మంగల్ గ్రూప్ ఆఫ్ షోలాపూర్ పేరుతో మంత్రిగారు ఒక ప్రభుత్వేతర సంస్ధని నడుపుతున్నారు. పురపాలక సంఘ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో నవంబర్ 17 తేదీన రొటీన్ గా వాహనాలు చెక్ చేస్తుంటే డబ్బు దొరికిందని కలెక్టర్ ప్రకటించారు. ఆ డబ్బు లోక్ మంగల్ బ్యాంకు పరిధిలోని చక్కెర ఫ్యాక్టరీ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డ్రా చేసి నిలవ చేశామని బ్యాంకు సిబ్బంది ప్రకటించాడు.
కానీ ఆ తర్వాత రోజే ఆ డబ్బు తనదే అంటూ దేశ్ ముఖ్ ప్రకటన చేశాడు. తన వ్యాపార కార్యకలాపాలకు ఎప్పుడన్నా అవసరం వస్తుందన్న ఉద్దేశంతో డబ్బు దాచానని అది నల్ల డబ్బు కాదని, తెల్ల డబ్బే అనీ చెప్పాడు. “కానీ ఎన్నికల కోసం మాత్రం ఆ డబ్బు దాచి పెట్టలేదు” అని అసలు మర్మం విప్పాడు.
ఓ పక్క “డబ్బు పంచకుండానే మీరు 2014 ఎన్నికల్లో నెగ్గారా?” అని రాజ్ ధాకరే మోడి ని ప్రశ్నిస్తున్నాడు. మరో వైపు దాదాపు కోటి రూపాయల డబ్బు ‘ఎన్నికల కోసం కాదు’ అని బిజేపి ఎంఎల్‌ఏ ప్రకటిస్తున్నాడు. బిజేపికీ నల్ల డబ్బుకీ ఉన్న సంబంధం ఇంకా ఎవరన్నా చెప్పాలా?
**********
శుక్రవారం వరకు భారీ క్యూ లైన్లలో నిలబడ్డ భారత దేశాన్ని కింది ఫొటోల్లో చూడండి.