కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు


 

RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది. 

బ్యాంకుల వద్ద కావలసినంత, సరిపోయినంత నోట్లు స్టాకు ఉన్నాయని వాటిని వివిధ బ్రాంచి కార్యాలయాలకు చేర్చడం ఒక్కటే సమస్య అని SBI అధినేత అరుంధతి భట్టాచార్య రెండు రోజుల నుండి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే ఇది వాస్తవం కాదని భారత మాజీ ప్రధాని ఆర్ధిక సలహాదారు వెల్లడి చేసిన అంశాల ద్వారా స్పష్టం అవుతున్నది. 

మోడీ ప్రభుత్వం నవంబర్ 8 అర్ధ రాత్రి నుండి పాత 500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాము రద్దు చేయలేదని, కేవలం సస్పెన్షన్ లో మాత్రమే పెట్టామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు కొత్తగా వివరణ ఇస్తున్నారు. రద్దు, సస్పెన్షన్… ఏ పేరు పెట్టినా సామాన్య ప్రజల వద్ద ఉన్న నోట్లు ఇక పనికిరావని సాక్షాత్తు ప్రధాని మోడీయే చెప్పారు. పాత నోట్లు మార్చుకోవడం ప్రజల వల్ల కావడం లేదు. 

రోజుకి 4500 మాత్రమే మార్చుకోవడానికి ఈ రోజు వరకు ఒప్పుకున్నారు. రేపటి నుండి (నవంబర్ 18) 2000 మాత్రమే మార్చుకోవడం సాధ్యమని జైట్లీ ప్రకటించారు. మళ్ళీ మళ్ళీ బ్యాంకుకు వచ్చి నోట్లు మార్చకుండా ఓటింగు రోజున ఉపయోగించే ఇండెలిబుల్ ఇంక్ తో వేలికి మచ్చ పెడతామని కూడా ఆయన చెప్పారు. పాత నోట్లు మార్చుకోకుండా సామాన్యులకు ఇన్ని ఆటంకాలు పెట్టినాక “అబ్బే, నోట్లు రద్దు చేయడం కాదు” అని నీళ్లు నమిలితే జనం ఎలా నమ్మాలి? 

సౌమిత్రి చౌదరి విషయానికి వస్తే.., మోడీ చర్య పర్యవసానం ఎలా ఉంటుంది? పాత రు. 500 నోట్లు దేశంలో 16.6 బిలియన్ల (1660 కోట్లు) చలామణిలో ఉన్నాయి. రు 1000 నోట్లు 6.7 బిలియన్ల ఉన్నాయి. అనగా మొత్తం 23.3 బిలియన్ల పాత నోట్ల బదులు అంతే విలువ (దాదాపు రు 15 లక్షల కోట్లు) కలిగిన కొత్త నోట్లు ముద్రించాలి.

ఈ విలువను కొత్త 500 మరియు 2000 నోట్ల రూపంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలపెట్టింది. గతంలో లాగా కాకుండా ఇప్పుడు నోట్లను దేశంలోనే ముద్రిస్తున్నారు. RBI తరపున భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ముద్రిస్తున్నది. దీనికి నెలకు 1.3 బిలియన్ల నోట్లు మూత్రమే ముద్రించగల సామర్ధ్యం ఉన్నది. అది కూడా రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేస్తే. మూడు షిఫ్టుల్లో పని చేయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కనుక నెల సామర్ధ్యం 2 బిలియన్ నోట్లు అవుతుంది. 

 

ఈ కంపెనీ పెద్ద నోట్లు (రెండు వేలు) మాత్రమే ముద్రిస్తుంది. వెయ్యి నోట్ల స్ధానంలో రు 2000 నోట్లు ముద్రిస్తున్నారు గనుక కొత్త 2000 నోట్లు  6.7 బిలియన్లకు బదులు 3.35 బిలియన్ల ముద్రించాలి. అనగా డిసెంబర్ 31 లోపు పెద్ద నోట్ల ముద్రణ చాల వరకు పూర్తి అవుతుంది. 

రు 500 నోట్లను సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ముద్రిస్తుంది. దీని సామర్ధ్యం నెలకు 1 బిలియన్ మాత్రమే. మూడు షిఫ్టుల్లో నెలకు 2 బిలియన్ల ముద్రించినా కూడా ఈ నోట్ల ముద్రణ పూర్తి చేసేందుకు 8 నెలలు పైనే పడుతుంది. రు 1000 నోట్లు కూడా ముద్రిస్తామని చెబుతున్నారు గనక ఈ కాలాన్ని తగ్గించవచ్చేమో తెలియదు. ఎందుకంటే కొత్త వెయ్యి నోటు డిజైన్ ఏ దశలో ఉన్నదో ఇంకా తెలియదు. మొత్తం మీద వెయ్యి, 500 నోట్ల ముద్రణ కనీసం 6 నెలలు పడుతుందని అనగా వచ్చే సంవత్సరం మే నెల వరకు పూర్తిగా నోట్లను ముద్రించడం కుదరదని సౌమిత్ర అంచనా వేశారు. 

సౌమిత్ర అంచనాకు బదులిస్తూ RBI పెద్దలు తాము 2 నెలల ముందే నోట్ల ముద్రణ ప్రారంభించామని చెప్పారు. అంటే సౌమిత్ర లెక్కలో నుండి 2 నెలలు తీసేస్తే సరిపోతుంది. ఆ లెక్కన పాత నోట్లను పూరించటానికి వచ్ఛే సంవత్సరం మార్చి వరకు పడుతుందని RBI చెప్పినట్లేనా? 

కొత్త నోట్ల గురించి ఎవరికీ తెలియదని మోడీ, మంత్రులు, బీజేపీ నేతలు ఇప్పటి వరకు చెప్పారు. కేబినెట్ సమావేశంలో మోడీ చెప్పేవరకు కేంద్ర మంత్రులకు కూడా తెలియదని పత్రికలూ, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒకటే ఊదరగొట్టారు. ఇప్పుడేమో 2 నెలల ముందు నుండే ముద్రిస్తున్నామని RBI చెబుతోంది. అనగా తెలియవలసిన వాళ్ళకి ముందే తెలుసనీ RBI పరోక్షంగా చెబుతోంది. 

లేదా…, డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ అసౌకర్యం అని మోడీ హామీ ఇచ్చారు. అప్పటికి కొత్త నోట్లు పూర్తిగా చలామణి లోకి వస్తాయని చెప్పారు. మోడీ ప్రకటన నిజమే అని నమ్మితే, సౌమిత్ర చౌదరి చెప్పినట్లుగా RBI ముద్రణ సామర్ధ్యం తక్కువే కనుక, అది అకస్మాత్తుగా సామర్ధ్యం పెంచుకోవడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి డిసెంబర్ నుండి తక్కువలో తక్కువ 6 నెలలు వెనక్కి వెళ్తే ఈ ఏడు జులై నుండే కొత్త నోట్ల ముద్రణ ప్రారంభం అయి ఉండాలి. అనగా కొత్త నోట్ల ముద్రణ గురించి తెలియవలసిన వాళ్ళకి  జులై నెలలోనే తెలిసిందని అర్ధం అవుతున్నది. 

6 నెలల క్రితమే గుజరాత్ లో ఒక పత్రిక కొత్త నోట్లు రాబోతున్న వార్తను ప్రచురించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే మోడీ చెప్పిన డిసెంబర్ 31 లెక్కతో ఆ వార్త సరిపోతుంది. గుజరాత్ పత్రికకు లీక్ అయిన సమాచారం పెద్ద బాబులకు తెలియకుండా ఉంటుందా? ముందే తెలిసాక బ్లాక్ మార్కెట్ నిల్వదారులు ఇప్పటికే జాగ్రత్త పడి ఉండరా? అదే జరిగితే మోడీ ప్రకటించిన, బీజేపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్న, కాషాయ అభిమానగణం సమర్థిస్తున్న “నల్ల ధనం నిర్మూలన” లక్ష్యం ఎంత వరకు నెరవేరినట్లు?          

దేశంలో 90 శాతం ప్రజల రోజు వారి జీవనం నోట్ల చలామణి పైనే ఆధారపడి ఉంటుంది. ధనిక వర్గాలకు ఆ సమస్య లేదు. వారు నల్ల డబ్బుని నోట్లలో దాచుకోవాల్సిన అవసరం లేదు. చీకటి సామ్రాజ్యాలు బడా రాజకీయ నేతల పర్యవేక్షణ లేకుండా నడవవు. ఎటొఛ్చి బలయింది సామాన్యులు మాత్రమే. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s