అంబానీ, ఆదానీలకు ముందే తెలుసు -బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ


bhavani-sing-rajawat

నిజాలు ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తున్నాయి. బి‌జే‌పి ప్రభుత్వం తమకు కావలసిన వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీలు కట్టగట్టుకుని చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు ఖండించే పనిలో ఉండగానే రాజస్ధాన్ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ అవే ఆరోపణలు చేయడం విశేషం.

రాజస్ధాన్ లో కోట జిల్లాలోని లడ్ పురా నియోజకవర్గ ఎం‌ఎల్‌ఏ భవాని సింగ్ రజావత్ తనకు తెలిసిన నిజాన్ని వెళ్ళగక్కాడు. రు 500/-, రు 1000/- ల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతున్న సంగతి అంబానీ, అదానీలకు ముందే తెలుసని ఆయన వెల్లడి చేశాడు. దానితో వాళ్ళు తమ నల్ల డబ్బుని ముందే భద్రం చేసుకున్నారని ఆరోపించారు.

గౌతమ్ అదానీ గుజరాత్ లో బడా పారిశ్రామికవేత్త. గతంలో ఊరూ పేరూ లేని అదానీ నరేంద్ర మోడి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలో బాగా సంపదలు ఆర్జించాడు. మోడి విదేశీ పర్యటన చేసినప్పుడల్లా ఆయన వెంట వెళ్ళే వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల బృందంలో అదానీ తప్పనిసరిగా ఉండవలసిందేనని తెలిసిన జర్నలిస్టులు చెబుతుంటారు. ఇక అంబానీ గురించి చెప్పనవసరం లేదు.

అంబానీ, అదానీలను ఉదాహరణలుగా మాత్రమే ఎం‌ఎల్‌ఏ పేర్కొన్నాడు. వారితో పాటు “ఇతరులు” అని కూడా ఎం‌ఎల్‌ఏ చెప్పడం విశేషం. అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద వాళ్లందరికీ నోట్ల రద్దు సంగతి ముందే తెలుసని ఎం‌ఎల్‌ఏ మాటల ఆంతర్యం.

“అంబానీ, అదానీ తదితరులకు ముందే సమాచారం ఉన్నది. వారికి ముందే సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ ప్రకారంగా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు” అని బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ రజావత్ చెప్పారు. ఆయన చెబుతుండగా రికార్డ్ చేసిన వీడియోను కింద చూడవచ్చు.

బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ చెప్పిన సంగతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. “ఆయనకు అబద్ధాలు చెప్పడం, ఆరోపణలు చెయ్యడం అలవాటుగా మారింది” అని కేజ్రీవాల్ ను బి‌జే‌పి నేతలు నిందించారు.

బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ చెప్పిన మాటలనే రాజ్య సభ, లోక్ సభ లలో ప్రతిపక్ష నేతలు, ఎం‌పిలు చెప్పారు. రాజ్య సభ కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, బి‌ఎస్‌పి నేత మాయావతి, జనతా దళ్ నేత శరద్ యాదవ్, సి‌పి‌ఎం నేత సీతారాం యేచూరి, లోక్ సభ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మొదలైన సభ్యులు అందరూ నోట్ల రద్దు సంగతి బి‌జే‌పి తన మిత్రులకు ముందే లీక్ చేసిందని చెప్పారు.

అందుకు రుజువులు చూపండి అని సభలో బి‌జే‌పి ఎం‌పి లు కోరుతుంటే “సాక్షం ఉంటే కోర్టులో కేసు వేయండి” అని బి‌జే‌పి నేత సుబ్రమణ్య స్వామి న్యూస్ ఛానెళ్లలో చిద్విలాసంగా సూచిస్తున్నారు. (అప్పు తీర్చమని అప్పిచ్చిన వ్యక్తి గట్టిగా అడుగుతుంటే ‘నా దగ్గర లేవు. కావాలంటే కోర్టులో కేసు వేసుకో పో’ అని గద్దించినట్లు లేదా ఇది!) కాంగ్రెస్ నేతలపై కోర్టు కేసులతో ఎం‌పి పదవి కొట్టేయగల తీరిక, ఓపిక ఆయనకు ఉన్నట్లే అందరికీ ఉండాలని స్వామి గారు చెప్పదలిచారు.

నవంబరు 8 తేదీన నోట్ల రద్దుని ప్రధాని మోడి ప్రకటించారు. నవంబరు 4 తేదీనే కొత్త 2000/- నోటు ఫోటోని రాజస్ధాన్ బి‌జే‌పి నేత ఒకరు ట్వీట్ చేశారు. నవంబర్ 8 తేదీన ప్రధాని ప్రకటనకు ముందే పశ్చిమ బెంగాల్ బి‌జే‌పి పార్టీ బ్యాంకులో ఒక కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. ఈ రుజువులని సభలో చెప్పినా కూడా బి‌జే‌పి నేతల నుండి, మంత్రుల నుండి స్పందన లేదు.

పత్రికలు రజావత్ వీడియోని తమ వెబ్ సైట్లలో పోస్ట్ చేశాయి. ఆ వీడియో యూ ట్యూబ్ లో అందరికీ అందుబాటులో ఉన్నది. చిత్రం ఏమిటంటే ఎం‌ఎల్‌ఏ రజావత్ తాను అలా అనలేదని బుకాయించడం. తనకు చెప్పకుండా వీడియో తీశారని ఆయన ఆరోపించాడు.

తన ఇంటికి కొందరు విలేఖరులు వచ్చి న్యూస్ బైట్ లు అడిగితే తాను ‘ఆఫ్ ద రికార్డ్’ చెప్పానని, వాటిని తనకు తెలియకుండా రికార్డ్ చేశారని రజావత్ వాపోయారు. ఇన్ని చెప్పి కూడా వీడియోలో వినబడతున్న మాటలు తాను చెప్పలేదని బుకాయించడం మానలేదు.

కొద్ది నెలల క్రితం ఉత్తర ఖండ్ లో నిరసన ప్రదర్శన పేరుతో బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ ఒకరు ప్రభుత్వ/పోలీసు గుర్రం పైన కర్రతో దాడి చేయడం, అది భయపడి వెనక్కి అడుగులు వేస్తూ పట్టుతప్పి పడిపోవడం, దాని కాలు విరగడం, ఆ గాయంతో అది చనిపోవడం… ఇవన్నీ పాఠకులకు గుర్తుండి ఉండాలి. ఎం‌ఎల్‌ఏ దాడి చేస్తున్న దృశ్యాన్ని టి.వి చానెళ్లు చూపించాయి. కానీ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఆ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ పచ్చిగా బుకాయించడానికి సిగ్గు పడలేదు.

ఈ అబద్ధాల జబ్బు, బుకాయింపు రోగం బి‌జే‌పి లో పైనుండి కింది వరకూ అంటు రోగంలా ప్రబలిపోయినట్లుంది.

4 thoughts on “అంబానీ, ఆదానీలకు ముందే తెలుసు -బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ

  1. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!
    సిగ్గు పడటం రోషపడటం ఎప్పుడో మానుకున్నారు గదా! తోలు మందం వాళ్లు! 😁

  2. కోట్లు సంపాదించే సినిమా నటుడు ఆమిర్ ఖానే ఒప్పుకున్నాడు “బ్లాక్ మనీ గడించినవాడు ఎవడూ డబ్బుని ఇంట్లో దాచుకోడు” అని. అంబాణీ, ఆడాణీలు తమ బ్లాక్ మనీని స్విస్ బ్యాంక్‌లలో దాచుకుంటారు. ఆడాణీ బి.ఎ. కూడా చదవలేదు కానీ అతను వజ్రాల వ్యాపారం చేసి కోట్లు గడించాడు. ఇప్పుడు అతను ప్రైవేట్ రంగ ఓడ రేవుల యజమాని స్థాయికి ఎదిగాడు. ఆడాణీ జైన మతస్తుడు. అతని మతంవాళ్ళలో ఎక్కువ మంది చేసేది వ్యాపారమే కనుక అతను వజ్రాల వ్యాపారం చేపట్టాడు. అతను ప్రైవేట్ రంగంలో ఓడరేవులు కట్టే స్థాయికి ఎదిగింది మాత్రం మోదీ వల్లే.

  3. పల్లెటూర్లలో కొరియర్ సర్వీసులు ఉండవు. అమేజాన్.కామ్‌వాడు లేదా ఈబే.కామ్‌వాడు పల్లెటూర్లకి కంజైన్మెంట్స్ ఎలా పంపిస్తాడు? ఎంత హైప్ సృష్టించినా మన దేశంలో ఆన్లైన్ ట్రాంజాక్షన్లు పెరగవు. పల్లెటూర్లలో కూరగాయల వ్యాపారులు మాత్రమే కాదు, ప్రొక్లెయినర్లు & జెసిబిలు అద్దెకి ఇచ్చేవాళ్ళు కూడా క్యాష్ మాత్రమే తీసుకుంటారు తప్ప చెక్కు తీసుకోరు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యించుకోరు. జె.సి.బి. అద్దెలకి తిప్పేవానికి ఇన్‌కమ్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఉండదు. వాడు జెసిబి తిప్పి గడించిన లక్షల రూపాయలకి లెక్కలు చూపించలేక ఆ డబ్బుని ఏ నదిలోనో పారేస్తాడు. మోదీ చేసిన తుగ్లక్ పని వల్ల అంబానీకో, ఆదానీకో అయితే నష్టం లేదు, కానీ పల్లెటూర్లలో unorganised వ్యాపారాలు చేసేవాళ్ళకి మాత్రం నష్టమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s