ఎఫ్‌బి‌ఐ వల్లే ఓడిపోయా -హిల్లరీ క్లింటన్


hillaryay

డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయి విచారంలో ఉన్న హిల్లరీ క్లింటన్ తన ఓటమికి మరో చోట కారణాలు వెతుకుతోంది. తన తప్పుల్ని పక్కన బెట్టి ఆ తప్పుల్ని బైటపెట్టిన వారిని నిందిస్తోంది. ఒబామా మొదటి అధ్యక్ష పదవి కాలంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశీ మంత్రి) గా పని చేసినప్పుడు ఈ మెయిల్ సేవల కోసం అధికారిక భద్రతలతో కూడిన సర్వర్లకు బదులుగా ప్రైవేటు సర్వర్లను వినియోగించి ప్రభుత్వ రహస్యాలను వాల్ స్ట్రీట్ కంపెనీలకు అప్పజెప్పడంపై ఎఫ్‌బి‌ఐ విచారణ జరిపినందునే తాను ఓడిపోయానని చెబుతోంది.

“ఇలాంటి ఎన్నిక విజయవంతం కాలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి… కానీ మా విశ్లేషణ ఏమిటంటే జిమ్ కామీ రాసిన లేఖ పునాది, ఆధారం లేని అనుమానాల్ని రేకెత్తించడంతో విజయం వైపుగా సాగుతున్న మా ప్రచార ఊపు ఆగిపోయింది” అని తనకు చందాలు, నిధులు సమకూర్చిన వారితో జరిగిన సమావేశంలో హిల్లరీ వాపోయిందని సి‌ఎన్‌ఎన్, క్వార్ట్జ్ పత్రికలు తెలిపాయి.

జిమ్/జేమ్స్ కామీ ఫెడరల్ పోలీసు పరిశోధనా సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు డైరెక్టర్. క్లింటన్ ఈ మెయిల్స్ బైట పెట్టింది జేమ్స్ కామీ కాదు, వికీ లీక్స్. వికీ లిక్స్ అధినేత జులియన్ అసాంజే లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో నాలుగేళ్లుగా ఇరుక్కుని ఉన్నప్పటికీ వికీ లీక్స్ చురుగ్గానే ఉన్నది. ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న, ముఖ్యంగా అమెరికాలో చురుకుగా ఉన్న హ్యాకర్లు క్లింటన్ వినియోగిస్తున్న ప్రైవేటు సర్వర్లను హ్యాక్ చేసి ఆమె ఈ మెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలను దొంగిలించి వికీ లీక్స్ కి అప్పజెప్పారు.

ఓ వైపు ట్రంప్ కి వ్యతిరేకంగా అనేక అబద్ధాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారంలో పెట్టడంలో క్లింటన్, ఆమె ప్రచార దళాలు, కార్పొరేట్ మీడియా బిజీగా గడిపితే హిల్లరీ క్లింటన్ పాల్పడిన గత ప్రజా వ్యతిరేక, మోసపూరిత కార్యకలాపాలను వెల్లడి చేయడంలో వికీ లీక్స్ చురుకుగా పని చేసింది.

విదేశీ మంత్రిగా అధికారికమైన ప్రభుత్వ సర్వర్లను తన డిజిటల్ ఉత్తర ప్రత్యుత్తరాలకు క్లింటన్ వినియోగించడం చట్ట రీత్యా నేరం. అదే సామాన్య ఉద్యోగులు, అధికారులు ఆ పని చేసి ఉంటే వాళ్ళు జైలు ఊచలు లెక్కబెడుతూ ఉండేవాళ్లు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పని చేసిన వ్యక్తి, వాల్ స్ట్రీట్ కంపెనీలకు అత్యంత ఇష్టురాలు కావటంతో క్లింటన్ పైన ఈగ కూడా వాలలేదు.

కానీ ఈ మెయిల్ ప్రత్యుత్తరాలను వికీలిక్స్ ప్రచురించడంతో క్లింటన్ కూ వాల్ స్ట్రీట్ కంపెనీలకు ఉన్న దగ్గరి సంబంధం అమెరికా ప్రజలకు తెలిసింది. ప్రభుత్వ సమాచారాన్ని ఆమె యధేచ్ఛగా బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిన సాక్షాలు ప్రజల దృష్టికి వచ్చాయి. దానితో విచారణ ప్రకటించడం ఎఫ్‌బి‌ఐకి విధి అయింది. లేదంటే అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎఫ్‌బి‌ఐ ఎదుర్కోవలసి వచ్చేది.

జులై నెలలో ఒక విడత డేటాను వికీ లీక్స్ ప్రచురించింది. అందులో అధికారిక సమాచారం కాంప్రమైజ్ అయిన సమాచారం వెల్లడి కావడంతో ఆ ఉదంతంపై విచారణ ప్రారంభించామని ఎఫ్‌బి‌ఐ డైరెక్టర్ అమెరికా పార్లమెంటుకు లేఖ రాశారు. కానీ త్వరలోనే క్లింటన్ కు ఎఫ్‌బి‌ఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. అక్టోబర్ లో మరో విడత డేటాను వికీ లీక్స్ ప్రచురించింది. అందులో కూడా మరిన్ని అక్రమాల సమాచారం వెల్లడి అయింది. అక్టోబర్ 28 తేదీన మళ్ళీ విచారణ ప్రకటిస్తూ ఎఫ్‌బి‌ఐ డైరెక్టర్ కాంగ్రెస్ కి లేఖ రాయక తప్పలేదు. కానీ ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందు మళ్ళీ క్లింటన్ కు క్లీన్ చిట్ ఇచ్చేసింది.

మొదటి విచారణ నుండి ఎలాగో బైటపడినప్పటికీ మళ్ళీ విచారణ తెరుస్తున్నట్లు రెండో సారి కూడా ఎఫ్‌బి‌ఐ డైరెక్టర్ లేఖ రాయడంతో మంచి ఊపులో ఉన్న తమ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని క్లింటన్ ఇప్పుడు ఆరోపిస్తున్నది. ఎఫ్‌బి‌ఐ మొదటి లేఖ తన పాత గాయాలను జనానికి గుర్తు చేసిందనీ, రెండో లేఖ తన గెలుపు ఊపుకి బ్రేకులు వేసి ప్రత్యర్ధి ట్రంప్ ప్రచారానికి నూతన శక్తిని ఇచ్చిందని ఆమె ఆరోపించారు.

ఆమెకు తాను ప్రైవేటు సర్వర్లను వినియోగించి ప్రభుత్వ సమాచారాన్ని అక్రమంగా బహుళజాతి కంపెనీలకు చేరవేయడంతో తప్పు కనిపించలేదు గానీ, దానిపైన ఎఫ్‌బి‌ఐ తూతూ మంత్రంగా విచారణ ప్రకటించడం మాత్రం తీవ్ర తప్పిదంగా కనిపిస్తోంది. అది తన విజయావకాశాలను దెబ్బ తీసింది కనుక తప్పన్నమాటే!

ఎన్నికలకు ముందు ఇరువురు అభ్యర్ధుల మధ్య జరిగిన మూడు బహిరంగ చర్చలలో క్లింటన్ దే పై చేయి అని కార్పొరేట్ మీడియా ఊదరగొట్టింది. కానీ ఇతర ఆన్ లైన్ ఓటింగుల్లో మాత్రం ట్రంప్ దే పై చేయి అని చాటాయి. కానీ మీడియా వాటిని పట్టించుకోలేదు. ట్రంప్ అధ్యక్ష పదవికి పనికి రాడని, మొరటు మనిషనీ, తెలివిహీనుడనీ, మైసోజినిస్టు (పురుష అహంకారి) అనీ ఇంకా అనేక విధాలుగా తాము చేసిన ప్రచారం ప్రజల్లో పని చేశాయని అవి నమ్మాయి. క్లింటన్ ను నమ్మించాయి.

“మూడో చర్చ తర్వాత మేము ఉన్న స్ధానం గురించి విశ్వాసంతో ఉన్నాము. మేము రెండు రాష్ట్రాల్లో తప్ప అన్ని చోట్లా ముందంజలో ఉన్నామని ప్రచార విశ్లేషణలు తెలిపాయి. ఒక చోట ఇరువురు సమానంగా ఉంటే మరో చోట వెనకబడి ఉన్నాం. గాలి మా వైపే ఉన్నదని గట్టిగా నమ్మాం” అని హిల్లరీ వాపోయిందని క్వార్ట్జ్ పత్రిక తెలిపింది.

ఒపీనియన్ పోల్స్ లో అత్యధికం ఒపీనియన్ ని సేకరించడానికి బదులుగా ఒపీనియన్స్ ని సృష్టించి ప్రజలపై రుద్దటానికే అనేక సర్వే సంస్ధలు పని చేస్తాయి. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు సర్వేలన్నీ క్లింటన్ గెలిచి తీరతారని ఓటర్లకు చెప్పడానికి మీడియా సర్వేలు తీవ్రంగా శ్రమించాయి. తద్వారా గెలిచే అభ్యర్ధికే ఓటు వేయించేందుకు కృషి చేశాయి. కానీ ప్రజలు వాస్తవంగా క్లింటన్ ని ఇష్టపడటానికి బదులు వాల్ స్ట్రీట్ తో ఆమెకు ఉన్న సంబంధాలను ద్వేషించాయి.

ఎన్నికల ముందు ట్రంప్ పైన అడ్డదిడ్డమైన ప్రచారం చేసి అప్రతిష్ట పాలు చేసేందుకు అధ్యక్షుడు ఒబామా, క్లింటన్ లు చేయని ప్రయత్నం లేదు. చేయని ఆరోపణ లేదు. కానీ ఆయన గెలిచిన తర్వాత ట్రంప్ ని పొగిడేందుకు, ఆయనలోని సానుకూలతలను జనానికి చెప్పేందుకు పోటీ పడుతున్నారు. “ఒక వ్యక్తి మాకు ఎప్పుడూ లక్ష్యంగా లేరు” అని క్లింటన్ యూ టర్న్ తీసుకోగా, “ట్రంప్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం. మేమందరమూ అందుకోసం ఎదురు చూస్తున్నాం” అని ఒబామా ప్రకటించాడు.

ఒబామా చెప్పిన మరో ముఖ్యమైన మాట “మేమంతా ఒకటే. ఒకే స్కూల్ నుంచి వచ్చాం” అని. స్కూల్ అంటే చిన్నప్పటి స్కూల్ కాదు; రాజకీయ-ఆర్ధిక విధానాలలో తామందరమూ ఒకటే అని ఒబామా చెబుతున్నారు. తద్వారా ట్రంప్ ఏమీ చేయనున్నదీ, ఏయే విధానాలు అనుసరించేది ఒబామా క్లూ ఇచ్చాడా అన్నది త్వరలోనే తెలుస్తుంది.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s