కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!


 

పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక నల్ల డబ్బు పని పట్టాలి. అందుకే పాత 500 /-, 1000 /- నోట్లు రద్దు చేస్తున్నాం. ఈ అర్ధ రాత్రి నుండి పెద్ద నోట్లు చిత్తు కాగితాలే. త్వరలో కొత్త 500 /-, 2000 /- నోట్లు తెస్తున్నాం. వాటికి అదనంగా భద్రతలు కల్పిస్తున్నాం. వాటిని ఎవరూ కాపీ చేయలేరు…” ఇలా సాగింది ప్రధాని ప్రసంగం. 

చెప్పినట్లుగా పాత, పెద్ద నోట్లు రద్దు అయ్యాయి. “ఆందోళన చెందొద్దు” అని ప్రధాని చెప్పినా, జనం ఆందోళన చెందారు; ఇంకా ఆందోళన లోనే ఉన్నారు. ఎటిఎం ల వద్ద జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ముందు జన సందోహం. తగిన మొత్తంలో కొత్త నోట్లు విడుదల చేస్తాం అన్నారు. కానీ 11 తేదీ ఎటిఎం లు తెరిచిన కొద్దీ సేపటికే క్యాష్ నిండుకుంది. ‘స్టాక్ లేదు’ అనో, “పని చేయటం లేదు” అనో బోర్డులు వెలిసాయి. కొన్ని చోట్ల అయితే ఎటిఎం లను అసలే తెరవలేదు. నల్ల డబ్బు రద్దయిందో తెలియదు గాని, కూలీలు, శ్రామికులు, తోపుడు బండ్ల వాళ్ళు, కిరాణా వ్యాపారాలు, పేరెంట్స్ ఇఛ్చిన పాకెట్ మనీని దాచుకున్న విద్యార్థులు, భర్తకు తెలియకుండా ఇంటి అవసరాల కోసం పోపు డబ్బాల్లో పొదుపు చేసుకున్న గృహిణులు, పెళ్లిళ్లకు-బర్త్ డేలకు-తదితర అవసరాలకు- బ్యాంకుల నుండి డ్రా చేసిన వాళ్ళు, LIC ప్రీమియం కట్టాలని డ్రా చేసిన వాళ్ళు… ఇలా అనేకమంది ఇబ్బందులు పడ్డారు. 

పైకి అనేకమంది “ఆహా, భలే చేసాడు మోడీ” అని అభినందిస్తున్నా, లోపల తిట్టుకుంటున్న సామాన్యులు అనేకులు! 

ఇంత జరిగినా కొత్త నోట్లలో అదనపు భద్రతలు (సెక్యూరిటీ ఫీచర్స్) కల్పించారా? నోట్ల నాణ్యత పెరిగిందా? ఇక ఎవరూ నకిలీ నోట్లు తయారు చేయలేరా? దొంగ నోట్లు తయారు కావటం ఇక కష్టమేనా? రు 1000 /- నోట్లు ఇక రావా? లేదు, లేదు, లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లేదు అనే. 

“కొత్త నోట్లు ప్రవేశపెట్టాలన్న నిర్ణయం కేవలం ఆరు నెలల క్రితం మాత్రమే తీసుకున్నారు. అందు వల్ల భద్రతా లక్షణాలు, ప్రమాణాలు మార్చడానికి సమయం లేదు. కేవలం డిజైన్ మాత్రమే మార్చాం. భద్రతా లక్షణాలు గతంలో ఏం ఉన్నాయో అవే కొనసాగించాం. పాత నోట్లకు కొత్త నోట్లకు డిజైన్ ఒక్కటే తేడా. సెక్యూరిటీ ఫీచర్స్ ఒకటే” అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారని ద హిందూ తెలిపింది. 

ఎవరైనా కొత్త నోట్లు చూసి ఉన్నట్లయితే పాత, కొత్త తేడా ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. తేడా ఏమిటి అంటే కొత్త నోటు ఇంకా ఘోరంగా ఉండటం. కాగితంలో నాణ్యత అసలే లేకపోవడం. చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే రంగు కాగితాల స్ధాయికి కొత్త నోట్ల ప్రమాణాలు పడిపోవడం. దొంగ నోటు తయారు చేయడం చాలా తేలిక అని చూడగానే ఒక అభిప్రాయం కలగడం…  కొత్త నోటు చూస్తే ఈ అభిప్రాయాలు ఒకేసారి ముప్పిరిగొంటాయి. 

పాత నోట్లు గ్రాండ్ గా ఉంటె కొత్త నోటు చిత్తు కాగితం లెక్క ఉన్నది. ఇంత ఘోరంగా ఎందుకు ఉన్నాయి అని చూస్తే… కొత్త నోట్లు ఇండియాలోనే ప్రింట్ అయ్యాయట. ఇప్పటి వరకు కరెన్సీ నోట్ల ముద్రణను విదేశీ కంపెనీల చేత ముద్రింపజేసేవారు. ముద్రణకు వినియోగించే కాగితం కూడా విదేశాల నుండే దిగుమతి చేసుకునేవారు. జర్మనీకి చెందిన లోసేన్తాల్, బ్రిటన్ కి చెందిన డే లా రూ, స్వీడన్ కి చెందిన క్రేన్, ఫ్రాన్స్-నెదర్లాండ్స్ కి చెందిన అజ్రో విగిన్స్ కంపెనీలు మన నోట్లను ముద్రించేవారు. 

ఇప్పుడు కొత్త నోట్లని ఇండియాలోనే ముద్రించారు. కాగితం కూడా ఇండియాలోనే తయారు చేసినది. మైసూరు లోని ‘బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్’ కంపెనీ తయారు చేసిన పేపర్ ని వినియోగించి రు 2000 నోట్లు తయారు చేశారు. ఈ కంపెనీ పోయిన సంవత్సరం (2015 ) నుండే పని చేయడం ప్రారంభించింది. 

రు 2000 నోట్లు ముద్రించాలని ఆరు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నారట. కానీ RBI  కొత్తగా రూపొందించిన భద్రతా ప్రమాణాలను నియోగించి నోట్లు తయారు చేయాలంటే కనీసం ఐదు లేక ఆరు సంవత్సరాల సమయం కంపెనీకి కావాలట. అందువల్ల పాత నోటుకి ఉన్న భద్రతా లక్షణాలతోనే నోట్లు ముద్రించామని ఇప్పుడు అధికారులు చక్కా చెబుతున్నారు. 

కొత్త భద్రతా ప్రమాణాలతో కొత్త నోట్లు తయారు చేసేందుకు ఐదు లేదా ఆరు సం.లు పడుతుందని ప్రధాని మోడీకి తెలియదా? తెలియకుండా ఎలా ఉంటుంది! అయినా మెరుగైన భద్రతా ప్రమాణాలతో, నకిలీ తయారు చేసేందుకు వీలు లేకుండా కొత్త నోట్లు తెస్తున్నామని ప్రధాని, RBI ఎందుకు ప్రకటించారు? జనాన్ని మాయ మాటలతో మోసగించడానికి తప్ప!

ద హిందూ తో మాట్లాడిన అధికారి ప్రకారం ప్రస్తుతం నోట్ల తయారీలో 70% ఇండియా కాగితాన్ని వినియోగిస్తున్నారు. కొత్తగా వచ్చే రు 500 , రు 1000 నోట్లు మాత్రం దిగుమతి చేసుకున్న కాగితంతో తయారు చేస్తారు. కానీ త్వరలో 100 % నోట్లు ఇండియాలోనే తయారు చేయాలనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా (మైసూరు) కంపెనీకి సం.కి 12000 మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నది. దీనితో 18 బిలియన్ల నోటు కాగితాలు ముద్రించవచ్చు. ఈ కాగితం తోనే కొత్త 2000 నోటుని తయారు చేశారు. 

కరెన్సీ నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చడం అంత తేలికైన పని కాదు. ముందు చెప్పినట్లు కనీసం ఐదారు సం.లు కావాలి. వాటర్ మర్క్స్, సెక్యూరిటీ దారం, ఫైబర్, లేటెంట్ ఇమేజ్ మొ.న అంశాల డిజైన్ మార్చాలి. ఇందుకు ప్రభుత్వంలో సుదీర్ఘమైన పాలనా ప్రక్రియ నడవాలి. అనేక మార్లు వివిధ స్ధాయిల్లో ప్రాతినిధ్యాలు, చర్చలు, ఆమోదాలు, అంగీకారాలు, అభ్యంతరాలు.. జరగాలి. ఒక్కో కొత్త ప్రమాణాన్ని చర్చించి, విచికిత్స చేసి కేబినెట్ ఆమోదం పొందాలి. ఆ తర్వాతే అసలు ప్రక్రియ మొదలవుతుంది.  

చివరిసారిగా 2005 లో భద్రతా ప్రమాణాల్ని మార్చారు. కానీ అప్పటి UPA ప్రభుత్వానికి మోడీకి వఛ్చిన ఐడియా వఛ్చినట్లు లేదు. చడీ చప్పుడు లేకుండా పాత నోట్లని క్రమంగా రద్దు చేసి వాటి స్ధానంలో కొత్త నోట్లు ముద్రించారు. అలా చేయడం వెనుక ఉద్దేశం జనానికి ఇబ్బంది కలగకుండా చేయడమే. ఆ ఇబ్బంది వల్ల వ్యతిరేకత ప్రబలి ఓట్లు పడవేమో లని కాంగ్రెస్ అనుమానించింది. కానీ మోడీకి తెలివితేటలు అధికం. ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మార్చుకోవడం ఆయనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఇంకా పెద్ద నోటు (2000 /-) తెస్తున్నామన్న సంగతికి ప్రాధాన్యత ఇవ్వకుండా పాత నోట్లు రద్దు అవుతున్నాయన్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ , ప్రత్యేకంగా టీవీ లో కనబడి, దొంగ నోట్లు, సీమాంతర ఉగ్రవాదం, నల్ల డబ్బు, ప్రజల ఇబ్బందులు, అవినీతి… ఇత్యాది అంశాలతో ఊదరగొట్టి జనం చేత “ఆహా” అనిపించుకున్నారు ప్రధాని మోడీ. 

ఆ తర్వాత నిజాలు తెలియకుండా పోవు. ఆ సంగతి మోడీకి తెలియక కాదు. కానీ ముందు వచ్చిన ‘ఆహా’ అన్న భావనే ఎక్కువగా పని చేస్తుందని, తర్వాత వెల్లడి అయ్యే నిజాలు పెద్దగా జనం లోకి పోవని, మొత్తంగా మేలు జరిగి ఓట్లు పెరుగుతాయని బీజేపీ/మోడీ అంచనా వేశారు.  

విదేశాల్లో నోట్లు ముద్రిస్తున్నందున పాకిస్తాన్ కు నకిలీ ముద్రణ తేలిక అయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. గతంలో ఓసారి రెండు విదేశీ కంపెనీలు నోట్ల డిజైన్ ని పాకిస్తాన్ కి ఇఛ్చినట్లు ఆరోపణలు రావడంతో ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కానీ విచారణలో అదేమీ జరగలేదని తేలిందిట. “ఈ కంపెనీలు 150 సం.లుగా వ్యాపారంలో ఉన్నాయి; ఒక దేశ కరెన్సీ సమాచారాన్ని మరో దేశానికీ అప్పజెప్పి తమ వ్యాపారాన్ని చెడగొట్టుకునే పనికి అవి పాల్పడవు. వాటిలో కొన్ని కంపెనీలు చిన్న చిన్న దేశాలకి కూడా కరెన్సీలు ముద్రిస్తాయి. విచారణ చేసాక ఆ రెండు కంపెనీలు ఎలాంటి తప్పుడు పనికి పాల్పడలేదని తేలింది. దానితో నిషేధం ఎత్తివేసాము” అని ప్రభుత్వాధికారి చెప్పారు. 

మరి భద్రతా ప్రమాణాలలో మార్పులు లేవు గనక దొంగ నోట్లు ముద్రించడం పాకిస్తాన్ కి కష్టం ఏమి కాదు కదా? అన్న ప్రశ్నకు ఆయన “అవును, ఏమంత కష్టం కాదు. కేవలం డిజైన్ మాత్రమే మారింది. భద్రతా ప్రమాణాలు మారలేదు. పాకిస్తాన్ లో ప్రభుత్వ ప్రెస్ లోనే దొంగ నోట్లు ముద్రిస్తారు. కనుక కొత్త డిజైన్ వారికి అంత కష్టం ఏమి కాదు” అని ప్రభుత్వాధికారి స్పష్టం చేశారు.

కాబట్టి ప్రధాని మోడీ చెప్పినవి ఏవి నిజం కాదు:

రు 1000 నోట్లు ఇక ఉండవు అన్నారు…, కొత్త రు 1000 నోట్లు కూడా ఉంటాయని టీవి ఛానెళ్లలో ఇప్పుడు స్క్రోలింగ్ వస్తున్నది. 

భద్రతా ప్రమాణాలు పెరుగుతాయి అన్నారు… కేవలం డిజైన్ మాత్రమే మారింది. భద్రతా ప్రమాణాలు పాతవే అని ఇప్పుడు చెబుతున్నారు. 

దొంగ నోట్లు తయారు చేయడం కష్టం అన్నారు…, పాక్ ప్రభుత్వానికి కొత్త డిజైన్ తో దొంగ నోట్లు ముద్రించడం కష్టం కాదు అని ఇప్పుడు చెబుతున్నారు. 

సీమాంతర (పాక్) ఉగ్రవాదుల ఫైనాన్స్ వెన్ను విరిచాం అన్నారు…, కొత్త నకిలీ నోట్ల ముద్రణ తేలికగా చేయొచ్చని చెబుతున్నారు. 

ఆందోళన వద్దు, ఇబ్బందులు ఉండవు, బోలెడు స్టాక్ ని ఇప్పటికే బ్యాంకులకు చేర్చాం అన్నారు…, బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు, ఎటిఎంలలో స్టాక్ లేదు, అనేక చోట్ల ‘పని చేయడం లేదు’ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. 

భద్రతా లేదు, నాణ్యతా లేదు… అన్నీ అబద్ధాలే!

5 thoughts on “కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!

  1. జనం నిజంగా అమాయకులే. బ్లాక్ మనీ గడించినవాడు ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్స్‌లో పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్ చేసుకుంటాడు కానీ దాన్ని ఇంటిలోనో, బ్యాంక్‌లోనో దాచుకోడు. నిన్న విశాఖపట్నంలో ఒకాయనకి ఈ విషయం చెపితే ఆయనకి ఒక్క ముక్క కూడా బుర్రకెక్కలేదు. దొంగ నోట్లు పోతాయని ఆయన సంతోషించాడు. దొంగ నోట్లు ముద్రించేవాళ్ళకైతే కొంత నష్టమే. వాళ్ళు కొత్త నోట్ల రూపురేఖలు పరిశీలించి డూప్లికేట్ చెయ్యాలి కదా. ఆ రకంగా అయితే అది దొంగ నోట్ల వ్యాపారులకి ఇబ్బందే కానీ బ్లాక్ మనీ గడించినవాళ్ళకి మాత్రం ఏ ఇబ్బందీ ఉండదు.

  2. నానో చిప్పులు, నానో చిప్పులు అని రెచ్చిపోయారుకానీ, అవి ఉంటే మాత్రం ఎలా నల్లధనాన్ని నియంత్రిస్తారో అర్ధం కాదు. అన్నేసి చిప్పులు, ఏ power source లేకుండా అన్ని వేలమైళ్ళదూరానున్న ఉపగ్రహాలకి (శక్తివంతమైన) సిగ్నళ్ళను ఎలా పంపిస్తాయో అర్ధంకాదు. అలాంటిదేదైనా ఉంటే అదేదో patent చెయ్యదగ్గ technology అవుతుంది. ఇక నోట్లన్నీ కూడబలుక్కుని, ‘మేమందరం ఇక్కడ ఇంతమందిమి పోగుబడ్డాం” అని కబురందించాలంటే వాటితో అవే మాట్లాడుకోవాలి. Distributed systems మీద కొద్దిపాటి అవగాహనున్నవాళ్ళుక్కూడా అది research topic అన్న విషయం అర్ధమవుతుంది.

    సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో “షేరు”లన్నీ మళ్ళీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే లైకుతుంటారు. ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా? అంతా భజన! మోదీ ఏం చేసినా “అంతా మన మంచికే”. ఆయనగారు రేపు రాజధానిని ఢిల్లీనుంచి, దేవగిరికిమార్చినా దాన్ని స్వాగతిస్తూ అమిత్ షా ఒక పదిసార్లు ట్విట్టరు హ్యాండిల్‌ని వాడుతూ ట్వీటుతారు. సినిమావాళ్ళు, రాజాకీయనాయకులూ మెచ్చుకుంటారు. ఒక్క ఆర్ధికవేత్త ‘ఇది పనికొచ్చేది’ అని అనడు. భజనమాత్రం సాగుతూనే ఉంటుంది.

  3. మనీ సర్జికల్ స్ట్రైక్ సర్జరీలో గబ గబా నాణ్యత లేని 2000 నోటు పెట్టేయడం వల్ల సెప్టిక్ అయే ప్రమాదం కనపడుతోంది.

  4. విశేషజ్ఞ గారు, ఏ చిప్‌నైనా లైవ్‌లో ఉంచడానికి బాటరీ అవసరం. ఆ బాటరీ లీక్ అవ్వకుండా ఎల్ల కాలం ఉంటుందా? GSM bug అనే పరికరం ఉంది. నువ్వు ఎవరి ఇంటిలో గానీ ఆఫీస్ గానీ అది పెట్టి, నీ ఇంటి లో కూర్చుని నీ మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళు మాట్లాడుకునే రహస్యాలు వినొచ్చు. అలాంటిది మావోయిస్ట్‌లు పోలీస్ స్టేషన్‌లో వదిలి వెళ్ళి పోలీసుల కదలికల గురించి తెలుసుకోవాలనుకోగలరు. కానీ దాని బేటరీ వారం లేదా పది రోజులు వరకే పని చేస్తుంది. విమానంలో పైలట్ల మాటలు రికార్డ్ చేసే బ్లాక్ బాక్స్ సిగ్నల్సే విమానం కూలిపోయిన చాలా రోజుల తరువాత ఆగిపోతాయి. కరెన్సీ నోట్‌లో పెట్టొచ్చనుకున్న నానో చిప్ బాటరీ ఎంత కాలం పని చేస్తుంది, దాని సిగ్నల్స్ ఎన్ని రోజులు వస్తాయి అనేది వాళ్ళు చెప్పలేదు. రెండు వేల రూపాయల నోట్ వల్ల బ్లాక్ మనీ తగ్గుతుందని జనాన్ని నమ్మించే నరేంద్ర మోదీని రక్షించే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఉండినారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s