
డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ కు 45వ అధ్యక్షులు కానున్నారు. ఈ మాటలు నేడు 324 మంది అమెరికన్ల హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది, కొందరు దిగ్భ్రాంతికి లోనై నిరుత్సాహానికి గురి కాగా ఇతరులు సంతోషంలో మైరిచిపోయారు. ఆశ్చర్యకరమైన ఫలితాల పట్ల వ్యక్తం అవుతున్న భావోద్వేగాల లోని ఈ శుద్ధ భిన్నత్వమే దేశం, రెండు సంవత్సరాల పాటు భిన్న ధ్రువాల వైపుగా సాగిన ఎన్నికల ప్రచారం అనంతరం, ఎంత లోతుగా విభజనకు గురై ఉన్నదో తెలియజేసేందుకు చురుకైన సంకేతం. ఈ సీజన్ అంతటా తమ వికార శిరస్సులను పైకి లేపిన దురభిమానం, పితృస్వామికత్వం, జాతి విద్వేష పూరిత విరోధం… ఇవన్నీ ట్రంప్ దైవారాధన నేపథ్యంలో ఆహ్వానించదగిన ప్రక్షాళనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 58 శాతం శ్వేత ప్రజలు, 21 శాతం శ్వేతేతరులు ట్రంప్ కి ఓటు వేయగా 37% శ్వేత ప్రజలు, 74% శ్వేతేతరులు డెమొక్రటిక్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కి ఓటు వేశారు. ఆయన మహిళల కంటే పురుషులలోనూ, కాలేజీ డిగ్రీ లేని వారిలోనూ ఎక్కువ ఓట్లు సంపాదించగలిగారు. మరో విధంగా చెప్పాలంటే, దేశ రాజకీయ మరియు ఆర్ధిక సంపన్నుల వల్ల తాము దరిద్రం ఎదుర్కొంటున్నామని, అవకాశాలు కోల్పోయామని భావిస్తూ (perceived impoverishment and disnfranchisement) బ్లూ కాలర్ శ్వేత పురుషులు మరియు స్త్రీలు గుంపులుగా ట్రంప్ కి ఓటు వేసేందుకు తరలి వచ్చారు. అది వారికి ఒకే ఒక అవకాశాన్ని మిగిల్చింది: ఈ అధికార కేంద్రాలపైకి (అలంకారయుత) గ్రెనేడ్ విసరడం.
దిగ్భ్రాంతి కరమైన ఫలితానికి పునాది, అనేక మంది విశ్లేషకులు అభివర్ణించిన “నిశ్శబ్ద మెజారిటీ”ల ఓటు నుండి ఉద్భవించిన ఆ దిగ్భ్రాంతియే. గాలి ఎటు వైపు వీస్తున్నదో పసిగట్టడంలో అమెరికన్ మీడియా మరియు ఎన్నికల నిపుణులు ఎందుకు విఫలం అయ్యారు? క్లింటన్ అత్యంత ఆమోదనీయమైన వ్యక్తి అని వివిధ అభిప్రాయం సేకరణలు సూచించినప్పుడు, ఈ అభిప్రాయం సేకరణలలో అభిప్రాయం చెప్పినవారిలో అనేకులు ట్రంప్ కి మద్దతుదారులముగా చెప్పుకోవటానికి ఇష్టపడి ఉండకపోవచ్చని బహుశా వారికి తట్టలేదు. ఉదాహరణకి తాను లైంగిక దాడి చేసానని ట్రంప్ గొప్పలు చెప్పుకున్న సంగతి వెల్లడై, ఆ విషయమై ఆరోపణలు కూడా ఎదుర్కొన్న తర్వాత ట్రంప్ కి ఓటు వేసిన మహిళల్లో 42 శాతం తాము ట్రంప్ మద్దతుదారులం అని వెల్లడి చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తున్నది. సరిగ్గా పరిగణనలోకి తీసుకోని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతి స్వింగ్ స్టేట్ లోనూ అక్టోబర్ చివరి నాటికి ఎటు ఓటు వేయాలో తేల్చుకోని ఓటర్లు 11 నుండి 18 శాతం వరకు ఉండటం -వారిలో గణనీయ మొత్తం ట్రంప్ వైపుకి మొగ్గారు. ఈ ఎన్నికల్లో వ్యక్తీకరించబడిన నిరాశ, నిస్పృహలు రాజకీయ సవ్యత (political corectness) కు వ్యతిరేకంగా ప్రతిబింబించినంతమేరకు ట్రంప్ విజయం బ్రెగ్జిట్ ని పోలి ఉన్నది. అయితే, తన విజయ ప్రసంగంలో పరస్పర నిందా ప్రచారం నుండి ట్రంప్ చాలా త్వరగా ముందుకు కదిలి సాగిపోయినట్లు కనిపిస్తున్నది; ఇంట (అమెరికాలో) ఉద్రిక్త భావనలను మరియు ఎన్నికలను దూరం నుండి ఉద్విగ్నంగా గమనిస్తున్న ప్రపంచ నేతలను చల్లబరచడంలో ఈ సమాధాన పూర్వక స్వరం పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఆయన నిజంగానే ఇంటా బయటా సున్నితమైన, మరింత సహకారపూర్వక వైఖరిని కనబరిచేటట్లయితే అమెరికాలోని విభజనకు గురయిన రాష్ట్రాలు గట్టిగా నిలబడి, గతంలో చేసినట్లుగానే, ప్రపంచ క్రమానికి (global order) బలం చేకూర్చుతుంది.
*********
సరిగ్గా గమనిస్తే పశ్చిమ పత్రికల ట్రంప్ వ్యతిరేక ప్రచారాన్ని ద హిందూ పత్రిక యధాతధంగా స్వీకరించినట్లు గ్రహించవచ్చు. ఓటర్ల నాడిని ఎందుకు పసిగట్టలేకపోయారని అమెరికన్ మీడియాను ప్రశ్నించిన సంపాదకీయం బలహీనమైన దారాన్ని కష్టపడి వెతికి పట్టుకున్నదే తప్ప అమెరికన్ సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలోని మౌలికమైన ఆర్ధిక లోపాలను, క్లింటన్ సొంతం చేసుకున్న యుద్ధోన్మాద భావ దారిద్య్రాన్ని మాత్రం వదిలిపెట్టింది. వాల్ స్ట్రీట్ కంపెనీలు, అమెరికన్ మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్ లకు ప్రతినిధిగా అమెరికన్లు క్లింటన్ ను గుర్తించినందునే ఆమెకు వ్యతిరేకంగా ట్రంప్ కి పట్టం గట్టిన సంగతిని విస్మరించింది. బ్రిటిష్ శ్రామిక వర్గాలు ఈయూ కార్మిక వ్యతిరేక, సంపన్నుల అనుకూల విధానాల పట్ల అసంతృప్తితో ఇచ్చిన బ్రెగ్జిట్ ఓటును ‘ప్రగతి వ్యతిరేక’ ఓటుగా తిరస్కరించినట్లుగానే అమెరికన్ శ్రామిక వర్గం క్లింటన్ కూ తద్వారా అమెరికన్ సంపన్న వర్గాల దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఓటును కూడా హిందూ తిరస్కరిస్తున్నది. ఆ విధంగా పత్రిక తాను ఎటువైపో చాటుకున్నది.
ఇలా చెప్పడం అంటే మహిళలకు వ్యతిరేకంగా, చులకనగా వ్యాఖ్యానించిన ట్రంప్ ను, సంపన్న-దోపిడీ వర్గంలో భాగమైన ట్రంప్ ను సమర్ధించటానికి కాదు. ఆ మాటకు వస్తే హిల్లరీ క్లింటన్ మొహమాటం లేకుండా ‘అమెరికా ప్రత్యేకత’ (American Exceptionalism) ను వెనకేసుకు రావటాన్ని వీరందరూ ఎందుకు తప్పు పట్టడం లేదు? గతంలో లాగానే ప్రపంచ క్రమానికి బలం చేర్చాలని ట్రంప్ మద్దతుదారులను, సో-కాల్డ్ డివైడెడ్ స్టేట్స్ నూ హిందూ కోరుతోంది. పత్రిక కోరుతున్న గ్లోబల్ ఆర్డర్ లో… అమెరికాయే పెత్తందారీ దేశం. ఇతర దేశాలన్నీ అసమాన, అనుచర, సేవక దేశాలే. ఈ ఆర్డర్ ని ప్రశ్నిస్తే, తిరస్కరిస్తే, ప్రతిఘటిస్తే వాళ్ళు ప్రపంచానికి శత్రువులే. వారిని ఎలాగైనా మట్టు బెట్టాలి. టెర్రరిస్టులను ప్రవేశపెట్టి, స్వతంత్ర దేశాలను అస్ధిరం చేయటం ద్వారా, కుక్కలు చింపిన విస్తరులు చేయడం ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టాలి. ఇటువంటి గ్లోబల్ ఆర్డర్ కు మద్దతు ఇవ్వటం, కొనసాగాలని కోరడం దారుణం.