అదిగో పులి అనే వాడు ఒక్కడుంటే, ఇదిగో తోక అని వేల మంది కేకలు వేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ యుగంలో ఇది వేలం వెర్రి అయిపోయింది.
ఎవరో ఏదో గొప్ప పని చేసేశారనీ, అదేదో అద్భుతం జరిగిపోతోందనీ, ఇంకేదో జరగరాని ఘొరం జరిగిపోయిందని ఒక బొమ్మ, ఒక చాత్రం (పిట్ట కధ)… ఎవరు పోస్ట్ చేసినా సరే, వెనకా ముందూ చూడకుండా షేర్ చేసెయ్యడం, బైట నలుగురికీ చెప్పి అబ్బురపరిచి తానూ అబ్బురపడిపోవడం…!
పొద్దుట్నుంచి ఒకటే రొద! ఆఫీసుల్లో రోడ్ల పైనా, సెంటర్లలో, టీ కొట్ల దగ్గరా… ఇలా నలుగురు ఎక్కడ చేరితే అక్కడ ఒకటే చెప్పుకోవడం…
కొత్తగా వచ్చే రు 2,000 నోటులో ఎలక్ట్రానిక్ చిప్ ఒకటి పెట్టబోతున్నారనీ; దాని వల్ల దొంగ నోటు తయారు చేయడం కుదరనే కుదరదనీ; కట్టలు కట్టలు దాచి పెట్టడం వీలే కాదనీ; 170 (ఈ అంకెని కనిపెట్టినవాడిని చెప్పుకోవచ్చు) అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టినా ఇట్టే కనుక్కోవచ్చనీ; నేల మాళిగల్లో దాచినా కనిపెట్టవచ్చనీ…
ఎవరు కనిపెడతారుట? భూమి మీద నిలబడ్డ మానవుడు కాదు సుమా, ఏకంగా శాటిలైట్లే కనిపెట్టేస్తాయట! ఆ చిప్ వల్ల ఒక నోటు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లింది, ఎన్ని చేతులు మారింది… అన్నీ రికార్డు చేసేస్తుందట!
ఎవరు….? ఇంకెవరు శాటిలైట్! మోడి అధికారం లోకి వచ్చాక ఎన్ని శాటిలైట్ల ప్రయోగాలు విజయవంతం కాలేదని! అవన్నీ మోడి వల్లనే విజయవంతం అయినట్లూ, అంతకు ముందు అన్నీ విఫలం అయినట్లూనూ…
అది సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేసినవాడిదే పాపం అంతా. ‘అదెట్లా సాధ్యం’ అని అడిగితే వాడొక వెర్రి వెంగళప్ప! అసలదేం ప్రశ్న అన్నట్లుగా పిచ్చోడ్ని చూసినట్లు చూడటం.
అర చేతిలోకి కంప్యూటర్ (అదేనండీ, మొబైల్ ఫోన్) వచ్చిన ఈ రోజుల్లో 2000 నోటు కాగితంలో ఎలక్ట్రానిక్ చిప్ పెట్టలేరా? నానో టెక్నాలజీ రాజ్యమేలుతున్న యుగంలో చిన్న పేపర్ ముక్కలో చిప్ పెట్టలేరా?
ఎన్నో నోట్లు ముద్రిస్తారు కదా, అన్నింటికీ చిప్ లు పెట్టడం సాధ్యమా, అసలు కాగితంలో చిప్ ఎలా పెడతారు? ఒక వేళ పెట్టినా అంత ఖర్చు ఎక్కడ నుంచి భరిస్తారు? ఈ ప్రశ్నలు వేసినందుకు అవివేకుల్ని చేసారే గానీ సాధ్యాసాధ్యాల గురించి కాస్త ఆలోచించినవారు దాదాపు లేరు.
వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్… ఒకటేమిటి, షేర్లే షేర్లు. స్టాక్ మార్కెట్ షేర్లు అనుకునేరు! పంచుకోవడం అనే షేర్.
ఈ గాలి దుమారం ఎంత దట్టంగా చెలరేగిందీ అంటే, ఢిల్లీలోని రికార్డు స్ధాయి కాల్యుష్యపు పొరల్ని కూడా దాటుకుని వెళ్ళి ఆర్‌బిఐ గవర్నర్ దిమ్మ గిర్రున తిప్పేసేటంత!
ఆ దెబ్బకి ఆర్‌బిఐ స్వయంగా రంగంలోకి దిగక తప్పలేదు.
“అదేం లేదు జనులారా, అదంతా ఒట్టి పుకారు” అని ఆర్‌బిఐ ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 10 తేదీ నుండి చలామణి లోకి వచ్చే రు 2000/- నోటులో ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్ ఉండదని తేల్చి చెప్పింది.
“రు 2,000 నోటుకు సంబంధించి వివరాలను మేము ఇప్పటికే విడుదల చేశాము. అందులో పేర్కొన్న భద్రతా లక్షణాలే పెద్ద నోటుకు ఉంటాయి. అంతకు మించి ఏవీ ఉండవు” అని ఆర్‌బిఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
“అయినా, మేము చెప్పిన వివరాల్లో ఎలక్ట్రానిక్ చిప్ గురించి ఏమీ చెప్పలేదు కదా!” అని ఆర్‌బిఐ గుర్తు చేసింది. మేము చెప్పని వివరాన్ని మీరు ఎలా నమ్ముతారు? అని పరోక్షంగా ప్రశ్నించింది. “మా ట్విట్టర్ అకౌంట్ లో కూడా మా ప్రకటనలు ఉన్నాయి చూసుకోండి” అని హెచ్చరించింది.
కాబట్టి మిత్రులారా, పులీ లేదు, తోకా లేదు.
నిజానికి నల్లడబ్బు కనిపెట్టడానికి చిప్ అవసరంలేదు.
ఫలానా వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఎంత ఉందో ఎక్కడ ఎలా దాచారో వాళ్ళ కంటే మిగతా అందరికే బాగా తెలుసు.
ఆ గుట్టు మట్టులన్నీ సవివరంగా రోజూ వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాం.
ఈ విషయం తెలిసే ఇంకా చిప్ ఎందుకు దండుగ అని వాళ్ళు దాని జోలికి వెళ్ళడం లేదు.
నమ్మే ప్రజలందరూ కామెడీని కంటిన్యూ చేయవలసినది.
శ్రీకాంత్ గడ్డిపాటి.