అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డోనాల్డ్ అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపు బాటలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలు అన్నింటిలో హిల్లరీ క్లింటన్ పై చేయి సాధిస్తే అసలు ఫలితాల్లో మాత్రం హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ ఫలితాలతో ఆసియా షేర్ మార్కెట్లలో ఊచకోత మొదలయింది. రక్తపాతం జరుగుతోంది. (షేర్ మార్కెట్లు భారీగా కూలిపోతే దాన్ని బ్లడ్ బాత్ గా పశ్చిమ పత్రికలు చెబుతాయి.)
కడపటి వార్తలు అందేసరికి ట్రంప్ ఖాతాకు 244 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు దక్కగా హిల్లరీ క్లింటన్ కు 215 సీట్లు దక్కాయి. అధ్యక్ష పదవి వరించాలంటే మొత్తం 538 సీట్లలో కనీసం 270 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
ఎన్నికల ముందు సర్వేలు వాస్తవానికి ఆ సర్వేల నిర్వాహకులైన కార్పొరేట్ మీడియా సంస్ధల కోరిక మాత్రమేనని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ గెలుపుని ఇచ్చగించని మీడియా కంపెనీలు క్లింటన్ కి ఆధిక్యం అప్పజెప్పి సంతృప్తి పడ్డాయి. సర్వేల పేరుతో అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు తెగించాయి. కానీ వారి ప్రభావంలో పడేది లేదని ట్రంప్ కే ఆధిక్యం కట్టబెట్టడం ద్వారా అమెరికన్ ఓటర్లు చాటి చెప్పారు.
స్వింగ్ స్టేట్స్ గా పేరు పొందిన రాష్ట్రాలు ట్రంప్ కే ఆధిక్యం కట్టబెట్టినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్లోరిడా, ఓహియో, లోవ, నార్త్ కరోలినా రాష్ట్రాలు ట్రంప్ కైవసం అయ్యాయి. మిచిగాన్ రాష్ట్రంలోనూ ట్రంప్ వెలుస్తాడని ఫ్యాక్స్ న్యూస్ అంచనా వేస్తున్నది. స్వింగ్ రాష్ట్రాలలో ఎవరిదీ పై చేయి అయితే వారే అధ్యక్షులు కావటానికి ఎక్కువ అవకాశం ఉన్నదని అమెరికాలో ప్రతీతి. ఇవి క్లింటన్ వశం అవుతాయని సర్వేలు చెప్పగా అందుకు విరుద్ధంగా మెజారిటీ ట్రంప్ వైపు మొగ్గు చూపాయి.
ట్రంప్ గెలుపు సూచనలు అనుకున్నట్లుగానే మార్కెట్లలో రక్తపాతం సృష్టించింది. ఆసియా మార్కెట్లు దభేల్ మని కూలిపోయాయి. ఆరంభంలో 6 శాతం వరకు పడిపోయాయి. భారత మార్కెట్లు 3 శాతం పైగా పడిపోయాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 270 పాయింట్లు పైగా నష్టపోయింది. S & P 500 ఫ్యూచర్స్ మార్కెట్ 5 శాతం పడిపోయింది. మెక్సికన్ కరెన్సీ పెసో తన లైఫ్ లోనే అత్యధిక శాతం పడిపోయిందని పత్రికలూ చెబుతున్నాయి
ట్రంప్ గెలుపు సూచనలతో ఆయన మద్దతుదారులు పండగ చేసుకుంటున్నారు. హిల్లరీ మద్దతుదారులు కన్నీళ్లు కారుస్తున్నారు.
సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ లలో కూడా రిపబ్లికన్లదే పై చేయి అవుతున్నదని తెలుస్తోంది.
Update: Mr Donald Trump wins the election. He got 276 electoral college seats. This can be called Brexit verision 2.0