అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు


డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక ఆరోపణలు ఆయనపైన గుప్పించారు. పాత చరిత్రలు తవ్వి తీశారు. ఎక్కడా లేని బురదా తెచ్చి జల్లారు. ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పించారు. అయినా ట్రంప్ గెలుపు ఆగలేదు.

మొత్తం వాల్ స్ట్రీట్ అంతా కట్టగట్టుకుని హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డా ఆమెను గెలిపించలేకపోయింది. ఆమె వాల్ స్ట్రీట్ మనిషి అన్న నిజమే అమెరికా శ్రామిక ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టింది.

2008-09 ఆర్ధిక సంక్షోభం నుండి బైట పడ్డాం అని పాలక వ్యవస్ధ అంతా చెప్పింది. కానీ జనం మాత్రం ఉద్యోగాలు లేక, కొత్త ఉపాధి దక్కక దరిద్రంలోకి వెళ్ళిపోయారు. బడా కంపెనీలు ఎప్పటిలాగా లాభాలు నమోదు చేస్తుంటే జనానికి మాత్రం ఉపాధి దక్కలేదు.

సాధారణంగా సంక్షోభం అనంతరం వచ్చే బూమ్ దశ ఉపాధి పెరగడంతో కూడుకుని ఉంటుంది. కానీ బూమ్ వచ్చిందని చెప్పారు గానీ ఉపాధి అందుకు సాక్షం ఇవ్వలేకపోయింది. వాళ్ళు చెప్పిన వృద్ధి ‘జాబ్ లెస్ గ్రోత్’ గా స్ధిరపడిపోయింది.

ఎడ తెగని యుద్ధాలు అమెరికన్ ప్రజలను నీరసపరిచాయి. 9/11 దాడులు జరిగిన దగ్గరి నుండి ఒకటే యుద్ధం. నిరంతర యుద్ధం. ఒకదాని తర్వాత మరొక యుద్ధం. ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి. అంతులేని మానవ హననం. అయినా యుద్ధాల నుండి వెనక్కి తగ్గని పాలక వ్యవస్ధ.

అటువంటి యుద్ధోన్మాద పాలక వ్యవస్ధకు హిల్లరీ ప్రతినిధిగా నిలిచారని అమెరికన్లు గుర్తించారు. ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ గా ఆమె వెలగబెట్టిన దర్జా, ఆ తర్వాత కూడా కొనసాగిన వాల్ స్ట్రీట్ సంబంధాలు, క్లింటన్ ఫౌండేషన్ – వాల్ స్ట్రీట్ ల సంబంధాలు… ఇవన్నీ ఆమెకు వ్యతిరేకంగా నిలిచాయి.

హిస్పానిక్ లు హిల్లరీకి మద్దతు వచ్చారు గానీ వారి మద్దతు సరిపోలేదు. ఒబామా పుణ్యమాని బ్లాక్ ఓటర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు గానీ వారిలో ఎక్కువమంది పోలింగ్ బూత్ లకు రాలేదు. వైట్ యువత డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చారు గానీ హిల్లరీ క్లింటన్ తో వారు కనెక్ట్ కాలేదని పత్రికలు ఇప్పుడు చెబుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడు అని ఒబామా, హిల్లరీలతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా నిరసించారు. మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చురుకుగా ట్రంప్ ఓటమికి కృషి చేసింది. ఆయన ఎప్పుడో మహిళల పట్ల చులకనగా మాట్లాడాడని పాత ఆడియో రికార్డ్ లు బైటపెట్టారు. ఆయన తమను అసభ్యంగా తాకాడు అని అనేక మంది మహిళల చేత చెప్పించారు. అమెరికాను చీకటిలోకి తీసుకెళ్తాడు అన్నారు. జాతి విద్వేషి అని ప్రచారం చేశారు.

ఈ వ్యతిరేక ప్రచారం ఎంతగా చేశారంటే, ఆ ప్రచారాన్ని అమెరికా కార్పొరేట్ మీడియా ఎంతగా నెత్తికి ఎత్తుకుని మొసింది అంటే…. తాము కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నామనీ, ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతున్నామనీ వాళ్ళే మర్చిపోయి, ఆ ప్రచారాన్ని తాము కూడా నమ్మడం మొదలు పెట్టారు. నమ్మేసి ట్రంప్ ఓటమి తప్పదని ఖాయం చేసుకున్నారు.

అందుకే ట్రంప్ గెలిచాడంటే పాపం పశ్చిమ మీడియా నమ్మలేకపోతున్నది. ప్రపంచం షాక్ కి గురయింది అంటూ తమ షాక్ ని ప్రపంచం మీద రుద్ది దుఃఖిస్తున్నాయి. ప్రపంచ నేతలు అంతా షాక్ తిన్నారు అంటూ హెడ్డింగ్ లు పెట్టి వార్తలు ప్రచురిస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ గతంలో రాజకీయాల్లో లేదు. ఎకాఎకిన ప్రైమరీల్లో గెలిచి అధ్యక్ష పదవికి పోటీలోకి వచ్చాడు. అందువల్లనే కాబోలు, ఆయన యుద్ధోన్మాదాన్ని నిరసించాడు. రష్యాతో తగవు మాని స్నేహం చేద్దాం అన్నాడు.

హిల్లరీ పక్షం ఇందులో నుండి కూడా అనుకూలతలను  వెతికింది. డొనాల్డ్ ట్రంప్ రష్యాతో కుమ్మక్కై ఎలక్షన్లను రిగ్గింగ్ చేస్తాడు అని ఆరోపించారు. శత్రువు రష్యాతో స్నేహం చేయడం ఏమిటని ప్రశ్నించారు. హిల్లరీ ప్రైవేటు కంప్యూటర్ లో దాగిన మోసాలను, ఆమె ఈ మెయిల్స్ వెల్లడి ద్వారా వికీ లీక్స్ ప్రచురిస్తే అది కూడా రష్యా పాపమే అని హిల్లరీ పక్షం ప్రచారం చేసింది.

ఎన్ని చెప్పినా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ లోని సంక్షోభం, ఆ సంక్షోభం వల్ల ఉపాధి కనుమరుగు కావటం, తమ ఉపాధి కనుమరుగైనా కంపెనీలు పచ్చగా వర్ధిల్లటం… ఇవన్నీ అమెరికా పాలక వ్యవస్ధ, వాల్ స్ట్రీట్ లకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడటానికి దారి తీసాయి.

సంక్షోభం నుండి గట్టేక్కే పేరుతో ట్రిలియన్ల కొద్దీ డాలర్లను వాల్ స్ట్రీట్ కంపెనీలను ఉద్ధరించే నిమిత్తం మార్కెట్లలో కుమ్మరించడాన్ని అమెరికన్లు 8 సం.లు గా చూస్తున్నారు. రెండు విడతలుగా పెద్ద మొత్తంలో విడుదల చేసిన 1.2 ట్రిలియన్ల బెయిలౌట్ నిధులు, రెండేళ్ల పాటు అమలు చేసిన క్వాంటిటేటివ్ ఈజింగ్ – QE (మొదట నెలకు 80 బిలియన్ల చొప్పున, ఆ తర్వాత నెలకు 40 బిలియన్ల చొప్పున) నిధులు అన్నీ కంపెనీలకు గుమ్మరించారు గానీ జనానికి ఫుడ్ స్టాంప్ లు మినహా ఒక్క పైసా ఇచ్చింది లేదు.

బెయిలౌట్లు, QE లతో పాటు 8 సం.ల పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటుని అత్యంత కనిష్ట స్ధాయి 0.25% వద్ద కొనసాగించి బండ్ల కొద్దీ నిధులని కంపెనీల ప్రయోజనాల కోసం కుమ్మరించారు. ఇప్పుడు కూడా వడ్డీ రేటు 0.5% వద్దనే ఉన్నది. వడ్డీ రేట్లు అత్యల్ప స్ధాయిలో ఉంచడం వల్ల ఆ డబ్బుతో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించి, ఫ్యాక్టరీలు-కంపెనీలు నడిపి ఉపాధి ఇవ్వాల్సి ఉండగా, కంపెనీలు అందుకు విరుద్ధంగా దానిని స్పెక్యులేటివ్ కార్యకలాపాలకే వినియోగించాయి. ఫలితంగా ప్రజలకు ఉపాధి దక్కకపోగా దరిద్రం దక్కింది.

ఈ నేపధ్యంలో అమెరికా శ్రామిక ప్రజలు అత్యధిక సంఖ్యలో ట్రంప్ కే ఓట్లు వేశారు. ట్రంప్ కి 276 ఎలక్తోరల్ కాలేజీ ఓట్లు దక్కగా హిల్లరీకి 218 దక్కాయి. ఇంకా మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడవలసి ఉన్నది. ఆ మూడింటిలోనూ ట్రంప్  ఆధిక్యంలో ఉన్నారని వార్తలు చెబుతున్నాయి. 538 ఓట్లలో అధ్యక్ష పదవికి అవసరమైన 270 ఓట్ల కంటే ఎక్కువగానే ట్రంప్ కి వచ్చినందున ట్రంప్ విజేతగా నిలిచాడు.

ట్రంప్ గెలుపు వల్ల అమెరికా శ్రామిక ప్రజలకు, ప్రపంచానికి ఏదో ఒరుగుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ హిల్లరీ క్లింటన్ కంటే నిస్సందేహంగా మెరుగే. రష్యాతో స్నేహ సంబంధాలు మెరుగుపరుస్తానని ట్రంప్ చెప్పినందున రష్యాకు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధోన్మాదం వెనక్కి మళ్లుతుందని, కనీసం నెమ్మదిస్తుందని పలువురు విశ్లేషకులు ఆశిస్తున్నారు. సిరియాలో టెర్రరిస్టులకు మద్దతు ఉపసంహరించడం ద్వారా ఆ దేశంలో శాంతికి సహకరిస్తాడని ఆశిస్తున్నారు.

ప్రపంచం నెత్తి మీద ఒబామా ప్రభుత్వం రుద్దిన ట్రాన్స్-పసిఫిక్ వాణిజ్య ఒప్పందం, ట్రాన్స్-అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్టనర్ షిప్ లకు వ్యతిరేకత ప్రకటించినందున ఆ మేరకు ఘర్షణ వాతావరణం ఉపశమిస్తుందని ఆశిస్తున్నారు.

కానీ ట్రంప్ కంటే అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం మరింత శక్తివంతమైనది. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పడం అంటే ఇజ్రాయెల్ ను అదుపులో పెట్టడం. అందుకు ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఇజ్రాయెల్ అణ్వాయుధ నిల్వలను అంతర్జాతీయ అణు సంస్ధ చేత తనిఖీ చేయించడానికి పూనుకున్నందుకు మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురయ్యాడు. అమెరికాలో ఇజ్రాయెల్ లాబీ అత్యంత శక్తివంతమైనది. అమెరికన్ మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రయోజనాలకు భిన్నంగా పోవడం అంటే కొండను ఢీ కొట్టడమే. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీలు, ఆయుధ కంపెనీలు ట్రంప్ విధానాలను ఒప్పుకోవు.

విదేశాలకు తరలిపోయిన కంపెనీలను వెనక్కి రప్పిస్తానన్న ట్రంప్ వాగ్దానాన్ని అమలు చేసేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలు అసలే ఒప్పుకోవు. అమెరికా కంపెనీలన్నీ లాభాల వేటలో పడి చౌక శ్రమ లభించే చైనా, ఇండియా, మెక్సికో తదితర దేశాలకు వెళ్ళాయి. తమ లాభాలను అవి వదులుకోవు. ఇరు పక్షాలు ఎక్కడో ఒక చోట రాజీ పడాలి. ఆ రాజీ కంపెనీలకు అనుకూలంగా ఉండి తీరాలి. లేదా ట్రంప్ ఏదో విధంగా పదవి నుండి తప్పుకోవలసి వస్తుంది. లేదా తప్పించబడతాడు.

అయితే అమెరికా ఆర్ధిక శక్తి క్షీణిస్తున్నది. ఐరోపాలోనూ అనేక దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడా ట్రంప్ తరహా రక్షణ (protectionist) ఆర్ధిక విధానాలు వల్లిస్తున్న పార్టీలకు ఆదరణ పెరుగుతున్నది. రష్యా మధ్య ప్రాచ్యంలో తన స్ధానాన్ని బలీయం చేసుకుంది. చైనా ఆర్ధిక శక్తి మరింత విస్తరిస్తున్నది. కొత్తగా మిలట్రీని కూడా విదేశాలలోని సైనిక స్ధావరాలకు తరలిస్తున్నది. ఈ  నేపధ్యంలో అమెరికాలో పరిణామాలు ఏ వైపుకి మళ్లుతాయన్నది అంత తేలికగా ఊహించలేము. కానీ అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు మాత్రం వెనక్కి మళ్ళే ప్రసక్తి లేదు.

హిల్లరీ మద్దతుదారుల దుఃఖం, ట్రంప్ మద్దతుదారుల ఆనందం ఏ స్ధాయిలో ఉన్నదో ఫొటోల్లో చూడండి.

 

2 thoughts on “అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s