
PM addressing nation
ఎన్‌డిఏ/బిజేపి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి.
ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది. పేదరిక నిర్మూలనకు అతి పెద్ద ఆటంకంగా పరిణమించిన అవినీతిని నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్లు 500/-, 1000/- లను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించినట్లు పత్రికలు చెబుతున్నాయి.
ద హిందు ప్రకారం ప్రధాన మంత్రి ఈ రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతను చాటారు. భారత దేశం ఇప్పుడు ప్రపంచంలో ‘బ్రైట్ స్పాట్’ గా అవతరించిందని ఆయన చెప్పుకున్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు చెబుతున్నాయని మోడి చాటారు.
ఇంతకీ భారత దేశం అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పవలసింది భారత ప్రజలా లేక ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులా?
నిరుద్యోగ సమస్య ప్రబలి పోవడంతో అనేక రాష్ట్రాల్లో అగ్ర కులాల యువతకు ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు తక్షణ లక్ష్యంగా మారడం ఎందుకు? వారు రిజర్వేషన్లను నిర్మూలించాలని లేదా తమకైనా రిజర్వేషన్లు ఇవ్వాలని భూములు, పరిశ్రమలపై ఆధిపత్యం కలిగిన కులాల యువత ఎందుకు నిలదీస్తున్నది?
ఎందుకంటే నిరుద్యోగ సమస్య, వ్యవసాయంలో ఆదాయం పడిపోతుండటం, స్వయం ఉపాధి రంగాలైన రిటైల్ అమ్మకాలు, ఆటో-ట్యాక్సీ మార్కెట్ ని కూడా విదేశీ కంపెనీలకు అప్పగించడం. ఈ మూడు కారణాలలో మొదటి రెండు దళితులు, దళితేతరులను ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని నిలబెడుతున్నాయి.
గుజరాత్ పటేళ్ళు, హర్యానా జాట్లు, మరాఠ్వాడా మరాఠాలు సాంఘికంగా అణచివేతకు గురయిన కులాలు కాదు, పేద కులాలు కూడా కాదు. పైగా భూములు, పరిశ్రమలు కలిగిన కులాలు. కానీ వారిలోనూ పేదలు ఉన్నారు. మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. వ్యవసాయం తలకు మించి భారం కావడంతో వారు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఉద్యోగాలన్నీ దళితులు రిజర్వేషన్ల ద్వారా కొట్టేస్తున్నారని వారిని రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయి. దశాబ్దాల తమ వైఫల్యాన్ని పాలకులు దళితుల మీదికి నెత్తివేస్తున్నారు. ఫలితమే రిజర్వేషన్ వ్యతిరేక ర్యాలీలు.
ఈ ర్యాలీలు ఏం చెబుతున్నాయి. ‘మాకు ఉపాధి లేదు మహా ప్రభో’ అని చెబుతున్నాయి. “వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు మహా ప్రభో’ అని చాటుతున్నాయి.
కానీ మోడి ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించే విధానానికి ముగింపు పలికింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటాలను విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు అమ్మేస్తూ ఉన్న ఉపాధిని కూడా హరించి వేస్తున్నది. రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీలను బాగా తగ్గించేసింది. గ్యాస్ సబ్సిడీలో కోత పెట్టింది. పెట్రోలు, డీజెల్ రేట్లు వరుసగా పెంచేస్తున్నది. అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయిన ఫలితాన్ని కూడా జనానికి దక్కకుండా పన్నులు పెంచి మోడి ప్రభుత్వం కాజేసింది. ఇప్పుడు అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నపుడు ఆ పన్నులు తగ్గించాల్సింది పోయి పెట్రోలు, డీజెల్ ధరల్ని పెంచుతున్నది.
ఈ విధంగా అన్ని వైపుల నుండీ ప్రజల జేబులకు మోడి ప్రభుత్వం చిల్లులు పెట్టింది. అటు ఉపాధి లేదు, ఇటు స్వయం ఉపాధిని విదేశీ కంపెనీలకి ఇచ్చేశారు.
మౌలికమైన ఈ చర్యలను దాచి పెట్టి ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకతను చల్లార్చడానికి తనను తాను ‘అవినీతి వ్యతిరేక ఛాంపియన్’ గా చాటుకోవడానికి 500/- 1000/- నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటిస్తున్నారు. ఇది రొంబ మోసం.
త్వరలో జరిగే పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో ఏఏపి పోటీ చేస్తున్నందున అక్కడ అవినీతి ప్రధాన సమస్య కానున్నది. ఈ దెబ్బతో అవినీతి వ్యతిరేక ప్రతిష్టని కొట్టెయ్యవచ్చు. పంజాబ్, గుజరాత్, యూపి ఎన్నికల్లో బ్రహ్మాండమైన స్కోరింగ్ పాయింట్ ని సాధించవచ్చు!
ఈ రోజుల్లో 500, 1000 నోట్లు రద్దు చేయడం వల్ల ఉపయోగం ఎంత వరకు ఉన్నది? దాదాపు ట్రాన్సాక్షన్స్ అన్నీ కార్డుల మీదుగానే నడిచిపోతున్న రోజులివి. ఏమి కొనాలన్నా ఇంటర్నెట్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్న రోజులు. చివరికి తిండి కూడా బహుళజాతి కంపెనీలు ఇంటికి తెచ్చి ఇస్తున్నాయి. ఈ పరిస్ధితిలో నోట్ల రద్దు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా?
నల్ల డబ్బు నిల్వదారులు తమ నల్ల డబ్బుని పెద్ద నోట్లలో కట్టలు కట్టి దాచుకుంటారని అవన్నీ రద్దవుతాయని సమర్ధకులు వాదించవచ్చు. నిజమే కావచ్చు.
ప్రధాని మోడి చర్య సత్ఫలితాల్ని ఇస్తే సంతోషమే. కానీ ఇస్తుందా?
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ కాలంలో రు 1000/- రు 500/- నోట్లని రద్దు చేశారు. కానీ ఆ తర్వాత కూడా అవినీతి వట వృక్షంలా విస్తరించిందే గానీ చావలేదే మరి? కనీసం తగ్గనైనా లేదే? పైగా “అవినీతి ప్రపంచం అంతా ఉన్నదే” అని ఇందిర ‘ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదు’ అని పరోక్షంగా చెప్పారు.
ఇప్పుడు మోడి ప్రభుత్వం తీసుకున్న చర్య కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది.
పౌరుల వద్ద వెయ్యి, 500/- నోట్లు ఉన్నట్లయితే వాటిని బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో మార్చుకోవటానికి డిసెంబర్ 31, 2016 వరకు సమయం ఇచ్చారు ప్రధాన మంత్రి. మార్చుకునే సమయంలో తమ తమ గుర్తింపులను రుజువు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్, పాన్ కార్డ్, వోటర్ ఐడి కార్డ్ లు చూపించి పెద్ద నోట్లను మార్చుకోవాలని ప్రధాని సూచించారు.
ఆధార్ కార్డు, వోటర్ ఐడి కార్డులు సంపాదించడం అవినీతిపరులకు అంత కష్టమా? ఆధార్ కార్డులు అంతగా వ్యాప్తిలోకి రాక మునుపే లక్షలాది బూటకపు ఆధార్ కార్డులు వ్యాప్తిలోకి వచ్చాయి. దొంగ నోట్లు ముద్రించగలిగిన వారికి ఆధార్ కార్డులు, వోటర్ ఐడి కార్డులు ఒక లెక్క కాదు.
నల్ల డబ్బు నిల్వ చేసుకున్నవాళ్లు పేదవారు కాదు, మధ్య తరగతి వారూ కాదు. కేవలం ధనిక వర్గాలే ఈ నోట్ల కట్టలని నిల్వ చేసుకుంటాయి. ప్రధాని మోడి తన ప్రసంగంలో ఇది కూడా చెప్పారు.
ఈ ప్రభుత్వాలని నడిపేదే ధనిక వర్గాలు. ఆ ధనిక వర్గాలే బ్లాక్ మార్కెట్లకు అధినేతలు. ఆ ధనిక వర్గాలే నల్ల డబ్బు నిల్వదారులు, ఆ ధనిక వర్గాలే ఎంఎల్‌ఏలు, ఎంపిలు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారులు, రాజకీయ నాయకులు. వారి నల్ల డబ్బుని డిసెంబర్ 31 లోపు తెల్ల డబ్బుగా మార్చుకునే అవకాశం కొత్తగా రాకపోతే అదే పదివేలు!
రష్యా విప్లవం విజయవంతమయ్యి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టామోలేదో,అటువంటి విప్లవం మనదేశంలో కూడా వస్తే ఎలా ఉంటుందో గానీ, పెద్దనోట్ల రద్దుద్వారా దేశ ప్రజలందరిలో చురుకు(చిన్నపాటి అలజడి) పుట్టించినట్లు ఒక కొత్త అనుభూతికి ప్రజలు లోనవ్వడం ఖాయం!