అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్


 

ఇటీవల అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికాపైనా అధ్యక్షుడు ఒబామా పైనా బహిరంగానే విరుచుకుపడుతున్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె తాజాగా మరో సారి విరుచుకు పడ్డాడు. ఇప్పటి వరకు దూషణలకు, సవాళ్లకు పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా చర్యల లోకి దిగినట్లు కనిపిస్తున్నది. 

ఫిలిప్పైన్స్ పోలీసుల వినియోగం కోసం అమెరికా నుండి భారీ మొత్తంలో రైఫిల్స్ కొనటానికి గతంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన బెట్టి మరో దేశం నుండి రైఫిల్స్ కొనుగోలు చేస్తామని డ్యుటెర్టె ప్రకటించాడు. ఖరీదైన అమెరికా రైఫిల్స్ బదులు తాము మరో దేశం నుండి కొనుగోలు చేస్తామని ప్రకటించాడు. 

“అమెరికా నుండే ఆ ఖరీదైన ఆయుధాలు కొనుగోలు చేయాలని మేము పట్టు బట్టబోము. వాటిని మేము ఎక్కడినుండైనా కొనే అవకాశం ఎప్పుడూ ఉన్నది. అమెరికా నుండి కొనుగోళ్లను రద్దు చేయాలని నేను పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాను. మాకు అమెరికా ఆయుధాలు అవసరం లేదు” అని డ్యుటెర్టె ప్రకటించాడు. 

సాధారణంగా అమెరికాతో ఒక ఒప్పందానికి వచ్చాక దానిని రద్దు చేసేందుకు ఏ దేశము సాహసించదు. రద్దు చేస్తే అమెరికా నుండి ప్రతీకార చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వారికి బాగానే తెలుసు. అలాంటిది చిన్న దేశం ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు అటువంటి సాహసానికి పూనుకోవడం మెచ్చదగిన విషయం. అయితే డ్యుటెర్టె ఆదేశాలు నిజంగా ఆచరణలోకి వచ్చేవరకు ఎదురు చూడవలసిందే. 

అమెరికా, ఫిలిప్పైన్స్ దేశాలు చారిత్రకంగా మిత్ర రాజ్యాలు. ఫిలిప్పైన్స్ కి చెందిన గత నేతలందరూ అమెరికా అడుగులకు మడుగులొత్తారు. డ్యుటెర్టె కుడా అదే బాటలో నడుస్తాడని భావించారు. అలాంటిది డ్యుటెర్టె అధికారం లోకి వఛ్చి రావడం తోనే ఒబామాను దూషించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 

డ్యుటెర్టె అధికారం చేపట్టేనాటికి దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా – చైనా ల మధ్య వైరం తారా స్ధాయిలో ఉన్నది. ఇప్పటికి అదే పరిస్ధితి కొనసాగుతున్నది. అమెరికా మద్దతు, ఆదేశాలతో గత ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు లో చైనాకు వ్యతిరేకంగా పెట్టిన కేసులో తీర్పు కుడా అప్పుడే వచ్చింది. ఆర్బిట్రేషన్ కోర్టు చైనాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ సముద్రంలో తనవి గా చెబుతున్న ద్వీపాలపై చైనాకు పూర్తి హక్కులు ఉన్నాయనడానికి తగిన చారిత్రక ఆధారాలు లేవని రూలింగ్ ఇచ్చింది. తద్వారా ఫిలిప్పీన్స్ క్లెయిమ్ చేస్తున్న ద్వీపాలు, సముద్ర భాగం ఆ దేశం కూడా తనవిగా చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది. 

ఆర్బిట్రేషన్ కోర్టు రూలింగ్ ను చైనా తిరస్కరించింది. అయితే కోర్టు తీర్పును తమకు అనుకూలంగా వఛ్చినప్పటికీ దానిని ఉపయోగపెట్టేందుకు డ్యుటెర్టె ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా చైనాతో స్నేహ సంబంధాలు తమ లక్ష్యం అని ప్రకటించాడు. దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటామని స్పష్టం చేసాడు. అప్పటి నుండి చైనా-ఫిలిప్పైన్స్ సంబంధాలు మెరుగుపడుతుండగా అమెరికా-ఫిలిప్పైన్స్ సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.

డ్యుటెర్టె అంతటితో ఆగలేదు. అమెరికా అధ్యక్షుడు ఒబామాను కనీసం మూడు సార్లు బహిరంగంగా తూలనాడాడు. టెర్రరిజాన్ని అమెరికా ప్రోత్సహిస్తున్నది ఒకసారి. ‘సన్ ఆఫ్ ఎ బి..’ అని ఒకసారి, ‘యూజ్ లెస్ ఫెలో’ అని ఒకసారి దూషించాడు. అయినప్పటికీ ఫిలిప్పైన్స్ తో ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా అమెరికా కిమ్మనలేదు. సమయం వచ్చినపుడు డ్యుటెర్టె పైన ఎదో విధంగా అమెరికా పగ తీర్చుకోవడం మాత్రం ఖాయం. 

“మేము రైఫిల్స్ సరఫరా కోసం మరో దేశాన్ని చూస్కుంటాము,. అమెరికా కంటే చౌకగా, మరింత సామర్ధ్యం కలిగిన రైఫిల్స్ చూసుకుంటాము” అని డ్యుటెర్టె ప్రకటించాడు. 

అధికారం లోకి వచ్చాక డ్యుటెర్టె మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించాడు. అనేక మంది స్మగ్లర్లను పోలీసులు వెంటాడి వేటాడుతున్నారు. పోలీసులు, స్మగ్లర్ల మధ్య ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. విచిత్రంగా అమెరికా ‘మానవ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయంటూ’ గడబిడ చేయడం మొదలు పెట్టింది. ఫిలిప్పైన్స్ మాదక ద్రవ్యాల మార్కెట్ పై అమెరికా వ్యాపారాలు ఏ విధంగా లబ్ది పొందుతున్నది అమెరికా ‘మానవ హక్కుల వాదన’ వెల్లడి చేసింది. 

మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారన్న పేరుతొ, డ్రగ్స్ మార్కెట్ కు సహకరిస్తున్నారన్న ఆరోపణతో అమెరికా వివిధ లాటిన్ అమెరికా దేశాలపై ఆంక్షలు విధించి దారిలోకి తెచ్చుకున్న ఉదాహరణలు అనేకం. పనామా అధ్యక్షుడు నోరిగా ను అరెస్టు చేసి తమ జైళ్లలోనే నిర్బంధించిన చరిత్ర అమెరికా సొంతం. అలాంటి అమెరికా ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తన దేశంలో మాదక ద్రవ్య స్మగ్లర్లపై చర్యలు తీసుకోవటాన్ని సహించలేకపోతున్నది. 

26,000 రైఫిళ్లను ఫిలిప్పైన్స్ కు అమ్మడానికి ఒప్పందం కుదరగా, డ్రగ్స్ పై యుద్ధంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా కాంట్రాక్టును సస్పెన్షన్ లో పెడుతున్నట్లు ప్రకటించింది. “అయితే మీ ఆయుధాలు మాకు అక్కర్లేదు పోమ్మ”ని డ్యుటెర్టె అమెరికాకు తానె తలుపులు మూసేసాడు. మానవ హక్కుల ఆరోపణలను తిరస్కరిస్తూ  అమెరికాతో “గో టు హెల్” అని చెప్పాడు. 

ఇటీవల చైనా సందర్శించిన డ్యుటెర్టె అక్కడ కూడా అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. వచ్చే రెండు సంవత్సరాలలో “మేము అమెరికా నుండి తెగతెంపులు చేసుకుంటాము. అన్ని సంబంధాలను రద్దు చేసుకుంటాము. మా దేశంలో ఉన్న అమెరికా సైనికులను పంపించేస్తాము. వారి సైన్యాలు మా దేశంలో అవసరం లేదు” అని ప్రకటించాడు డ్యుటెర్టె. దానితో చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి డ్యుటెర్టె సిద్ధం అయ్యాడని మరో సారి spashtaM అయింది. 

దక్షిణ చైనా సముద్రంలో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రధానంగా ఫిలిప్పైన్స్ పైనే ఆధారపడి ఉన్నది. డ్యుటెర్టె వల్ల అమెరికాకు ప్రాంతీయంగా తీవ్రంగా నష్టపోయే పరిస్ధితి వచ్చింది. అయితే అలాంటి పాలకులను చూస్తూ సహించడం అమెరికా నైజం కాదు. సద్దాం హుస్సేన్, కల్నల్ గడ్డాఫీ, హ్యూగో చావెజ్ లను చంపించినట్లే డ్యుటెర్టె ను అంతం చేసేందుకు ప్రయత్నాలు చేయవచ్చుఁ. లేదా అర్జెంటీనా, బ్రెజిల్, వెనిజులా (రాబర్ట్ మదురో) లకు మల్లె ఆయనను పదవీచ్యుతుడ్ని చేసేందుకు NGO ల ద్వారా కుట్రలు చేయవచ్చుఁ.

One thought on “అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s