హిందీ టెలివిజన్ చానెల్ ఎన్‌డిటివి ఇండియా ను నవంబర్ 9 తేదీన 24 గంటల పాటు ప్రసారం కాకుండా నిలిపివేయాలని నిర్దేశిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశం మీడియా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమే. జాతీయ భద్రత అంశానికి సంబంధించినంతవరకు భిన్నాభిప్రాయాన్ని సహించనట్లు కనిపించే ప్రభుత్వం నుండే ఈ సస్పెన్షన్ ఆదేశం వెలువడడంలో పాత్రికేయ రచనాంశాల పైన నిబంధనలు విధించే వైపుగా మొగ్గు చూపే కలత పూర్వక ధోరణి తొంగి చూస్తున్నది. పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్ధావరం పైన జనవరిలో జరిగిన టెర్రరిస్టు దాడికి సంబంధించి జరిగిన పరిణామాలను ప్రసారం చేయడం నుండి ఈ నిర్ణయం ఉద్భవించింది. టెర్రరిస్టు దాడిని న్యూట్రలైజ్ చేసేందుకు ఆపరేషన్ జరుగుతుండగా, మిలట్రీ సిబ్బంది మరియు పౌరుల భద్రతను ప్రమాదంలో పడవేసే విధంగా, సున్నితమైన సమాచారాన్ని వెల్లడి చేసే విధంగా వార్తా ప్రసారం చేసిందని చానెల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ ఆరోపణలను విచారించిన అంతః మంత్రిత్వ శాఖల కమిటీ ప్రకారం అక్కడ అందుబాటులో ఉన్న ఆయుధాగారం, ఆయుధాల వరుస, మిలట్రీ స్ధలాలను చూపడం వల్లా, ఆ సమీపంలోనే పౌర నివాసాలు ఉన్న సంగతిని వెల్లడి చేయడం వల్లా ఆ సమాచారాన్ని టెర్రరిస్టులు తమకు అనుకూలంగా వినియోగించుకుని ఉండేవాళ్లు. చానెల్ సమర్ధన ఏమిటంటే ఇతర మీడియా సంస్ధలు ప్రచురించని, ప్రసారం చేయని ఏ అంశాన్నీ తాము వెల్లడి చేయలేదు అని; తమ నివేదిక అంతా అధికారికంగా ఇచ్చిన సమాచారం మీదనే ఆధారపడి ఉన్నదనీ, మరియు అత్యంత బాధ్యతాయుతంగా ప్రసారం చేశామనీను.
నవంబరు 2008లో ముంబై టెర్రరిస్టు దాడులను మీడియా చూపిన విధానం వివాదాస్పదం అయిన దగ్గరి నుండి, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు మరియు బందీలుగా ఉంచుకున్న పరిస్ధితి ఏర్పడినప్పుడు బాధ్యతాయుతంగా, నిగ్రహంతో కట్టుబాటుతో మీడియా వ్యవహరించాలని ఒక అంగీకారానికి అంతా వచ్చారు. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ నెలకొల్పిన ‘న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ ఆధారిటీ, కొన్ని నియమ నిబంధనలతో ముందుకు వచ్చింది. మంత్రిత్వ శాఖ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం లోని ఆధారిటీని సంప్రదించి ఉండవచ్చు, లేదా న్యాయ నిర్ణయం చేసేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఉండవచ్చు. అందుకు బదులుగా, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు జరుగుతుండగా, అవి ముగిసే వరకూ ప్రత్యక్ష ప్రసారం చేయకుండా మొత్తం నిషేధం విధించడానికి వీలు కల్పించే జూన్ 2015లో ప్రవేశ పెట్టిన నిబంధనను అమలు చేసింది. టి.వి కార్యక్రమాల ప్రసారాన్ని నియమ్తృంచేందుకు లేదా నిషేధించేందుకు ప్రభుత్వానికి అధికారాలు కల్పించిన చట్టబద్ధ సూత్రాలను ప్రభుత్వం ఉల్లేఖించింది. అప్పీలు చేసుకునే అవకాశం ప్రస్తావన కూడా ప్రభుత్వం చేయలేదు. జరుగుతున్న ఆపరేషన్ ను బాధ్యతారాహిత్యంగా ప్రత్యక్ష ప్రసారం చేసినా పరిహారం ఉండరాదని ఎవరూ సకారణంగా వాదించబోరు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ పెనాల్టీని విధిస్తేనే సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎంత కొద్ది కాలం పాటైనా సరే ఒక చానెల్ ప్రసారాన్ని నిలిపివేయడం అన్నది చాలా తీవ్ర నిర్ణయమే కాక ఇతర న్యూస్ రూమ్ లు తమకు తాము సెన్సార్ విధించాలని హెచ్చరిక చేసినట్లుగా సంకేతాలు పంపుతుంది. మిలట్రీ సిబ్బంది లేదా పౌరులకు ఏ సమాచారం ప్రమాదకరంగా పరిణమిస్తుందో నిర్ణయించడానికి ప్రభుత్వాధికారులతో కూడిన కమిటీ ఆదర్శయుత సంస్ధ కాజాలదు. అది ఒక స్వతంత్ర వేదిక నిర్వర్తించవలసిన పని.
*********
ఎన్‌డిఏ/బిజేపి/మోడి ప్రభుత్వం తన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను క్రమంగా పెంచుకుంటూ పోతున్నదని చెప్పేందుకు తాజా చర్య తిరుగులేని సాక్షం. పఠాన్ కోట్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను దాడికి ముందే పంజాబ్ ప్రభుత్వం నుండి రిటైర్ అయిన ఒక ఎస్‌పి స్ధాయి అధికారి ఎదుర్కొన్నాడు. ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని టెర్రరిస్టులు చంపివేయగా ఆయన మాత్రం చావు నటించి ఎలాగో బైటపడ్డాడు.
వారిని ఉగ్రవాదులుగా గుర్తించిన ఆ మాజీ పోలీసు అధికారి వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కి ఫిర్యాదు చేశాడు. వాళ్ళు దాడి గురించి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడారని, వారు ఉగ్రవాదులు కావచ్చని తన అనుమానాల్ని బలంగా వ్యక్తం చేశాడు. ఆయన అనుమానాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టవలసిన పోలీసులు ఆయననే నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన ఉదంతాన్ని పత్రికలు వెల్లడి చేశాయి. కానీ ఈ ఉదంతం పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ఎందువలన?
నిజంగా ఉగ్రవాద దాడుల పట్ల అంత పట్టింపు ఉంటే సదరు పోలీసు అధికారిని నిర్బంధించిన పోలీసు అధికారులను ఎందుకు ప్రశ్నించలేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు ఆ విషయమే తెలియనట్లు కేంద్ర పరిశోధనా సంస్ధలు ఎందుకు ఊరుకున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే, అవి లభిస్తే, ఎన్‌డిటివి చానెల్ పై ‘ఒక రోజు నిషేధం’ వెనుక దాగిన ఉద్దేశం ఏమిటో అర్ధం అయినట్లే. కాగా ఎన్‌డిటివి చానెల్ పై నిషేధం లక్ష్యం నిస్సందేహంగా మొత్తం పత్రికా వ్యవస్ధకు ఇచ్చిన హెచ్చరిక. ప్రభుత్వం ఏది చెపితే దానినే నిజంగా ప్రచారం చేయాలన్నదే ఆ హెచ్చరిక!