న్యాయ వ్యవస్ధ లేకుండా చేస్తారా? -సుప్రీం కోర్టు


supreme-court

సాక్షాత్తు సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తేనే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల విన్నపాలకి దిక్కెవ్వరు?

“కర్ణాటక హై కోర్టులో మొత్తం ఒక అంతస్ధు అంతా తాళాలు వేసేశారు. ఎందుకంటే అక్కడ జడ్జిలు లేరు మరి. ఒకప్పుడు జడ్జిలు ఉన్నా కోర్టు రూములు ఖాళీగా లేని పరిస్ధితి ఉండేది. ఇప్పుడు కోర్టు రూములు ఉన్నాయి గాని, జడ్జిలు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కోర్టు రూములు మూసేసి న్యాయానికి తలుపులు వేసేస్తున్నారు” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ టి ఎస్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం పైన బహిరంగంగా విరుచుకుపడటం ఇది మూడోసారి. మీడియాతో పాటు కోర్టుల పైనా పగ బట్టినట్లుగా మోడి ప్రభుత్వం వ్యహరించడం ఇందుకు ప్రధాన కారణం.

గుజరాత్ అల్లర్లను, అల్లర్ల వెనక మోడి ప్రభుత్వం పాత్రను వెల్లడి చేసినందుకు మీడియాతో, టైమ్స్ నౌ లాంటి హిందూత్వ చానెల్ తో తప్ప, మాట్లాడటానికి కూడా ఇష్టపడని ప్రధాన మంత్రి పశ్చిమ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల ద్వారానే అధికారిక స్పందనలు ఇస్తున్నారు.

గుజరాత్ అల్లర్ల వెనుక ముఖ్యమైన దోషులను కనీస మాత్రంగా నైనా వెల్లడి చేసి శిక్షలు పడేలా చేయడానికి సుప్రీం కోర్టు ప్రధాన కారణంగా నిలిచింది. సాక్షులకు అనేక ప్రలోభాలకు గురి చేసి అనేక కేసులను నీరుగార్చి చర్యలు లేకుండా చేయడంలో సఫలమైన మోడి నేతృత్వం లోని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాక చేష్టలుడిగి చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఒక దశలో మోడి పైన కూడా విచారణ తధ్యం అని భావిస్తుండగా సిట్ సహకారంతో అది జరగలేదు.

కోర్టులను లొంగదీసుకునే కార్యక్రమం గత యూ‌పి‌ఏ హయాం లోనే ప్రారంభం అయింది. అయితే కాంగ్రెస్ తగవులాట అవినీతి కేసులకు, సంస్కరణల అమలుకు మాత్రమే పరిమితం అయింది. సంస్కరణల అమలుకు న్యాయ వ్యవస్ధ వ్యతిరేకం కానప్పటికీ సంస్కరణల నేపధ్యంలో జరిగిన అవినీతి కేసుల పైన సుప్రీం కోర్టు పట్టు పట్టడంతో సంస్కరణల అమలు ఆలస్యం కాక తప్పలేదు. ఈ నేపధ్యంతో పాటు సంస్కరణలను పరుగెత్తిస్తానని పశ్చిమ కార్పొరేట్లకు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన నేపధ్యంలో కూడా మోడి ప్రభుత్వం ఆది నుండీ కోర్టులతో ఘర్షణ వైఖరి చేపట్టింది.

ఉన్నత కోర్టుల్లో జడ్జిల నియామకాలపైనా తమకు అధికారం ఉండాలని మోడి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వచ్చింది. తదనుగుణంగా ‘ఎన్‌జే‌ఏ‌సి – నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ ను ఏర్పాటు చేసే చట్టాన్ని తెచ్చింది. జడ్జిల నియామక ప్రక్రియలో పార్లమెంటు, స్పీకర్ ల పాత్రను చొప్పించి తద్వారా రాజకీయ నాయకులకు న్యాయ వ్యవస్ధపై నియంత్రణ తెచ్చేందుకు పధకం పన్నింది. కోర్టులకు కూడా ఎన్‌జే‌ఏ‌సి లో స్ధానం కల్పించినప్పటికీ అంతిమ పరిశీలనలో దొడ్డిదారిన రాజకీయ నాయకులదే పై చేయి అయ్యేలా ప్రతిపాదనలు చేసింది.

ప్రమాదాన్ని పసిగట్టిన సుప్రీం కోర్టు ఎన్‌జే‌ఏ‌సి ఏర్పాటు చట్ట విరుద్ధం అని ప్రకటించింది. దానికి బదులు ఇంకేదన్నా ప్రతిపాదన చేస్తే చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వానికి ఆహ్వానం పలికింది. ప్రధాన మంత్రి మోడి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వానికి ఇది సుతరామూ గిట్టలేదు. అప్పటి నుండి సుప్రీం కోర్టును సాధిస్తూనే ఉన్నది. జడ్జిల నియామకంలో కొలీజియం చేసిన ప్రతిపాదనలకు కొర్రీలు పెట్టడం మొదలు పెట్టింది. దానితో హై కోర్టు, సుప్రీం కోర్టుల్లో అనేక ఖాళీలు ఉన్నా భర్తీ కానీ పరిస్ధితి నెలకొన్నది.

chief-justice-t-s-thakur

Chief Justice T S Thakur

ఇటీవల అలహాబాద్ హై కోర్టుకు 18 మంది జడ్జిల నియమాకాలను సుప్రీం కోర్టు ప్రతిపాదించగా అందులో 8 మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొన్నాళ్ళ తర్వాత ఆ 8 మందిలో ఇద్దరికీ మాత్రమే ఆమోదిస్తున్నట్లు కబురు పంపింది. ఈ నేపధ్యంలో కేంద్రం – సుప్రీం కోర్టు మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కాసింత కూడా ఆసక్తి చూపడం లేదు.

ఓ పక్క “న్యాయమూర్తుల నియామకానికి మేము అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాము” ప్రకటిస్తూనే దానిని వీసమెత్తు కూడా ఆచరణలో చూపేందుకు ప్రయత్నించడం లేదు.

ఈ పరిస్ధితుల్లో ఏడెనిమిది నెలల క్రితం ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఇద్దరూ ఆసీనులై ఉన్న ఒక సభలో చీఫ్ జస్టిస్ ఠాకూర్ కంట తడి పెట్టారు. జడ్జిలు లేకపోవడంతో కేసులు పరిష్కరించలేకపోతున్నామని, అధిక భారంతో సతమతం అవుతున్నామని ఆ సభలో చెప్పారు. దయ చేసి జడ్జిల నియామకం చేపట్టాలని కోరారు. ఆయనకు బదులిస్తూ ప్రధాని మోడి జడ్జిలు సెలవులపై వెళ్తున్నారని ఆక్షేపించడం బట్టి ఆయన ధోరణిని అర్ధం చేసుకోవచ్చు. వేసవి కాలం సెలవులు, చలి కాలం సెలవులు అంటూ వెళ్ళే బదులు కేసులు పరిష్కరించవచ్చు అన్నట్లుగా ఎత్తిపొడిచారు.

మోడి ఎత్తిపొడుపుకు సభ ముగిశాక విలేఖరులతో చీఫ్ జస్టిస్ బదులు ఇచ్చారు కూడా. సెలవుల్లో తామేమి విహార యాత్రలకు వెళ్ళడం లేదని వాదనలు ముగిసిన ప్రధాన కేసుల్లో తీర్పులు రాసేందుకు సెలవులను కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సెలవులను తీర్పులు రాయడానికి కేటాయించడం తప్ప మరోకందుకు వినియోగించగల లగ్జరీ తమకు లేదని, సెలవుల్లో కూడా తాము పని చేస్తూనే ఉన్నామని, చేయకపోతే కనీసం ఇప్పుడున్న స్ధితి కూడా ఉండబోదని ఆయన తెలిపారు.

ఆ తర్వాత మరో రెండు మూడు నెలలకు కోర్టు రూములోనే చీఫ్ జస్టిస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాగైతే తామే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుందని, కోర్టుకు ఆ అధికారం ఉన్నదని అటార్నీ జనరల్ కు స్పష్టం చేశారు. పరిస్ధితిని అంతవరకు రాణియ్యవద్దని హెచ్చరించారు. ‘ఇదిగో రేపో, మాపో’ అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏ చర్యా తీసుకున్న పాపాన పోలేదు. అదే మొండితనాన్ని, పంతాన్ని కొనసాగించింది.

ఫలితంగా ఈ రోజు కూడా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మరోసారి బరస్ట్ కావలసి వచ్చింది. “కేసుల పరిష్కారానికి ఇరు వైపులా గొప్ప ఆవేశం కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా ఆచరణలోకి వచ్చేసరికి ఏమీ జరగడం లేదు. ఎన్‌జే‌ఏ‌సి ని కొట్టివేసి 9 నెలలు పైనే గడిచినా కదలిక లేదు. కొలీజియం మీకు పేర్లు ఇచ్చి 9 నెలలు గడిచినా స్పందన లేదు. పేర్లపైన మీరు కూర్చొని ఉన్నారు. మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు?” అని చీఫ్ జస్టిస్ నిలదీశారు.

“వ్యవస్ధలో మీరు తెచ్చిన మార్పులు ఇవేనా? వ్యవస్ధలు మీరు తెచ్చిన విప్లవం ఇదేనా?” అని ఠాకూర్ ప్రశ్నించారు. “మేము అధికారం లోకి వచ్చాక వ్యవస్ధలో విప్లవాత్మక మార్పులు తెచ్చాము” అన్న ప్రధాన మంత్రి గొప్పలను చీఫ్ జస్టిస్ పరోక్షంగా గేలి చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఘర్షణ ఎంతకాలం కొనసాగిస్తుందో చూడవలసి ఉన్నది. జడ్జిల నియామకం కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళితే ఇక సంస్కరణల అవినీతి, శిక్షలు తర్వాత సంగతి, బైటపడే మార్గం కూడా ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s