
“ఛాతీలు గుద్దుకోవద్దని ప్రధాని మోడీ ఆదేశించారు.” వారం పది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశం నుండి బైటికి వచ్చాక కేబినెట్ మంత్రులు చెప్పిన మాట ఇది.
కానీ అప్పటి నుండి ఛాతీలు గుద్దుకోవడం, భుజాలు చరుచుకోవడం పెరిగిందే గానీ తగ్గలేదు. నిన్నటికి నిన్న రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ తన ఛాతీ తాను గుద్దు కోవడంలో కొత్త పుంతలు తొక్కారు. ఆయన తెలివిగా తనతో పాటు ప్రధాని మోడీని కూడా కలిపి సర్జికల్ స్ట్రైక్స్ తాలూకు క్రెడిట్ ఇచ్చేసుకున్నారు.
మరి బాగోదు అనుకున్నారో ఏమో కాస్త క్రెడిట్ సైన్యానికి కూడా దక్కుతుంది అని ప్రకటించారు.
“గతంలో అనేకసార్లు ఈ తరహా దాడులు జరిగాయి. కాకపొతే దాడుల నుండి కూడా రాజకీయ ప్రతిష్ట గుంజుకునే ప్రయత్నం చేయలేదంతే” అని కాంగ్రెస్ నేతలు యాష్ట పోయారు. కొంతమంది అసలు స్ట్రైక్స్ జరిగాయా అని ప్రశ్నిస్తూ, రుజువులు చూపాలన్నారు.
దానికి కూడా పారికర్ ఒకటి చెప్పారు. “కావాలంటే ఈ అనుమాన థామస్ లు (డౌటింగ్ థామస్ లు), 127 కోట్ల ప్రజలు కూడా క్రెడిట్ తీసుకోవచ్చు” అని తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
ఈ క్రెడిట్ గోల రాష్ట్రాల ఎన్నికలు జరిగే వరకు కొనసాగుతుంది. బహుశా వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదు. “ఛాతీలు గుద్దు కోవద్దు. అసలు క్రెడిట్ సైన్యానిదే అని ప్రధానితో సహా ఎవరన్నా ప్రకటించినా కూడా అది పరోక్షంగా దాడులను గుర్తు చేస్తూ క్రెడిట్ కొట్టేసే ఉద్దేశంతోనే జరుగుతుంది.
గతంలో చేసిన దాడులకు ఇప్పుడు తమ హయాంలో జరిగిన దాడులకు తేడా ఏమిటో ఆయన వివరించారు. “గతంలో జరిగినవి బోర్డర్ బలగాలు చేసిన దాడులు. వారు అప్పటికప్పుడు స్పందించి దాడులు చేశారు. అవి స్ధానిక స్వభావం కలవి. దాడులు చేసాక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేవారు.
“కానీ ఇప్పటి సంగతి అది కాదు. ప్రభుత్వమే మొదట సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను వారు అమలు చేశారు” అని సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ తమకు ఎందుకు చెందుతుందో వివరించారు పర్రికర్.
“మా ఆదేశాల మేరకే దాడి చేశారు కనుక క్రెడిట్ మాకే” అని పర్రికర్ చెబుతున్నారు. “దాడిలో పాల్గొన్నారు కనుక సైనికులకు కూడా కాస్త క్రెడిట్ ఇవ్వొచ్చు” అని ఆయన గారి ఉదారత! “మరీ ఏడవొద్దు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోండి” అని జనానికి భరోసా ఇస్తూ “అసలు క్రెడిట్ మాత్రం మా ప్రధానిదీ, మాదీనూ” అన్నది పర్రికర్ గారి కంఠ శోష!
ఆ కంఠ శోషకు అసలు అర్ధం ఏమిటో కార్టూన్ చెబుతున్నది!