యెమెన్ లో సౌదీ యుద్ధాన్ని ఆపండి! -ద హిందూ..


[Stop the Saudis war in Yemen సంపాదకీయానికి (అక్టోబర్ 13, 2016) యధాతధ అనువాదం.]

***

యెమెన్ లో 18 నెలలుగా సౌదీ అరేబియా సాగిస్తున్న మిలటరీ ఆపరేషన్, జనావాస కేంద్రాలపై దాడులతోనూ, మూకుమ్మడి చావుల తోనూ నిండిపోయింది. ఇటీవలి ప్రమాణాల ప్రకారం చూసినా కూడా సనాలో సంతాపం కోసం జనం చేరిన హాలుపై అక్టోబర్ 8 తేదీన, 140 మంది మరణానికీ 500 కు పైగా గాయపడేందుకూ -వారిలో అనేకమంది పౌరులు- దారి తీసేట్లుగా జరిగిన భయానక దాడి మున్నెన్నడూ ఎరగనిది. మార్చి 2015 లో మొదలైనప్పటి నుండి, అరబ్ దేశాలలో అత్యంత పేద దేశాలలో ఒకటైన యెమెన్ పై జరుగుతున్న ఈ క్రూర మిలట్రీ దాడి, మితి మీరిన (ఆయుధ) బలగాలను ప్రయోగిస్తున్నందుకు, యుద్ధ నేరాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలతో సహా సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా విమర్శలకు పురి గొల్పింది. కానీ సౌదీ అరేబియా విమర్శలను పట్టించుకున్నట్లు ఏమీ కనిపించడం లేదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన -దక్షిణాది నగరం ఏడెన్ నుండి నడుస్తున్న- అధ్యక్షుడు అబ్ద్-రబ్బు మన్సూర్ హది ప్రభుత్వానికి తాను రక్షణ ఇస్తున్నానని రియాద్ (సౌదీ అరేబియా) చెబుతున్నది. కానీ దేశం లోపల పెద్దగా మద్దతు లేనట్లు కనిపిస్తున్న ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తూ, రియాద్ మరియు దాని మిత్రులు యెమెన్ ను ఒక మానవతా వినాశనం కిందకు మార్చివేశాయి. సౌదీ జోక్యం ప్రారంభం అయిన తర్వాత 10,000 మందికి పైగా -వారిలో అత్యధికులు పౌరులు- చనిపోయారని, మిలియన్ల మంది స్వస్ధలాల నుండి తరిమివేయబడ్డారనీ ఐరాస అంచనా వేసింది. అంతే కాకుండా దేశంలో ఇప్పటికే క్షీణ స్ధితిలో ఉన్న ఆరోగ్య భద్రతా వ్యవస్ధ కూలిపోగా దాని ఆర్ధిక వ్యవస్ధ ధ్వంసమై రూపు రేఖలు కోల్పోయింది. యెమెన్ లోని 28 మిలియన్ల ప్రజల్లో సగం మందికి తగినంత ఆహారం లభించదు; 400,000 మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో తీసుకుంటున్నారు. వ్యూహాత్మక దృక్కోణంలో చూసినా కూడా సౌదీ జోక్యం ఘోర అనర్ధం. 18 నెలల పాటు తెంపు లేని బాంబింగ్ అనంతరం హౌతీలు తమ స్ధావరాలను -రాజధాని నగరంతో సహా- ఇప్పటికీ రక్షించుకోగలుగుతున్నారు. కాగా హది ప్రభుత్వం కేవలం కొన్ని పాకెట్ల నుండి మాత్రమే నడుస్తున్నది. అటు జనం పడుతున్న కష్ట నష్టాలు గానీ, ఇటు మిలట్రీ దాడుల వైఫల్యం గాని ఇతర పరిష్కారాల కోసం చూసేట్లుగా సౌదీ అరేబియాను ఒత్తిడి చేయలేకపోతున్నాయి.

ఎందుకంటే రియాద్ ఈ యుద్ధాన్ని ఇరాన్ తో తనకున్న వైరంలో భాగంగా చూస్తున్నది. హౌతీలను ఇరాన్ ఏజెంట్లుగా అది పరిగణిస్తున్నది. తన పెరడులో టెహ్రాన్ ప్రతినిధి (ప్రాక్సీ) ఉనికిలో ఉండటం దానికి ఇష్టం లేదు. కానీ తన సంకుచిత భౌగోళిక-రాజకీయాల పరిరక్షణ కోసం యెమెన్ ను మరింతగా నాశనం చేసేందుకు సౌదీ అరేబియాను అనుమతించరాదు. గూఢచార సమాచారాన్ని అందజేయడం ద్వారా, (సౌదీ బాంబింగ్) లక్ష్యాలను ఆమోదించడం ద్వారా వాషింగ్టన్ ఈ యుద్ధానికి మద్దతు అందిస్తున్నది. పైగా యెమెన్ లో సౌదీ ఆపరేషన్ ప్రారంభం అయిన నెలల తర్వాతనే ఒబామా ప్రభుత్వం రియాద్ తో 60 బిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకం ఒప్పందం కుదుర్చుకుంది. సనా బాంబింగ్ తర్వాత అమెరికా “తీవ్ర ఆందోళన” ప్రకటించింది గానీ ఎటువంటి చర్యకు ఉపక్రమించడానికి ఒక అడుగు ఇవతలే ఆగిపోయింది. అలెప్పోలో రష్యా బాంబింగ్ ను కారణంగా చూపిస్తూ సిరియా శాంతి చర్చల నుండి ఇటీవల ఉపసంహరించుకున్న అమెరికా, సౌదీలను అవే ప్రశ్నలను అడగాలి; యెమెన్ సంక్షోభానికి దౌత్య పరిష్కారం కనుగొనేందుకు రియాద్ తో తన సంబంధాలను ఉపయోగించాలి. యెమెన్ కు కావలసింది ఏమిటంటే హౌతీలు మరియు సౌదీల మధ్య కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత అన్ని పక్షాలు భాగస్వామ్యం వహిస్తూ చర్చలు చేయడం; మరిన్ని బాంబు దాడులు కాదు.

*********

జనరల్ పరిశీలనలో ఈ సంపాదకీయం మెచ్చదగినది. సిరియాలో అమెరికా అబద్ధాల ప్రచార వలలో తానూ పడిపోయినట్లు కనిపించే ద హిందు సంపాదకీయం (విచిత్రంగా ఫ్రంట్ లైన్ పత్రిక మాత్రం సిరియాలో అమెరికా దుర్నీతిని సమర్ధవంతంగా ఎండగడుతున్నది) యెమెన్ విషయంలో ఈ మాత్రం రాయడం ఎన్నదగినది.

సంపాదకీయంలో చెప్పని విషయం ఏమిటంటే (స్ధలాభావం రీత్యా పరిమితులు ఉండవచ్చు) యెమెన్ లో సౌదీ బాంబింగ్ కు చాలా కాలం ముందునుండే అమెరికా ఆ చిన్న దేశం పైన డ్రోన్ విమానాలతో అనేకమార్లు క్షిపణి దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ వాయవ్య గిరిజన ప్రాంతం పైనా, ఆఫ్ఘనిస్తాన్ లోనూ (తాలిబాన్ పైన అని చెబుతూ), సోమాలియా లోనూ (ఆల్-ఖైదా బ్రాంచి ఆల్-షబాబ్ టెర్రరిస్టులపై దాడి అని చెబుతూ), డ్రోన్ దాడులు నిర్వహించిన అమెరికా అదే సమయంలో యెమెన్ లోనూ డ్రోన్ లతో దాడులు చేసింది. ఇపుడు యెమెన్ తిరుగుబాటు బహుళ ప్రచారం పొందడంతో, విమర్శలకు జడిసి, డ్రోన్ దాడులు నిలిపివేసినట్లు కనిపిస్తోంది. డ్రోన్ దాడులకు బదులు ఇప్పుడు సౌదీ అరేబియా దాడులు చేస్తున్నదంతే!

ఇది భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోసం సాగిస్తున్న వినాశకర యుద్ధ క్రీడలో భాగం. అమెరికా దృష్టిలో చమురు దేశాలలో గానీ, వాటి చుట్టూ పక్కల గల చమురు వాణిజ్య మార్గాలు సాగే దేశాలలో గానీ అమెరికా, దాని మిత్ర దేశాలు తప్ప మరొకరి పాత్ర -ఆధిపత్యం తర్వాత సంగతి- ఉండటానికి వీలు లేదు. ఇరాన్ చమురు దేశమే. అమెరికా ఆదేశాలను అది పాటించదు గనుక దానిని ఒక రాకాసిగా, ప్రపంచానికి ప్రమాదకారిగా చూపాలి. ముస్లిం తీవ్రవాద భావాలకు తల్లిలాంటి వహాబీయిజాన్ని సౌదీ ప్రపంచం నిండా వ్యాపింపజేస్తున్నప్పటికీ తన మిత్ర దేశం కనుక దాని ప్రయోజనాలు కాపాడాలి.

యెమెన్ లో తిరుగుబాటు చేస్తున్న హౌతీలకు ఆ దేశంలో మెజారిటీ ప్రజల మద్దతు ఉన్నది. తమ పైన తమకు ఇష్టం లేని పాలకులను సౌదీ అరేబియా రుద్దడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల సౌదీ మద్దతు ఉన్న హదీ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. వారికి మాజీ అధ్యక్షుడు సలే మద్దతు ఇస్తున్నాడు. ఇరాన్ కూడా హౌతీలకు మద్దతు ప్రకటించింది. సౌదీ ప్రయోజనాలు అమెరికాకు కూడా ప్రయోజనాలే. కనుక సౌదీ బాంబింగ్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. సంపాదకీయం చెప్పినట్లుగా బాంబింగ్ కు అవసరమైన గూఢచార సమాచారం ఇస్తున్నది. బాంబింగ్ లక్ష్యాలను మొదట తానే ఆమోదిస్తున్నది.

అలాంటి అమెరికా సౌదితో తనకున్న పలుకుబడి ఉపయోగించి యెమెన్ లో శాంతి నెలకొనడానికి, కాల్పుల విరమణకూ, చర్చలు జరగడానికీ దోహద పడుతుందా? సిరియాలో కాల్పుల విరమణకు రష్యాతో ఒప్పందం చేసుకున్న రెండు రోజులకే తానే సిరియా సైన్యం పైన కాల్పులు జరిపి డజన్ల మందిని చంపేయడం ద్వారా ఆ ఒప్పందాన్ని తానే ఉల్లంఘించిన అమెరికా యెమెన్ లో కాల్పుల విరమణకు దోహదం చేస్తుందా?

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s