బషర్ ఇంటర్వ్యూ: ఇలాంటి నేత మనకి లేడు! -వీడియో


bashar-interview

సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ని ఒక రాక్షసుడిగా చిత్రీకరించడానికి అమెరికా, పశ్చిమ రాజ్యాలు చెప్పని అబద్ధం లేదు; చేయని కృషి లేదు; తిట్టని తిట్టు లేదు.

అదంతా ఒట్టి అబద్ధం అని ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్ధం అవుతుంది. అంతే కాదు, ఇలాంటి దేశ భక్తియుత నాయకుడు భారత దేశంలోని రాజకీయ పార్టీల్లో ఒక్కరంటే ఒక్కరూ లేరే అని తప్పనిసరిగా అనిపిస్తుంది.

సిరియా కిరాయి తిరుగుబాటు క్రమంలో సిరియా అధ్యక్షుడిని నేరుగా చంపేందుకే దాడి జరిగింది. ఈ దాడి సి‌ఐ‌ఏ తదితర పశ్చిమ గూఢచార ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఈ దాడి జరిగాక కూడా బషర్ ఆల్-అస్సాద్ తన కుటుంబానికి రక్షణ కల్పించలేదు. వారిని కాపాడుకోవటం కోసం విదేశాలకు పంపలేదు.

“మిమ్మల్ని హత్య చేసేందుకు దాడి జరిగినా కూడా మీ కుటుంబాన్ని విదేశాలకు ఎందుకు పంపలేదు? వాళ్ళని కాపాడుకోవాలని మీకు అనిపించలేదా?” అని ఇంటర్వ్యూ చేసిన రష్యన్ విలేఖరి ఆయనను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం:

“నా కుటుంబాన్ని బైటికి పంపితే నేను మా ప్రజలకు ఏమని సందేశం ఇచ్చినట్లు? నా కుటుంబాన్ని కాపాడలేని అశక్తతలో సిరియా మిలటరీ ఉన్నదని చెప్పినట్లే గదా! అధ్యక్షుడి కుటుంబాన్ని రక్షించలేని దేశ మిలట్రీ దేశాన్నేం కాపాడుతుందని ప్రజలు ప్రశ్నించరా? మిలట్రీ ప్రజల్ని కాపాడుతుందని అధ్యక్షుడే ధైర్యంగా తన ప్రజలకు చెప్పలేకపోతే ప్రజలు ఎవరి వైపు చూడాలి? నాకసలు ఆ ఆలోచనే ఇంతవరకు రాలేదు. నేను ఎన్నటికీ ఆ పని చేయలేను.”

సొంత పార్టీ నేతల దోషాలని, బంధువుల నేరాల్ని, సుపుత్రుల తప్పుల్నీ వెనకేసుకు రావడానికి, మాఫీ చేయడానికి, పోలీసుల నుండి తప్పించడానికీ సర్వ ప్రయత్నాలు చేస్తూ నానా గడ్డీ కరిచే నేతల మధ్య బ్రతుకుతున్న మనకు (బూర్జువా పాలకుల నుండి) ఇలాంటి నేత దొరుకుతాడా? చాలా కష్టం.

ఓపిక ఉంటే గనక ఈ ఇంటర్వ్యూని ఆద్యంతం శ్రద్ధగా చూడండి/వినండి. అమెరికా, సౌదీ, కతార్, ఇజ్రాయెల్, టర్కీలు స్వార్ధ ప్రయోజనాల కోసం ఏ విధంగా కబళిస్తున్నదీ, మానవ హననం సృష్టిస్తున్నదీ చక్కగా తెలిసిపోతుంది. ఎలాంటి అనుమానాలు ఉండబోవు.

ముఖ్యమైన విషయం! సిరియా కిరాయి తిరుగుబాటు విషయమై ఈ బ్లాగ్ ఇప్పటి వరకూ చేసిన విశ్లేషణలు అన్నీ ప్రత్యక్షర సత్యమేనని బషర్ ఇంటర్వ్యూ పొల్లు పోకుండా ధ్రువపరుస్తుంది.

బషర్ ఇంటర్వ్యూలోని ఒకటి, రెండు అంశాలు:

“ప్రాంతీయ ఘర్షణ గురించి చెప్పుకోవాలంటే, సిరియాకు ఇరాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇరాన్ ని పూర్తిగా నాశనం చేయాలని, వివిధ కారణాల వల్ల, కోరుకుంటుంది; బహుశా రాజకీయ దృక్కోణంలో కావచ్చు; భౌతిక అర్ధంలో కావచ్చు; నిజమైన అర్ధంలో కూడా కావచ్చు. కాబట్టి వాళ్ళు సిరియా, ఇరాన్ కి వ్యతిరేకంగా వెళ్లాలని కోరారు. అందుకే వాళ్ళు సిరియాని నాశనం చేస్తే ఆ ప్రభావం ఇరాన్ పైన ప్రతికూలంగా పడుతుందని అంచనా వేయడం. నాకు కనిపిస్తున్నది అదే. పశ్చిమ దేశాల విషయానికి వస్తే, వారి దృష్టిలో సిరియా-రష్యాలు దశాబ్దాలుగా మిత్ర దేశాలు. కాబట్టి సిరియాను బలహీనపరిస్తే అది రష్యాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, తద్వారా రష్యాను బలహీనం చేయొచ్చని వారి నమ్మిక… …యుద్ధం మొదలయ్యాక సౌదీలు నేరుగా ఒక ఆఫర్ తో మా వద్దకు వచ్చారు. ‘మీరు ఇరాన్ కు దూరంగా జరిగితే, ఇరాన్ తో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నామని ప్రకటిస్తే, మేము మీకు సహాయం చేస్తాం’ అని చెప్పారు. చాలా మామూలుగా, చాలా నేరుగా చెప్పదలచుకున్నది చెప్పారు.”

తాజాగా ఇసిస్ పైన యుద్ధం ప్రకటించామని చెబుతున్న టర్కీ గురించి చెబుతూ:

“టర్కీ సిరియా పైన దురాక్రమణ దాడి చేస్తున్నది. మా దేశంలో కొన్ని పాకెట్లను ఆక్రమించింది…  ISIS ని వాళ్ళే తయారు చేశారు. ఇసిస్ కు వాళ్ళు మద్దతు ఇచ్చారు. అవసరమైన రవాణా-సరఫరా (లాజిస్టికల్) మద్దతుని ఇచ్చారు. మా చమురుని తమ సరిహద్దుల ద్వారా అమ్ముకోవడానికి ఇసిస్ ని అనుమతించారు. చమురు అక్రమ అమ్మకం వారి దేశంలోనే జరిగింది. ఎర్దోగన్ తనయుడు, ఆయన కోటరీ అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ (పశ్చిమ దేశాలు, కతార్, సౌదీ..etc) ఇసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నవాళ్లే. ప్రపంచం అంతా దీని గురించి తెలుసు. కానీ ఇప్పటి దురాక్రమణ ద్వారా వాళ్ళు ఇసిస్ ప్యాకేజీలో మార్పులు తేవాలని భావిస్తున్నారు. సిరియాలో కొన్ని భాగాల్ని ఆక్రమిస్తే అక్కడి నుండి ఇసిస్ ని తరిమేశామని (వాస్తవంగా తరమకుండానే) చెప్పుకోవచ్చు. తద్వారా ఇసిస్ టెర్రరిస్టులకు మోడరేట్ ముద్ర తగిలించవచ్చు. నిజానికి మోడరేట్ లు అంటూ ఇక్కడ ఎవరు లేరు. అంతా ఒకటే. వారి పునాది ఐడియాలజీ (సౌదీ) వహాబీజమే. ఇసిస్ నుండి తరలించి ఇంకో పేరు పెడితే వారే మోడరేట్లు”

అరబ్బులు/ముస్లింలు అయిన ఇసిస్ కి ఇజ్రాయెల్ ఎలా మద్దతు ఇస్తుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ:

“ఇసిస్ మాత్రమే కాదు, లేదా దాయిష్ మాత్రమే కాదు. ఆల్-నూస్రా మాత్రమే కాదు. ఏ టెర్రరిస్టు అయినా సరే, మెషీన్ గన్ చేతబట్టుకుని సిరియాలో చంపడం, నాశనం చేయడం మొదలు పెడితే వాడికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుంది. ఆ మద్దతు సరిహద్దు వద్ద రవాణా-సరఫరా లాంటి పరోక్ష మద్దతు కావచ్చు; కొన్నిసార్లు సిరియాలో వివిధ ప్రాంతాల్లో నేరుగా బాంబు దాడులకు పాల్పడే ప్రత్యక్ష చర్యల ద్వారా కావచ్చు.”

సిరియా కిరాయి యుద్ధంలో రష్యా పాత్ర గురించి చెబుతూ:

“క్లుప్తంగా చెప్పాలంటే, (రష్యా) జోక్యానికి ముందు, ఈ సో-కాల్డ్ అమెరికన్ అలయన్స్ ఉన్నా కూడా, -ఇది నాకు ఎక్కడా కనపడని అలయెన్స్, వాళ్ళు చేసింది అసలేమీ లేదు – (ఇసిస్ పై పోరాటం పేరుతో తాను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా చెప్పిన అలయన్స్), ఇసిస్ ఇంకా ఇంకా విస్తరిస్తూ ఉన్నది. ఆల్-నూస్రా కూడా విస్తరిస్తూ ఉన్నది. వాళ్ళకి మరింతమంది రిక్రూట్ అవుతున్నారు. మరిన్ని రిక్రూట్ మెంట్లు జరుగుతున్నాయి. టర్కీ ద్వారా మరింత చమురు ఎగుమతి చేస్తున్నారు.. ఇంకా అలాంటివి. రష్యా జోక్యం తర్వాత టెర్రరిస్టుల నియంత్రణలో ఉన్న భూభాగం కుచించుకుపోవడం మొదలయింది… …మేము వారి రాజకీయాలను నమ్ముతున్నాము. ప్రయోజనాల కంటే నైతిక విలువలను ముందు నిలబెట్టే రాజకీయాలు అవి. టెర్రరిస్టులను నిర్మూలించాలని వారు నిజంగానే కోరుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళని నమ్ముతాము. వాళ్ళ సాయానికి బదులుగా ఏదో కావాలని వారు కోరడంలేదు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నాము. ఈ క్షణం వరకి ప్రతిఫలం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగలేదు. ఈ కారణాలే వారి సహాయం కోరేలా నన్ను, సిరియా ప్రభుత్వాన్ని, సిరియా ప్రభుత్వ సంస్ధలని పురిగొల్పాయి.”

హ్యాట్స్ ఆఫ్ టు బషర్ ఆల్-అస్సాద్ & పుతిన్ & రష్యా!

***

[Disclaimer: ప్రతిఫలం కోరే విషయం ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము.]

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s