నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?


 

టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు.

నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా నియమించిన అధికారులను టర్కీ ప్రధాని ఎర్డోగాన్ వెనక్కి పిలిపిస్తున్నాడు. ఇన్నాళ్లు నాటో దేశాలలో ఉంటూ వారు కూడా కుట్రకు తోడ్పాటు అందించారని టర్కీ ప్రధాని అనుమానిస్తున్నారు. అనేకమంది పైన నిర్ధారణకు కూడా వచ్చేశాడు. 

అమెరికా, ఐరోపాల నుండి వెనక్కి పిలిచినవారిలో 150 మంది వరకు టర్కీకి రాగా వాళ్ళు వఛ్చిన వెంటనే క్రమ శిక్షణ చర్యలను ఎర్డోగాన్ అమలు చేసాడు. కొందరిని ఉద్యోగం నుండి తొలగించాడు. కొందరిని సస్పెండ్ చేసాడు. కొందరిని నిర్బంధం లోకి తీసుకున్నాడు. కొందరికి శిక్ష కూడా వేసేశాడు. అనేకమంది పాస్ పోర్టులను రద్దు చేసాడు. బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశాడు.   

అమెరికా పనే

టర్కీ కూడా నాటో (NATO – నార్త్ అట్లాటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో సభ్యత్వం కలిగిన దేశమే. టర్కీలో అమెరికాకు అతి పెద్ద సైనిక స్ధావరం (ఇన్సిర్లిక్) ఉన్నది. కుట్రదారులపై విరుచుకు పడటంలో భాగంగా ఎర్డోగాన్ ఈ స్ధావరానికి విద్యుత్ సరఫరా బంద్ చేయడమే గాక దాని చుట్టూ పోలీసులని మోహరించాడు. 

అనాదిగా నాటో సభ్య దేశంగా ఉన్న టర్కీ లో అడుగడుగునా అమెరికా తన అనుకూల శక్తులతో నింపి వేసింది. టర్కీ సమస్త పాలనా అంగాలలోను అమెరికా అనుచర వర్గం పలుకుబడి కలిగి ఉన్నది. అమెరికాతో స్నేహ సంబంధాలు ఉన్నంత వరకు ఈ పరిస్ధితి పట్ల ఎర్డోగాన్ కు ఎలాంటి అభ్యంతరము లేకపోయింది. కానీ ఎప్పుడైతే తనను కూలదోయడానికి అమెరికా కుట్ర పన్నిందో అప్పటి నుండి ఎర్డోగాన్ కు నాటో కూటమి పైన కూడా అనుమానాలు బయలుదేరాయి. 

టర్కీ సైనిక కుట్ర అమెరికా పనే అని దాదాపు నిర్ధారణ అయినట్లే. నేరుగా రుజువు చేసే సాక్షాలు లేనందునే ‘దాదాపు’ అనడం తప్పితే అమెరికా ముద్ర కుట్ర పై స్పష్టంగా ఉన్నదని పరిశీలకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆసియా, ఐరోపాల మధ్య వంతెన లాంటి చోట కీలక స్ధానంలో ఉండడంతో టర్కీని మళ్ళీ మంచి చేసుకోవడానికి అమెరికా కృషి చేస్తున్నది. 

కుర్దిస్తాన్ పీడకల 

అమెరికా కుట్రకు కారణం గతంలో అనుకున్నదే. సిరియాలో రష్యా ప్రత్యక్ష జోక్యం దరిమిలా అంతర్యుద్ధ పరిస్ధితి సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. టర్కీ కోరుకున్న వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరే పరిస్ధితి కనిపించడం లేదు. 

పైగా సిరియాలో ఉత్తర భాగాన్ని విడదీసి కుర్దులకు స్వతంత్ర భూభాగాన్ని సృష్టించే పనిలో అమెరికా ఉండటం టర్కీకి సుతరామూ ఇష్టం లేదు. కుర్దులకు స్వతంత్ర రాజ్యం ఏర్పడటం, కనీసం స్వయం పాలిత ప్రాంతం అయినా సరే ఎర్డోగాన్ కు పీడకల లాంటిది. 

ఎందుకంటే టర్కీ దక్షిణ ప్రాంతంలోనూ కుర్దులు మెజారిటీ నివసిస్తున్నారు. స్వతంత్రం కోసం వారు దశాబ్దాలుగా టర్కీ ప్రభుత్వంతో తలపడుతున్నారు. సిరియాలో కుర్దిస్తాన్ ఏర్పడితే అది అనివార్యంగా టర్కీలో కుర్దుల ఉద్యమం బలపడేందుకు దోహదం చేస్తుంది. అమెరికా సహాయంతో టర్కీ కుర్దులు కూడా సాయుధ ఉద్యమాన్ని తీవ్రం చేయవచ్చు. అది టర్కీకి పెద్ద తలనెప్పి అవుతుంది. కొంత భూభాగాన్ని కోల్పోవలసి రావచ్చు కూడా.  

కుర్దిస్తాన్ కి సిరియా ఒప్పుకోదు. ఇరాన్, ఇరాక్ లు కూడా ఒప్పుకోవు. (సిరియా, ఇరాన్, ఇరాక్, టర్కీ లలో నివసిస్తున్న కుర్దులు ఈ దేశాల నుండి భాగాలను విడదీసి కుర్దిస్తాన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.) కాబట్టి సిరియా ప్రభుత్వం, సిరియా కోసం యుద్ధం లోకి దిగిన రష్యా, ఇరాన్ లు టర్కీకి కొత్త మిత్రులుగా కనిపిస్తున్నారు. 

దానితో ఎర్డోగాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అర్జెంటుగా రష్యా వెళ్లి పుతిన్ తో మంతనాలు జరిపాడు. దాదాపు రద్దయినట్లే అనుకున్న టర్కిష్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ ను పునరుద్ధరిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అమలులోకి వస్తే ఐరోపా రాజ్యాలకు అనేక విధాలా ప్రయోజనం. 

ముఖ్యంగా రుణ సంక్షోభంతో చితికి పోయిన గ్రీసు గ్యాస్ వాణిజ్య హబ్ గా విలసిల్లే అవకాశం వస్తుంది. ఐరోపా రాజ్యాలకు చవకగా గ్యాస్ లభిస్తుంది. ఇంకా అనేక వాణిజ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అటు రష్యా, ఇటు ఐరోపా రెండు లాభపడతాయి. ఇది అమెరికాకు ఇష్టం లేదని వేరే చెప్పనవసరం లేదు. 

ఆ విధంగా అమెరికా, టర్కీ కోసం తీసిన గొయ్యిలో తానె పీకల లోతు కూరుకుపోయింది. ఐరోపా వ్యాపితంగా పని చేస్తున్న 149 మంది నాటో (టర్కిష్) రాయబారులు వెంటనే వెనక్కి రావాలని సెప్టెంబర్ 27 తేదీన తాఖీదు పంపింది. వెనక్కి వఛ్చిన వారిలో అనేకమందిని అరెస్టు/డిస్మిస్/సస్పెండ్ చేసింది. 

తాఖీదులు అందుకున్న వారిలో కొందరు, ఎలాగూ శిక్ష తప్పదు అన్న భయంతో- అక్కడే ఉండిపోయారు. తమ పశ్చిమ దేశాల అనుకూల సానుభూతి వల్లనే తమను వెనక్కి పిలిచారని వారికి తెలుసు. 

వారిలో కొందరు సో-కాల్డ్ సెక్యులర్ భావాల వాళ్ళు. సెక్యులర్ భావాలు అంటే టర్కీలో సాధారణంగా పశ్చిమ దేశాల లిబరల్ భావాలు కలిగిన వాళ్ళు. సెక్యులరిజం కంటే పశ్చిమ జీవనం పైనే వారికి ఎక్కువ మక్కువ. అమెరికాకు కూడా సెక్యులరిస్టులే కానవసరం లేదు. తమకు అనుకూలంగా పని చేస్తే వాళ్ళు ఎవరైనా ఫర్వాలేదు. సైనిక కుట్రకు మూల కారకుడని ఎర్డోగాన్ ఆరోపించిన అబ్దుల్లా గుటెన్ ముస్లిం మతతత్వ వాది. ఆయన CIA అసెట్ గానే పరిశీలకులు పరిగణిస్తారు.

నాటో-టర్కీ ల మధ్య ఎడబాటు పెరిగి కొద్దీ మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రభావం క్షీణిస్తూ  ఉంటుంది. ఏ పరిణామాన్నైతే నివారించాలని టర్కీలో సైనిక కుట్రకు అమెరికా పాల్పడిందో సరిగ్గా అదే పరిణామం కుట్ర వైఫల్యం వల్ల ఏర్పడుతున్నది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s