
ఎర్ర సముద్రంలో తిష్ట వేసిన మూడు అమెరికా యుద్ధ నౌకలు ఈ రోజు (గురువారం, అక్టోబర్ 13) యెమెన్ పైన క్షిపణి దాడి చేశాయి. యెమెన్ కు చెందిన రాడార్ నిర్వహణ స్ధలాలను లక్ష్యం చేసుకుని అమెరికా మిలట్రీ ఈ దాడులు చేసింది దాడిలో మూడు రాడార్ నిర్వహణ వసతులు ధ్వంసం అయ్యాయని అమెరికా సగర్వంగా చాటింది.
అమెరికా దాడులకు కారణం? ఆత్మ రక్షణ!
యెమెన్ చాలా చిన్న దేశం. అత్యంత పేద దేశం. సహజ వనరులు ఏవి లేని దేశం. ఎడారి, కొండలు-గుట్టలతో నిండి ఉన్న దేశం. అలాంటి దేశానికి అమెరికాని ‘ఆత్మ రక్షణ’ చేసుకునే వైపుగా నెట్టగల శక్తి గాని, ధైర్యం గాని, అవసరం గాని ఉంటాయా?
ఆదివారం ఎర్ర సముద్రంలో లంగరు వేసి ఉన్న అమెరికా యుద్ధ నౌక USS మాసన్ పైన యెమెన్ నుండి రెండు మిసైళ్లు వఛ్చి పడ్డాయట. అవి అమెరికా యుద్ధ నౌకను తాక లేదు గాని, నౌకకు దూరంగా నీళ్లలో పడిపోయాయట. మల్లి బుధ వాళ్రం మరో సారి మరో క్షిపణి దాడి జరిగిందట. ఈ దాడుల దరిమిలా ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం దాడి చేశామని అమెరికా ప్రకటించింది.
అమెరికా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక దేశం పైన దాడి చేయదలుచుకుంటే దానికి అప్పటికప్పుడు అనేక కారణాలు పుట్టుకొస్తాయన్నది చరిత్ర నిరూపించిన సత్యం. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు ఉండడం కొత్త విషయం కాదు. అనేక ఏళ్లుగా అవి అక్కడ ఉన్నాయి. ఇన్నాళ్లు వాటి పైన దాడి చేయని యెమెన్ ఇప్పుడు దాడి చేస్తుందా?
అది కాక గత ఒకటిన్నర సం.లుగా యెమెన్ సౌదీ అరేబియా నుండి వినాశకర యుద్ధాన్ని ఎదుర్కొంటున్నది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలనే సౌదీ అరేబియా యెమెన్ పై ప్రయోగిస్తున్నది. సర్వ వినాశనం కావిస్తున్నది. అయినప్పటికీ సౌదీ అరేబియాను ఎదుర్కొని నిలువరిస్తున్నారు యెమెన్ తిరుగుబాటుదారులు. ఓ పక్క సౌదీ దాడులను ఎదుర్కొంటు అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసే పిచ్చి పనికి ఎవరు పూనుకుంటారు?
యెమెన్ గురించిన మరి కొన్ని అంశాలు: సౌదీ అరేబియా పొరుగునే భౌగోళిక రాజకీయాలకు అత్యంత కీలకమైన స్ధానంలో ఆ దేశం నెలకొని ఉన్నది. అరేబియా సముద్రం తీరాన ఉన్న ఈ దేశం పక్కనే అత్యంత కీలకమైన చమురు వాణిజ్య రవాణా మార్గం ఉన్నది. పర్షియన్ అఖాతం, ఎర్ర సముద్రం, సౌదీ అరేబియాల మధ్య ఇరుక్కుని ఉన్న ఈ దేశం వ్యూహాత్మకంగా ఏంటో కీలకమైన ప్రాంతం.
ఇలాంటి దేశంలో రెండు సంవత్సరాల క్రితం ప్రజలు తిరుగుబాటు లేవదీశారు. ‘అరబ్ వసంతం’ పేరుతొ ఈజిప్టు, లిబియా, ట్యునీషియా దేశాలలో తిరుగుబాట్లకు, ప్రభుత్వాల కూల్చివేతలు, చివరికి ప్రభుత్వాధినేతల హత్యలకు కూడా మద్దతు ఇచ్చిన అమెరికా, పశ్చిమ రాజ్యాలు యెమెన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా లలో తలెత్తిన తిరుగుబాట్లను మాత్రం సహించలేకపోయాయి.
అందుకు కారణం ఈ మూడు దేశాల్లోని తిరుగుబాటు నిజంగానే ప్రజలు పాల్గొంటున్నారు. అమెరికా పోషణలోని ప్రభుత్వాల విధానాలకు, అణచివేతకు, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా వారు గొంతు విప్పి విధుల్లోకి వచ్చారు. సౌదీ అరేబియా తన దేశంలో జరిగిన ఆందోళనలను నిర్దయగా అణచివేసింది. అతి చిన్న దేశం బహ్రెయిన్ లోకి తన సైన్యాలను పంపి ఆందోళన చేస్తున్న ప్రజలను ఊచకోత కోయించింది. అనంతరం యెమెన్ పై కేంద్రీకరించి అక్కడి తిరుగుబాటును కర్కశంగా అణచివేయడానికి ప్రయత్నిస్తోంది.
అయితే యెమెన్ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. అవసరమైన ఆయుధ సహాయం అందిస్తోంది. దానితో సౌదీ దాడులను యెమెన్ ప్రజలు/తిరుగుబాటుదారులు సమర్ధవంతంగా తిప్పి కొడుతున్నారు. దేశంలోని గణనీయ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల తిరుగుబాటుదారుల తరపు ఇంటీరియర్ మంత్రి తండ్రి చనిపోగా ఆయన స్మృత్యర్థం వందల మంది ప్రజలు ఒక హాలులో సమావేశం అయ్యారు. ఆ హాలు పైన సౌదీ అరేబియా ఉద్దేశ్యపూర్వకంగానే క్షిపణి దాడులు చేసింది. మంత్రి గారి తండ్రి స్మ్రుతి కనుక ప్రముఖులు అక్కడికి హాజరువుతారన్న అంచనాతో వారిని చంపేసే లక్ష్యంతో ఆ దాడి చేసింది. తిరుగుబాటు ప్రముఖులు ఎందరు చనిపోయారో తెలియలేదు గాని జనం మాత్రం 200 మంది వరకు చనిపోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా “ఇలాగయితే సౌదీ కూటమికి ఇస్తున్న మద్దతును సమీక్షించుకుంటాం” అని ప్రకటించింది. ఇంతలోనే యెమెన్ పైన తానె దాడి చేసింది. తన దాడి నిర్మానుష్యమైన ప్రాంతంలో జరిగింది కనుక పౌరులు చనిపోయే అవకాశం లేదని తన దాడిని తానె సమర్ధించుకుంది.
“మా యుద్ధ నౌక రక్షణ చర్యలు చేపట్టింది. మిసైల్ మా నౌక USS మాసన్ ను చేరుకొనే లేదు. నౌకకు గాని, సిబ్బందికి గాని ఎలాంటి నష్టము జరగలేదు” అని అమెరికా మిలట్రీ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ ప్రకటించాడని CNN వార్తా సంస్ధ తెలిపింది.
పక్కనే కొన్ని పదుల కి.మీ దూరంలోనే ఉన్నప్పటికీ యెమెన్ క్షిపణులు లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం సాధ్యమేనా? ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి నష్టము జరగకుండా ఉండేట్లుగా ప్రయోగిస్తే తప్ప!?