[Leading the divided nations, ద ఎడిటోరియల్ – అక్టోబర్ 10,2016- కు యధాతధ అనువాదం.]
*********
ఆంటోనియో గుతెయర్ ను సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేయడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కనబరచిన విశాల ఏకాభిప్రాయం, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలతో తలపడటంలో మరింత పటిష్టమైన ఐరాస అవతరించే దిశలో శుభప్రదమైన ఆరంభం. గత వారం భద్రతా సమితిలోని 15 సభ్య దేశాలలో 13 -వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలతో సహా- పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి పేరును అంతిమ ఆమోదం నిమిత్తం జనరల్ అసెంబ్లీకి పంపించాయి. ఆయన నామినేషన్ ను అసెంబ్లీ ఆమోదించినట్లయితే, ఆ తర్వాత ఐరాస 9వ సెక్రటరీ జనరల్ గుతెయర్ అనేక సమస్యల పైన అత్యవసరంగా దృష్టి పెట్టవలసి ఉన్నది; నానాటికీ క్షీణిస్తున్న అంతర్జాతీయ శరణార్ధి సంక్షోభం, ఉగ్రవాద శాపం వాటిలో ప్రముఖమైనవి. ఒక మేరకు ఇవి రెండూ సిరియా యుద్ధంతో సంబంధం కలిగి ఉన్నవే. చివరిసారిగా లెక్కించినపుడు ప్రపంచ వ్యాపితంగా 4 మిలియన్లకు పైగా ఉండవచ్చని తేలిన సిరియా శరణార్ధులకు తగిన నీడ కల్పించడానికీ, పునరావాసం కల్పించడానికీ కృషి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఐరాస శరణార్ధుల హై కమిషనర్ గా పని చేసిన అనుభవం అక్కరకు వస్తుంది. UNHCR (యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యుజీస్) వద్ద ఉండగా సంస్ధాగత సంస్కరణల పైనా, నిధులను కేంద్ర కార్యాలయం నుండి బైటికి తరలించి క్షేత్ర స్ధాయిలోకి మరింతగా తరలించే వినూత్న చర్యలపైనా గుతెయర్ అధిక దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తున్నది. శరణార్ధుల కోసం ఆయన ఎంతగానో తాపత్రయపడ్డారన్నది స్పష్టమే; వలస సంక్షోభం విషయమై ఆయన తరచుగా అంతర్జాతీయ సమాజానికి విన్నపాలు చేశారు, వారి ప్రతినిధిగా గొంతు విప్పడం కొనసాగిస్తానని ప్రతిన బూనారు.
సమాన స్ధాయిలో గుతెయరాకు సవాలు విసిరే అజెండా అంశం ఏమిటంటే, ఓ వైపు పశ్చిమ శక్తులు మరో వైపు రష్యా మరియు చైనాలు… ఈ రెండు శిబిరాల మధ్య నెలకొన్న అగాధాన్ని సృజనాత్మక పద్ధతులలో పూడ్చడం. అభాస పూర్వకమైన అంశం ఏమిటంటే శరణార్ధి సమస్యను పరిష్కరించడంలో ఆయన కనబరచిన నిబద్ధత వల్ల ఆయన ‘కార్యకర్త’గా పరిగణించ బడవచ్చు. సిరియా విషయంలో శాంతి ఒప్పందం కుదర్చడానికి చేసే ఎలాంటి ప్రయత్నానికైనా ఇది వినాశకారి కాకపోతే గనుక స్తబ్దతకు కారణం కావచ్చు. అటువంటి ఆటంకవాదానికి గుతెయర్ చోటు ఇవ్వలేరు. ఒక సంస్ధగా ఐరాస తరచుగా “(సారం లేని) ఉబ్బు మరియు బ్యూరోక్రటిక్” సంస్ధగా నిందలు ఎదుర్కొంటున్నది; దాని శాంతి స్ధాపకులు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో లైంగిక వేధింపులకు పాల్పడినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది. స్వాభావికంగానే వ్యూహరచనా చతురుడుగా పేరు గాంచినప్పటికీ గుతెయర్ సమర్ధవంతమైన సలహాదారుల బృందాన్ని యేరుకోవలసి ఉంటుంది. కానీ ఎవరు ఏ యే కీలక రాజకీయ పదవులు పొందుతారన్న విషయంలో ఆయన రష్యా, చైనాలతో ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చేశారా? ఐరాసలో ఉన్నత స్ధానాలలో 50 శాతం మహిళా ఉద్యోగులు ఉండేలా చూస్తానన్న తన గత హామీని ఆయన నిలుపుకోగలరా? 20 యేళ్ళ క్రితం ఐరాస తనకు తాను పెట్టుకున్న సదరు లక్ష్యం ఇప్పటికీ సుదూరంగానే ఉండిపోయింది. నిజానికి ఐరాస అత్యున్నత పదవికి 7 కు తక్కువ కాకుండా మహిళా అభ్యర్ధులు పోటీలో ఉన్న నేపధ్యంలోనూ, వారిలో ఒక్కరూ గెలుపుకు సమీపంగా కూడా రాలేని పరిస్ధితుల్లోనూ, ఆయన అభ్యర్దిత్వమే కొందరికి నిరాశను కలిగించింది.
********
ఇన్నాళ్లూ ఐరాస పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు భౌగోళిక రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు, ఇతర దేశాలపై పెత్తనం సాగించేందుకు పని ముట్టుగా ఉపయోగపడింది. ప్రచ్చన్న యుద్ధ కాలంలో -అమెరికా ఆధిపత్యాన్ని USSR సవాలు చేస్తూ ఢీ అంటే ఢీ అన్నంతగా ఎదురు నిలిచినందున- కొంతమేర స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించిన ఐరాస, ప్రచ్చన్న యుద్ధం ముగిశాక బొత్తిగా అమెరికా అడుగులకు మడుగులొత్తింది.
ప్రస్తుతం అమెరికా ఆర్ధికంగా చితికిపోయింది. ఆర్ధిక దౌర్బల్యం మిలట్రీ శక్తిని నామమాత్రం చేస్తుంది. మరోవైపు రష్యా మధ్య ప్రాచ్యంలో సిరియా ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా కొత్త శక్తులు సంతరించుకుంటున్నది. నాటో దేశం టర్కీ, అమెరికా అనుంగు సహచరి ఇజ్రాయెల్ లు సైతం రష్యాతో రహస్యంగా, బహిరంగంగా మంతనాలు జరుపుతున్నాయి. ఇక చైనా ఆర్ధిక శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిస్ధితుల్లో అమెరికా, రష్యాల మధ్య మరో విడత ప్రచ్చన్న యుద్ధం మొదలై ముందుకు సాగుతోంది.
కనుక ఐరాస కూడా అనివార్యంగా రష్యా, చైనాల వైపు చెవి ఒగ్గి ఉండవలసి వస్తుంది. రాజకీయ పదవుల్లో ఎవరెవరిని నియమించాలన్న విషయంలో కొత్త సెక్రటరీ జనరల్ ఇప్పటికే రష్యా, చైనాలతో ఒక అంగీకారానికి వచ్చినట్లు సంపాదకీయం సూచించడం ఈ అంశాన్నే తెలియజేస్తున్నది. ప్రపంచ శరణార్ధులు 4 మిలియన్లకు పైగా ఉండగా వారందరు సిరియా నుండి వస్తున్నవారే అని చెప్పడం సత్యదూరం. ఇది కల్పితం మాత్రమే. సిరియా నుండి కూడా శరణార్ధులు వస్తున్నమాట నిజమే గాని అందరు వాళ్ళే అనడం నిజం కాదు.
ఆఫ్రికా దేశాల నుండి ఈజిప్టు, లిబియా మీదుగా టర్కీకి చేరుకుంటున్నవారు అనేకమంది ఉన్నారు. వారిలో అత్యధికులను అమెరికాయే గూఢచార సంస్ధలే తరలిస్తున్నాయి. టర్కీ చేర్చిన తర్వాత అక్కడి నుండి గ్రీసు మీదుగా ఐరోపా దేశాలకు శరణార్ధులను ఒక పద్ధతి ప్రకారం తరలిస్తున్నారు. వీరు జర్మనీ లాంటి దేశాలలో అత్యంత చౌకగా తమ శ్రమ శక్తిని అమ్ముకునే లేబర్ మార్కెట్ గా మారుతున్నారు. తద్వారా ఐరోపా బహుళజాతి కంపెనీలకు లాభాలు పెంచుతున్నారు. శరణార్ధులను వెల్లువగా పంపడం ద్వారా మాట వినని దేశాలను దారిలో తెచ్చుకునే ఎత్తుగడను కూడా అమెరికా అమలు చేస్తున్నది. సిరియా సంక్షోభానికి ముందు నుండే ఆఫ్రికా దేశాల నుండి ఐరోపా దేశాలకు గుంపులుగా వలసలు జరిగాయి. వలసీకరణను ఒక ఆయుధంగా ప్రయోగించడం సామ్రాజ్యవాద దేశాలకు కొత్త కాదు.
చైనా, రష్యాలు ముఖ్యమైన, విస్మరించలేని శక్తులుగా అవతరించినందున ఐరాస పని ఇక నుండి ఆసక్తికరంగా ఉండగలదు. క్షీణిస్తున్న అమెరికా ఇచ్చే ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడం, వృద్ధి చెందుతున్న రష్యా-చైనాల ఆదేశాలు క్రమ క్రమంగా పై చేయి సాధించడం… పరిశీలించి తీరవలసిందే!