చనిపోయిన తమ నేత అంతిమ యాత్ర నిమిత్తం ఒక హాలులో గుమి కూడిన ప్రజలపై సౌదీ అరేబియా జరిపిన వైమానిక బాంబు దాడిలో 140 నుండి 200 వరకు మరణించిన సంగతి విదితమే. “నెత్తుటి చెరువు’ గా అభివర్ణించబడుతున్న ఈ మారణకాండలో సౌదీ మిలట్రీ, అమెరికా సఫరఫరా చేసిన MK-82 గైడెడ్ మిసైల్ లను ప్రయోగించినట్లు తాజాగా సాక్షాలు వెలువడ్డాయి. దానితో సౌదీ పాపంలో అమెరికా నేరుగా భాగం పంచుకున్నదని వెల్లడి అయింది.
సౌదీ దాడి అనంతరం పలు అంతర్జాతీయ వార్తా సంస్ధలు, స్వతంత్ర విలేఖరులు హత్యాకాండ జరిగిన చోట పరిశోధనలు జరిపాయి. ఈ పరిశోధనలో వారికి అమెరికా ఆయుధాల విడి భాగాలు, సీరియల్ నెంబర్లు, లేబుళ్లు అనేకం కనిపించాయి. సదరు లేబుళ్ల ఫోటోలను స్ధానిక పత్రికలు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ప్రచురించాయి.
ఒక లేబుల్ పైన “FOR USE ON MK-82 FIN, GUIDED BOMB” అని రాసి ఉన్నట్లు ఫోటోలో స్పష్టంగా తెలుస్తున్నది. దీనితో అమెరికా పెద్ద మొత్తంలో సరఫరా చేసిన MK82 గైడెడ్ మిసైళ్లనే యెమెన్ ప్రజల పైన సౌదీ అరేబియా వినియోగిస్తున్నదని స్పష్టం అవుతున్నది. సౌదీ బాంబింగ్ మొదలై ఒకటిన్నర సంవత్సరాలకు పైనే అయింది కనుక ఇన్నాళ్ళు అమెరికా తయారీ మిసైళ్ళ ద్వారానే యెమెన్ లో మారణకాండలు సాగిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. అయినప్పటికీ అమెరికా సౌదీ అరేబియాకు మరిన్ని మిసైళ్ళు, ఆయుధాలు సరఫరా చేయడం గమనార్హం.
బ్రిటన్ (యూకే) కూడా అమెరికాతో పోటీ పడుతూ పెద్ద ఎత్తున ఆయుధాలను సౌదీ అరేబియాకు సరఫరా చేసింది. బ్రిటన్ ప్రాణాంతక మారణాయుధాలను సౌదీ అరేబియాకు సరఫరా చేస్తున్నదనీ, వాటిని సౌదీ యెమెన్ పౌరులపై ప్రయోగిస్తున్నదనీ అనేక వార్తా సంస్ధలు వెల్లడి చేశాయి. అయినప్పటికీ ఐక్య రాజ్య సమితి గానీ, భద్రతా సమితి గాని ఎవరు వీసమెత్తు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.
వాస్తవాలు ఇవి కాగా సౌదీ అరేబియాతో తమ సంబంధాలను, సహకారాన్ని సమీక్షిస్తామని అమెరికా ఉత్తుత్తి బెదిరింపులు చేయడం మోసపూరితం మాత్రమే. నిజానికి బారక్ ఒబామా అధ్యక్షరికంలో 115 బిలియన్ డాలర్ల ఆయుధాలను అమెరికా సౌదీ అరేబియాకు సరఫరా చేయగా అందులో 20 బిలియన్ డాలర్ల మేర గత ఒకటిన్నర సంవత్సరాల క్రితం యెమెన్ పై సౌదీ దాడులు ప్రారంభం అయ్యాక సరఫరా చేసినవే. ఇందులో అత్యధిక మొత్తం MK82 మిసైళ్ళ సరఫరాకే విచ్చించినట్లు పలు మిలట్రీ విశ్లేషణ సంస్ధలు వెల్లడి చేశాయి.
MK82 అన్నది 500 పౌండ్ల బరువు గాన భారీ పేలుడు ఆయుధమని దానిని అమెరికా మాత్రమే తయారు చేస్తుందని మిలట్రీ విశ్లేషకులు తెలిపారు. లేబుల్ పైన 96214 కోడ్ నెంబర్ ఉండటం బట్టి, అది అమెరికాలో మూడవ అతి పెద్ద మిలటరీ రక్షణ కాంట్రాక్టు కంపెనీ రేధియాన్ లో ఉత్పత్తి అయినట్లుగా తెలుస్తున్నది.
గత నవంబర్ 2015 నెలలో సౌదీ అరేబియాకు 8,020 MK-82 మిసైళ్లను సరఫరా చేయాలని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన సంగతి ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియా ఇందుకు గాను 1.29 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం ద్వారా సౌదీ అరేబియా ఏ స్ధాయి మిలట్రీ కొనుగోళ్ళు జరిపి ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.