మధ్య ప్రాచ్యం / పశ్చిమాసియా లో అమెరికా అనుంగు మిత్ర దేశం సౌదీ అరేబియా యెమెన్ లో సామూహిక హాత్యాకాండలకు పాల్పడుతోంది. తనకు వ్యతిరేకంగా మారినందుకు, అమెరికాను కూడా తలదన్నుతూ, ఒకటిన్నర సం.ల క్రితం యెమెన్ పై ఏకపక్ష యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా ఆ దేశంలో అనేక అరాచకాలకు, యుద్ధ నేరాలకు, ఉచకోతలకు పాల్పడుతున్నది. తాజా ఊచకోత సౌదీ అరేబియా సాగించిన అనేక దారుణాల్లో ఒకటి మాత్రమే.
తిరుగుబాటు గ్రూపుకు చెందిన ఇంటీరియర్ మినిష్టర్ జలాల్ ఆల్-రోవైషన్ తండ్రి మరణించిన దరిమిలా శనివారం ఆయన అంతిమ యాత్ర జరుగుతోంది. అంతిమ యాత్రలో వందల మంది పౌరులు పాల్గొంటున్నారు. ఈ ఊరేగింపు పైన సౌదీ మిలట్రీ ఫైటర్ జెట్లు బాంబు దాడితో విరుచుకుపడ్డాయి. దాడిలో 140 మంది మరణించారని పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. మృతుల సమాఖ్య 200 పైనే అని రష్యన్, ఇరానియన్ పత్రికలు చెబుతున్నాయి. 525 మందికి పైగా గాయపడ్డారని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి మూన్ ప్రకటించాడు.
షియాకు చెందిన హౌతీ మిలిటెంట్లు యెమెన్ లో తిరుగుబాటు ప్రకటించి రాజధాని సనా ను ఒకటిన్నర సంవత్సరాల క్రితం స్వాధీనం చేసుకున్నాయి. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉండటంతో ఇరాన్ బద్ధ శత్రువు సౌదీ అరేబియా తిరుగుబాటును అణచివేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నది. ఎవరి అనుమతి లేకుండా కనీసం ఐరాసకు సమాచారం కూడా ఇవ్వకుండా తనంతట తానే యెమెన్ పై యుద్ధం ప్రకటించింది.
యెమెన్ మాజీ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలేను పదవి నుండి బలవంతంగా కూలదోసింది. శాంతి ప్రయత్నాల పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తున్నది. లెక్కకు మిక్కిలిగా సామూహిక హత్యాకాండలకు పాల్పడుతోంది. సౌదీ ఇంత బరితెగించినప్పటికీ సో-కాల్డ్ అంతర్జాతీయ సమాజం మౌనం వహించడానికి కారణం ఆ దేశానికి అమెరికా మద్దతు ఉండడమే.
‘అంతర్జాతీయ సమాజం’ (ఇంటర్నేషనల్ కమ్యూనిటీ) అన్నది అమెరికా, ఐరోపా దేశాలు తరచుగా ఉపయోగించే పదం. ఆ దేశాల దృష్టిలో ‘అంతర్జాతీయ సమాజం’ అంటే తామే. తమకు ఏది నచ్చితే అది అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా ఆమోదించే వాస్తవంగా ప్రచారంలో పెట్టేస్తాయి. తమకు నచ్చనిది ఏదైనా దానిని అంతర్జాతీయ సమాజం మెచ్చనిదిగా చెబుతాయి.
ఈ ప్రచారాన్ని ప్రధానంగా చేసేది పశ్చిమ కార్పొరేట్ పత్రికలే. ఈ ‘అంతర్జాతీయ సమాజం’ కు యెమెన్ లో సౌదీ అరేబియా సాగిస్తున్న అరాచకాలు కనిపించడం లేదు. ఎందుకంటే సౌదీ తమ మిత్ర దేశం కనుక. సిరియాలో మాత్రం టెర్రరిస్టు సంస్ధలు లేవదీసిన కిరాయి తిరుగుబాటు ‘ప్రజల తిరుగుబాటు’ గా ప్రచారం చేస్తాయి. ఆ టెర్రరిస్టు సంస్ధలు తమ నిషేధ జాబితాలో, ఐరాస నిషేధ జాబితాలో ఉన్నా సరే.
అమెరికా, ఇజ్రాయెల్ తదితర ఆధిపత్య దేశాలు అరాచకాలకు, హత్యాకాండలకు పాల్పడినప్పుడు అంతర్జాతీయంగా నిరసనలు పెల్లుబుకితే అప్పుడు తమ చర్యల పైన తామే విచారణ చేసేసుకుంటాయి. తమకు నచ్చని, తాము మెచ్చని ఇతర దేశాల విషయంలో మాత్రం ఐరాస విచారణ చేయాలంటాయి. ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ – హేగ్) లో కేసు వేయాలనంటాయి. తాము ఆమోదించని (సంతకం చేయని) ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టుకి ఫిర్యాదు చేయిస్తాయి.
ఇప్పుడు సౌదీ అరేబియా కూడా తమ దాడి పైన తామే విచారణ చేసుకుంటాం అని ప్రకటిస్తుంది. మొదటేమో దాడికి తమకు సంబంధం లేదని తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ దాడిలో సౌదీ పాత్ర స్పష్టంగా కనిపించడంతోనూ, దాడిని ఐరాస, అమెరికాలు కూడా ఖండించడంతోనూ తప్పించుకునే ప్రయత్నాలు వమ్ము అయ్యాయి.
ఫలితంగా తమ దాడి పైన తామే విచారణ చేస్తాము అని ప్రకటిస్తున్నది. “ఈ దాడి విచారకరం, బాధాకరం” అని ప్రకటిస్తూ “సౌదీ కూటమి ఈ కేసు పైన వెంటనే విచారణ జరిపిస్తుంది. గతంలో వివిధ కేసుల్లో విచారణలో పాల్గొన్న అమెరికా నిపుణులు కూడా ఈ విచారణలో పాల్గొంటారు” అని సౌదీ అరేబియా చక్కా ప్రకటించింది.
సౌదీ చర్య అమెరికాకు ఒక విధంగా ఇబ్బందిగా మారింది. ఓ పక్క సిరియాలో, -సిరియా ప్రభుత్వం ఆహ్వానంతోనే- రష్యా ఫైటర్ జెట్లు టెర్రరిస్టులపై చేస్తున్న వైమానిక దాడులను అమెరికా ఖండిస్తున్నది. ముఖంగా అలెప్పో కోసం తీవ్ర స్ధాయిలో జరుగుతున్న యుద్ధంలో ఆల్-నూస్రా బలగాలపై జరుగుతున్న వైమానిక దాడులను ఖండిస్తున్నది. ఈ దాడుల్లో సిరియా పౌరులు చనిపోతున్నారని అమెరికా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. సిరియా తన వైమానిక దాడులు ఆపకపోతే వాటిని అడ్డుకోవడానికి ఆల్-నూస్రా టెర్రరిస్టులకు MANPAD లు (భుజం పైన ఉంచుకుని జెట్ విమానాలపై దాడి చేసేందుకు ఉపయోగించే ఆయుధాలు) తామే సరఫరా చేస్తామని హెచ్చరిస్తున్నది. అమెరికా దృష్టిలో సిరియా ప్రజలు అంటే టెర్రరిస్టు మూకలే. తాము ఆయుధాలు సరఫరా చేసి, సైనిక శిక్షణ ఇచ్చి, సి ఐ ఏ కాంట్రాక్టర్ల చేత శిక్షణ శిబిరాలు నడిపి ప్రవేశపెట్టిన టెర్రరిస్టు మూకలు గనుక రష్యన్, సిరియన్ వైమానిక దాడులను అమెరికా ఖండిస్తున్నది.
తాము ఖండిస్తున్న పనినే సౌదీ అరేబియా చేస్తున్నా ఇన్నాళ్లు మౌనం వహించింది. అంతిమ యాత్ర దాడి తాము ఖండించకుండా ఉండలేని పరిస్ధితిని కల్పించింది. నిజానికి సౌదీ దాడులకు రష్యన్-సిరియన్ దాడులకు చాలా తేడా ఉన్నది. సిరియా ప్రభుత్వం తమ దేశంలో తమపై సాయుధ ఘర్షణలకు పాల్పడుతున్న విదేశీ టెర్రరిస్టు మూకలపై తలపడుతుంది. తనకు సాయం చేయాలని రష్యాను ఆహ్వానించింది.
కానీ సౌదీ అరేబియా యెమెన్ లో తనకు అనుకూల ప్రభుత్వాన్ని నిలిపే వీబాధ్యతను తనకు తానే నెత్తిన వేసుకున్నది. అందులో యెమెన్ ప్రజల పాత్ర గాని, యెమెన్ ప్రభుత్వం పాత్ర గాని ఏ మాత్రం లేదు. యెమెన్ ఘర్షణల్లో 4,000 మందికి పైగా చనిపోయారని భావిస్తుండగా అందులో సగం మంది సౌదీ దాడుల్లో చనిపోయిన వాళ్ళే.
అంతర్జాతీయంగా విమర్శలు వస్తుండే సరికి తాము విచారణ చేస్తాం అని చెబుతూ అందులో అమెరికా నిపుణులు భాగస్వామ్యం వహిస్తారని చెబుతోంది. కానీ విచారణను ఐరాసకు అప్పగిస్తాం అని మాత్రం చెప్పడం లేదు. ఐరాస అధిపతి బాన్ కి మూన్ ఘటన పైన నిస్పాక్షికమైన విచారణ చేయాలని పిలుపు ఇచ్చాడు. దాడి కారకులని న్యాయం ముందుకు తెప్పించాలి అన్నాడు తప్పితే మీ దాడి పైన మీరే ఎలా విచారణ చేస్తారు అని అడగడం లేదు.
కాగా సౌదీ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హౌతిలు ప్రకటించారు. సాయుధ బలగాలు, మిలిషియాలు, ప్రజా బలగాలు సరిహద్దుకు తరలాలని పిలుపు ఇచ్చారు. “మన వాళ్ళ మరణాలకు ప్రతీకారం తీర్చుకుందాం… ఆర్మీ సదావరాల్లో, మార్కెట్లపై జరిగిన దాడుల్లో, అత్యంత క్రూరమైన సామూహిక హత్యాకాండలలో, అంతిమ యాత్రలో మృతులైన మన వాళ్ళ చావులకు బదులు తీర్చుకుందాం” అని హౌతిలు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యెమెన్ తిరుగుబాటు దారులకు, సౌదీ అరేబియాకు మధ్య మునుముందు భీకర పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మద్యం ఫాక్టరీ పెట్టినందుకు సౌదీలో 5గురు భారతీయుల్ని ఉరితీసారు. అది తాలిబాన్ కంటే గొప్ప ప్రభుత్వం కాదు.