వారెవా! కార్టూనిస్టుకి సలాం చేయకుండా ఎవరైనా నిభాయించుకోగలరా?!
‘సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ దేశంలో రెచ్చగొట్టిన ఉన్మాదానికి అసలు లక్ష్యం ఏమిటో కార్టూన్ ప్రతిభావంతంగా చాటుతోంది. బహుశా ఈ తరహా కార్టూన్ ఒక కేశవ్ కే సాధ్యం అనుకుంటాను.
మోడి అధికారం చేపట్టినాక జాతీయవాదం లేదా జాతీయత అన్న వ్యక్తీకరణలకి అర్ధం పూర్తిగా మారిపోయింది. జాతి అంటే జనులు అన్న సామాన్య అర్ధం గంగలో కలిసిపోయింది. దేశం అంటే ప్రజ అన్న ఉదాత్త భావన ఉన్మాదపూరిత నినాదాలతో కల్తీ అయిపోయింది.
చివరికి గోమాత భక్తిని కూడా స్మగ్లర్ గ్యాంగుల దందాగా మార్చివేయగల వికృత సృజనాత్మకత రాజ్యం ఏలుతున్నది. ఓ పక్క గోవధ నిషేధం అంటూనే లక్షలు వసూలు చేసి గోవుల్ని కబేళాలకు తరలించేందుకు అంగీకరించే హిందూత్వ దారిదోపిడీ గ్రూపులు సందుకొకటి పుట్టుకొచ్చాయి.
యూపిఏ ఏలుబడిలో అనేకసార్లు ఈ సో-కాల్డ్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయిట! ఈ సంగతి మాజీ హోమ్ మంత్రి చిదంబరం ఒక్కరే చెప్పలేదు. ఇప్పటి ఆర్మీ అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు కూడా పత్రికల్లో, టి.వి ఛానెళ్లలో కనపడి చెప్పారు.
కానీ సో-కాల్డ్ ‘జాతీయ ప్రయోజనాల’ రీత్యా గోప్యంగా ఉంచబడిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ ను ఎన్నికల ప్రయోజనాలకు కూడా వాడుకోవచ్చని మోడి-అమిత్ షా ల ద్వయమే కనిపెట్ట గలిగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?
అన్నీ అయ్యాక, అనవలసినవి అన్నీ అన్నాక, గల్లీ లీడర్ నుండి హోమ్ మంత్రి, రక్షణ మంత్రి దాకా రొమ్ములు విరిచి, జబ్బలు చరిచి ఇంకా అలాంటివి ఏవేవో చేశాక “ఛాతీలు గుద్దుకోవద్దు” అని కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని హెచ్చరించారట! ఆ కాస్త మాట బహిరంగంగా చెప్పొచ్చు గదా?! పోనీ కనీసం ట్విట్టర్ లో నన్నా కూయొచ్చు గదా!
బహిరంగంగా చెబితే ఏమన్నా ఉందా? రేపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉపయోగించొద్దూ!
మిలట్రీ డిజైన్ దుస్తులు తొడిగిన గోమాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వస్తోంది! సిద్ధంగా ఉండండహే!!
*********
రహస్యం: కార్టూన్ లో ఉన్నది నిజమైన గోమాత అనుకునేరు. కాళ్ళకి గిట్టలు ఉన్నాయా? బూట్లు ఉన్నాయి. మెడకి గంట ఉందా, కాదు మైకు ఉంది. వీపు మీద చూడండి, పరీక్షగా చూస్తే జిప్పు కనిపిస్తుంది. ఆ లోపల, ఆవు ముసుగు లోపల, ఎవరో ఉన్నట్లున్నారు. ఎవరు చెప్మా!