
UN special envoy for Syria: Staffan De Mistura
బహుశా దీనిని ఎవరూ ఊహించి ఉండరేమో! సిరియాలో ప్రభుత్వానికి, సిరియా ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న జబ్బత్ ఆల్-నూస్రా టెర్రరిస్టులు క్షేమంగా అలెప్పో వదిలి వెళ్లనివ్వాలని ఐరాస ప్రతినిధి స్టాఫన్ డి మిస్తురా కోరుతున్నాడు.
సిరియా వ్యవహారాలు చూసేందుకు మిస్తురా ని ఐరాస నియమించింది. నిస్పాక్షికంగా ఉంటూ శక్తివంతమైన రాజ్యాల నుండి బలహీన రాజ్యాలను కాపాడేందుకు ప్రయత్నించవలసిన ఐక్య రాజ్య సమితి ఆచరణలో అమెరికా, పశ్చిమ రాజ్యాల భౌగోళిక రాజకీయాలకు పని ముట్టుగా మారింది.
సిరియా కిరాయి తిరుగుబాటు అమెరికా భౌగోళిక రాజకీయ (సామ్రాజ్యవాద) ప్రయోజనాల కోసం, ప్రాంతీయంగా సౌదీ అరేబియా – ఇజ్రాయెల్ ఆధిపత్యం కోసం ప్రవేశపెట్టబడింది కనుక ఐరాస నియమించిన స్టాఫన్ డి మిస్తురా కూడా అనివార్యంగా అమెరికా ప్రయోజనాల కోసమే పని చేయాలి; చేస్తున్నాడు కూడాను.
అమెరికా – రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అటు అమెరికా, ఇటు టెర్రరిస్టు గ్రూపులు (ఇసిస్, ఆల్-నూస్రా) విఫలం చేసిన దరిమిలా సిరియా ప్రభుత్వ బలగాలు అలెప్పో లోని ఆల్-నూస్రా బలగాలపై తీవ్ర స్ధాయిలో దాడి చేస్తున్నాయి. రష్యా వైమానిక దాడులతో సహకరిస్తుండగా, ఇరానియన్, హిజ్బొల్లా బలగాలు భూతల యుద్ధంలో సహకరిస్తున్నాయి.
దానితో అలెప్పోలో ఘోరం జరిగిపోతున్నదంటూ అమెరికా ఆక్రోసిస్తున్నది. మొదట రష్యా దాడులను ఆపించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. ‘మీ ఇళ్లకు మీ సైనికుల శవాలు వస్తాయి’ అని బెదిరించింది. రష్యన్ నగరాలలో టెర్రరిస్టులు దాడులు చేస్తారు అని హెచ్చరించింది. మీ ఫైటర్ జెట్ లు కూలిపోతాయి అని జడిపించింది. రష్యన్ ఎంబసీ పై ఓ సారి మోర్టార్ దాడి కూడా జరిగింది.
ఇవేవీ రష్యా పైన పని చేయలేదు. అమెరికా అప్పటికే సిరియన్ సైన్యాలపై క్షిపణి దాడి చేసి 62 మందిని చంపడం, మరో 100 మందిని గాయపరచడంతో అర్జెంటుగా S-300 క్షిపణి రక్షక వ్యవస్ధలను సిరియాకు తరలించింది. ఇవి శత్రువులు చేసే వైమానిక దాడులను తిప్పి కొడతాయి. అవి కవర్ చేసే ఏరియాలో ఎలాంటి వైమానిక దాడి జరిగినా దాడిలో ఉన్న క్షిపణులు బయలు దేరిన చోటనే అడ్డుకుంటాయి. అనగా ఇవి రష్యన్ జెట్ విమానాలతో పాటు సిరియన్ జెట్ లకు కూడా రక్షణ కల్పిస్తాయి.
చివరికి సిరియా సైన్యాల పైన నేరుగా, అధికారికంగానే వైమానిక దాడులు చేయడానికి వైట్ హౌస్ చర్చలు చేస్తున్నట్లుగా మీడియాకు లీక్ లు వదిలారు. సిరియా ప్రభుత్వ బలగాలు పై చేయి సాధించడానికి ఫైటర్ జెట్ విమానాల వైమానిక దాడులు ఇతోధికంగా సహాయపడుతున్నాయి. పరిమిత దాడులు చేసి సిరియన్ ఫైటర్ జెట్ లో సిరియా గగనతలంలో ఎగరకుండా చేయడానికి వైట్ హౌస్ ఆలోచన చేస్తున్నట్లుగా అమెరికన్ పత్రికలు ప్రకటించాయి.
దీనికి కూడా రష్యా బెదరలేదు. రష్యన్ సైనికాధికారి ఒకరు ఈ లీకులకు అధికారికంగానే బదులు ఇచ్చాడు. “అక్కడ పధక రచన చేసేవాళ్లు కాస్త తిన్నగా ఆలోచిస్తే మేము ఇప్పటికే S-300 రక్షణ వ్యవస్ధలను తరలించినట్లు స్ఫురణకు వస్తుంది. ఇవి రష్యన్ ఫైటర్ జెట్ లపైన ఈగ కూడా వాలనివ్వవు. వాటి పనితనం మీకు కొంతవరకే తెలుసు. తెలియనిది చాలా ఉంది. శత్రువుల క్షిపణులు బయలుదేరిన చోటనే నాశనం చేస్తాయి. మా జెట్ లు సిరియా గగనతలం అంతటా ఎగురుతున్నాయి. కనుక సిరియా గగనతలం అంతటా ఇవి (S-300) కాపలా కాస్తాయి. దాని అర్ధం సిరియా విమానాలకు కూడా కాపలా కాస్తాయని అర్ధం. ఈ మాత్రం కూడా అర్ధం కాకపోతే, జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత మమ్మల్ని అని లాభం లేదు” అని ఆయన కుండ బద్దలు కొట్టాడు.
ఆ తర్వాత చడీ చప్పుడు లేదు. అమెరికా డిఫెన్స్ శాఖ ప్రతినిధి ఒకరు సందర్భం లేకుండా ‘అది చేస్తాం, ఇది చేస్తాం’ అంటూ వీరాలాపాలు పలికాడు కానీ అది ఎవరిని ఉద్దేశించో చెప్పలేకపోయాడు. ఆ వీరాలాపాల్లో నిర్దిష్టత లేకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. కనీసం పశ్చిమ పత్రికలు కూడా ఆ వీరాలాపాల్ని సరిగా కవర్ చేయలేదు.
ఆ తర్వాత హఠాత్తుగా డి మిస్తురా రంగం లోకి దిగాడు. తూర్పు అలెప్పోలో సిరియా సైన్యాల ముట్టడిలో ఉన్న ఆల్-నూస్రా బలగాలు క్షేమంగా -ఆయుధాలతో సహా- వెల్లనివ్వాలని రష్యాను కోరాడు. అయితే ఆయన అలెప్పో ప్రజల్ని అడ్డం పెట్టుకుని ఆల్-నూస్రా తరపున మాట్లాడాడు. నేరుగా ఆల్-నూస్రా తరపున మాట్లాడితే తాము టెర్రరిస్టులుగా ప్రకటించిన టెర్రరిస్టుల పక్షానే మాట్లాడుతున్న సంగతి ప్రత్యక్షంగా వ్యక్తం అవుతుంది గనుక తూర్పు అలెప్పో ప్రజల క్షేమం కోసం ముట్టడిలో ఉన్న ఆల్-నూస్రా బలగాలు అలెప్పో వదిలి వెళ్లడానికి సహకరించాలని కోరాడు. ఆయన మాటలు చూడండి:
“నేను రష్యన్ అధికారులను, సిరియా ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతున్నాను. -దయ చేసి నా కళ్లలోకి చూడండి. ప్రపంచం కళ్లలోకి చూడండి. ప్రజాభిప్రాయం కళ్లలోకి చూడండి- మీరు నిజంగా దీనిని (తూర్పు అలెప్పో లోని ఆల్-నూస్రా టెర్రరిస్టులపై దాడిని) ఇలాగే కొనసాగిస్తారా… ఇదే తరహా యుద్ధాన్ని, మీరు వినియోగిస్తున్న తరహా ఆయుధాలతో, నగరం మొత్తాన్ని ధ్వంసం చేస్తూ, తూర్పు అలెప్పోను ధ్వంసం చేస్తూ, 275,000 మంది ప్రజలు ఉన్న ప్రాచీన నగరం అలెప్పోను, కేవలం 1000 మంది ఆల్ నూస్రా ఫైటర్లను రూపమాపడానికి, ధ్వంసం చేస్తారా? లేదా దానికి బదులు, ఆల్-నూస్రా అక్కడి నుండి వెళ్లిపోతే తక్షణమే వైమానిక దాడులు బాంబింగ్ లు ఆపేస్తారా? తద్వారా తూర్పు అలెప్పోలో స్ధానిక పాలన క్షేమంగా ఉండనిస్తారా?”
ఈ మొత్తం మాటల్లో ఎర్ర అక్షరాల్లో హై లైట్ చేసిన మాటలే డి మిస్తురా చెప్పదలచుకున్న అసలు మాటలు. మిగిలిన మాటలన్నీ తన అసలు మాటలను, ఆ మాటల ఉద్దేశాన్ని కవర్ చేసుకునేందుకు జత చేసిన మాటలే. అవన్నీ ఉత్తుత్తి, నకిలీ మాటలే తప్ప అసలువి కావు. కాకుంటే ఐదున్నర సంవత్సరాలుగా సిరియా ప్రజలని టెర్రరిస్టు మూకలు లక్షలుగా ఊచకోత కొస్తున్నా పట్టించుకోకుండా బాషర్ ఆల్-అస్సాద్ గద్దె దిగితే తప్ప శాంతికి తావు లేదని హెచ్చరికలు, ఆదేశాలు, బెదిరింపులు ఐరాస ప్రతినిధులు ఎందుకు చేస్తారు?
ఇప్పుడు సిగ్గు ఎగ్గూ లేకుండా ఆ టెర్రరిస్టులనే క్షేమంగా వెళ్ళేందుకు సహకరించాలని కోరుతూ ఆ ఏడుపు కూడా నేరుగా ఏడవ లేక తూర్పు అలెప్పో ప్రజల కోసం అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అసలు నిషేధించబడిన ఆల్-నూస్రా టెర్రరిస్టులు క్షేమంగా, ఆయుధాలతో సహా, అలెప్పో నుండి వెళ్లలేకపోతే ఏమిటట? ఇన్నాళ్లూ అమెరికాతో అలవి కానీ చర్చలు చేసి, చర్చల ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తున్నా ఓపిక పడుతూ మళ్ళీ మళ్ళీ చర్చలకు సిద్ధపడుతూ వస్తున్న సిరియా, రష్యాలను ఇన్నాళ్లూ తేలికగా ఎందుకు తీసుకున్నట్లు?
తూర్పు అలెప్పో ప్రజలు క్షేమంగా బైటికి రావడానికి సిరియా ప్రభుత్వ బలగాలు హ్యూమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఆ ప్రజలు వస్తున్నపుడు వారిపైన ఆల్-నూస్రా కాల్పులు జరిపి వెనక్కి తరిమినా ఎందుకు ప్రశ్నించలేదు? కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని ఈ స్తాఫాన్ డి మిస్తురా అమెరికాని ఎందుకు కోరలేదు? ఆల్-నూస్రా ను ఎందుకు కోరలేదు? ఐరాస కాన్వాయ్ పైన దాడి చేసి ఆ దాడి కూడా రష్యాయే చేసిందని పశ్చిమ పత్రికలు, అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఎందుకు అడగలేదు?
ఇన్ని చేసినా రష్యా మిస్తురా ప్రతిపాదనకు అంగీకరించడం విశేషం. డి మిస్తురా, ఆల్-నూస్రా అలెప్పోను వదిలి వెళ్లడానికి సహకరించమని మంచి ఉద్దేశంతోనే కోరాడనీ, సీరియస్ గానే కోరాడనీ ఇంకా ఇదమిద్ధంగా తెలియలేదు. అయినా రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ స్వయంగా ‘మిస్తురా ప్రతిపాదన తనకు తెలిసిందనీ, అది నిజమే అయితే అందుకు తాము సిద్ధమనీ, సిరియా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను నెత్తిన వేసుకుంటామని ప్రకటించాడు.
“కేవలం నూస్రా పట్ల ఆందోళనతో ఆయన చేసిన ప్రకటన నేను విన్నాను. దేవుడు క్షమించు గాక! ఆల్-నూస్రా తమ ఆయుధాలతో తాము బలంగా ఉన్న ఇద్లిబ్ కు వెళ్లడానికి సిద్ధపడితే మేము దానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అంగీకరించాలని సిరియా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత కూడా స్వీకరిస్తాం” అని రష్యన్ ఛానెల్ తో మాట్లాడుతూ ప్రకటించాడు.

Russian External Affairs Minister Sergy Lavarov
ఇక్కడి నుండి పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరం. రష్యా, సిరియాలు మాత్రం ప్రస్తుతం అలెప్పో నగరాన్ని పూర్తిగా విముక్తి చేసే పనిలో నిండా మునిగి ఉన్నాయి. మిస్తురా చెప్పినట్లు 2.5 లక్షల మంది ప్రజలు అలెప్పోలో ఉన్నారా అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అలెప్పోలో 17 లక్షల మంది నివసిస్తున్నారు. వివిధ సందర్భాల్లో తూర్పు అలెప్పో నుండి తరలివచ్చిన పౌరులు వారిలో ఉన్నారు. తూర్పు అలెప్పోలో ఆల్-నూస్రా ఫైటర్లు 10,000 మంది వరకు ఉన్నారని పశ్చిమ పత్రికలే గతంలో చెప్పాయి. ఆ సంఖ్యను మిస్తురా 900 కు తగ్గించి చెబుతున్నాడు. ఆ పేరుతో మిగిలిన టెర్రరిస్టులను సాధారణ పౌరులుగా అక్కడే కొనసాగించి దొంగ దెబ్బ తీసే ఉద్దేశంలో అమెరికా ఉన్నా ఆశ్చర్యం లేదు.
అందుకే “అమెరికా మద్దతు ఉన్న (మోడరేట్) మిలిటెంట్ల నుండి ఆల్-నూస్రా టెర్రరిస్టులను స్పష్టంగా వేరు చేస్తేనే ఇందుకు సమ్మతిస్తాం” అని లావరోవ్ స్పష్టం చేశాడు.
ఎంత గందరగోళం?
ఎలా జరిగితే … సిరియాకూ, తక్కిన ప్రపంచానికీ – శ్రేయోదాయకమో కూడా తెలియడం లేదే!